చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

టెలీ-లా కార్యక్రమ విజయ గాథలపై తొలి ఈ-ఎడిషన్

విడుదల చేసిన న్యాయశాఖ

"అందనివారిని చేరుకోవడం - లబ్ధిదారుల అభిప్రాయాలు"

మారుమూల ప్రాంతాల్లోని 3లక్షల మంది లబ్ధిదారులకు

టెలీ-లా వ్యవస్థ ద్వారా న్యాయ సలహాల చేరవేత

115 ఆశావహ జిల్లాలతోపాటుగా మొత్తం 260 జిల్లాల్లో అమలు

న్యాయ సలహా కోసం పేదలు, అట్టడుగువారు, సదుపాయాలు లేని వారిని

ప్యానెల్ లాయర్లతో అనుసంధానించిన సాంకేతిక పరిజ్ఞానం

Posted On: 23 SEP 2020 10:15AM by PIB Hyderabad

  టెలీ-లా కార్యక్రమం సాగిస్తున్న ప్రయాణానికి గుర్తుగా కేంద్ర న్యాయ శాఖ తన తొలి చిన్న పుస్తకాన్ని విడుదల చేసింది. “టెలీ-లా- అందనివారిని చేరుకోవడం, “లబ్ధిదారుల అభిప్రాయాలుశీర్షికన పుస్తకం విడుదలైంది. టెలీ-లా కార్యక్రమం ద్వారా న్యాయసలహాతో ప్రయోజనం పొందిన లబ్దిదారుల నిజజీవిత గాథలతో ఎంతో ఆకర్షణీయంగా పుస్తకాన్ని ప్రచురించారు. తమ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసిన వివాదాల పరిష్కారంలో టెలీ-లా అందించిన సేవలపై వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పుస్తకంలో పొందుపరిచారు. భౌగోళికంగా ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో  గ్రామాల్లో ఉంటున్న 3 లక్షలమందికిపైగా లబ్ధిదారులకు 29,860 ఉమ్మడి సేవా కేంద్రాల (సి.ఎస్.సి.) ద్వారాన్యాయ సలహా అందించేందుకు కార్యక్రమం దోహదపడింది.

  చదవడానికి ఎంతో ఉత్సాహం కలిగించేలా రూపొందించిన చిన్న పుస్తకంలో టెలీ-లా కార్యక్రమం అమలు చేసిన తీరు, ప్రయోజన పొందిన లబ్ధిదారుల అభిప్రాయాలను పొందుపరిచారు. ఇందులో పారా లీగల్ వాలంటీర్లు నిర్వహించిన పాత్రను, న్యాయ సలహా ఆవశ్యకతపై గ్రామీణులకు అవగాహన కల్పించి, న్యాయ సలహా తీసుకునేలా వారిని ప్రోత్సహించడంలో గ్రామస్థాయిలోని ఔత్సాహికుల పాత్రను కూడా పుస్తకంలో వివరించారు. ప్రత్యామ్నాయ న్యాయ పరిష్కార యంత్రాంగం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడానికి సంబంధించి సామాన్యుల్లో ఉన్న అపోహలు, ఆందోళనలు కార్యక్రమంతో తొలగిపోయాయి. న్యాయపరమైన ఆరు రకాల వివాదాలకు సరళమైన రీతిలో కార్యక్రమం న్యాయ సహాయం అందించింది. అన్యాయంతో పోరాటం, ఆస్తి వివాదాల పరిష్కారం, కోవిడ్ వైరస్ బాధితులకు సహాయం, సమాచారంతో సాధికారత కల్పించడం, అమలు ప్రక్రియలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడం, మహిళలపై నేరాలు వంటి అంశాల్లో న్యాయ సలహా ప్రక్రియను అమలు చేశారు.

  న్యాయం అందరికీ వాస్తవంగా అందాలన్న సమాచారాన్ని వేగంగా ప్రచారం చేసేందుకు  ప్రభుత్వండిజిటల్ ఇండియా విజన్బాట పట్టింది. కేంద్ర న్యాయ శాఖ ఇందుకోసం డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంలోఆవిర్భవిస్తున్న”,  “దేశీయమైనవేదికలను వినియోగించుకుంటూ వస్తోంది. ఇదే ప్రయత్నంలో భాగంగా టెలీ-లా కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించారు. వ్యాజ్యానికి ముందుస్తు దశలోని కేసుల పరిష్కారం లక్ష్యంగా తొలుత కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమం కింద వీడియో కాన్ఫరెన్సింగ్, టెలిఫోన్/ ఇన్ స్టాంట్ కాలింగ్, వంటి  స్మార్ట్ టెక్నాలజీ సదుపాయాలు పంచాయతీల స్థాయిలో విస్తృతమైన ఉమ్మడి సేవా కేంద్రాల (సి.ఎస్.సి.) వ్యవస్థ ద్వారా అందుబాటులో ఉన్నాయి. పేదలు, అట్టడుగు వర్గాలు, అన్యాయానికి బలయ్యే ఆస్కారం ఉన్నవర్గాలు, సదుపాయాలు అందుబాటులోలేని గ్రూపులకు సకాలంలో న్యాయ సలహా అందించేందుకు సదుపాయాలను వినియోగించారు. న్యాయ సహాయం అందించేందుకు వీరిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్యానెల్ న్యాయవాదులతో అనుసంధానించారు.

   న్యాయపరమైన సమస్యను త్వరగా కనుగొని, అందులో చొరవ తీసుకుని, అన్యాయాన్ని నివారించేందుకు ప్రత్యేకంగా టెలీ-లా వ్యవస్థను రూపొందించారు. జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ (నల్సా-ఎన్..ఎల్.ఎస్..), ఉమ్మడి సేవా కేంద్రాలు (సి.ఎస్.సి.లు) అందించిన వలంటీర్ల ద్వారా టెలీ-లా  వ్యవస్థ తన సేవలను అవసరమైన వర్గాల, గ్రూపుల ప్రజలకు అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సైనికుల్లా పనిచేసే వలంటీర్ల వద్ద మొబైల్ యాప్ అందుబాటులో ఉంటుంది. వారు తమ క్షేత్రస్థాయిలో న్యాయసేవ దరఖాస్తు దారులను యాప్ ద్వారా నమోదు చేస్తారు. వారికి న్యాయసేవ అందించే సమయం, షెడ్యూల్ సూచిస్తూ అప్పాయింట్ మెంట్ కూడా ఖరారు చేస్తారు. న్యాయ సహాయం దరఖాస్తుదారులకు నిరాటంకంగా అందించేందుకు ప్యానెల్ లో నియమితులైన న్యాయవాదులు అందుబాటులో ఉంటారు. https://www.tele-law.in/ అనే టెలీ-లా సర్వీసు పోర్టల్ ద్వారా సేవలను అందిస్తారు. రియల్ టైమ్ డాటా, అందించాల్సిన న్యాయ సలహా స్వభావం వంటి వివరాల నమోదుకోసం విడివిడిగా డ్యాష్ బోర్డును రూపొందించారు. జిల్లా స్ధాయి  డాటాబేస్ లో సమాచారానికి భవిష్యత్తులో ఏర్పడే అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదే సమాచారాన్ని పి.ఎం.. ప్రయాస్ పోర్టల్ కు బదలాయిస్తున్నారు.

   ఇకపై దేశంలోని అన్ని జిల్లాలకూ టెలీ-లా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు, న్యాయ సహాయ ప్రక్రియలో  అద్భుతమైన మూల స్తంబంగా టెలీ-లా వ్యవస్థనుతీర్చిదిద్దేందుకు కేంద్ర న్యాయ శాఖ ఇకపై కూడా లబ్ధిదారుల విజయ గాథలను మూడు నెలలకోసారి ప్రచారంలోకి తెస్తూనే ఉంటుంది.

  “టెలీ-లా- అందనివారిని చేరుకోవడం, “లబ్ధిదారుల అభిప్రాయాలుఅనే శీర్షికతో విడుదలైన బుక్ లెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

********



(Release ID: 1658173) Visitor Counter : 168