పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

దేశంలో బీఎస్‌-6ను ప్రవేశపెట్టడం విప్లవాత్మక అడుగు: శ్రీ ప్రకాశ్‌ జావడేకర్


Posted On: 18 OCT 2020 7:10PM by PIB Hyderabad

కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్‌ జావడేకర్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ప్రజలతో సంభాషించారు. దేశంలో వాయు కాలుష్యం, నియంత్రణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. #AskPrakashJavadekar హ్యాష్‌ట్యాగ్‌తో ప్రజలు కేంద్ర మంత్రితో మాట్లాడారు.

వాయు కాలుష్య నియంత్రణకు ప్రధాని మోదీ సమగ్ర విధానం ప్రకటించారని, అది దేశవ్యాప్తంగా అమలవుతోందని శ్రీ జావడేకర్‌ చెప్పారు. జాతీయ స్వచ్ఛ వాయు పథకం (ఎన్‌సీఏపీ) ద్వారా, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆ విధానాన్ని దేశవ్యాప్తంగా 122 నగరాల్లో అమలు చేస్తోందని తెలిపారు. 'పీఎం10'లో 20-30 శాతం తగ్గింపు, 2024 నాటికి 'పీఎం2.5' సాధించడం ఎన్‌సీఏపీ లక్ష్యంగా కేంద్ర మంత్రి వివరించారు.

ప్రపంచం మొత్తం వాయు కాలుష్య సమస్యను ఎదుర్కొంటోందని శ్రీ జావడేకర్‌ అన్నారు. వాహన, పారిశ్రామిక ఉద్గారాలు; నిర్మాణ ప్రాంతాల ధూళి; పంట వ్యర్థాలు, అటవీ దహనాలు; పేలవమైన వ్యర్థాల నిర్వహణ వంటివి భారత్‌లో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా చెప్పారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితులతో ఈ కారణాలు కలవడం వల్ల, చలికాలంలో ఉత్తర భారతదేశంలో సమస్య తీవ్రరూపం దాలుస్తోందన్నారు.

వాయు కాలుష్య నియంత్రణకు కేంద్రం సమర్థవంతంగా చేపట్టిన చర్యల గురించి ఫేస్‌బుక్‌ ద్వారా ప్రజలకు శ్రీ జావడేకర్‌ వివరించారు. జనవరి నుంచి సెప్టెంబర్‌ కాలానికి సంబంధించి; 'మంచి వాయు దినాలు' 2016లో 106 ఉంటే, 2020లో 218కి పెరిగాయని; 'నాణ్యత లేని వాయు దినాలు' 2016లో 156 ఉంటే, 2020లో 56కు తగ్గాయని వివరించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 ఇంధన ప్రమాణాలతో వాహనాలను ప్రవేశపెట్టడం వాహన కాలుష్యం తగ్గింపు దిశగా విప్లవాత్మక అడుగుగా కేంద్ర మంత్రి అభివర్ణించారు. బీఎస్‌-6 ఇంధన వినియోగం కారణంగా, డీజిల్‌ కార్లలో నైట్రోజన్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు 70 శాతం, పెట్రోల్‌ కార్లలో 25 శాతం, వాహనాల్లో పీఎం స్థాయి 80 శాతం తగ్గిందని వెల్లడించారు.

'తూర్పు, పశ్చిమ పరిధి ఎక్స్‌ప్రెస్‌ వే' ద్వారా దిల్లీ నుంచి ట్రాఫిక్‌ మళ్లించడం వల్ల రద్దీ తగ్గిందన్న శ్రీ జావడేకర్‌; వ్యక్తిగత వాహన వినియోగం తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాలుష్యం వెలువరించని వాహనాలు ఉపయోగించాలని సూచించారు. మెట్రో విస్తరణ వల్ల రద్దీ, కాలుష్యం బాగా తగ్గిందని చెప్పారు. ఐదు లక్షల వాహనాల కాలుష్యాన్ని తగ్గించేలా మరికొన్ని స్టేషన్లు, బోగీలతో మెట్రో విస్తరణ జరిగిందని వెల్లడించారు.

బాదర్పూర్‌, సోనీపట్‌ బొగ్గు విద్యుత్‌ ప్లాంట్ల మూసివేత, ఇటుక బట్టీలు జిగ్‌జాగ్‌ సాంకేతికతలకు మారడం, 2800 పరిశ్రమల్లో పీఎన్‌జీ ఇంధన వినియోగం, పెట్‌ కోక్‌, ఫర్నేస్‌ ఆయిల్‌ వాడకంపై నిషేధం సహా పారిశ్రామిక ఉద్గారాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి కూడా కేంద్ర మంత్రి జావడేకర్‌ వివరించారు.

దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లోని కాలుష్యపూరిత ప్రాంతాల గురించి పూర్తి సమాచారం అందించే, సీపీబీసీ రూపొందించిన 'సమీర్‌' యాప్‌ను ప్రజలంతా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని శ్రీ జావడేకర్‌ కోరారు. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలను ఈ యాప్‌ ఎర్రరంగుతో సూచిస్తుంది.

****


(Release ID: 1665714) Visitor Counter : 528