ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

తెలుగు భాషకు, తెలుగు పద్యానికి వన్నెలద్దిన అవధానం - ఉపరాష్ట్రపతి

• బహుశా సంస్కృత, తెలుగు భాషలకే ప్రత్యేకమైన అవధానం మస్తిష్క మథనంతో కూడిన సాహితీ ప్రక్రియ 

• జాతీయత, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే భాషే మన అస్తిత్వం

• దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత

• అంతర్జాతీయ శతావధానం ప్రారంభోత్సవంలో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన

• శతావధాని డాక్టర్ మేడసాని మోహన్ సరస్వతీ పుత్రుడని ప్రశంస

• తొలి పృచ్ఛకుడిగా సాహితీ సమస్యను సంధించిన ఉపరాష్ట్రపతి

Posted On: 05 NOV 2020 5:08PM by PIB Hyderabad

తెలుగు భాష మాధుర్యానికి, తెలుగు పద్య వైభవానికి మరింత వన్నె తీసుకొచ్చిన సాహితీ ప్రక్రియే అవధానమని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అవధానం చేస్తున్నకవి.. ఆశు కవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తి, పాండితీ ప్రకర్షకు ఇదొక పరీక్ష వంటిదని ఆయన అన్నారు. బహుశా సంస్కృత, తెలుగు భాషలకు మాత్రమే ప్రత్యేకమైన అవధాన ప్రక్రియను మరింతంగా ప్రోత్సహిస్తూ.. తెలుగుభాష మాధుర్యాన్ని, సాహితీ సౌరభాన్ని మరింత పరిమళింపజేయాల్సిన బాధ్యత భాషాపండితులు, సాహితీవేత్తలపై ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు.

గురువారం తిరుపతిలోని శ్రీ కృష్ణదేవరాయ సత్సంగ్ ఆధ్వర్యంలో డాక్టర్ మేడసాని మోహన్ నిర్వహిస్తున్న ‘అంతర్జాతీయ శతావధానం’ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రతి అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను సులువుగా పూర్తి చేస్తూ, అసంబద్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ అద్భుతమైన సాహితీ విన్యాసంగా ముందుగా సాగే అవధాన ప్రక్రియ ఎంతో ఆసక్తిదాయంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

మాతృభాషే మన అస్తిత్వమన్న ఉపరాష్ట్రపతి.. తెలుగు భాష పరిరక్షణ, తర్వాతి తరాలకు ఈ మాధుర్యాన్ని అందించడంలో రచయితలు, సాహితీవేత్తలు, కవులు, భాషా నిపుణులు మరింత కృషిచేయాలన్నారు. తెలుగు భాష పరిరక్షణకోసం విదేశాల్లో జరుగుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. ‘విదేశాల్లోని తెలుగువారు.. మన భాష ఔన్నత్యాన్ని కాపాడేందుకు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఉత్సాహంగా కృషిచేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ దిశగా కృషిచేయాలి. విదేశీ భాషల వ్యామోహాన్ని నేను తప్పుబట్టడం లేదు. అయితే.. మాతృభాషను మాత్రం మరవొద్దు’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.

భాష అంటే కేవలం భావ వ్యక్తీకరణ మాత్రమే కాదని.. ఒక వ్యక్తి జాతీయత, సాంస్కృతిక వారసత్వం, ప్రాంతం ఇలా అన్ని విషయాలను భాషే తెలియజేస్తుందని ఆయన అన్నారు. తల్లి భాషను పదిలపరుచుకున్న ఏ జాతి అయినా తన ఉనికిని నిలుపుకుని తీరుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదన్నారు.  తాను భారతదేశ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, నిర్ణయించుకున్న భవిష్యత్ ప్రణాళికలో మాతృభాషకు తొలి ప్రాధాన్యం ఇచ్చానన్నారు. అమ్మభాష విషయంలో తాను చాలా నిక్కచ్చిగా ఉంటానన్నారు. మాతృభాష తెలుగుకు మాత్రమే కాకుండా, అన్ని భాషలకు అదే గౌరవాన్ని ఇస్తున్నానని తెలిపారు. మాతృభాషను పరిరక్షించుకోవడం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం, ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారానే మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోగలమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు.

భాషా ఔన్నత్యాన్ని కాపాడుతున్న అవధాన ప్రక్రియను నిర్వహిస్తున్న వారందరూ అభినందనీయులన్నారు. తెలుగు భాష వైభవాన్ని పరంపరగా ముందుకు తీసుకువెళుతున్న శ్రీ మేడసాని మోహన్ గారిని ప్రశంసిస్తూ.. ‘వారు సరస్వతి పుత్రులు. అసాధారణ జ్ఞాపకశక్తి, ప్రజ్ఞాపాటవాలు కలిగిన వారు. తెలుగు భాషకు, సాహితీ రంగానికి వారు చేస్తున్న సేవ అభినందించదగినది’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ఈ మహత్తర అవధాన కార్యక్రమంలో అమెరికా, యూరప్, ఆసియా ఖండాలకు చెందిన 20 దేశాల నుంచి సాహితీ వేత్తలు పృచ్ఛకులుగా పాల్గొనడం అభింనదనీయమన్నారు. తెలుగు వెలుగులు ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ తరుణంలో మనకు ప్రత్యేకమైన అవధాన ప్రక్రియ కూడా అంతే ఖ్యాతిని సముపార్జించటం ఆనందదాయకమని ఆయన అన్నారు.

భారతీయ సంస్కృతి వైభవం, వ్యాస, వాల్మీకి, కాళిదాసాది మహాకవుల కవితా ప్రాభవం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ శాంతి వంటి సంప్రదాయిక అంశాలపై వివిధ కోణాల్లో అధ్యయనం చేయదగిన రీతిలో ప్రశ్నించే అంశాలు ఉండడం ముదావహమని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

కరోనా నేపథ్యంలో అంతర్జాలం ద్వారా అవధానాన్ని నిర్వహించడం గొప్పవిషయమని.. సమస్యలను సోపానాలుగా మార్చుకుంటూ ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో భవిష్యత్ లో మరిన్ని అవధానాలు సాగాలని, తెలుగు భాష, తెలుగువారి సాహితీ ప్రక్రియలు మరింతగా విశ్వవ్యాప్తం కావాలని ఆయన ఆకాంక్షించారు.

అంతర్జాతీయ శతావధానంలో భాగంగా 'కురు, చిరు, కడు, నడు, నిడు' లను ఉపయోగించుకుంటూ భారతీయ సంస్కృతి వైభవం గురించి గానీ, పర్యావరణ పరిరక్షణ గురించి గానీ, ప్రపంచ శాంతి గురించి గానీ మీకు నచ్చిన ఛందస్సులో ఓ పద్యాన్ని చెప్పగలరని ఉపరాష్ట్రపతి సమస్యను సంధించగా... దీనికి డాక్టర్ మేడసాని మోహన్ గారు ‘శ్రీలు చేకురు గాక, శ్రీ భారతోర్వీ యశస్ఫూర్తి దిగ్వియసంభుతముగ – పంచభూతాత్మక ప్రకృతి సౌందర్యంబు సవ్యసాచిరుచిత్వా సంహరితము – పలుకుల తల్లి శ్రీపాదాలు కడుగంగ ఉత్సహించెడి కవులున్న భూమి – నడువంగవలయు ఈ నవ్యభారత దీప్తి దిగ్‌దిగంతములలో తేజరిల్లి – స్వర్ణవాక్కులనిడు తల్లి స్వాంతమందు వెలుగగ నుపాసనముచేయు విభుదవరుల నిలయముగ భారతంబు సొంపలరుచుండె – విశ్వమానవ సౌభాగ్య విభవము అలర’ అని పూరించారు.

ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, భాషా పండితులు, రచయితలు, కవులు,  భాషాభిమానులు, భాషావేత్తలతో పాటు వివిధ దేశాలకు చెందిన  తెలుగువారు పాల్గొన్నారు.

***



(Release ID: 1670387) Visitor Counter : 280