ప్రధాన మంత్రి కార్యాలయం
వర్చువల్ ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం పై భారత్- శ్రీ లంక సంయుక్త ప్రకటన
Posted On:
26 SEP 2020 6:21PM by PIB Hyderabad
1. భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ లంక ప్రధాని శ్రీ మహిందా రాజపక్షె ఈ రోజు వర్చువల్ శిఖర సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు ద్వైపాక్షిక సంబంధాలను గురించి, ఇరు దేశాలకు ఆందోళన రేకెత్తిస్తున్న ప్రాంతీయ అంశాలను గురించి, అంతర్జాతీయ అంశాలను గురించి చర్చించారు.
2. శ్రీ లంక లో కిందటి నెల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో నిర్ణయాత్మక ప్రజా తీర్పు వెలువడడంతో ప్రధాని గా పదవీబాధ్యతలను స్వీకరించిన శ్రీ మహిందా రాజపక్షె ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. దీనికి ప్రధాని శ్రీ మహిందా రాజపక్షె కృతజ్ఞతను తెలియజేస్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కలసి పనిచేయాలన్న ఆసక్తి ని వ్యక్తంచేశారు.
3. అధ్యక్షుడు శ్రీ గోటబాయా రాజపక్షె 2019 నవంబర్ లో, ప్రధాని శ్రీ మహిందా రాజపక్షె గత ఫిబ్రవరిలో భారతదేశంలో జరిపిన ఆధికారిక పర్యటనలు ఫలప్రదం కావడాన్ని శ్రీ మోదీ, శ్రీ మహిందా రాజపక్షె లు ఈ సమ్మేళనం సందర్భం లో గుర్తుకు తెచ్చుకొన్నారు. ఈ సందర్శనలు ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తు కై స్పష్టమైన రాజకీయ దిశ ను, దార్శనికతను సూచించాయి.
4. కోవిడ్-19 మహమ్మారి తో పోరాడటంలో ఈ ప్రాంతం లోని దేశాలకు పరస్పరం తోడ్పాటును, సహాయాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి శ్రీ మోదీ చాటిన బలమైన నాయకత్వాన్ని ప్రధాని శ్రీ మహిందా రాజపక్షె అభినందించారు. ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఉత్సాహాన్నిచ్చే తాజా అవకాశాన్ని ప్రస్తుత పరిస్థితి కల్పించిందని ఇరువురు నాయకులు అంగీకరించారు. కోవిడ్-19 మహమ్మారి ని ఎదుర్కోవడంలో భారతదేశం, శ్రీ లంక చాలా సన్నిహితంగా పని చేశాయంటూ ఇరువురు నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగం పై, ఆర్ధిక రంగం పై మహమ్మారి ప్రభావాన్ని కనీస స్థాయి కి తగ్గించడానికి శ్రీ లంక కు భారతదేశం సాధ్యమైనన్ని రకాల సహాయాన్ని అందిస్తూ ఉంటుందని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
5. ద్వైపాక్షిక సంబంధానికి మరింత ఉత్తేజాన్ని ఇవ్వడానికి -
(i) సామర్ధ్యాల పెంపుదల, ఇంటెలిజెన్స్ ను, సమాచారాన్ని పంచుకోవడం, సమూల సంస్కరణవాదాన్ని నిర్మూలించడం, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలపై పోరాడటం లో సహకారాన్ని మెరుగుపరచడం;
(ii) శ్రీ లంక ప్రభుత్వం, శ్రీ లంక ప్రజానీకం గుర్తించిన ప్రాధాన్యతా రంగాలకు అనుగుణంగా ఫలప్రదమైన, సమర్థవంతమైన అభివృద్ధియుత భాగస్వామ్యాన్ని కొనసాగించడం; 2020-2025 మధ్య కాలం లో అధిక ప్రభావశాలి సాముదాయిక అభివృద్ధి పథకాన్ని(హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ..హెచ్‌ఐసిడిపి) అమలు చేయడానికి ఉద్దేశించిన అవగాహనపూర్వక ఒప్పందాన్ని శ్రీ లంక ద్వీపం అంతటా విస్తృత స్థాయి లో ఆచరణలోకి తేవడం.
(iii) 2017 మే నెల లో ప్రధాన మంత్రి శ్రీ మోదీ శ్రీ లంక పర్యటన సందర్భంలో ప్రకటించిన తోటల పెంపకం ప్రాంతాల్లో 10,000 ఇళ్ళ నిర్మాణాన్ని శీఘ్రంగా పూర్తి చేయడం కోసం కలిసి పని చేయడం,
(iv) ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడం, కోవిడ్-19 మహమ్మారి విసురుతున్న సవాళ్ళ నేపథ్యంలో సరఫరా వ్యవస్థల మధ్య ప్రస్తుతం ఉన్న సమన్వయాన్ని మరింత పెంచడం;
(v) ద్వైపాక్షిక ఒప్పందాలు, అవగాహనపూర్వక ఒప్పందాల (ఎంఒయుల)లో పేర్కొన్న విధంగా సన్నిహిత సంప్రదింపులు జరపడం ద్వారా నౌకాశ్రయాల రంగం, శక్తి రంగం సహా మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను, కనెక్టివిటీ ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేయడానికి కృషి చేయడం; రెండు దేశాల మధ్య పరస్పరం ప్రయోజనకరమైన అభివృద్ధియుత సహకారపూర్వక భాగస్వామ్యం పట్ల బలమైన నిబద్ధతను కనబర్చడం;
(vi) పునరుత్పాదక శక్తి రంగం లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం; మరీ ముఖ్యంగా, భారతదేశం సమకూర్చిన 100 మిలియన్ యుఎస్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ తో సౌర పథకాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం.
(vii) వ్యవసాయం, పశుసంవర్ధకం, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఆరోగ్య సంరక్షణ, ‘ఆయుష్’ (ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి..ఎవైయుఎస్ హెచ్) రంగాల్లో సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడం; అలాగే వృత్తినిపుణులకు శిక్షణ ను పెంచడం ద్వారా నైపుణ్యాభివృద్ధికి రంగాన్ని సిద్ధం చేయడం, రెండు దేశాలలో జనాభా లో వయోవర్గం పరంగా ఉన్న అనుకూలతలను పూర్తి స్థాయి లో ఉపయోగించుకోవడం;
(viii) ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం కోసం బౌద్ధం, ఆయుర్వేదం, యోగ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను అన్వేషించడం ; (పవిత్ర నగరమైన కుశీనగర్ కు వచ్చే తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు లో శ్రీ లంక బౌద్ధ యాత్రికుల ప్రతినిధివర్గం బయలుదేరేందుకు భారత ప్రభుత్వం అనుమతిని ఇస్తుంది. బౌద్ధం లో కుశీనగర్ కు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి, ఇటీవలే కుశీనగర్ ను అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడం జరిగింది.)
(ix) కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఎదురైన ముప్పులను దృష్టి లో పెట్టుకొని, భద్రత పరంగా అవసరమైన అన్ని చర్యలను చేపడుతూనే రెండు దేశాల మధ్య ప్రయాణాలకు మార్గాన్ని సుగమం చేయడానికి విమాన సర్వీసుల రాకపోకలను పున:ప్రారంభించడం, కనెక్టివిటీ ని పెంచి పర్యటన రంగాన్ని ప్రోత్సహించడం;
(x) ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో సహా ప్రస్తుతమున్న ఫ్రేంవర్క్ లు, ఉమ్మడి లక్ష్యాలకు అనుగుణంగా మత్స్యకారులకు సంబంధించిన సమస్యలను క్రమం తప్పని సమాలోచనల ద్వారా, ఇతర ద్వైపాక్షిక మార్గాల ద్వారా పరిష్కరించడానికి చేస్తున్న కృషి ని కొనసాగించడం;
(xi) సిబ్బంది పరస్పర సందర్శనల కు అనుమతులు, సముద్ర భద్రత సంబంధి సహకారం, రక్షణ - భద్రత రంగాలలో శ్రీ లంక కు మద్దతు తో సహా ఇరు పక్షాల సాయుధ దళాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం..
అనే అంశాలపై నేతలు ఇద్దరూ అంగీకారాన్ని తెలియజేశారు.
6. రెండు దేశాల మధ్య బౌద్ధం పరంగా గల సంబంధాలను పెంపొందించడానికి 15 మిలియన్ యుఎస్ డాలర్ లను గ్రాంటు రూపం లో సహాయంగా భారతదేశం అందజేయగలదంటూ ప్రధాన మంత్రి శ్రీ మోదీ చేసిన ప్రకటన ను శ్రీ లంక ప్రధాని శ్రీ మహిందా రాజపక్షె స్వాగతించారు. ఈ గ్రాంటు ఇరు దేశాల మధ్య ప్రజల సంబంధాలను మరింతగా పెంపొందింపచేయడం లో, బౌద్ధమతానికి సంబంధించినంతవరకు- ఇతర అంశాలతో పాటు- బౌద్ధ మఠాల నిర్మాణం / పునరుద్ధరణ ల ద్వారాను, బుద్ధుని అవశేషాలను ఉభయ పక్షాలు పరస్పరం వెల్లడి చేసుకోవడం, బౌద్ధ పండితుల, బౌద్ధ మతాధికారుల మధ్య బంధాలను పటిష్టపర్చుకోవడంలోను, సామర్థ్యం పెంపుదల, సాంస్కృతిక బృందాల రాక పోకలకు అవకాశం, పురావస్తు సంబంధ సహకారం వంటి అంశాలలో సహాయకారి కాగలదు.
7. శ్రీ లంక రాజ్యాంగ పదమూడో సవరణ ను అమలు చేయడంద్వారా సయోధ్య ప్రక్రియ ను ముందుకు తీసుకుపోవడం సహా ఐక్య శ్రీ లంక పరిధి లో సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం పరంగా తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని శ్రీ లంక ప్రభుత్వానికి ప్రధాన మంత్రి శ్రీ మోదీ పిలుపునిచ్చారు. శ్రీ లంక ప్రజలిచ్చిన తీర్పు ప్రకారం, రాజ్యాంగ నిబంధనలను అమలు చేయడం ద్వారా సయోధ్య ను సాధించి ఒక్క తమిళులే కాక అన్ని జాతుల ఆకాంక్షలను నెరవేర్చే దిశ లో శ్రీ లంక కృషి చేయగలదన్న విశ్వాసాన్ని ప్రధాని శ్రీ మహిందా రాజపక్షె వ్యక్తం చేశారు.
8. ఎస్ఎఎఆర్ సి (‘సార్క్’), బిఐఎమ్ఎస్ టిఇసి (‘బిమ్స్ టెక్’), ఐఒఆర్ఎ, ఐక్య రాజ్య సమితి వ్యవస్థ ల పరిధి కి లోబడి పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న ప్రాంతీయ అంశాలపై, అలాగే అంతర్జాతీయ అంశాలపై ఇరు పక్షాలలో సన్నిహితత్వం పెరుగుతున్న సంగతిని నేతలిద్దరూ గుర్తించారు.
9. ప్రాంతీయ సహకారానికి బిఐఎమ్ఎస్ టిఇసి (బిమ్స్ టెక్) ఒక ముఖ్యమైన వేదిక అని, ఇది ఆగ్నేయాసియాతో దక్షిణ ఆసియాను కలపగలదని గమనించిన ఇరువురు నేతలూ శ్రీ లంక అధ్యక్షతన నిర్వహించే బిఐఎమ్ఎస్ టిఇసి శిఖర సమ్మేళనం విజయవంతం అయ్యేటట్టు చూడటానికి కలసి పనిచేయాలని అంగీకరించారు.
10. 2021-2022 పదవీకాలానికి గాను ఐక్య రాజ్య సమితి భద్రత మండలి లో శాశ్వతేతర సభ్యత్వ దేశం గా భారతదేశం ఎంపిక కావడం లో అంతర్జాతీయ సముదాయం నుంచి అందిన బలమైన సమర్ధనకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రధాని శ్రీ మహిందా రాజపక్షె అభినందనలు తెలిపారు.
***
(Release ID: 1659490)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam