హోం మంత్రిత్వ శాఖ

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) 59వ ఆవిర్భావ

దినోత్సవంలో పాల్గొన్న కేంద్రం హోం శాఖ సహాయమంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో

ఐటీబీపీ సంపూర్ణ సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా సమర్థ నాయకత్వాన ఐటీబీపీని

మరింత సమర్థం, ఆధునికం చేసేందుకు మంత్రిత్వశాఖ పలు చర్యలు చేపట్టింది

Posted On: 24 OCT 2020 3:48PM by PIB Hyderabad

   ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) 59వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా గ్రేటర్‌ నోయిడాలో నిర్వహించిన వేడుకలలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా దళాల కవాతులో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శ్రీ జి.కిషన్‌ రెడ్డి ప్రసంగిస్తూ- ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మన సంస్కృతి “వసుధైవ కుటుంబకం” నినాదాన్ని బోధించిందని గుర్తుచేశారు. అదే సమయంలో శత్రువులు సృష్టించే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయి సాధికారత, సంసిద్ధతల తారకమంత్రాన్ని కూడా మన సంస్కృతి ఉపదేశించిందని పేర్కొన్నారు. ఆ మేరకు 1962లో ఆవిర్భవించిన ఐటీబీపీ బలగం మన సరిహద్దులను రక్షిస్తున్నదని శ్రీ రెడ్డి తెలిపారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఐటీబీపీ సిబ్బంది భరతమాత రక్షణ కర్తవ్యాన్ని మొక్కవోని దేశభక్తి, అకుంఠిత దీక్షతో నిర్వర్తిస్తున్నారని కొనియాడారు.

   పర్వత ప్రాంతాల్లో అత్యంత ప్రతికూల, కఠిన పరిస్థితుల నడుమ ఐటీబీపీ బలగం అత్యున్నత క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యంతో సేవలందిస్తున్నదని ప్రశంసించారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం, ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాదం వంటివాటిని ఐటీబీపీ సమర్థంగా చాకచక్యంగా ఎదుర్కొంటున్నదని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఐటీబీపీ సంపూర్ణ సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ జి.కిషన్‌ రెడ్డి చెప్పారు. అలాగే హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా సమర్థ నాయకత్వాన ఐటీబీపీని మరింత సమర్థం, ఆధునికం చేసేందుకు మంత్రిత్వశాఖ పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. సరిహద్దులలో 47 ఐటీబీపీ గస్తీ శిబిరాల ఏర్పాటుకు హోంశాఖ ఆమోదం తెలిపిందని శ్రీ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది 28 రకాల కొత్త వాహనాలను సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఐటీబీపీకి రూ.7,223 కోట్ల బడ్జెట్‌ కేటాయింపుతోపాటు  నిర్వహణ కోసం రూ.15 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

   ప్రధానమత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన మన దేశం కరోనా మహమ్మారిపై పోరాడుతున్న సమయంలో ఐటీబీపీ సిబ్బంది తమవంతు సహకారం అందించారని గుర్తుచేశారు. దేశవ్యాప్త దిగ్బంధం కొనసాగుతున్న వేళ మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఐటీబీపీ సిబ్బంది నిత్యావసరాలను సరఫరా చేశారని పేర్కొన్నారు. కోవిడ్‌-19పై జాతి చేస్తున్న యుద్ధంలో ఐటీబీపీ అనేక విధాలుగా నిస్వార్థ సేవలు అందించడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఛాత్రపూర్‌లో సర్దార్‌ పటేల్‌ పేరిట ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌-19 ప్రత్యేక ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను శ్రీ అమిత్‌ షా మార్గనిర్దేశం మేరకు ఐటీబీపీకి అప్పగించడాన్ని గుర్తుచేశారు. నిస్వార్థంగా మానవాళికి సేవలు అందించడంలో ఐటీబీపీ ఆదర్శప్రాయంగా నిలిచిందని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్‌లో యువతను క్రీడలవైపు ప్రోత్సహించడంలో, సామాన్య ప్రజానీకానికి తాగునీటి వసతుల కల్పనలో, సుదూర ప్రాంతాల్లో వైద్యశిబిరాల నిర్వహణలో ఐటీబీపీ జవాన్లు నిర్విరామంగా శ్రమించారని ప్రశంసించారు. అంతేగాక మారుమూల ప్రాంతాల నుంచి కిలోమీటర్ల మేర కాలినడకన రోగులను ఆస్పత్రులకు మోసుకువచ్చి విలువైన ప్రాణాలను రక్షించారని కొనియాడారు.

   భారత ప్రభుత్వ పథకాలను విజయవంతంగా చేయడంలోనూ ఐటీబీపీ సిబ్బంది పోషించిన చురుకైన పాత్ర గురించి కూడా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆదేశాల మేరకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారని పేర్కొన్నారు. అలాగే ‘సుదృఢ భారతం’ ఉద్యమంద్వారా ఐటీబీపీ జవాన్లు శరీర దృఢత్వంపై ప్రజానీకంలో ఎంతో స్ఫూర్తిని రగిల్చారని వివరించారు. దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఐటీబీపీ గణనీయ స్థాయిలో కృషి చేసిందని చెప్పారు. మన ఆర్థికాభివృద్ధిని మందగింపజేయడానికి సరిహద్దుల ఆవలినుంచి జరిగిన ప్రయత్నాలను ఐటీబీపీ తిప్పికొట్టడంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. ఐటీబీపీ అమరవీరులకు నివాళి అర్పిస్తూ- ప్రభుత్వంతోపాటు దేశం యావత్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తుందని శ్రీ రెడ్డి హామీ ఇచ్చారు.

   ఈ కార్యక్రమంలో భాగంగా విశిష్ట సేవలందించిన ఐటీబీపీ సిబ్బందికి ఆరు రాష్ట్రపతి పోలీసు పతకాలను, 23 పోలీసు పతకాలను శ్రీ రెడ్డి ప్రదానం చేశారు. ఐటీబీపీ సిబ్బంది ధైర్యసాహసాలు, త్యాగాలు దేశానికి గర్వకారణమని, జాతియావత్తూ వారికి రుణపడి ఉంటుందని తన ప్రసంగం ముగింపు సందర్భంగా పేర్కొన్నారు. అంతకుముందు ఐటీబీపీ చేపట్టిన ఇటీవలి కార్యకలాపాల గురించి బలగాల డైరెక్టర్‌ జనరల్‌ శ్రీ సూర్జిత్‌ సింగ్‌ దేశ్వాల్‌ కేంద్ర హోంశాఖ సహాయంత్రికి వివరించారు. ఆధునిక వాహనాలు, రక్షణ కవచాలు, హెల్మెట్లు తదితరాల కొనుగోళ్లసహా ఐటీబీపీ ఆధునికీరణకు కృషి చేస్తున్నట్లు శ్రీ దేశ్వాల్‌ చెప్పారు. కోవిడ్‌-19 ప్రతికూల పరిస్థితుల నడుమ దేశానికి సేవలందించే అవకాశం లభించినందుకు ఐటీబీపీ ఎంతో గర్విస్తున్నదని శ్రీ దేశ్వాల్‌ పేర్కొన్నారు. ఆ మేరకు ఆరోగ్య సేవలతోపాటు ఇతరత్రా సేవలను ఉచితంగా అందించడం తమకెంతో సంతోషకరమని పేర్కొన్నారు.

   ఐటీబీపీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఏడాది కాలంలో బలగాలు సాధించిన విజయాలను వివరించే వార్షిక ప్రత్యేక స్మారక సంచికతోపాటు ‘దేవభూమి ఉత్తరాఖండ్‌’ పేరిట రాష్ట్రంలోని ఆధ్యాత్మిక-మత-పర్యాటక ప్రదేశాలు, విశిష్ట సంస్థలు, ఆలయాలు, తదితరాల సమాచారంతో కూడిన పుస్తకాన్ని ముఖ్య అతిథి ఆవిష్కరించారు. కాగా, భారత-చైనా యుద్ధం నేపథ్యంలో 1962 అక్టోబరు 24న ఐటీబీపీ బలగాలు ప్రధానంగా హిమాలయాల పరిధిలోని 3,488 కిలోమీటర్ల దేశ సరిహద్దులను కాపలా కాస్తుంటాయి. ఈ గస్తీ శిబిరాలు 3,000 నుంచి 18,800 అడుగుల మేర అత్యంత ఎత్తయిన ప్రాంతాలవరకూ విస్తరించి ఉంటాయి. సరిహద్దుల రక్షణతోపాటు ఈ బలగాలను నక్సలైట్‌ వ్యతిరేక కార్యకలాపాల్లో్నూ, ఇతర అంతర్గత భద్రత విధుల్లోనూ ప్రభుత్వం నియమిస్తూంటుంది.

***



(Release ID: 1667328) Visitor Counter : 248