ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

మౌలిక సమస్యలకు పరిష్కారాలే లక్ష్యంగా హ్యాకథాన్.లో కలిసిన 1300 మేధస్సులు

విజయవంతంగా ముగిసిన “గవ్-టెక్-థాన్ 2020”
దేశవ్యాప్త వర్చువల్ హ్యాకథాన్ కోసం కలసి వచ్చిన ఎన్.ఐ.సి., ఐ.ఇ.ఇ.ఇ., ఒరాకిల్.

వాహనాల ఫిట్.నెస్ నిర్ధారణకు సృజనాత్మక నమూనాను ప్రదర్శించిన
“ఫిట్ ఫర్ ఫ్యూచర్” జట్టుకు ప్రథమ బహుమతి

Posted On: 06 NOV 2020 12:31PM by PIB Hyderabad

గవ్-టెక్-థాన్ (Gov-Tech-Thon) 2020 పేరిట 36గంటలపాటు దేశవ్యాప్తంగా వర్చువల్ పద్ధతిలో జరిగిన హ్యాకథాన్ పోటీ 2020 నవంబరు ఒకటిన విజయవంతంగా ముగిసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అజమాయిషీలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రికల్, అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీర్స్, (ఐ.ఇ.ఇ.ఇ.) నేషనల్ ఇన్ ఫర్మాటిక్స్ లిమిటెడ్ (ఎన్.ఐ.సి.), ఒరాకిల్  సంస్థలు ఈ పోటీని నిర్వహించాయి. ఈ పోటీకి 1300మందినుంచి రిజిస్ట్రేషన్లు అందాయి. వారంతా 390 జట్లుగా ఏర్పడ్డారు. హ్యకథాన్ వెబ్ పేజీని రెండు వారాల్లో 15వేలమంది చూశారు. 

  రిజిస్టరైనవారినుంచి ఎంపికైన 447మంది ఉత్సాహవంతులు వంద జట్లుగా హ్యాకథాన్ లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని  3 మంత్రిత్వ శాఖలకు చెందిన 5 సమస్యాత్మక ప్రకటనలపై పరిష్కారాలు సూచించేందుకు వారు ఈ పోటీలో పాల్గొన్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ,.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ,.. విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటనలపై వారు పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో వచ్చిన ప్రతిపాదనలను పారిశ్రామిక  రంగానికి, విద్యాసంస్థలకు, ప్రభుత్వానికి చెందిన 27మంది న్యాయనిర్ణేతలు కూలంకషంగా  మధింపు చేసి విజేతలను నిర్ణయించారు.

   గవ్-టెక్-థాన్ 2020 నుంచి సృజనాత్మక పరిష్కారాలు కోరిన ఐదు సమస్యలు ఈ కింది విధంగా ఉన్నాయి.

 

  1. వివిధ సీజన్లలో కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో  సాగుచేసే ప్రత్యామ్నాయ పంటలనుగానీ, రొటేషన్ పంటలను గానీ రైతులకు సూచించండి. పర్వత ప్రాంతాలు, ఇతర స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉత్పాదకత పెంపుదల లక్ష్యంగా ఈ సూచనలు చేయండి.
  2. వివిధ రకాల భాగస్వామ్య వర్గాల ప్రమేయంతో విత్తనాల సరఫరా వ్యవస్థ సంక్లిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో నాసిరకం విత్తనాల సమస్య పరిష్కారానికి సూచనలు చేయండి. ఇందుకోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగంతో మేలిరకం విత్తనాలను కనిపెట్టడం ఎలాగో సూచించండి.    
  3. అవసరాలకు తగినట్టుగా ఒకేసారి డాక్యుమెంట్ల స్కానింగ్, సైజు మార్పిడి, అప్ లోడింగ్ కోసం మొబైల్ ఆధారిత /వెబ్ ఆధారిత అప్లికేషన్ (యాప్)ను సూచించండి. 
  4. రిమోట్ సూపర్ విజన్ సాఫ్ట్ వేర్/వెబ్ కెమేరా ద్వారా ఇంటినుంచి, లేదా సంస్థల నుంచి ఆన్ లైన్ పరీక్షలను పర్యవేక్షించే పరికరాన్ని సూచించిండి. తగిన అధీకృత ఏర్పాట్లతో, నియంత్రణలతో, మోసాన్ని పసిగట్టగలిగేలా చూసేందుకు కృత్రిమ మేధస్సు/మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందుకు వినియోగించాలి.
  5. వాహనాల ప్రయాణ యోగ్యతను నిర్ధారించే పరీక్షా ప్రక్రియ యాంత్రీకరణకు తగిన ఆధునాతన పరికరాన్ని సూచించిండి.

 

  ఈ పోటీలో ప్రథమ స్థానాన్ని రాబర్ట్ బోష్ ఇంజినీరింగ్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన  ఫిట్ ఫర్ ఫ్యూచర్ అనే జట్టు సాధించింది. వాహనాల ప్రయాణ యోగ్యత నిర్ధారణా ప్రక్రియను నిర్వహించే అధునాతన నమూనా పరికరాన్ని ప్రదర్శించినందుకు ఈ జట్టుకు మొదటి బహుమతి దక్కింది. రెండవ బహుమతి వడోదరాలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి లభించింది. సుదూర ప్రాంతంనుంచి పరీక్షలు నిర్వహించగలిగే సురక్షితమైన పరిష్కారాన్ని కనిపెట్టినందుకు వడోదర ట్రిపుల్ ఐటీకి 2వ బహుమతి లభించింది. బెంగళూరు పి.ఇ.ఎస్. విశ్వవిద్యాలయానికి చెందిన ఆరెంజ్ జట్టు,. మూడవ బహుమతికి ఎంపికైంది. బ్లాక్ చెయిన్ సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో విత్తనాల నాణ్యతను ధ్రువకీరించే వినూత్న ప్రక్రియను రూపొందించినందుకు ఆరెంజ్ జట్టు 3వ బహుమతికి ఎంపికైంది   

  2020 నవంబరు ఒకటిన జరిగిన ముగింపు సమావేశంలో వ్యవసాయ, విద్యా, రవాణా మంత్రిత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్.ఐ.సి.కి చెందిన సీనియర్ ప్రతినిధులు, ఐ.ఇ.ఇ.ఇ. కంప్యూటర్ సొసైటీ బోర్డు సభ్యురాలు ప్రొఫెసర్ రామలతా మారిముత్తు, ఒరాకిల్ సంస్థ ప్రతినిధులు, న్యాయనిర్ణేతలు, మెంటార్లు తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  

   గవ్-టెక్-థాన్ 2020 ముగింపు కార్యక్రమంలో ఎన్.ఐ.సి. డైరెక్టర్ జనరల్ డాక్టర్ నీతా వర్మ మాట్లాడుతూ, సామాజిక రంగం, నూతన సాంకేతిక పరిజ్ఞాన రంగాల ప్రతినిధుల విభిన్నమైన కలియకగా వర్చువల్ హ్యాకథాన్ జరిగిందన్నారు. సామాజిక సమ్మిళిత ప్రక్రియ, ప్రజలకు సాధికారత, జాతి అభ్యున్నతి వంటి ప్రయోజనాలకోసం ఆవిర్భవిస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే వీలుందని ఈ హ్యాకథాన్ రుజువు చేసినట్టు చెప్పారు. 

   కంప్యూటర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెలిస్సా రస్సెల్ మా ట్లాడుతూ, హ్యాకథాన్ కోసం తాము ఎన్.ఐ.సి., ఒరాకిల్ సంస్థలతో కలసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఐ.ఇ.ఇ.ఇ.కి భారతదేశంలో బలమైన సభ్యత్వం ఉందని, సవాళ్లు విసిరే పలు సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా వృత్తి నిపుణులు తమ నైపుణ్యాలను వినియోగించుకునేందుకు గవ్-టెక్-థాన్ వంటి పోటీలు సదవకాశాలను చూపిస్తాయని మెలిస్సా అన్నారు.

  ఒరాకిల్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలేందర్ కుమార్ మాట్లాడుతూ,..సృజనాత్మ భావాలను పాదుకొల్పే గొప్ప వేదికగా హ్యాకథాన్ ను అభివర్ణించారు. ఈ హ్యాకథాన్ లో పలువురు యువ మేధావులు సమర్పించిన నమూనా పరిష్కారాలపట్ల తానెంతో ఆకర్షితుడనయ్యానని అన్నారు. మెరుగైన రేపటికోసం తమ పరిష్కారాల రూపకల్పనకు యువత పనిచేయడం గర్వకారణమన్నారు. విజేతలందరికీ తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. సృజనాత్మకతను, కొత్త ఆలోచనలను ప్రోత్సహించడానికి ఒరాకిల్ సంస్థ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. 

 

నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్.ఐ.సి.) గురించి..

   కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  మంత్రిత్వశాఖకు అనుబంధించిన కార్యాలయం. 1976లో ఇది ఏర్పాటైంది. ప్రభుత్వానికి నాలుగు దశాబ్దాలుగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సేవలు, ఈ గవర్నెన్స్ సేవలు అందించడంలో ఎంతో అనుభవం గడించింది. డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానంలో వారధిలా పనిచేస్తోంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా డిజిటల్ టెక్నాలజీ అవకాశాలను కల్పించడంలో ప్రధాన పోషక సంస్థగా ఆవిర్భవించింది. సామాజిక కార్యకలాపాలు, ప్రభుత్వ పరిపాలనా అంశాల్లో, ప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ సేవలు అందించడంలో ఎన్.ఐ.సి. ఎంతో దోహదపడుతోంది. ఇన్ఫర్మాటిక్స్ ద్వారా నడిచే అభివృద్ధి ప్రక్రియకు ఎన్.ఐ.సి. సారథ్యం వహిస్తోంది. ప్రభుత్వంనుంచి వాణిజ్య వర్గాలకు, పౌరులకు, ఉద్యోగులకు ఎలక్టానిక్ సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నిక్ నెట్ ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు, దేశంలోని 37 రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, 720 జిల్లాల పరిపాలనా యంత్రాగాలకు సంస్థాగత అనుసంధానమైన ఏర్పాట్లు ఎన్.ఐ.సి.కి ఉన్నాయి.

  ప్రభుత్వ పరిపాలనా ప్రక్రియకు సంబంధించిన వివిధ విభాగాలతో ఎన్.ఐ.సి.కి సన్నిహిత సంబంధాలు, అనుబంధం కొనసాగిస్తూ వస్తోంది. అంతేకాక,..దేశవ్యాప్తంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో డిజిటిల్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిష్కారాలను ఎన్.ఐ.సి. రూపొందించింది. పౌరుల స్థాయి వరకూ సేవలందించడంలో తన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంద్వారా ఎన్.ఐ.సి. ఎంతో కృషి చేస్తోంది.

ఐ.ఇ.ఇ.ఇ. కంప్యూటర్ సొసైటీ గురించి..

  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రికల్, అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీర్స్, (ఐ.ఇ.ఇ.ఇ.) ప్రపంచంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ సంస్థ. మానవాళి ప్రయోజనాలకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు కృషి చేస్తూ వస్తోంది. సృజనాత్మక రంగంలో ఈ సంస్థతోపాటు, సంస్థ సభ్యులు ప్రపంచ సమాజానికే స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారు. 160 దేశాల్లో ఈ సంస్థ తరఫున 4,19,000మంది ప్రతినిధులు ఉన్నారు. ఐ.ఇ.ఇ.ఇ.పై మరింత సమాచారం కోసం www.ieee.org అనే వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

ఒరాకిల్ గురించి...

  అమ్మకాలు, సేవలు, మార్కెటింగ్, మానవ వనరులు, ఆర్థిక రంగం, సరఫరా వ్యవస్థ, తయారీ రంగం వంటి వాటికోసం సమగ్రమైన అప్లికేషన్లను ఒరాకిల్ క్లౌడ్ అందిస్తోంది. అత్యంత అధునాతనమైన యాంత్రీకరణతో కూడిన సురక్షితమైన రెండవ తరం మౌలిక సదుపాయాలను ఒరాకిల్ అటానమస్ డాటాబేస్ సహాయంతో అందిస్తోంది. ఒరాకిల్ (ఎన్.వై.ఆర్.సి.ఎల్.),పై మరింత సమాచారం కోసం www.oracle.com అనే వెబ్ సైట్.ను సంప్రదించవచ్చు. 

 

***(Release ID: 1670657) Visitor Counter : 224