ప్రధాన మంత్రి కార్యాలయం

ఎస్ సిఒ కౌన్సిల్ సభ్యత్వ దేశాల అధినేతల 20 వ శిఖర సమ్మేళనం

Posted On: 10 NOV 2020 6:33PM by PIB Hyderabad

ఎస్ సిఒ కౌన్సిల్ సభ్యత్వ దేశాల అధినేతల 20 వ శిఖర సమ్మేళనాన్ని 2020 నవంబర్ 10 న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించడమైంది.  ఈ సమావేశానికి రష్యా సమాఖ్య అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ అధ్యక్షత వహించారు.  భారతదేశ ప్రతినిధి వర్గానికి ప్రధాన మంత్రి  శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు.  ఎస్ సిఒ లోని ఇతర సభ్యత్వ దేశాలకు ఆయా దేశాల అధ్యక్షులు ప్రాతినిధ్యం వహించగా, భారతదేశానికి, పాకిస్తాన్ కు ఆ దేశాల ప్రధాన మంత్రులు ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతరులలో ఎస్ సిఒ సచివాలయం సెక్రటరీ జనరల్, ఎస్ సిఒ ప్రాంతీయ తీవ్రవాద నిరోధ బృందం కార్యనిర్వాహక  సంచాలకుడు తో పాటు నాలుగు పర్యవేక్షక దేశాలైన అఫ్గానిస్తాన్, బెలారూస్, ఇరాన్, మంగోలియా ల అధ్యక్షులు కూడా ఉన్నారు.

వర్చువల్ విధానం లో జరిగిన మొదటి ఎస్ సిఒ సమావేశం ఇది.  భారతదేశం 2017 లో ఈ కూటమి లో పూర్తికాల సభ్యత్వాన్ని పొందిన తరువాత జరిగిన మూడో సమావేశమిది.  ఎస్ సిఒ నేతలను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సవాళ్లు, ప్రతికూల స్థితుల మధ్య ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ ను అభినందించారు.   

మహమ్మారి కారణంగా ఎదురైన సామాజిక, ఆర్ధిక ప్రభావాలతో సతమతం అవుతున్న ప్రపంచం ఆశలను నెరవేర్చడానికి సంస్కరణలకు తావు ఉన్న  బహుళపక్షీయవాదం ఎంతయినా అవసరమని ప్రధాన మంత్రి  తన ప్రసంగంలో ప్రముఖంగా పేర్కొన్నారు.  ప్రపంచ పాలన లో వాంఛనీయ మార్పులను తీసుకు రావడానికి భారతదేశం 2021 జనవరి 1 నుంచి ఐక్య రాజ్య సమితి భద్రత మండలి (యుఎన్‌ఎస్‌ సి) లో శాశ్వతేతర సభ్యత్వ దేశంగా ‘సంస్కరణలకు తావు ఉన్న బహుళపక్షీయవాదం’ పై ప్రత్యేక శ్రద్ధ వహించనుంది.

ప్రాంతీయ శాంతి, భద్రత, సమృద్ధి ల పట్ల భారతదేశం దృఢత్వాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి, ఆయుధాలు, మత్తు పదార్థాల దొంగరవాణాకు, మనీలాండరింగుకు వ్యతిరేకంగా ఆయన గళమెత్తారు.  మహమ్మారి కాలంలో భారతదేశ సాహసిక జవానులు సుమారు 50 ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలలో పాల్గొన్నారని, భారతదేశ ఔషధ తయారీ పరిశ్రమ 150 కి పైగా దేశాలకు అత్యవవసర మందులను సరఫరా చేస్తోందని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.  

ఎస్ సిఒ ప్రాంతంతో భారతదేశానికి ఉన్న బలమైన సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భంలో నొక్కిచెప్పారు.  అలాగే, అంతర్జాతీయ ఉత్తర- దక్షిణ రవాణా కారిడార్, చాబహార్ ఓడరేవు, అశ్ గాబాత్  ఒప్పందం వంటి రంగాలలో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవడం పట్ల  భారతదేశం దృఢమైన నిబద్ధతను కలిగివుందని కూడా ఆయన మరో మారు స్పష్టంగా చెప్పారు.  ‘‘ఎస్ సిఒ సంస్కృతి సంవత్సరం (ఎస్ సిఒ ఇయర్ ఆఫ్ కల్చర్)’’ ఇతివృత్తం తో 2021 లో నిర్వహించనున్న ఎస్ సిఒ 20 వ వార్షికోత్సవానికి భారతదేశం పూర్తి తోడ్పాటు ను అందిస్తుందని తెలిపారు.  రాబోయే సంవత్సరంలో భారతదేశంలో ఎస్ సిఒ ఆహారోత్సవాన్ని నిర్వహించడంతో పాటు నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి బౌద్ధ వారసత్వం పై ఒకటో ఎస్ సిఒ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్న సంగతిని, పది ప్రాంతీయ భాషా సాహిత్య రచనలను రష్యన్, చైనీస్ భాషలలోకి అనువదించే కార్యక్రమం వంటి భారతదేశం తీసుకొంటున్న చొరవలను గురించి కూడా ఆయన తన ప్రసంగంలో తెలియజేశారు.   

ఎస్ సిఒ కౌన్సిల్ సభ్యత్వ దేశాల అధినేతల తదుపరి సాధారణ సమావేశాన్ని ఈ నెల 30 న వర్చువల్ విధానంలో నిర్వహించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఎస్ సిఒ పరిధిలో నూతన ఆవిష్కరణ, అంకుర సంస్థలపై ఒక ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని, సంప్రదాయ వైద్యంపై ఒక ఉప బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా భారతదేశం ప్రతిపాదించింది.  మహమ్మారి అనంతర ప్రపంచంలో ‘‘ఆత్మ నిర్భర్ భారత్’’ (స్వయంసమృద్ధియుత భారతదేశం)కు సంబంధించిన భారతదేశం దార్శనికత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు శక్తి గుణకంగా మారడం తో పాటు ఎస్ సిఒ ప్రాంతం ఆర్ధిక పురోగతికి కూడా దోహదపడనుందని ప్రధాన మంత్రి విపులంగా తెలియజేశారు.  

రాబోయే సంవత్సరం లో ఎస్ సిఒ కు అధ్యక్షుడు కానున్న తాజికిస్తాన్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ ఇమోమాలీ రహమాన్ కు ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు.  భారతదేశం పక్షాన పూర్తి సహకారం ఉంటుందంటూ హామీని కూడా ఇచ్చారు.
 

***
 



(Release ID: 1671855) Visitor Counter : 205