జల శక్తి మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సర్పంచులు, గ్రామ పెద్దలను కోరిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. జల జీవన్ మిషన్ ను సమర్థవంతంగా వినియోగించుకోవడంద్వారా ప్రతి ఇంటికి కుళాయిలద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రధాని పిలుపు
Posted On:
01 OCT 2020 5:21PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్ ( జెజెఎం) కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సర్పంచులు, గ్రామ పెద్దలను కోరుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 29న ఉత్తరం రాశారు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీటి సరఫరా అనే లక్ష్యాన్ని అందుకోవాలంటే గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు కీలక పాత్ర పోషిస్తారని ప్రధాని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చరిత్రను సృష్టిస్తుందని ప్రధాని అన్నారు. ఈ మిషన్ ద్వారా నీటి సరఫరా సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా నీటి ద్వారా వచ్చే పలు రోగాల నివారణకు కూడా ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని ప్రధాని వివరించారు. జీవాలకు భద్రతమైన, శుభ్రమైన నీటిని అందిస్తే వాటి ఆరోగ్యం మెరుగై వాటి ఉత్పాదకత పెరుగుతుందని తద్వారా వాటి మీద ఆధారపడే కుటుంబాల ఆదాయం పెరుగుతుందని ప్రధాని అన్నారు. జల జీవన్ మిషన్ ను ప్రజా ఉద్యమంగా చేయాలని సర్పంచులకు, గ్రామ పెద్దలకు తన ఉత్తరం ద్వారా ప్రధాని పిలుపునిచ్చారు.
కరోనా మహమ్మారి వైరస్ తో దేశం పోరాటం చేస్తోంది. ఈ సంక్షోభ సమయంలో ఆత్మనిర్భర్ భారత్ సాధనకోసం కేంద్ర ప్రభుత్వం సర్వశక్తులు కేంద్రీకరించి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇలాంటి సమయంలో ప్రధాని ఈ కీలకమైన ఉత్తరం రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.గత ఆరు సంవత్సరాలుగా తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రధాని తన ఉత్తరంలో ప్రస్తావించారు. రవాణా, గృహ నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, గ్యాస్ కనెక్షన్ సౌకర్యం, విద్యుత్, బాంకు అకౌంట్, అందరికీ పింఛన్లు మొదలైన సేవల గురించి ఇందులో వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీటిని అందించే బాధ్యత గ్రామ సంఘాల మీద ఉందని ఇందుకోసం జెఎంఎం కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందని ప్రధాని తెలిపారు.
నీటి కొరత అనేది మహిళలు, చిన్నారుల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని తన ఉత్తరంలో ప్రధాని తెలిపారు. నీటి నిర్వహణలో మహిళలు ముందుండి నడిపించాలని ప్రధాని కోరారు. ఎందుకంటే ఈ పనిని వారు ఉత్తమంగా చేయగలరని గ్రామస్థాయిలో వారు సమర్థవంతంగా తమ పనిని కొనసాగిస్తే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తమ సహాయ సహకారాలను అందిస్తాయని ప్రధాని అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుందని అన్నారు. కరోనా వైరస్ కారణంగా తిరిగి వచ్చిన వలస కార్మికులకు గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజనలో ప్రాధాన్యత లభిస్తోందని దీని కింద ఈ మిషన్ ద్వారా వారికి లబ్ధి చేకూర్చాలని ప్రధాని కోరారు.
ఈ చారిత్రాత్మక కార్యక్రమంద్వారా ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ ఇప్పించాలని ముఖ్యంగా పేద, బడుగు బలహీన వర్గాలకు ఈ సౌకర్యం కల్పించాలని ప్రధాని దేశంలోని సర్పంచులను గ్రామ పెద్దలను కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వానికి తనకు సర్పంచులు, గ్రామ పెద్దలు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడం కోసం గ్రామాల్లో భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించాలని ఈ విషయంలో సర్పంచులు సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ కోరారు.
ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని కుళాయిలద్వారా అందించే ఈ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శికను ప్రధాని విడుదల చేశారు. ఈ సందర్భంగా జల్ జీవన్ మిషన్ లోగోను ప్రధాని ఆవిష్కరించారు. 2024నాటికి రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమమే జల్ జీవన్ మిషన్. గత సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా 2.30 కోట్లకు పైగా కుటుంబాలకు కుళాయి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వరకూ దేశంలో 5.50 కోట్ల కుటుంబాలకు సురక్షిత కుళాయి నీటి సౌకర్యం వుంది. గ్రామీణ ప్రాంతాల కుటుంబాల్లో దాదాపు 30శాతం కుటుంబాలకు ఈ సౌకర్యం వుంది.
*******
(Release ID: 1661242)
Visitor Counter : 192