భారత ఎన్నికల సంఘం

బీహార్ లో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు: సి.ఇ.సి.

అసెంబ్లీ ఎన్నికలపై పరిశీలకులతో వర్చువల్/ ఇన్ పర్సన్ సమావేశం

Posted On: 05 OCT 2020 5:24PM by PIB Hyderabad

   బీహార్ శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికలకోసం తరలించవలసిన పరిశీలకులతో ఒక సమావేశాన్ని ఎన్నికల కమిషన్ ఈ రోజు నిర్వహించింది. బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను 2020 సెప్టెంబరు 25న వెలువరించారు. ఈ సమావేశాన్ని కొంతవకూ వర్చువల్ పద్ధతిలో, మరి కొంతమేర వ్యక్తిగత హాజరుతో విభిన్నశైలిలో నిర్వహించారు.  పరిశీలకులుగా ఢిల్లీలో  నియమితులైన 40మంది అధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. 700మందికి పైగా  సాధారణ సిబ్బంది, పోలీసు సిబ్బంది, వ్యయ పరిశీలకులు వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా సమావేశంలో పాలుపంచుకున్నారు.

  ఈ సందర్భంగా పరిశీలకులనుద్దేశించి ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా మాట్లాడుతూ,..ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలపై కోవిడ్-19 వైరస్ చూపుతున్న ప్రభావాన్ని గురించి వివరించారు. బీహార్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవాడనికి ముందు, దేశంలో ప్రస్తుత పరిస్థితిపై అంచనాకోసం కమిషన్ విస్తృతంగా చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిలో  సమయంలో ప్రపంచంలో జరిగే అతి పెద్ద ఎన్నికలు ఇవే కాబట్టి, ప్రపంచ సమాజం ఈ ఎన్నికలను నిశితంగా గమనించే అవకాశం ఉందని, ఎన్నికల నిర్వహణలో మరింత జాగరూకతతో వ్యవహరించవలసి ఉంటుందని చెప్పారు. ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా, నైతికంగానే కాక, కోవిడ్ నుంచి రక్షణ కల్పిచుకునే రీతిలో నిర్వహించడానికి కమిషన్ కట్టుబడి ఉందన్నారు. ప్రజాస్వామ్య బలం, ఎన్నికల ప్రధాన భాగస్వామి అయిన వోటరుపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుందని, పోలింగ్ రోజున వోటరు ఆత్మవిశ్వాసంతో స్వేచ్ఛగా, సురక్షితమైన వాతావరణంలో వోటుహక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలూ తీసుకోవాలని అన్నారు.  ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల యంత్రాగానికి స్నేహితుడిగా, మార్గదర్శిగా పరిశీలకులు వ్యవహరించాలని, విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో స్థానిక ఎన్నికల సిబ్బందికి చేదోడు వాదోడుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో వ్యయ పరిశీలకులుగా చిత్తశుద్ధితో అంకిత భావంతో విధులను నిర్వర్తించిన కొందరు అధికారులను ఆయన ప్రశంసించారు.

    ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ,.. పరిశీలకుల ప్రధాన పాత్రను గురించి వివరించారు. ఇద్దరు ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులను కమిషన్ ఇప్పటికే నియమించిందని, అవసరమైతే ఎన్నికలు జరుగుతున్న దశలోనే  మరింతమంది పరిశీలకులను నియమిస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ 2020, ఆగస్టు 21న జారీ చేసిన ప్రత్యేక మార్గదర్శక సూత్రాలను, బీహార్ ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన నియమావళిని కచ్చితంగా పాటించాలన్నారు. అధికారులు ఒకవైపు తమ విధులు నిర్వర్తిస్తూనే, తమ సమక్షానికి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన సూచించారు.

  మరో కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ,..ఎన్నికల కమిషన్ తరఫున చట్టబద్ధమైన విధులను ఎన్నికల పరిశీలకులు నిర్వహించవలసి ఉంటుందన్నారు. తాము, ఎన్నికల కమిషన్ కు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతిరూపమనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. బీహార్ ఎన్నికలను ప్రపంచ దేశాలన్నీ నిశితంగా గమనిస్తాయని, అందరీ దృష్టీ ఈ ఎన్నికలపైనే ఉందని అన్నారు. క్షేత్రస్థాయి ఎన్నికల నిర్వహణా బృందాలకు మార్గదర్శకత్వం, సారథ్యం వహించడంలో ఎన్నికల పరిశీలకులదే ముఖ్యమైన పాత్ర అని రాజీవ్ కుమార్ అన్నారు.

ఢిల్లీలో నియమితులైన పరిశీలకులకోసం దిశానిర్దేశంగా ఈ రోజు సగంపూట సమావేశం నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి ఆన్ లైన్ ద్వారా సమావేశంలో పాలుపంచుకున్న అధికారులనుద్దేశించి, ఎన్నికల కమిషన్ సెక్రెటరీ జనరల్ ఉమేశ్ సిన్హా, ఇతర డిప్యూటీ కమిషనర్లు ప్రసంగించారు. బీహార్ ఎన్నికల ప్రక్రియగురించి సిన్హా విపులంగా వివరించారు. ఎన్నికల నిర్వహణా ప్రణాళిక, ఎన్నికల విధానంపై వోటర్లకు అవగాహన కల్పించడం, సమాచార విభాగం నిర్వహణ తదితర అంశాలను ఆయన వివరించారు. పోలింగ్ సిబ్బందికోసం ఇప్పటికే నిర్వహించిన శిక్షణా ప్రక్రియ గురించి ఎన్నికల సీనియర్ డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర శర్మ వివరించారు.  ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు, వి.వి.పి.ఎ.టి సదపాయం నిర్వహణ, వోటర్ల జాబితా తదితర అంశాలపై డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ వివరించారు.  

   ప్రత్యేకించి, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో బీహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో..  ఎన్నికల చట్టపరమైన నిబంధనలు, ప్రవర్తనా నియమావళి గురించి మరో డిప్యూటీ ఎన్నికల కమిషనర్ చంద్ర భూషణ కుమార్ వివరించారు. బీహార్ శాసనసభ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ తరఫున ఇన్ చార్జి అధికారిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ప్రత్యేక ఐ.టి. యాప్.ల వినియోగంపై డిప్యూటీ కమిషనర్ ఆశీస్ కుంద్రా పరిశీలకులకు వివరించారు. ఎన్నికల వ్యయంపై పర్యవేక్షణ ప్రక్రియ, మీడియా సర్టిఫికేషన్ పర్యవేక్షక కమిటీని సమర్థవంతంగా వినియోగించడం తదితర అంశాలపై ఎన్నికల వ్యయం, మీడియా విభాగాల డైరెక్టర్లు వివరించారు.

   కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో, సురక్షిత విధానంలో ఎన్నికలు నిర్వహించడం, కమిషన్ జారీ చేసిన స్థూలమైన మార్గదర్శక సూత్రాలను పాటించడం, తదితర అంశాలపై ఈ సమావేశంలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.  కమిషన్ జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు, నిబంధనలు, ఆదేశాలు తు.చ. తప్పక అమలు జరిగేలా చూడటంలో ఎన్నికల పరిశీలకులు నిర్వహించవలసిన ప్రభావవంతమైన పాత్ర గురించి కూడా ఈ సమావేశంలో ఉన్నతాధికారులు ప్రధానంగా ప్రస్తావించారు.

***********


(Release ID: 1661845) Visitor Counter : 141