ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆదాయం పన్ను రిటర్నులు, ఆడిట్ రిపోర్టుల సమర్పణకు గడువు పొడిగింపు

Posted On: 24 OCT 2020 2:27PM by PIB Hyderabad

   కోవిడ్-19 వైరస్ ప్రబలడంతో పన్ను చెల్లింపుదార్లు పాటించవలసిన చట్టబద్ధమైన, నియంత్రణా నిబంధనలు, ఇతర సవాళ్ల నేపథ్యంలో ప్రభుత్వం 2020 మార్చి 31న ఒక ఆర్డినెన్సును తీసుకువచ్చింది. పన్నుల విధింపు, ఇతర నిబంధనలకు సంబంధించిన చట్టాల్లో కొన్ని నిబంధనలను సవరిస్తూ ఈ ఆర్డినెన్సును జారీ చేశారు. పన్నుల చెల్లింపునకు సంబంధించి వివిధ రకాల గడువులను కూడా పొడిగించారు. అనంతరం కొన్ని నిబంధనల సవరణతో,.. పన్ను విధింపు ఇతర నిబంధనలతో ఆర్డినెన్స్ స్థానంలో కొత్త చట్టాన్ని కూడా తీసుకువచ్చారు.

  కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో,..2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పన్ను వివరాలను సమర్పించేందుకు గడువును 2020 నవంబరు 30వ తేదీవరకూ పొడిగిస్తూ ప్రభుత్వం 2020, జూన్ 24వ తేదీన ఒక నోటిఫికేషన్ వెలువరించింది.  దీనితో, 2020, జూలై 31, 2020 అక్టోబరు 31లోగా దాఖలు చేయాల్సిన ఆదాయం పన్ను వివరాలను ఇపుడు 2020 నవంబరు 30వరకూ దాఖలు చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాగే, 1961వ సంవత్సరపు ఆదాయంపన్ను చట్టం ప్రకారం పన్ను ఆడిట్ నివేదికలతోపాటుగా వివిధ రకాల ఆడిట్ నివేదికలు సమర్పించడానికి గడువు కూడా 2020 అక్టోబరు 31కి పొడిగించారు.

   ఆదాయం పన్ను వివరాలను సమర్పించేందుకు పన్ను చెల్లింపు దారులకు గడువులో వెసులుబాటు ఇచ్చేందుకు వీలుగా ఆదాయం పన్ను రిటర్నుల దాఖలుకు చివరి తేదీని ఈ కింది విధంగా పొడిగించారు. :

 

 (ఎ)   పన్ను చెల్లింపుదారులు, వారి భాగస్వాములు, తమ ఖాతాలను ఆడిటింగ్ చేయించవలసిన అవసరం ఉన్నవారు ఆదాయం పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు ఇదివరకు నిర్దేశించిన చివరి తేదీని తాజాగా పొడిగించారు. పొడిగింపు నోటిఫికేషన్ కు ముందు ఇచ్చిన చివరి తేదీ 2020 అక్టోబరు 31 కాగా,  ఆ తేదీని ఇపుడు 2021 జనవరి 31వరకూ పొడిగించారు.    

 

 (బి)   అంతర్జాతీయ లావాదేవీలు, కొన్ని ప్రత్యేక స్వదేశీ లావాదేవీలు నిర్వహించే పన్ను చెల్లింపు దార్లు చట్టం ప్రకారం తమ ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఇదివరకు నిర్దేశించిన గడువును కూడా పొడిగించారు. పొడిగింపు నోటిఫికేషన్ కు ముందుగా ఇచ్చిన తేదీ ప్రకారం 2020 నవంబరు 30వ తేదీకి గడువు ముగుస్తుండగా, తాజాగా ఆ గడువును 2021, జనవరి 31వరకూ పొడిగించారు 

 

 (సి)   ఇతర పన్నుచెల్లింపు దార్లు చట్ట ప్రకారం  తమ ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఇదివరకు ఉన్న గడువును కూడా తాజాగా పొడిగించారు. పొడిగింపు నోటిఫికేషన్ కు ముందు ఇచ్చిన చివరి తేదీ 2020, జూలై 31 కాగా,.. తాజాగా గడువును 2020, డిసెంబరు 31వరకూ పొడిగించారు.

 

    దీనితో,.. చట్టప్రకారం పన్ను ఆడిట్ నివేదికలు, వివిధ ఆడిటింగ్ నివేదికలు సమర్పించవలసిన వారు, అంతర్జాతీయ లావాదేవీలు, కొన్ని ప్రత్యేకమైన స్వదేశీ లావాదేవీలు జరిపే వారు తమ నివేదికల సమర్పించాల్సిన ఆఖరు తేదీని 2020, డిసెంబరు 31వరకూ పొడిగించారు.

   పైగా,..దిగువ చిన్నతరహా పన్ను చెల్లింపుదారులు, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం పన్ను వివరాలు సమర్పించేందుకు గడువులో మరింత వెసులుబాటు ఇస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పన్ను విధింపునకు ఆస్కారంఉన్న లక్షరూపాయల వరకూ ఆదాయం ఉన్న వారు సొంత మధింపుతో కూడిన ఆదాయం పన్ను వివరాలను సమర్పించడానికి గడువును పొడిగిస్తూ 2020 జూలై 24న ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించిది. దీనికి అనుగుణంగా,.ఈ తరహా పన్ను చెల్లింపుదార్లకు, అంటే, తమ ఖాతాల ఆడిటింగ్ చేయించాల్సిన అవసరంలేని వారికి ఇదివరకు 2020, జూలై 31వరకూ ఇచ్చిన గడువును 2020, నవంబరు 30 వరకూ పొడిగించారు. తమ ఖాతాలను అడిటింగ్ చేయాల్సిన అవసరం ఉన్నవారికి ఇదివరకు 2020 అక్టోబరు 31వరకూ నిర్దేశించిన గడువును 2020, నవంబరు 30వరకూ పొడిగించారు.

  దిగువ తరగతి, మధ్యతరగతి పన్ను చెల్లింపు దార్లు తాము స్వయంగా మధింపు చేసిన ఆదాయం పన్ను వివరాలను దాఖలు చేసేందుకు గడువులో మరోసారి వెసులుబాటు కల్పించారు. పన్ను విధింపునకు ఆస్కారం ఉన్న లక్ష రూపాయలవరకూ ఆదాయం ఉన్నవారు స్వయం మధింపు ప్రక్రియతో వివరాలు సమర్పించేందుకు 2021 జనవరి 31వరకూ అవకాశం ఇచ్చారు. ఈ మేరకు పేరా 3(ఎ)లో, పేరా 3(బి)లో ప్రస్తావించిన పన్ను చెల్లింపుదార్లకు 2021జనవరి 31వరకూ తాజాగా గడువు ఇచ్చారు.  ఇక, పేరా 3(సి)లో ప్రస్తావించిన పన్ను చెల్లింపు దార్లకు తాజాగా 2020 డిసెంబరు 31వరకూ గడువు ఇచ్చారు.

 ఇందుకు సంబంధించి,.. అవసరమైన నోటిఫికేషన్ త్వరలో వెలువడుతుంది.

****



(Release ID: 1667300) Visitor Counter : 444