జల శక్తి మంత్రిత్వ శాఖ
పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు వందరోజుల్లో మంచినీటి సరఫరా
ప్రధానమంత్రి మార్గదర్శకత్వం, నాయకత్వంలో
ఉధ్యమ తరహా పథకాన్ని ప్రారంభించిన కేంద్ర జలశక్తి మంత్రి
కార్యక్రమాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని సూచన
Posted On:
02 OCT 2020 6:03PM by PIB Hyderabad
పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు కేవలం వంద రోజుల తక్కువ వ్యవధిలో పైపుల ద్వారా మంచినీరు అందించే ప్రత్యేక బృహత్ కార్యక్రమాన్నికేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ 2020, అక్టోబరు 2న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా చిన్నారులకు సురక్షిమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న గొప్ప సంకల్పంతో కూడిన ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో కేంద్ర మంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు పైపుల ద్వారా శుద్ధమైన నీటిని అందించే కార్యక్రమాన్ని ప్రధాని ఇదివరకే అంటే 2020 సెప్టెంబరు 29న ప్రకటించారు. ఆ రోజున, జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) కింద గ్రామ పంచాయతీలకు, పానీ సమితులకు ‘మార్గదర్శిక’ విడుదల సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన చేశారు. 2020 అక్టోబరు 2న ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నట్టు అదే రోజున ప్రకటించారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు తదితర ప్రభుత్వ సంస్థలకు పైపుల ద్వారా మంచినీరు కల్పించే ఈ పథకాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవలసిందిగా వివిధ రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు చిన్న పిల్లలకు సోకే అవకాశం ఎక్కువ కాబట్టి అంగన్ స్కూళ్లకు, అంగన్ వాడీ కేంద్రాలకు, ఆరోగ్య రక్షణ కేంద్రాలకు కుళాయిల ద్వారా మంచినీరు అందించే కార్యక్రమం కోసం జలజీవన్ మిషన్ లో తగిన ఏర్పాటు చేసినట్టు కూడా ప్రధాని చెప్పారు.
ప్రధానమంత్రి ప్రకటన మేరకు జాతీయ జలజీవన్ మిషన్ కార్యక్రమంపై నిర్వాహకులు ఇప్పటికే రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించాయి. గ్రామాల్లోని పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్వచ్ఛమైన నీటిని అందించే అంశంపై తీర్మానాల ఆమోదానికి సాధ్యమైనంత త్వరగా గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఈ సదుపాయాలను గ్రామ పంచాయతీలు, పంచాయీతీల సబ్ కమిటీలు, (గ్రామ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీలు, లేదా పానీ సమితులు) నిర్వహించవలసి ఉంటుంది. చిన్నారుల ఆరోగ్యానికి, వారి బహుముఖ అభివృద్ధికి దోహదపడేలా వారికి సురక్షిత నీటిని అందించేందుకు ఈ కార్యక్రమ రూపంలో పెద్దఎత్తున కృషి చేయనున్నారు. మహాత్మాగాంధీ 151 జయంతి సందర్భంగా ఇది ‘జాతిపిత’కు అందించే సరైన నివాళిగా పరిగణిస్తున్నారు.
2024వ సంవత్సరానికల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ మంచినీటి ట్యాప్ కనెక్షన్లు కల్పించాలన్న లక్ష్యంతో జలజీవన్ మిషన్ (జె.జె.ఎ.) కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం కింద, మహిళలపై, చిన్నారులపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు. నీటి ద్వారా సంక్రమించే డయేరియా, విరేచనాలు, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు చిన్నపిల్లలకు సోకే అవకాశాలు ఎక్కువ కాబట్టి, వారికి సురక్షిత నీటిని అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సురక్షితంకాని నీటి వినియోగం కారణంగా పదేపదే వ్యాధులు సోకడం ఎదిగే పిల్లలకు మంచిది కాదు. భవిష్యత్తులో వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్, ఇతర ఆమ్లాలు, లోహాలతో కలుషితమైన నీటి వనరులతో సమస్య మరింత సంక్లిష్టంగా ఉంటుంది. వారు ఫ్లోరోసిస్ వంటి వ్యాధులకు, మరింత తీవ్ర అస్వస్థతలకు గురికావలసి ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు తదితర సంస్థలకు కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా ఏర్పాటు కోసం జలజీవన్ మిషన్ లో ఏర్పాటు చేశారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే సామర్థ్యం జలజీవన్ మిషన్ కు ఉంది. ఆయా ప్రాంతాల్లో కలుషితనీటితో అస్వస్థులయ్యే ఆస్కారం ఉన్న వర్గాల ప్రజలకు ఇంటింటికీ పైపుల ద్వారా మంచినీటిని ఒక వరంలా అందించే కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు, వాటి ఉప కమిటీలు విరివిగా భాగస్వామ్యం వహించవలసి ఉంటుంది.
*****
(Release ID: 1661136)
Visitor Counter : 223