గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ట్రైఫెడ్ జాబితాలోకి వంద తాజా అటవీ, సేంద్రియ ఉత్పత్తులు
Posted On:
26 OCT 2020 3:12PM by PIB Hyderabad
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గిరిజన సహకార మార్కెటింగ్ సమాఖ్య (ట్రైఫెడ్) జాబితాలో మరో వంద తాజా అటవీ సేంద్రియ ఉత్పాదనలు చేరాయి. ప్రకృతి వరప్రసాదాలైన తాజా అటవీ ఉత్పత్తులను, పలు రకాల కొత్త తరహా గిరిజన ఉత్పాదనలను ట్రైఫెడ్ ఈ జాబితాలో చేర్చింది. ఈ ఉత్పత్తులను ట్రైఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ కృష్ణ ఈ రోజు వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు. కొత్తగా జాబితాలో చేర్చిన వంద ఉత్పాదనలను, వారం, వారం ప్రాతిపదికన ట్రైబ్స్ ఇండియా కేటలాగులో చేర్చుతారు. వీటిల్లో తొలి దశ ఉత్పత్తులను ఈ రోజు ఆన్ లోకి విడుదల చేశారు. తొలిదశలో అందుబాటులోకి తెచ్చిన ఉత్పత్తలతోపాటుగా, మిగతా ఉత్పాదనలు కూడా దేశంలోని 125 ట్రైబ్స్ ఇండియా దుకాణాల్లో, ట్రైబ్స్ ఇండియా సంచార వాహనాల్లో అందుబాటులో ఉంచుతారు. ట్రైబ్స్ ఇండియా ఈ మార్కెట్ వేదిక అయిన tribesindia.com పోర్టల్లో, e-tailersలో కూడా వీటిని అందుబాటులో ఉంచుతారు. గిరిజన హస్తకళాకారులు, ఆదివాసీలకు సుస్థిర ఆదాయం, జీవనోపాధి కల్పించే చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా గిరిజనులనుంచి కొత్త తరహా ఉత్పాదనలను, ప్రాకృతిక ఉత్పత్తులను ట్రైఫెడ్ అందుబాటులోకి తెచ్చింది.
ఈ సందర్భంగా ట్రైఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ కృష్ణ మాట్లాడుతూ, “కొత్త తరహా గిరిజన ఉత్పత్తులను, తాజా అటవీ సేంద్రియ ఉత్పాదనలను ఆవిష్కరించడం మాకు ఎంతో గర్వకారణం. ప్రకృతి సిద్ధంగా తయారైన, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజంనుంచి సేకరించిన వంద రకాల కొత్త తరహా ఉత్పత్తులను, రోగనిరోధక శక్తిని పెంపొందించే ఉత్పాదనలను వీటిలో చేర్చబోతున్నాం. ఈ సేంద్రియ ఉత్పాదనలు, రోగనిరోధక శక్తిని పెంచే ప్రాకృతిక ఉత్పాదనలు,..ప్రజలు సుస్థిరమైన సంపూర్ణ స్థాయి జీవితం సాగించడానికి దోహదపడతాయి. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన హస్తకళాకారుల, ఆదివాసీల సాధికారతను పెంపొందించేందుకు ఈ చర్య వీలు కలిగిస్తుంది. ఈ ఉత్పాదనల అమ్మకంతో ప్రయోజనం నేరుగా గిరిజనలకే చేరుతుంది.” అని అన్నారు.
ట్రైబ్స్ ఇండియా అధీనంలోని విస్తారమైన వస్తు పట్టికను ఈ తాజా గిరిజన, ప్రకృతి ఉత్పత్తులు మరింత సుసంపన్నం చేస్తాయి. ఈ రోజు ఆవిష్కరించిన ఉత్పత్తుల్లో, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, కినౌర్ ప్రాంతానికి చెందిన గోల్డన్ గ్రీన్, రెడ్ ఆపిల్ పండ్లు, ఉత్తరాఖండ్ లోని ముంజ్ గడ్డితో తయారు చేసిన బుట్టలు, పెట్టెలు, తమిళనాడులోని నీలగిరి గిరిజనులు ఉత్పత్తి చేసిన పిక్కల చింతపండు, లవంగాలు, యూకలిప్టస్ తైలం, కాఫీపొడి, రాజస్థాన్ లోని మీనా తెగ గిరిజనులు తయారు చేసిన ట్రైబ్స్ ఇండియా బ్రాండ్ మాస్కులు ఉన్నాయి; అలాగే, మధ్యప్రదేశ్ అడవుల గోండులు, భిల్లు తెగ గిరిజనులు తయారు చేసిన రోగనిరోధక శక్తిని పెంచే మూలికా చూర్ణం, కాదా కషాయం, మధ్యప్రదేశ్ కే చెందిన శివగంగ, ఝబువా ప్రాంతాల భిలాలా తెగవారు తయారు చేసిన మహువా వెదురు బొంగుల కొవ్వత్తులు, రోగనిరోధక శక్తిని పెంచే తిప్పతీగ, నేరేడు గింజల చూర్ణాలు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ఒక రకం పప్పు ధాన్యాలు, కిచిడీ మిక్సులు, ఈశాన్య రాష్ట్రాలనుంచి పలు రకాల పనస, ఆలీవ్ పచ్చళ్లు, పండ్లరసాలు, ఎర్రబియ్యం వంటి వాటిని కూడా తాజాగా ఆవిష్కరించారు.
తాజా గిరిజన, అటవీ ఉత్పత్తులన్నీ చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలనుంచి సేకరించారు. వీటికి తోడు, వన్ ధన్ గిరిజన స్టార్టప్ కంపెనీల ఆధ్వర్యంలో శుద్ధీకరించి, ప్యాకేజీ చేయించిన ఉత్పత్తులను కూడా విక్రయానికి అందుబాటులోకి తెచ్చారు. కనీస మద్దతు ధర పథకం కింద గిరిజనులకు, ఆదివాసీల, ఇళ్లలోని గిరిజన హస్తకళాకారుల ఉపాధికల్పన లక్ష్యంగా ఈ స్టార్టప్ కంపెనీలను ప్రారంభించారు.
వినూత్నమైన ఈ ఉత్పాదనలను కేటలాగులో చేర్చడంవల్ల వినియోగదారులకు, గిరిజన జనాభాకు ప్రయోజనం చేకూరుతుంది. మరో వైపు, ప్రకృతి వరప్రసాదమైన సహజ సిద్ధమైన ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కుటుంబాలను మరింత సులభంగా చేరుతాయి. గిరిజనుల జీవనోపాధినీ ఇవి పటిష్టంచేస్తాయి. కోవిడ్-19 వైరస్ మహమ్మారి వైరస్ సంక్షోభంతో పలువురి జీవితాలను విచ్ఛిన్నమైన ప్రస్తుత కష్టకాలంలో ప్రజలు ప్రాకృతిక ఆహారోత్పత్తులతో ఆరోగ్యకరమైన జీవన విధానం పాటించేందుకు, సాధ్యమైనంత సురక్షితంగా గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు.
‘స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం, ప్రోత్సాహం’ అన్న మంత్రాన్ని ట్రైఫెడ్,.. ప్రస్తుత కష్టకాలంలో సానుకూలంగా మార్చుకుంది. ‘స్వదేశీ ఉత్పత్తులకు, గిరిజన ఉత్పాదనలకు ప్రోత్సాహం’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. పెనుమార్పులు తెచ్చే అనేక చర్యలతో దెబ్బతిన్న గిరిజనుల జీవన పరిస్థితులను మార్చివేసేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధాన కార్యక్రమాలకు అదనంగా అనేక లాభదాయక పథకాలను ట్రైఫెడ్ చేపట్టింది.
అంతేకాక ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’కు అనుగుణంగా గిరిజనులకోసం ప్రత్యేక మైన ఈ-మార్కెట్ వేదికను ట్రైఫెడ్ ప్రారంభించింది. ఆదివాసీల, హస్తకళాకారుల తయారు చేసిన హస్తకళలను, అటవీ ఉత్పత్తులకు విక్రయ వేదికగా market.tribesindia.com అనే పోర్టల్ ను ప్రారంభించింది. గిరిజనులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ఒక విలక్షణ సదుపాయంగా ఇది ఉపయోగపడుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 5లక్షలమేర గిరిజన ఉత్పాదనలను, ప్రాకృతిక ఉత్పత్తులను, హస్తకళలను ఈ మార్కెట్ వేదికపైకి తీసుకువచ్చేందుకు ట్రైఫెడ్ కృషిచేస్తోంది.
*****
(Release ID: 1667666)
Visitor Counter : 196