ప్రధాన మంత్రి కార్యాలయం

జాతి నుద్దేశించి ప్రధానమంత్రి ప్రత్యేక ప్రసంగం

కరోనాకు వ్యతిరేకంగా దేశ పోరాటంలో తమ రక్షణను తగ్గించవద్దని పౌరులకు విజ్ఞప్తి చేసిన - ప్రధానమంత్రి


లాక్ డౌన్ పోయి ఉండవచ్చు కానీ వైరస్ పోలేదన్న - ప్రధానమంత్రి


జాగ్రత్తగా ఉండండి - ఇది నిర్లక్ష్యం మరియు నిశ్చలతకు సమయం కాదు


దేశానికి నిస్వార్థ సేవ చేసినందుకు వైద్యులు, నర్సులు మరియు ఇతర కరోనా వారియర్స్ చేసిన కృషి ప్రశంసనీయం


టీకాపై పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రతి పౌరునికి టీకా పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఒక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది


దేశంలో రికవరీ రేటు మెరుగుపడింది, మరణాల రేటు తక్కువగా ఉంది: ప్రధానమంత్రి

Posted On: 20 OCT 2020 7:52PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ టెలివిజన్ ద్వారా దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ, కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం కొనసాగుతున్న పోరాటం నేపథ్యంలో, పౌరులెవరూ, తమ రక్షణను తగ్గించవద్దనీ, ఆత్మసంతృప్తి చెందవద్దనీ, పౌరులందరికీ ఒక తీవ్రమైన విజ్ఞప్తి చేశారు.  

లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ, కరోనా వైరస్ తుడిచిపెట్టుకుపోయినట్లు భావించరాదని, శ్రీ నరేంద్రమోదీ అన్నారు.

దేశవ్యాప్తంగా పరిస్థితిలో మెరుగుదలను ఆయన ప్రశంసించారు.  ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్నాయనీ, తమ విధులు, బాధ్యతలు నెరవేర్చడానికి ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటికి వెళ్లడం ప్రారంభించారనీ, ఆయన పేర్కొన్నారు. 

ఉత్సవాల నేపథ్యంలో మార్కెట్లు కూడా సాధారణ స్థితికి చేరుకోవడం ప్రారంభమైందని, శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు.

గత 7-8 నెలల్లో ప్రతి భారతీయుడు చేసిన ప్రయత్నాల ఫలితంగానే, భారతదేశం ఈ రోజున మెరుగైన పరిస్థితిలో ఉందనీ, అది దిగజారడానికి అనుమతించరాదనీ, ఆయన అన్నారు.

దేశంలో రికవరీ రేటు మెరుగుపడగా, అదే సమయంలో మరణాల రేటు తగ్గినట్లు, ప్రధానమంత్రి గుర్తించారు.  మన దేశంలో, ప్రతి 10 లక్షల మంది పౌరులకు 5,500 మంది కరోనా బారిన పడుతుండగా, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో ఈ సంఖ్య దాదాపు 25,000 గా ఉందని, శ్రీ మోదీ పేర్కొన్నారు.

భారతదేశంలో మరణాల రేటు ప్రతి 10 లక్షల మంది పౌరులకు 83 కాగా, అభివృద్ధి చెందిన అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, బ్రిటన్ వంటి అనేక ఇతర దేశాలలో ఇది 600 గా ఉందని, ప్రధానమంత్రి వివరించారు. 

అనేక అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, దేశ పౌరుల ప్రాణాలను రక్షించడంలో భారతదేశం విజయవంతమవుతోందని ప్రధానమంత్రి ప్రశంసించారు.

దేశంలో కోవిడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు.  దేశ వ్యాప్తంగా 12,000 క్వారంటైన్ కేంద్రాలతో పాటు కరోనా రోగులకు 90 లక్షలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా 2,000 కరోనా పరీక్షా ప్రయోగశాలలు పనిచేస్తున్నాయనీ, పరీక్షల సంఖ్య త్వరలో 10 కోట్లను దాటుతుందని ఆయన తెలిపారు. 

వనరులు సమృద్ధిగా ఉన్న దేశాలతో పోలిస్తే, తన పౌరులలో ఎక్కువ మంది ప్రాణాలను రక్షించడంలో, భారతదేశం విజయవంతమవుతోందని ఆయన అన్నారు.  పెరుగుతున్న పరీక్షల సంఖ్య కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో ఒక గొప్ప బలంగా ఉంది. 

"సేవా పరమో ధర్మ" అనే మంత్రాన్ని అనుసరించి, ఇంత పెద్ద జనాభాకు నిస్వార్థంగా సేవ చేస్తున్న వైద్యులు, నర్సులతో పాటు ఇతర ఆరోగ్య కార్యకర్తల కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.

ఈ ప్రయత్నాలన్నిటి మధ్య, కరోనా వైరస్ పోయిందనీ లేదా ఇప్పుడు కరోనా నుండి ఎటువంటి ప్రమాదం లేదనీ భావించవద్దని ప్రజలను ఆయన హెచ్చరించారు. 

జాగ్రత్తలు తీసుకోవడం మానేసిన ప్రజలను ఆయన హెచ్చరిస్తూ,  "మీరు నిర్లక్ష్యంగా, మాస్కు లేకుండా బయటకు వెళుతుంటే, మీతో పాటు, మీ కుటుంబం, మీ పిల్లలు, వృద్ధులను కూడా, అదే మొత్తంలో ప్రమాదానికి గురిచేసినవారవుతారు." అని పేర్కొన్నారు. 

కరోనా కేసుల సంఖ్య మొదట్లో తగ్గినప్పటికీ, అకస్మాత్తుగా పెరగడం ప్రారంభించిన అమెరికా, ఐరోపా దేశాలలో కొనసాగుతున్న పరిస్థితిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు ప్రజలు నిర్లక్ష్యంగా ఉండవద్దనీ, కోవిడ్-19 తీవ్రత క్రమంగా బలహీనపడాలని ఆయన కోరారు.

మానవాళిని కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, దేశ శాస్త్రవేత్తలతో సహా అనేక దేశాలు వ్యాక్సిన్ ఉత్పత్తికి కృషి చేస్తున్నాయనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

కరోనాకు వ్యతిరేకంగా వివిధ వ్యాక్సిన్ల పని జరుగుతోందని, వీటిలో కొన్ని అధునాతన దశలో ఉన్నాయని ఆయన అన్నారు.

వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న వెంటనే ప్రతి పౌరునీకీ చేరడానికి వీలుగా,  ప్రభుత్వం ఒక వివరణాత్మక కార్యాచరణ ప్రణాళిక‌ను కూడా సిద్ధం చేస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు. 

టీకా వచ్చేవరకు ప్రజలు అజాగ్రత్తగా ఉండవద్దని, ఆయన పదే పదే విజ్ఞప్తి చేశారు. 

మనం చాలా కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొంటున్నామనీ, ఏ మాత్రం కాస్త అజాగ్రత్తగా ఉన్నా, అది భారీ సంక్షోభానికి దారితీస్తుందనీ, మన ఆనందాన్ని దెబ్బతీస్తుందనీ, ప్రధానమంత్రి హెచ్చరించారు.  

పౌరులు తమ విధులను, బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

ఆరు అడుగుల దూరం (దో గజ్ కి దూరి) ని నిర్వహించాలనీ, తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలనీ, ఫేస్ మాస్కులు  ధరించాలనీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు.

*****



(Release ID: 1666281) Visitor Counter : 190