సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
గాంధీనగర్ లో కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారికి విద్యుత్తుతో నడిచే కుమ్మరి చక్రాలను పంపిణీ చేసిన కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా
Posted On:
30 SEP 2020 3:49PM by PIB Hyderabad
ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ (కె వి ఐ సి) వారి కుమ్మరి సశక్తీకరణ్ యోజన ద్వారా గాంధీనగర్, అహమ్మదాబాద్ లోని 20 గ్రామాల్లో కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన 200 కుటుంబాల వారు నిలకడైన స్వయం ఉపాధిని సాధించే వైపు అడుగులు వేశారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ నియోజకవర్గం రాంథేజా గ్రామంలో జరిగిన ఒక ఉత్సవంలో 200 మంది శిక్షణ పొందిన కుమ్మరి సామాజిక వర్గం వారికి 200 విద్యుత్తుతో నడిచే కుమ్మరి చక్రాలను, ఇతర కుమ్మరి ఉపకరణాలను కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పంపిణీ చేశారు.
కె వి ఐ సి గుర్తించిన 20 గ్రామాలలో 15 గ్రామాలు గాంధీ నగర్ జిల్లాలో, మిగిలిన అయిదు గ్రామాలు అహమ్మదాబాద్ జిల్లాలో ఉన్నాయి. విద్యుత్ చక్రాలను పంపిణీ చేయడం వల్ల కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన దాదాపు 1200 మంది లబ్ది పొందుతారు. తద్వారా వారి ఉత్పాదకత, ఆదాయం పెంచాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కల నిజమవుతుంది.
తేనెటీగల పెంపకం, కుమ్మరి సశక్తీకరణ్ యోజన, చర్మకారుల సాధికారత, ప్రాజెక్ట్ డిగ్నిటీ వంటి వివిధ స్వయం ఉపాధి స్కీములు ప్రవేశపెట్టినందుకు శ్రీ అమిత్ షా కెవిఐసిని ప్రశంసించారు. విధ్యుత్ చక్రాల పంపిణీ సందర్బంగా హోమ్ మంత్రి కె వి ఐ సి ద్వారా 10 రోజుల శిక్షణ, విద్యుత్ చక్రం, ఇతర ఉపకరణాలు పొందిన నలుగురు కుమ్మరి పనివారు -- శైలేష్ భాయ్ ప్రజాపతి, భారత్ భాయ్ ప్రజాపతి, అవనిబెన్ ప్రజాపతి మరియు జిగ్నేష్ భాయ్ ప్రజాపతితో మాట్లాడారు. దీనివల్ల తాము మెరుగైన జీవనోపాధిని పొందడానికి మరియు 'స్వయం సమృద్ధిని' సాధించడానికి తోడ్పడుతుందని చెప్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుత్ చక్రాలు కుమ్మరుల ఉత్పత్తిని పెంచడమే కాక వినియోగదారులు మెచ్చే రీతిలో సరికొత్తగా ఉత్పత్తులను తయారు చేయడానికి, దసరా, దీపావళి పండుగల రోజుల్లో వారి ఆదాయం పెంచడానికి తోడ్పడుతుందని శ్రీ అమిత్ షా తెలిపారు. సామాజిక వర్గం విస్తృత ప్రయోజనం కోసం ప్రతి లబ్ధిదారుడు కనీసం మరో 10 కుటుంబాలను కుమ్మరి సశక్తీకరణ్ యోజన కార్యక్రమంలో చేర్చాలని శ్రీ అమిత్ షా అన్నారు.
'కుమ్మరి (ప్రజాపతి) సామాజికవర్గం సామాజిక-ఆర్ధిక స్థితిని మెరుగుపరచడం ద్వారా వారి సాధికారత సాధించాలన్నది గౌరవనీయ ప్రధానమంత్రి కల అని, వారసత్వ కళను పరిరక్షిస్తూ నిలకడైన స్వయం ఉపాధిని సాధించడం ద్వారా కుమ్మరులు 'స్వయం సమృద్ధిని' సాధించే లక్ష్యంతో కెవిఐసి కుమ్మరి సశక్తీకరణ్ యోజన ప్రారంభించింది. అందువల్ల కుమ్మరి యువత తమ కుల వృత్తిని చేపట్టి దానిని దేశవ్యాప్తంగా విస్తరించాలని" శ్రీ అమిత్ షా అన్నారు. .
ప్రభుత్వం అవసరమైన మార్కెటింగ్ ఛానల్స్ ఏర్పాటు చేసిందని, కుమ్మరుల ఉత్పత్తులను అమ్మడానికి ప్రభుత్వం రైల్వేలతో ఒప్పందం కుదుర్చుకుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం దాదాపు 400 రైల్వే స్టేషన్లలో ఆహారం, పానీయాలు మట్టి పాత్రలలో అమ్ముతున్నారు. ఇంకామరికొన్ని స్టేషన్లను గుర్తించవలసిందిగా రైల్వే మంత్రిని కోరనున్నట్లు హోమ్ మంత్రి తెలిపారు. అదే సమయంలో రైల్వే స్టేషన్లలో తమ ఉత్పత్తుల విక్రయం కోసం సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవలసిందిగా అయన కుమ్మర పనివారిని కోరారు.
పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడే ఏ ప్రయత్నం/ఉపక్రమంలోనైనా పాలుపంచుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కెవిఐసి చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18వేలకు పైగా విద్యుత్ చక్రాలను పంపిణీ చేసినట్లు, దానివల్ల 80వేల మంది కుమ్మరి సామాజిక వర్గం వారికి ప్రయోజనం కలిగినట్లు సక్సేనా తెలిపారు. కుమ్మరి సశక్తీకరణ్ యోజన వల్ల కుమ్మరి పనివారి సగటు ఆదాయం నెలకు రూ. 3000 నుంచి రూ. 10,000 పెరిగిందని తెలిపారు.
గుజరాత్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ముఖ్యంగా కచ్ మరియు సౌరాష్ట్ర సంప్రదాయ కుమ్మరి కళకు ప్రసిద్ధి. 2018లో కుమ్మరి సశక్తీకరణ్ యోజన ప్రారంభించినప్పటి నుంచి గుజరాత్ రాష్ట్రంలో కెవిఐసి దాదాపు 800 మంది కుమ్మరి సామాజిక వర్గం వారికి ఈ పనిలో శిక్షణ ఇవ్వడమే కాక విద్యుత్తుతో పనిచేసే కుమ్మరి చక్రాలను, బంకమన్ను కలిపే యంత్రం వంటి ఇతర ఉపకరణాలను కూడా పంపిణీ చేసింది. దీనివల్ల వారికి చాకిరీ తప్పడమే కాక ఉత్పత్తి మూడు నాలుగు రెట్లు పెరిగింది.
***
(Release ID: 1660696)
Visitor Counter : 197