సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఆన్ లైన్ లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కె.ఎస్.వి.వై. పథకాలపై కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మార్గదర్శక సూత్రాలు

వర్చువల్ కార్యక్రమాల నిర్వహణపై కూడా కళాకారులకు ప్రయోజనాలు
కోవిడ్ సంక్షోభంలో నిలదొక్కుకునేలా వారికి ఆర్థిక సహాయం కొనసాగింపు

Posted On: 16 OCT 2020 11:25AM by PIB Hyderabad

  కోవిడ్ వైరస్ వ్యాప్తి సంక్షోభం సాంస్కృతిక రంగంపైనా, ప్రదర్శన కళలపైనా గణనీయమైన ప్రతికూల ప్రభావం చూపింది. కళాకారులు స్వయంగా భౌతికంగా పాల్గొనే వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, కార్యక్రమాలు కోవిడ్ వైరస్ వ్యాప్తి కారణంగా,.. రద్దుకావడమో, వాయిదా పడటమో జరిగింది. అయితే, ఈ నేపథ్యంలో డిజిటల్ వేదికలపై కార్యక్రమాల ఏర్పాటు ద్వారా ప్రత్యామ్నాయ సేవలు, అదనపు సేవలు అందించేందుకు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కళాకారులు, సంస్థల ద్వారా విశేషమైన కృషి జరిగింది. వివిధ కార్యక్రమాలను డాక్యుమెంట్లలో నమోదు చేయడం ద్వారా ఈ ఏర్పాట్లకు మార్గం సుగమం చేశారు. ఇందుకోసం కళా సంస్కృతీ వికాస్ యోజన (కె.ఎస్.వి.వై.) కింద పలు పథకాలను కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. పెద్దసంఖ్యలో ప్రేక్షకుల హాజరు ప్రమేయం ఉండే కార్యక్రమాలను, కార్యకలాపాలను నిర్వహించు కునేందుకు ఈ పథకం ద్వారా సహాయం మంజురు చేస్తున్నారు. వాటి నిర్వహణకు ఆమోదం కూడా తెలుపుతున్నారు.

  పరిమిత సంఖ్యలో ప్రేక్షకులతో కళా ప్రదర్శన కార్యక్రమాలకు ఇటీవలే అనుమతి ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో  సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో నిర్ణయం తీసుకుంది.  వర్చువల్ పద్ధతిలో కార్యక్రమాల నిర్వహణకు కె.ఎస్.వి.వై. పరిధిలోని వివిధ పథకాల ద్వారా, ఇదివరకే అనుమతిని, గ్రాంటును పొందిన  కళాకారులకు, కళా సంస్థలకోసం ఈ కింది మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. దీనితో ఆయా పథకాల కింద కళాకారులు, కళా సంస్థలు భౌతికం రూపంలో కార్యక్రమాలను నిర్వహించలేని స్థితిలో ఉన్నప్పటికీ, గతంలో వలే  ఆయా కార్యక్రమాల నిర్వహణతో వచ్చే ప్రయోజనాలను పొందేందుకు వీలుంటుంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితినుంచి కళాకారులు గట్టెక్కేందుకు వీలుగా వారికి ఇక ముందు కూడా ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుంది.

     ఎ) కె.ఎస్.వి.వై. పథకాల కింద ఇప్పటికే గ్రాంట్ పొందిన కళాకారులు, కళా సంస్థలు వర్చువల్ పద్ధతిలో కళల, హస్తకళల చర్చాగోష్టులు, ఉపన్యాస, ప్రదర్శన కార్యక్రమాలు, వెబినార్లు, ఆన్ లైన్ కార్యక్రమాలు, ఆన్ లైన్ ఉత్సవాలు తదితర కార్యకలాపాల నిర్వహణను ప్రోత్సహిస్తారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, యూ ట్యూబ్ తదితర హ్యాండిల్స్ పై వర్చువల్ పద్ధతిలో కార్యక్రమాల నిర్వహణకు తగిన ప్రోత్సాహం అందిస్తారు. (పథకాలవారీగా వివరాలను అనుబంధంలో పొందుపరిచారు.)

    బి) ఆయా పథకాల కింద చేపట్టే సాంస్కృతిక కార్యక్రమాలకు, కార్యకలాపాలకు సంబంధించి కాగితపు ప్రతుల రూపంలో ఉన్న డాక్యుమెంట్లతో లావాదేవీలను ప్రస్తుతానికి నిలిపివేస్తారు. గ్రాంటు, లేదా సహాయం విడుదల చేయాలంటే సాఫ్ట్ కాపీలను మాత్రమే పరిశీలనకు అనుమతిస్తారు.

    సి) వర్చువల్ పద్ధతిలో కార్యక్రమాలకు సంబంధించి కార్యక్రమ నిర్వహణపై ధ్రువీకరణకోసం వార్తా పత్రికల క్లిప్పింగులు సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఆయా కళా సంస్థలకు మినహాయింపు ఇస్తారు. అయితే, సదరు వర్చువల్ కార్యక్రమాల, కార్యకలాపాలకు సంబంధించిన ఆన్ లైన్ లింక్.ను, చిత్రీకరణ రికార్డును ఆయా సంస్థలు  వివరాలతో సహా సమర్పించవలసి ఉంటుంది. ఎంతమందితత డిజిటల్ ప్రేక్షకులకు సదరు కార్యక్రమం చేరిందన్న వివరాలను కూడా ఆయా సంస్థలు సూచించవలసి ఉంటుంది.

   డి) వినియోగ ధ్రువీకరణ పత్రం లేదా యుటిలైజేషన్ సర్టిఫికెట్ (యు.సి.)లో సూచించినట్టుగా కార్యకలాపాల నిర్వహణా వ్యయం, వర్చువల్ వేదికపై నిర్వహించిన కార్యక్రమ వ్యయం సరిపోలేలా వివరాలు సమంజసంగా, హేతుబద్ధంగా ఉండాలి.

   

    

   జనరల్ ఫైనాన్స్ రూల్స్(జి.ఎఫ్.ఆర్.) ప్రకారం:

  1. యుటిలైజేషన్ సర్టిఫికెట్.ను జి.ఎఫ్.ఆర్.-12 ఎ నమూనా ఫారం ప్రకారం సమర్పించాల్సి ఉంటుంది.
  2. ప్రదర్శన, నిర్దేశిత లక్ష్యాలు, సాధించిన లక్ష్యాలు, నిధుల వినియోగం జరిగిన సంవత్సరానికి సంబంధించిన స్టేట్మెంట్ తదితర వివరాలు సమర్పించాలి. జి.ఎఫ్.ఆర్. 12-ఎ నమూనా ఫారంలోని అనుబంధం-1 ద్వారా వీటిని సమర్పించాలి.
  3. నిధుల వినియోగం వివరాలు, అదే మంత్రిత్వ శాఖ లేదా ఇతర మంత్రిత్వ శాఖ నుంచి గ్రాంటు అందించిన సంస్థ అమలు చేసిన పథకాల వివరాలను సమర్పించాలి. జి.ఎఫ్.ఆర్. 12-ఎ నమూనా ఫారంలోని అనుబంధం-2 ద్వారా వీటిని సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వంలోని కార్యక్రమాల విభాగం ఈ అనుబంధాలను రూపొందించింది.

అనుబంధం

  1. రిపర్టరీ గ్రాంట్: రిపర్టరీ గ్రాంట్ కింద కళాకారులకు శిక్షణ ప్రక్రియను సంబంధిత గురువుల ద్వారా చేపట్టి, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనను ఆన్ లైన్ ద్వారా నిర్వహించవచ్చు. ప్రదర్శన హాలు అద్దె రసీదు, దుస్తులు, లైటింగ్, డిజైన్ ఖర్చు, కళాకారులకు పారితోషికం వంటివి యుటిలైజేషన్ సర్టిఫికెట్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ గ్రాంట్ కింద నిర్వహించిన వివిధ కార్యకలాపాలను గ్రాంట్ విడుదలకు పరిగణనలోకి తీసుకుంటారు.
  2. నేషనల్ ప్రెజెన్స్: నేషనల్ ప్రెజెన్స్ కింద కళా, సంస్కృతుల పోషణకు జాతీయ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలు, సదస్సులు, సెమినార్లు తదితక కార్యకలాపాలను ఆన్ లైన్ ద్వారా నిర్వహించుకోవచ్చు.  యుటిలైజేషన్ సర్టిఫికెట్ కోసం ప్రదర్శన హాళ్ల, థియేటర్ల అద్దె రసీదులు, కళాకారుల పారితోషికం, ప్రదర్శన సామగ్రి కొనుగోలు ఇన్ వాయిస్ బిల్లులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పథకం పరిధిలో మార్గదర్శక సూత్రాల ప్రకారం నిర్వహించిన వివిధ కార్యకలాపాల ప్రదర్శనకు అయిన ఖర్చును గ్రాంటు విడుదలకు పరిశీలనలోకి తీసుకుంటారు.
  3. సి.ఎఫ్.పి.జి.ఎస్. : సాంస్కృతిక ఉత్సవం, నిర్మాణ గ్రాంట్ (సి.ఎఫ్.పి.ఎస్.) కింద,..భారతీయ సంస్కృతికి చెందిన విభిన్న అంశాలపై సదస్సులను, సెమినార్లను, పరిశోధనను, చర్చా గోష్టులను, పర్వదినాలను, ప్రదర్శనలను, సింపోజియమ్ లను, నృత్య నిర్మాణాన్ని, నాటక రంగస్థల, సంగీత కార్యక్రమాలను ఆన్ లైన్ ద్వారా నిర్వహించవచ్చు. యుటిలైజేషన్ సర్టిఫికెట్ల కోసం,.. కార్యక్రమం నిర్వహించిన హాళ్ల, థియేటర్ల అద్దె రసీదులు, కళకారుల పారితోషికం వివరాలు, ప్రదర్శన సామగ్రి కొనుగోలు బిల్లులు తదితర వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పథకం పరిధిలో మార్గదర్శక సూత్రాల కింద నిర్వహించిన వివిధ కార్యకలాపాల ప్రదర్శన ఖర్చును గ్రాంటు విడుదలకు పరిశీలనలోకి తీసుకుంటారు.
  4. హిమాలయ ప్రాంత వారసత్వం:  హిమాలయ ప్రాంతపు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, అభివృద్ధికి ఆర్థిక సహాయ పథకం కింద కళలపై పరిశోధనాపూర్వక అధ్యయనం, కళల రక్షణ, వివరాల డాక్యుమెంటేషన్, దృశ్య శ్రవణ కార్యక్రమాల ద్వారా వాటిని ప్రచారం చేయడం, సంప్రదాయ, జానపద కళల్లో శిక్షణ వంటి కార్యకలాపాలను ఆన్ లైన్ ద్వారా నిర్వహించవచ్చు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లకోసం ఈ కార్యక్రమాల వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. హిమాలయ ప్రాంతపు వారసత్వ పథకం కింద నిర్వహించే కార్యకలాపాలను గ్రాంట్ల విడుదలకు పరిశీలనలోకి తీసుకుంటారు.
  5. బౌద్ధుల, టిబెటన్ల కళలు: బౌద్ధుల, టిబెటన్ల కళల అభివృద్ధికి ఆర్థిక సహాయ పథకం కింద పరిశోధనా ప్రాజెక్టులను, పుస్తకాల కొనుగోలును, కేటలాగుల డాక్యుమెంటేషన్ ప్రక్రియ, బౌద్ధ భిక్షువులకు ఉపకార వేతనం మంజూరు, ప్రత్యేక కోర్సుల నిర్వహణ, దృశ్య శ్రవణ రికార్డింగ్, డాక్యుమెంటేషన్, ఐ.టి. పరిజ్ఞాన నవీకరణ శిక్షణా పరికరాలు, ఉపాధ్యాయులకు వేతనాల చెల్లింపు వంటిని ఆన్ లైన్ ద్వారా నిర్వహించవచ్చు. బౌద్ధుల పథకం కింద చేపట్టే వివిధ కార్యకలాపాలను యుటిలైజేషన్ సర్టిఫికెట్లకు, గ్రాంట్ల విడుదలకు పరిగణనలోకి తీసుకుంటారు.
  6. ఉపకార వేతనాలు / ఫెలోషిప్పులు: కళా, సంస్కృతుల పోషణకు ఉద్దేశించిన ఉపకార వేతనాలు, ఫెలోషిప్పుల పథకం కింద, భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యంపై దేశంలో ఆధునిక శిక్షణ, రంగస్థల కళలు, మైమ్ కళ, దృశ్యకళలు, జానపద కళలు, సంప్రదాయ దేశీయ కళలపై, లలిత శాస్త్రీయ సంగీతంపై శిక్షణను, పరిశోధనను ఆన్ లైన్ ద్వారా నిర్వహించవచ్చు. వీటిపై నివేదికను సాఫ్ట్ కాపీ రూపంలో సమర్పించవచ్చు.

*****



(Release ID: 1665168) Visitor Counter : 293