ప్రధాన మంత్రి కార్యాలయం
పన్ను-ఉగ్రవాదం నుంచి పన్ను-పారదర్శకత దిశగా భారత్: ప్రధానమంత్రి
నిజాయితీగల పన్ను చెల్లింపుదారుల గౌరవానికి ప్రాధాన్యంద్వారా కీలక సంస్కరణ
ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్-కటక్ బెంచ్
కార్యాలయ-నివాస సముదాయానికి ప్రారంభోత్సవం
Posted On:
11 NOV 2020 6:09PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్-కటక్ బెంచ్ కార్యాలయ-నివాస సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- ఈ బెంచ్ ఇకపై ఒడిషాకు మాత్రమేగాక తూర్పు-ఈశాన్య భారతంలోని లక్షలాది పన్ను చెల్లింపుదారుల కోసం అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. దీంతోపాటు ఈ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో అపరిష్కృత కేసులన్నిటికి సత్వర పరిష్కారం చూపడంలో తోడ్పడుతుందని తెలిపారు.
దేశం నేడు పన్ను-ఉగ్రవాదం నుంచి పన్ను-పారదర్శకత దిశగా పయనిస్తున్నదని ప్రధానమంత్రి నేడు గుర్తుచేశారు. సంస్కరణ-పనితీరు-పరివర్తన విధానం అనుసరణ ద్వారానే ఈ మార్పు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో వివిధ నిబంధనలు, ప్రక్రియలను సంస్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. “మేం సుస్పష్ట సంకల్పంతో పనిచేస్తున్నాం… అదే సమయంలో పన్ను యంత్రాంగం ధోరణిని కూడా పరివర్తన దిశగా నడిపిస్తున్నాం” అని ఆయన అన్నారు.
దేశ సంపద సృష్టికర్తలకు ఇబ్బందులు తగ్గితే వారికి రక్షణ లభిస్తుందని, తద్వారా దేశంలోని వ్యవస్థలపై వారిలో విశ్వాసం పెరుగుతుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ పెరుగుతున్న విశ్వాసంవల్ల దేశాభివృద్ధి దిశగా పన్ను వ్యవస్థలో కలిసేందుకు మరింతమంది భాగస్వాములు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను కష్టాలనుంచి రక్షించడం, వారిని గౌరవించడంకోసమే పన్ను తగ్గింపు, ప్రక్రియల్లో సరళతసహా అతిపెద్ద సంస్కరణలు తెచ్చినట్లు ప్రధాని వివరించారు.
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశాక మొట్టమొదట దాన్ని సంపూర్ణంగా విశ్వసించడమే ప్రభుత్వ ఆలోచనా విధానమని ప్రధాని ప్రకటించారు. ఆ మేరకు నేడు దేశవ్యాప్తంగా దాఖలైన రిటర్నులలో 99.75 శాతం ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా ఆమోదించబడినట్లు చెప్పారు. దేశ పన్ను వ్యవస్థలో ఇదో పెనుమార్పుగా ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ బానిసత్వ పాలన ఫలితంగా పన్ను చెల్లింపుదారు-వసూలు యంత్రాంగాల మధ్య దోపిడీ-దోపిడీదారుల వంటి సంబంధం ఏర్పడిందని శ్రీ మోదీ అన్నారు. ఈ సందర్భంగా గోస్వామి తులసీదాస్‌ను ఉటంకిస్తూ- “మేఘాలు వర్షిస్తున్నపుడు ప్రయోజనం మనకు గోచరమవుతుంది. అయితే, మేఘాలు ఏర్పడినపుడు సూర్యుడు కొంత నీటిని గ్రహిస్తాడు. కానీ, దానివల్ల ఎవరికీ అసౌకర్యం కలగదు” అన్నారు. ఇదే తరహాలో సామాన్యుల నుంచి పన్ను వసూలు వేళ పాలన అసౌకర్యానికి గురికారాదని ప్రధానమంత్రి అన్నారు. అదే సమయంలో ఆ సొమ్ము పౌరులకు చేరినప్పుడు, ప్రజలు తమ జీవితాల్లో దాని ప్రయోజన అనుభూతిని పొందాలన్నారు.
ప్రభుత్వం కొన్నేళ్లుగా ఇదే దార్శనికతతో ముందుకు వెళ్తున్నదని, మొత్తం పన్ను వ్యవస్థలో ఆ పెనుమార్పులతోపాటు పారదర్శకతను నేడు పన్ను చెల్లింపుదారులు స్పష్టంగా చూడగలుగుతున్నారని ఆయన అన్నారు. పన్ను వాపసు కోసం చెల్లింపుదారులు నెలల తరబడి వేచిఉండాల్సిన అవసరం లేనప్పుడు, కేవలం కొన్ని వారాల్లోనే తిరిగి పొందినపుడు సదరు పారదర్శకతను వారు అనుభూతి చెందుతారని తెలిపారు. “అదేవిధంగా అతి పురాతన వివాదాన్ని పన్ను విభాగం తనంతట తానుగా పరిష్కరించడం చూసినప్పుడు పారదర్శకత వారి అనుభవంలోకి వస్తుంది. అలాగే నేరుగా హాజరుతో పనిలేకుండా అప్పీలు చేయగలిగితే పన్ను పారదర్శకతను ఆస్వాదిస్తాడు. ఆదాయపు పన్ను నిరంతరం తగ్గుతుండటం గమనించినప్పుడు మరింత పన్ను పారదర్శకతను అతను అనుభవిస్తాడు” అని ప్రధాని విశదీకరించారు.
దేశంలో రూ.5 లక్షలవరకూ ఆదాయంపై పన్ను విధించకపోవడం మన దిగువ మధ్యతరగతి యువతకు నేడు ఎంతో లబ్ధి చేకూర్చిన అంశమని ప్రధాని అన్నారు. ఈ అలాగే ఆదాయపు పన్నుకు సంబంధించి ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త ఎంపిక పన్ను చెల్లింపుదారుల జీవితాలను సరళం చేసిందన్నారు. ప్రగతి వేగాన్ని మరింత పెంచడంతోపాటు భారత్‌ను పెట్టుబడులకు మరింత స్నేహపూర్వకంగా మార్చడానికి కార్పొరేట్ పన్నులో కోత విధిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు గుర్తుచేశారు. తయారీ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా కొత్త దేశీయ తయారీ సంస్థలకు పన్నును 15శాతంగా నిర్ణయించామని ఆయన చెప్పారు. అదేవిధంగా భారత ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులను పెంచడానికి డివిడెండ్ పంపిణీ పన్నును కూడా రద్దుచేసినట్లు తెలిపారు. జీఎస్టీని ప్రవేశపెట్టడంతో పన్ను పరిధి తగ్గిందని, చాలా వస్తువులు, సేవలపై పన్ను శాతం కూడా తగ్గిందని చెప్పారు. వివాదాల భారం తగ్గింపు దిశగా ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్(ITAT)లో అప్పీళ్ల పరిమితి మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.50 లక్షలకు, సుప్రీంకోర్టులో రూ.2కోట్ల స్థాయికి పెంచినట్లు వివరించారు. ఈ సంస్కరణలవల్ల దేశంలో వాణిజ్య సౌలభ్యం పెరిగిందని ఆయన అన్నారు.
వివాదాలపై అప్పీళ్లను డిజిటల్ మాధ్యమంద్వారా విచారించడం కోసం ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ దేశంలోని ధర్మాసనాల(బెంచ్)ను ఉన్నతీకరిస్తుండటంపై ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. అలాగే ప్రస్తుత సాంకేతిక యుగంలో మొత్తం వ్యవస్థను ఉన్నతీకరించడం చాలా ముఖ్యమన్నారు. ప్రత్యేకించి మన న్యాయవ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఎక్కువగా వాడుతూ దేశ పౌరులకు కొత్త సౌలభ్యం కల్పించడం మొదలుపెట్టిందని ఆయన నొక్కి చెప్పారు.
***
(Release ID: 1672096)
Visitor Counter : 229
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam