కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
చారిత్రాత్మక కార్మిక చట్టాల బిల్లులకు ఆమోదం తెలిపిన రాజ్యసభ
కార్మికుల, పరిశ్రమల అవసరాల మధ్యన సామరస్యాన్ని తెచ్చేలా రూపొందిన లేబర్ కోడ్స్. కార్మికుల సంక్షేమంలో ప్రధానమైన అధ్యాయం : కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ‌్రీ గంగ్వార్
అందరితో కలిసి అందరి వికాసం కోరుకుంటూ అందరి విశ్వాసం సాధించాలనే ప్రభుత్వ విధానాన్ని బలోపేతం చేసేలా లేబర్ కోడ్స్ : శ్రీ గంగ్వార్
నూతన లేబర్ కోడ్స్ కారణంగా దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లోని 50 కోట్ల మంది కార్మికులు, స్వయం ఉపాధిదారులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత.
40 కోట్ల మంది అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రతా నిధి ఏర్పాటు. తద్వారా సార్వత్రిక సామాజిక భద్రత కల్పన.
పురుష కార్మికులతోపాటుగా మహిళా కార్మికులకు సమాన వేతనాలు
డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు కూడా వర్తించనున్న వర్కింగ్ జర్నలిస్టుల నిర్వచనం
వలస కార్మికుల ఫిర్యాదుల పరిష్కారానికి హెల్ప్ లైన్
లేబర్ కోడ్ల కారణంగా ఏర్పడనున్న పారదర్శకత, బాధ్యతాయుతమైన, సులువైన వ్యవస్థ. అన్ని కోడ్లకు కలిపి ఒక రిజిస్ట్రేషన్, ఒక లైసెన్స్, ఒక రిటర్న్ .
Posted On:
23 SEP 2020 4:28PM by PIB Hyderabad
ఈ రోజున మూడు లేబర్ కోడ్లకు సంబంధించిన బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 1. పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020 2. పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశాల్లో పరిస్థితుల కోడ్, 2020 3. సామాజిక భద్రత కోడ్ , 2020 ఈ మూడు కోడ్ల బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ మూడు బిల్లులకు నిన్ననే లోక్ సభ ఆమోదం తెలపడంతో అవి ఈ రోజున రాజ్యసభ ముందుకు వచ్చాయి. దాంతో ఇవి త్వరలోనే చట్టాలు కాబోతున్నాయి.
ఈ బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన శ్రీ గంగ్వార్ వీటిని చారిత్రాత్మకమైనవిగా పేర్కొన్నారు. కార్మికులకు, పరిశ్రమలకు, ఇంకా ఇతర సంబంధితులకు మధ్యన సామరస్యం తెస్తాయని ఆయన అన్నారు. దేశంలోని కార్మికుల సంక్షేమంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా ఈ లేబర్ కోడ్స్ నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. 2014నుంచి కేంద్రప్రభుత్వం చేపట్టిన కార్మిక సంక్షేమ కార్యక్రమాల గురించి, ఈ బిల్లుల ప్రాధాన్యత గురించి ఆయన వివరంగా మాట్లాడారు. మొదటి కోడ్ ద్వారా కార్మికులకు భద్రతనిచ్చే వాతావరణం ముఖ్యంగా మహిళలకు భద్రత ఏర్పడుతుందని అన్నారు. పారిశ్రామిక సంబంధాల కోడ్ ద్వారా సమర్థవంతంగా పనిచేయగలిగే వివాద పరిష్కారాల వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. సామాజిక భద్రత కోడ్ కారణంగా సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సమగ్రమైన సామాజికభద్రత లభిస్తుందని అన్నారు. దీని ద్వారా ప్రధానమంత్రి దార్శనికతైన సార్వత్రిక సామాజిక భద్రత విధానం అమల్లోకి వస్తుందని శ్రీ గంగ్వార్ అన్నారు.
2014లో తమ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వం కింద తీసుకున్న అనేక నిర్ణయాల కారణంగా బాబా సాహెబ్ అంబేద్కర్ కలలు సాకారమవుతున్నాయని శ్రీ గంగ్వార్ అన్నారు. శ్రమయేవ జయతే, సత్యమేవ జయతే నినాదాలకు సమానమైన ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు. కోవిడ్ 19 మహమ్మారి ప్రభావం మొదలైనప్పటినుంచీ కార్మికులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను సభకు వివరించారు.
29 కార్మిక చట్టాలను కలిపి నాలుగు లేబర్ కోడ్లగా రూపొందించడం జరిగిందని విస్తృతమైన సంప్రదింపుల ద్వారా వీటిని తయారు చేయడం జరిగిందని శ్రీ గంగ్వార్ అన్నారు. తొమ్మిది త్రిపక్ష సమావేశాలు, 4 సబ్ కమిటీల సమావేశాలు, పలు మంత్రిత్వశాఖల మధ్యన పదిసార్లు సంప్రదింపులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు, ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలు, సలహాలు, సూచనలు తీసుకొని ఈ కోడ్లను రూపొందించామని మంత్రి తెలిపారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతదేశం అభివృద్ధి సాధించాలని అటు కార్మికులకు ఇటు పరిశ్రమలకు మేలు జరిగేలా వుండాలనేది కార్మిక సంస్కరణల ఉద్దేశ్యమని మంత్రి అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 73 సంవత్సరాల్లో అన్ని విధాలుగా పరిశ్రమల్లో, పని ప్రదేశాల్లో మార్పులు వచ్చాయని అంతర్జాతీయంగా అనేక మార్పులు వచ్చాయని ఎక్కడా వెనకబడి పోకుండా వుండాలనే ఈ సంస్కరణలు తెచ్చినట్టు ఆయన తెలిపారు.
దేశంలో ఇంతవరకూ 44 కార్మిక చట్టాలు వున్నప్పటికీ కార్మికుల్లో 30 శాతంమందికి మాత్రమే కనీస వేతనాలకు సంబంధించి చట్టపరమైన హక్కులున్నాయని మిగతావారికి న్యాయం జరగలేదని అన్నారు. అందుకే మొదటిసారిగా దేశంలోని 50 కోట్ల మంది కార్మికులందరికీ..వారు సంఘటిత రంగం కావొచ్చు, అసంఘటిత రంగం కావచ్చు అందరికీ కనీస వేతనాలు, సమయానికి వేతనాలు వచ్చేలా సంస్కరణలు తెస్తున్నామని మంత్రి తెలిపారు.
ఇక రెండో ముఖ్యమైన అంశం కార్మిక భద్రత. దీన్ని కట్టుదిట్టం చేస్తూ పని ప్రదేశాల్లో భద్రమైన పరిస్థితులు కల్పించడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికిగాను కార్మికులకు అన్ని విధాలా అండగా వుండేలా కోడ్లను తెచ్చామని అన్నారు.
పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగి గాయలైనా, మరణం సంభవించినా..యాజమాన్యంపై విధించే జరిమానాలో సగం బాధిత కార్మికుల వెలుతుంది. అంతే కాదు ఇతర ప్రయోజనాలు లభిస్తాయని కార్మికులకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడానికే కార్మిక చట్టాల సంస్కరణలు తెచ్చామని మంత్రి స్పష్టం చేశారు. మగవాళ్లు చేసే పనిని కూడా చేపట్టే స్వేచ్ఛను మహిళలకు ఇచ్చేలా కార్మిక చట్టాల సంస్కరణలు తెచ్చామని మంత్రి తెలిపారు. మహిళా కార్మికుల భద్రతకు పెద్దపీట వేశామని మంత్రి సభకు తెలిపారు.
ఇక కార్మికుల సంబంధించిన మరో ముఖ్యమైన అంశం వారికి సమగ్రమైన సాంఘిక భద్రత కల్పించడం. దీనికోసం బీమా కార్పొరేషన్, ప్రావిడెంట్ ఫండ్ సంస్థలద్వారా చేపట్టిన సంస్కరణల గురించి మంత్రి సభకు వివరించారు. ఈ రెండు సంస్థల పరిధిని విస్తృతం చేసి అసంఘటిత రంగంలోని కార్మికులకు కూడా లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు.
దేశంలోగల అసంఘటిత రంగంలోని 40 కోట్ల మంది కార్మికులకోసం సామాజిక భద్రతా నిధిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దీనిద్వారా సామాజిక భద్రతా పథకాలను అందిస్తామని అన్నారు. సార్వత్రిక సామాజిక భద్రతా కల్పన అనే ప్రభుత్వ విధానం అమలవుతుందని అన్నారు.
పారిశ్రామిక సంస్థల్లో అమలు చేసే పారిశ్రామిక సంబంధాల కోడ్ ( ఐఆర్ కోడ్) ప్రాధాన్యతను వివరించారు. దీని ద్వారా పరిశ్రమల్లో సామరస్యం ఏర్పడుతుందని కార్మికులకు, పరిశ్రమలకు మధ్యనగల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. సెలవులు, జీతాలు, సామాజిక భద్రత, గ్రాట్యుటీకి సంబంధించి వచ్చే సమస్యలు తొలగుతాయని స్పష్టం చేశారు.
ఐఆర్ కోడ్ లోని సమ్మె ప్రొవిజన్ గురించి మాట్లాడుతూ కార్మికులకు వున్న సమ్మె హక్కుకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. అయితే సమ్మెకు పోవడానికి ముందు 14 రోజుల నోటీసు పీరియడ్ వుంటుందని , ఈ సమయంలో సంప్రదింపులద్వారా సమస్యల పరిష్కారం వుంటుందని మంత్రి వివరించారు. సమ్మెద్వారా అటు కార్మికులకు, ఇటు పరిశ్రమలకు ఎలాంటి మేలు జరగదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఆర్ధిక సమస్యల కారణంగా కార్మికులను తొలగించడం, కంపెనీ మూసేయడం వంటివాటికి సంబంధించి ఐఆర్ కోడ్ లోని అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు. కార్మిక రంగం అనేది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కంకరెంట్ లిస్టులో వుంది కాబట్టి సంబందిత రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు. ఐఆర్ కోడ్‌లో కార్మికుల తొలగింపు సంఖ్యను వందనుంచి మూడువందలకు పెంచడానికి సంబంధించిన అంశంలో ఆయన ఇలా అన్నారు.
పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల హక్కులను కాపాడడడంలో కార్మిక సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అందుకే మొదటిసారిగా వాటి ప్రాధాన్యతను చట్టంలో గుర్తించడం జరిగిందని అన్నారు. సంస్థాగతంగాను, రాష్ట్రస్థాయిలోను, కేంద్ర స్థాయిలోను వాటికి గుర్తింపు వుందని అన్నారు. అలాగే కార్మికుల్లో నైపుణ్యాన్ని పెంచడానికిగాను రీ స్కిల్లింగ్ ఫండ్ ఏర్పాటు చేశామని అన్నారు. దీనిద్వారా నైపుణ్యాలు పెంచడం జరుగుతుందని అలాంటి కార్మికులు రీస్కిల్లింగ్ కాలంలో 15 రోజుల జీతం పొందుతారని అన్నారు.
కోవిడ్ 19 నేపథ్యంలో వలస కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. వారి హక్కులను బలోపేతం చేయడానికిగాను కార్మిక చట్టాల్లో మార్పులు చేశామని మంత్రి గంగ్వార్ తెలిపారు. వలస కార్మికుల నిర్వచనాన్ని మార్చామని అన్నారు. వారికి అనేక ప్రయోజనాలు కలిగేలా ఈ మార్పులు చేశామని అన్నారు. 18 వేల రూపాయలకంటే తక్కువ జీతం పొందేవారిని వలస కార్మికులుగా భావిస్తారు. అంతే కాదు వారు ఒక రాష్ట్రాన్నించి మరో రాష్ట్రానికి వెళ్లేవారై వుండాలి. వారికి సంబంధించిన గణాంకాల నిర్వహణ, హెల్ప్ లైన్, సంక్షేమ పథకాల పోర్టబిలిటీ, యాజమాన్యం వారికి ఇవ్వాల్సిన అలవెన్సులు తదితర అంశాలన్నిటినీ సంస్కరణల్లో చేర్చామని అన్నారు. పారిశ్రామిక సంస్థ పెట్టుకోవాలంటే బహుళ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల అవసరం లేదని అన్నారు. నిర్ణీత సమయంలో ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్, లైసెన్సుల ప్రక్రియ అయిపోతుందని తెలిపారు.
నూతనంగా తెచ్చిన ఈ లేబర్ కోడ్ల ద్వారా ఒకవైపు కార్మికుల సంక్షేమాన్ని కోరుకుంటూనే మరో వైపు నూతన పరిశ్రమల స్థాపనకు కావలసిన పరిస్థితులు కల్పిస్తున్నామని మంత్రి గంగ్వార్ తెలిపారు. తద్వారా ఉద్యోగాల కల్పన పెరుగుతుందని స్పష్టం చేశారు. నూతన కార్మిక కోడ్ల ద్వారా ప్రధానమంత్రి దార్శనికతైన సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అండ్ సబ్ కా విశ్వాస్ నినాదం బలోపేతమైందని రానున్న రోజుల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుతుందని కేంద్ర మంత్రి గంగ్వార్ ఆకాంక్షించారు.
******
(Release ID: 1658596)
Visitor Counter : 809