ప్రధాన మంత్రి కార్యాలయం

బిహార్ లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంలో ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 21 SEP 2020 3:53PM by PIB Hyderabad

గవర్నర్ శ్రీ ఫాగూ చౌహాన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్ గారు, మంత్రివర్గం లో నా సహచరులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు, శ్రీ వికె సింగ్ గారు, శ్రీ ఆర్ కె సింగ్ గారు, బిహార్ ఉపముఖ్యమంత్రి శ్రీ సుశీల్ గారు, ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్ఎల్ఎ లు మరియు నా ప్రియమైన సోదరులు, సోదరీమణులారా,

బిహార్ అభివృద్ధి ప్రయాణంలో ఇది మరో ప్రధానమైన రోజు. బిహార్ కనెక్టివిటీని పెంచే 9 ప్రాజెక్టులకు కొద్ది సేపటి క్రితమే శంకుస్థాపన జరిగింది. వీటిలో 4 లేన్లు, 6 లేన్ల రహదారులు, నదులపై 3 భారీ వంతెనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రారంభం అవుతున్న సమయంలో బిహార్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

మిత్రులారా,

ఇది ఒక్క బిహార్ కే కాదు, యావద్దేశానికి కూడా ముఖ్యమైన రోజు. యువ భారతానికి కూడా పెద్ద రోజు. ఈ రోజున భారతదేశం తన గ్రామాలను ఆత్మనిర్భర్ భారత్ కు పెద్ద అండ గా తీర్చిదిద్దేందుకు పెద్ద పెద్ద అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమం యావత్తు దేశం కోసం ఉద్దేశించిందే అయినా ఇది ఈ రోజు బిహార్ నుంచి మొదలవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ పథకంలో భాగంగా, దేశం లోని 6 లక్షల గ్రామాలను 1000 రోజుల్లో ఆప్టికల్ ఫైబర్ తో కలపడం జరుగుతుంది. నీతీశ్ గారి సుపరిపాలన లో, ఈ పథకం కూడా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ బిహార్ లో మరింత వేగంగా అమలవుతుందన్న విశ్వాసం నాకుంది.

మిత్రులారా,

గ్రామాల్లో ఇంటర్ నెట్ వినియోగదారుల సంఖ్య పట్టణాల కన్నా అధికంగా ఉంటుందని ఊహించడం సైతం కొన్నేళ్ల కిందటి వరకు కష్టంగా ఉండేది. గ్రామాల్లోని మహిళలు, రైతులు, యువత అంత తేలికగా ఇంటర్ నెట్ ను ఉపయోగించుకోగలుగుతారా అని కూడా ఎంతో మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అలాంటి సన్నివేశాలన్నీ మారిపోయాయి. ప్రస్తుతం,  భారతదేశం డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఉంది. ఆగస్టు సంఖ్యలనే మీరు పరిశీలిస్తే, మొబైల్ ఫోన్ ల ద్వారా, యుపిఐ ల ద్వారా దాదాపు 3 లక్షల రూపాయల విలువైన లావాదేవీలు చోటు చేసుకొన్నాయి. కరోనా మహమ్మారి కాలంలోనూ, డిజిటల్ ఇండియా ప్రచార ఉద్యమం దేశంలోని సామాన్య ప్రజలకు సాయపడింది. 

మిత్రులారా,

ఇంటర్ నెట్ వినియోగం పెరిగిన తీరు వల్ల, నాణ్యమైన, హై స్పీడ్ ఇంటర్ నెట్ ఇక గ్రామాలకు తప్పనిసరిగా మారిపోయింది. ప్రభుత్వ కృషి  కారణంగా ఇప్పటికే 1.5 లక్షలకు పైగా పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ అందింది. గత ఆరేళ్లలో  3 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్ లను ఆన్ లైన్ కు జతచేయడమైంది. ఈ కనెక్టివిటీ ని దేశంలో ప్రతి ఒక్క గ్రామానికి అందించే లక్ష్యం దిశలో దేశం దూసుకుపోతోంది. వేగవంతమైన ఇంటర్ నెట్ ప్రతి ఒక్క గ్రామానికి అందిందంటే గ్రామాల విద్యార్థులు చదువుకోవడం సులభమవుతుంది. మన గ్రామాల్లోని పిల్లలు, మన గ్రామీణ యువత ప్రపంచంలోని మంచి పుస్తకాలను, సాంకేతిక విజ్ఞానాన్ని ఓ మౌస్ ను క్లిక్ చేసినంత మాత్రాననే అందుబాటులోకి తెచ్చుకోగలుగుతారు. పైపెచ్చు, టెలి- మెడిసిన్ ద్వారా మారుమూల గ్రామాల్లోని నిరుపేదలకు సైతం తక్కువ ధరలకే, ప్రభావవంతమైన చికిత్స ను అందించడం ఇక సాధ్యపడుతుంది. 

మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.. ఇంతకు ముందు మనం రైల్వే రిజర్వేషన్ లు చేయించుకోవాలంటే గ్రామాల నుంచి సమీపంలోని పట్టణాలకు వెళ్లి, పొడవాటి బారులలో నిలబడి, అప్పుడు టికెట్ల ను అందుకోవలసి వచ్చేది. ఈ రోజు, మీరు మీరు రైల్వే రిజర్వేషన్ పని ని మీ గ్రామ కామన్ సర్వీస్ సెంటరుకు వెళ్లడం ద్వారా పూర్తి చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే, అలాంటప్పుడు మీరు అందుకు అవసరమైన రిజర్వేషనును ఇంటర్ నెట్ సదుపాయం ఉన్నందు వల్ల  తేలికగా చేయించుకోగలుగుతారు. దీని వల్ల మన రైతులు కూడా గొప్పగా లాభపడగలుగుతారు. కనెక్టివిటీ సహాయంతో కొత్త పంటలు, కొత్త విత్తనాలు, కొత్త విధానాలు, వాతావరణ మార్పులు వంటి భిన్న విభాగాల్లో జరిగిన ఆధునిక సాంకేతికపరమైన మార్పులకు సంబంధించిన సమాచారాన్ని రైతులు క్షణాల వ్యవధిలో పొందగలుగుతారు. అంతే కాదు, రైతులు వారి పంటలను దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా సరే విక్రయించుకోగలుగుతారు. ఒక రకంగా, గ్రామీణ ప్రజలు ఇక నగరాల్లోని ప్రజల్లానే ఇంట్లోనే ఉంటూ అన్ని సదుపాయాలను పొందగలిగేలా చూడటానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధిచేయడం జరుగుతోంది. 

మిత్రులారా,

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మౌలిక సదుపాయాల కల్పన పై అదే పని గా భారీ పెట్టుబడులను పెడుతూ వచ్చిన దేశాలు అత్యంత వేగవంతమైన పురోగతి ని సాధించాయని చరిత్ర చెప్తోంది. అయితే దశాబ్దాలుగా, ఇంత భారీ మార్పులను తీసుకురాగల ఇలాంటి ప్రాజెక్టుల పై భారతదేశం లో తగినంత శ్రద్ధ ను చూపనేలేదు. ఫలితంగా బిహార్ బాగా ఎక్కువగా నష్టపోయింది. మిత్రులారా, వాస్తవానికి మౌలిక సదుపాయాల కల్పన ను, అభివృద్ధి ప్రణాళికలను రాజకీయాలకు ప్రధాన ఆధారంగా తొలిసారిగా మార్చింది అటల్ జీ ప్రభుత్వం.  ఆయన ప్రభుత్వం లో నీతీశ్ గారు అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయనకు ఈ విషయాల్లో మరింత ఎక్కువ అనుభవం ఉంది. పాలనలో చోటు చేసుకున్న మార్పును ఆయన గమనించారు.   

మిత్రులారా,

మౌలిక సదుపాయాల కల్పన ఎంత స్థాయిలో ఎంత వేగంగా ప్రస్తుతం జరుగుతోందంటే అది ఇదివరకు ఎరుగనిది.  ప్రస్తుతం, 2014 వ సంవత్సరానికి పూర్వం కంటే రెండింతల వేగంతో హైవేల ను నిర్మించడం జరుగుతోంది.  2014కు  ముందు కాలంతో పోల్చి చూస్తే, హైవే నిర్మాణంపై ఖర్చు కూడా సుమారు 5 రెట్లు పెరిగింది. రాబోయే నాలుగైదు సంవత్సరాల కాలంలో మౌలిక వసతుల కల్పనపై 110 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని లక్ష్యంగా నిర్దేశించడమైంది. దీనిలో, 19 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువ గల ప్రాజెక్టులు హైవేలకు సంబంధించినవి.   

మిత్రులారా,

దేశం లోని తూర్పు ప్రాంతాలపై నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టినందువల్ల, ఈ రోడ్ల విస్తరణ, కనెక్టివిటీ సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన తాలూకు ప్రయోజనాన్ని బిహార్ కూడా అందుకోగలుగుతోంది. 2015 వ సంవత్సరంలో ప్రకటించిన పిఎం ప్యాకేజి లో భాగంగా 3 వేలకు పైగా కిలోమీటర్ల  హైవే ప్రాజెక్టులను ప్రకటించడం జరిగింది. అదనంగా భారత్ మాల ప్రాజెక్టు లో 650 కిలోమీటర్ల జాతీయ రహదారులను కూడా నిర్మించడం జరుగుతోంది. జాతీయ రహదారుల గ్రిడ్ పరిధి లోని పనులు బిహార్ కు విస్తరిస్తున్నాయి. తూర్పు బిహార్ , పశ్చిమ బిహార్ లను కలిపే నాలుగు లేన్ల ప్రాజెక్టులు నాలుగు, ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశంతో సంధానించే 6 ప్రాజెక్టులు పురోగమన దశలో ఉన్నాయి. ఈ రోజున శంకుస్థాపన జరిగిన హైవే విస్తరణ ప్రాజెక్టులు బిహార్ లోని ప్రధాన నగరాలన్నిటి కనెక్టివిటీని పటిష్ఠం చేస్తాయి.

మిత్రులారా,

ప్రధాన నదులు ఉన్న కారణంగా బిహార్ కనెక్టివిటీ విషయంలో భారీ అవరోధాలను ఎదుర్కొంటోంది. పిఎం ప్యాకేజి ని ప్రకటించిన సందర్భం లో వంతెనల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించడానికి గల కారణం ఇదే. పిఎం ప్యాకేజి లో భాగం గా గంగా నది మీద మొత్తం 17 వంతెనల నిర్మాణం జరుగుతోంది. వాటిలో చాలా వరకు ప్రాజెక్టులు పూర్తి అయ్యాయంటూ వాటి వివరాలను సుశీల్ గారు కొద్ది సేపటి క్రితం మీ ముందుంచారు. దీనికి దీటుగానే గండక్ నదిపై, కోసీ నదిపై వంతెనల నిర్మాణం కూడా జరుగుతోంది. మూడు కొత్త నాలుగు లేన్ల వంతెనలకు ఇవాళ శంకుస్థాపన చేయడమైంది. వీటిలో రెండు వంతెనలను గంగా నది మీద, ఒక వంతెన ను కోసీ నదిపై నిర్మిస్తారు. ఈ వంతెనల నిర్మాణం పూర్తి అయిన తరువాత, గంగానది పై, కోసీ నదిపై నాలుగు లేన్ల వంతెనల సామర్థ్యం మరింతగా పెరుగుతుంది.
 
మిత్రులారా,

బిహార్ కు జీవనరేఖ వంటి మహాత్మ గాంధీ సేతు అధ్వాన స్థితిని మనమందరం చూశాం. దానికి ఇప్పుడు కొత్త రూపాన్ని ఇస్తున్నాం. నానాటికీ పెరుగుతున్న జనాభాను, భవిష్యత్ అవసరాలను లెక్క లోకి తీసుకుని ఆ సేతు కు సమాంతరంగా మరో నాలుగు లేన్ల వంతెన నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.  దీనికి తోడుగా 8 లేన్ల అప్రోచ్ రోడ్డు ను కూడా నిర్మించడం జరుగుతుంది. అదే విధంగా, గంగానదిపై విక్రమ్ శిల సేతుకు సమాంతరంగా నిర్మిస్తున్న కొత్త వంతెన, కోసీ నదిపై నిర్మిస్తున్న మరో వంతెనలతో బిహార్ కనెక్టివిటీ మరింత మెరుగు పడుతుంది. 

మిత్రులారా,

కనెక్టివిటీ అంశాన్ని అడ్డుగోడల పరిధిలో కాకుండా విస్తృత దృక్పథంలో చూడాలి. ఇక్కడో వంతెన, అక్కడో రోడ్డు, ఇంకో చోట ఒక రైలు మార్గం, మరో చోట ఒక రైల్వే స్టేషన్ నిర్మించే వైఖరి వల్ల దేశానికి ఎంతో చేటు కలుగుతుంది. గతంలో నిర్మించిన రోడ్లు, హైవేలకు రైల్ నెట్ వర్క్ అనుసంధానం లేదు. అలాగే రైల్వేలకు పోర్టు కనెక్టివిటీ, పోర్టులకు విమానాశ్రయ కనెక్టివిటీ లేదు. ఇలాంటి లోపాలన్నింటినీ తొలగించుకుంటూ 21వ శతాబ్ది భారతం, 21వ శతాబ్ది బిహార్ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మల్టీ మోడల్ కనెక్టివిటీకి దేశం ప్రాధాన్యం ఇస్తోంది. రైలు మార్గం, విమాన మార్గం అనుసంధానత గల హైవేల నిర్మాణం జరుగుతోంది. పోర్టులతో అనుసంధానత గల రైలు మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి. ఒక రవాణా సాధనం మరో రవాణా వ్యవస్థకు బలంగా నిలవడం ఈ ప్రయత్నం ప్రధాన లక్ష్యం. ఈ విధానం వల్ల దేశంలో లాజిస్టిక్స్ పరంగా సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. 

మిత్రులారా,

మౌలిక సదుపాయాల అభివృద్ధితో సమాజంలోని బలహీనులు, పేదలు అధికంగా ప్రయోజనం పొందుతారు. మన రైతులు కూడా దీని వల్ల అధిక లబ్ధిని  పొందుతారు. మంచి రోడ్ల నిర్మాణం, నదులపై మంచి వంతెనల నిర్మాణం వల్ల వ్యవసాయ క్షేత్రాలు, నగరాల్లోని మార్కెట్ల మధ్య దూరం చెప్పుకోదగ్గ స్థాయి లో  తగ్గుతుంది. 

మిత్రులారా, 

దేశంలోని రైతులకు కొత్త హక్కులు కల్పించే చారిత్రక బిల్లులను పార్లమెంటు నిన్న ఆమోదించింది. ఈ రోజు బిహార్ ప్రజలతో మాట్లాడుతున్న ఈ సమయంలో దేశ రైతులను, దేశ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ సంస్కరణలు 21వ శతాబ్ద భారతదేశానికి అవసరం.

మిత్రులారా, 

ఇంత కాలం దేశంలో వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తికి, పంట‌ల అమ్మ‌కాల‌కు సంబంధించిన చ‌ట్టాలు, వ్య‌వ‌స్థ అనేవి మ‌న రైతుల చేతులను, కాళ్ల‌ను క‌ట్టేసి ఉంచాయి. ఈ చ‌ట్టాల ముసుగులో, ఒక బ‌ల‌మైన లాబీ పుట్టుకొచ్చింది. దేశంలోని రైతుల అస‌హాయ‌త‌ను అడ్డం పెట్టుకొని ల‌బ్ధి పొందుతూ వ‌చ్చింది. అయితే ఇది ఎంత కాలం ముందుకు సాగుతుంది? అందుకే ఈ వ్య‌వ‌స్థ‌ను మార్చ‌డానికి మా ప్ర‌భుత్వం ఈ మార్పుల‌ను తీసుకొచ్చింది. మా ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా దేశంలో ప్ర‌తి రైతుకు త‌న ఉత్పత్తులను, పండ్ల‌ను, కూరగాయలను దేశంలో ఎక్క‌డైనా, ఎవ‌రికైనా అమ్ముకొనే స్వేచ్ఛ ల‌భించింది. ఇప్పుడు రైతుల‌కు త‌మ పంట‌లను అమ్ముకొనే విష‌యంలో త‌న ప్రాంతంలోని మండీతో పాటు మ‌రెన్నో అవ‌కాశాలు ల‌భించాయి. తమ‌ ప్రాంతంలోని మండీలో మంచి ధ‌ర ల‌భిస్తే రైతులు అక్క‌డే అమ్ముకోవ‌చ్చు. వేరే చోట మంచి ధ‌ర ల‌భిస్తుంద‌ని అనుకుంటే వేరే చోట అమ్ముకోవ‌చ్చు. త‌ప్ప‌నిస‌రిగా త‌న ప్రాంతంలోనే అమ్ముకోవాల‌నే నిబంధ‌న ఏమీ లేదు. ఇప్పుడు ఒక ప్ర‌శ్న మ‌న ముందుకు వ‌స్తోంది. ఈ సంస్క‌ర‌ణ‌ల‌ వ‌ల్ల ఏం మేలు జ‌రుగుతుంది?  వీటి ద్వారా రైతులు ఎలా ల‌బ్ధి పొందుతారు?  రైతుల ఆర్ధిక ప‌రిస్థితుల‌ను మెరుగు పరచడానికి ఈ నిర్ణ‌యం ఎంత‌మేర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది? ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికీ క్షేత్ర స్థాయి నుంచి వ‌స్తున్న నివేదిక‌లు స‌మాధానం చెబుతున్నాయి. 

పంట‌ల అమ్మ‌కానికి సంబంధించి కొత్త‌గా వ‌చ్చిన ఈ స్వేచ్ఛ వ‌ల్ల రైతుల‌కు వ‌స్తున్న లాభాలు ఇప్ప‌టికే మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. కొన్ని నెల‌ల క్రితం ఆర్డినెన్స్ అమ‌ల్లోకి రాగానే బంగాళా దుంప‌లను పండించే ప్రాంతాల‌ నుంచి దీనికి సంబంధించి నివేదిక‌లు వ‌చ్చాయి. జూన్- జులై ల్లో భారీ మొత్తంలో కొనుగోలు చేసే వ్యాపారులు అక్క‌డి శీత‌లీక‌ర‌ణ గిడ్డంగుల‌ నుంచి బంగాళాదుంప‌లను ఎక్కువ ధ‌ర‌లు ఇచ్చి కొనుగోలు చేశారు. బయట వైపు నుంచి బంగాళాదుంప‌ల రైతుల‌కు అధిక ధ‌ర‌లు ల‌భించేస‌రికి...ఆ ఒత్తిడి కార‌ణంగా మండీలు కూడా త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే రైతుల‌కు అధిక ధ‌ర‌లు ఇవ్వ‌డం మొద‌లైంది. అలాగే మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ ల‌ నుంచి వ‌చ్చిన నివేదిక‌ల ప్ర‌కారం చూస్తే ఆ రాష్ట్రాల్లోని నూనె మిల్లులు అక్క‌డి రైతుల‌కు 20 నుంచి 30 శాతం ఎక్కువ‌గా ధ‌ర‌లు ఇచ్చి ఆయా రైతుల ద‌గ్గ‌ర‌ నుంచి ఆవాల పంటను కొనుగోలు చేశాయి. మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్, ప‌శ్చిమ బెంగాల్ లలో ప‌ప్పు ధాన్యాల పంట‌లను ఎక్కువగా పండిస్తారు. ఏడాదితో పోలిస్తే ఈ రాష్ట్రాల్లో రైతులు 15 నుంచి 25 శాతం అధికంగా ధ‌ర‌లు పొందిన‌ట్టు తెలుస్తోంది. అక్క‌డి ప‌ప్పుధాన్యాల మిల్లులు కూడా రైతుల ద‌గ్గ‌ర‌ నుంచి నేరుగా పంట‌లు కొనుగోలు చేసి వారికి నేరుగా డ‌బ్బులు చెల్లించాయి. 

ఇప్పుడు ప్ర‌జ‌లు ఊహించగలుగుతారు.. ఎందుకని దేశంలో కొంత‌మంది అక‌స్మాత్తుగా గింజుకుంటున్నార‌నే సంగతిని. దేశంలో చాలా ప్రాంతాల్లో ఒక ప్ర‌శ్న తలెత్తుతోంది.. అది ఏమిటంటే ఇప్పుడు వ్య‌వ‌సాయ మండీల విషయం లో ఏమి జరుగుతుంది అనేదే ఈ ప్ర‌శ్న‌. వ్య‌వ‌సాయ మండీలను మూసేస్తారా? అక్క‌డ కొనుగోళ్లు ఆగిపోతాయా?  కానే కాదు. అది జ‌ర‌గ‌నే జ‌ర‌గ‌దు. ఈ విష‌యాన్ని నేను స్ప‌ష్టంగా చెప్పాల‌నుకుంటున్నాను. ఈ చ‌ట్టాలు, ఈ మార్పులు అనేవి వ్య‌వ‌సాయ మండీల‌కు వ్య‌తిరేకంగా తెచ్చిన‌వి కావు. వ్య‌వ‌సాయ మార్కెట్లు అనేవి గ‌తంలో ఎలా ప‌ని చేసేవో అలాగే ఇప్పుడు కూడా ప‌ని చేస్తాయి. నిజం చెప్పాలంటే ఎన్ డిఎ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాతే దేశంలో వ్య‌వ‌సాయ మండీల‌ను ఆధునీకరించే ప‌ని స్థిరంగా కొనసాగింది. గ‌త ఐదు ఆరు సంవ‌త్స‌రాలుగా దేశంలోని వ్య‌వ‌సాయ మండీల‌కు కార్యాల‌యాలను ఏర్పాటు చేయ‌డం, వాటిలో కంప్యూటర్లను తీసుకురావడం మొద‌లైన ప‌నులు భారీగా కొన‌సాగుతున్నాయి. కాబ‌ట్టి ఈ వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల అనంతరం దేశంలో మండీలు మూత‌ప‌డ‌తాయ‌ని ప్ర‌చారం చేస్తున్న వారు రైతుల‌కు అబ‌ద్ధాలు చెబుతున్న‌ట్టే. 

మిత్రులారా, 

కలసి ఉండటం లోనే బలం ఉంది అని మనకు ఒక చాలా పాత ఆదర్శ వాక్యం ఉంది.  వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించిన రెండో చ‌ట్టం దీని నుంచే స్ఫూర్తిని పొందింది. ప్ర‌స్తుతం మ‌న దేశంలో 85 శాతానికి పైగా రైతులు చిన్న క‌మ‌తాల‌ను క‌లిగి వున్నారు. కొంత‌మందికి ఒక ఎక‌రా పొల‌ం ఉంటే, మ‌రికొంత‌ మందికి రెండు ఎక‌రాలు, కొంత‌మందికి ఒక హెక్టార్ వుంటే మ‌రికొంత‌మందికి రెండు హెక్టార్ల పొల‌ం ఉంది. వారంతా చిన్న రైతులు, స‌న్న‌కారు రైతులు. త‌క్కువ పొలాన్ని దున్నుకోవ‌డం ద్వారా వారు జీవ‌నాన్ని కొన‌సాగిస్తున్నారు. ఈ కార‌ణంగా వారి ఖ‌ర్చులు కూడా పెరుగుతున్నాయి. దాంతో వారి పంట‌ల ద్వారా వారికి ఆశించిన ఆదాయం రావ‌డం లేదు. అయితే అలాంటి రైతులంద‌రూ ఒక బృందంలా ఏర్ప‌డి వ్య‌వ‌సాయం చేస్తే వారి ఖ‌ర్చులు త‌గ్గుతాయి. దాంతో వారికి స‌రైన ధ‌ర‌లు ల‌భిస్తాయి. బయటి నుంచి వ‌చ్చే వ్యాపారులు ఈ రైతు సంఘాల‌తో నేరుగా మాట్లాడి, వారి ఉత్ప‌త్తుల‌ను నేరుగా కొంటారు. అలాంటి ప‌రిస్థితులకు అనుగుణంగా రైతుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డానికి, వారి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌డానికి రెండో చ‌ట్టాన్ని రూపొందించ‌డం జ‌రిగింది. ఇది ప్ర‌త్యేక‌మైన చ‌ట్టం. రైతుల‌పై బ‌లవంతంగా అమలుచేసే నిబంధ‌న ఏదీ ఉండ‌దు. ఇది రైతుల పొలాల‌కు త‌గిన భ‌ద్ర‌త ను క‌ల్పిస్తుంది. వారి యాజ‌మాన్య హ‌క్కుల‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురవదు. రైతు కోసం నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు మొద‌లైన‌వి కొనే బాధ్య‌త కాంట్రాక్ట‌ర్ పైన అంటే పంట‌లను కొనే వ్యాపారిపైన ఉంటుంది. 

మిత్రులారా,

ఈ సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా వ్య‌వ‌సాయ రంగంలో పెట్టుబ‌డులు పెరుగుతాయి. రైతుల‌కు ఆధునిక సాంకేతిక‌త ల‌భిస్తుంది. అంతే కాదు రైతుల వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు చాలా సులువుగా అంత‌ర్జాతీయ మార్కెట్ల‌ను చేరుకుంటాయి. ఈ మ‌ధ్య‌ే బిహార్ లో ఐదు వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల సంఘాలు ఒక ప్ర‌సిద్ధ బియ్యం అమ్మే కంపెనీతో ఒప్పందం కుదుర్చ‌కున్నాయ‌ని అధికారులు నాతో చెప్పారు. ఈ ఒప్పందం ప్ర‌కారం ఆ కంపెనీ ఆ రైతు సంఘాల ద‌గ్గ‌ర‌ నుంచి 4000 ట‌న్నుల వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఈ రైతు సంఘాల్లోని రైతులు ఇప్పుడు మండీల‌కు వెళ్లవలసిన అవ‌స‌రం లేదు. వారి ఉత్ప‌త్తులు నేరుగా జాతీయ అంత‌ర్జాతీయ మార్కెట్ల‌కు వెళ‌తాయి. ఈ సంస్క‌ర‌ణ‌ల త‌ర్వాత స్పష్టంగా తెలిసిన విష‌యం ఏమిటంటే వ్య‌వ‌సాయ‌ రంగానికి సంబంధించిన చిన్నపరిశ్రమలకు, పెద్ద ప‌రిశ్ర‌మ‌ల‌కు ఒక మార్గం ఏర్ప‌డుతుంది.  గ్రామీణ ప్రాంతాల్లోని ప‌రిశ్ర‌మ‌లు ప్ర‌గ‌తిప‌థంలో ముందుకు సాగుతాయి. మీకు మ‌రో ఉదాహ‌ర‌ణను చెబుతాను. వ్య‌వ‌సాయ‌ రంగంలో ఒక అంకుర సంస్థ ను ప్రారంభించాల‌ని ఒక యువ‌కుడు అనుకుంటాడు. చిప్ ఫ్యాక్ట‌రీని పెట్టాల‌ని భావిస్తాడు. ఈ విష‌యంలో ఇంత‌వ‌ర‌కూ ఏం జ‌రిగింది. మండీకి వెళ్లి బంగాళాదుంప‌లు కొని, ఆ త‌ర్వాతనే చిప్ ఫ్యాక్ట‌రీ నిర్వాహ‌కులు త‌మ ప‌ని ని మొద‌లుపెట్టేవారు. అయితే ఇప్పుడు అలా కాదు అంకుర సంస్థ ను పెట్టాల‌నుకున్న యువ‌కుడు నేరుగా రైతుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఒప్పందం కుదుర్చుకుంటాడు. త‌న‌కు కావ‌లసిన బంగాళ‌దుంప‌ల ప‌రిమాణం, నాణ్య‌తల గురించి రైతుల‌కు చెబుతాడు. నాణ్య‌మైన బంగాళాదుంప‌లను పండించ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే సాంకేతిక సాయాన్ని కూడా రైతుల‌కు అందిస్తాడు. 

మిత్రులారా, 

ఇలాంటి ఒప్పందాల‌కు సంబంధించి మ‌రో అంశం కూడా ఉంది. పాడి ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన డెయిరీ వున్న ప్రాంతాల‌ వారు దీన్ని గ‌మ‌నించే ఉంటారు. ఈ డెయిరీకి చుట్టుప‌క్క‌ల వున్న రైతులు త‌మ పాల‌ను చాలా సులభంగా అమ్ముతుంటారు. ఆ డెయిరీలు కూడా త‌మ ప్రాంతాల్లోని ప‌శు పోష‌ణ రైతుల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అందించ‌డం మ‌న‌కు తెలుసు. ఈ డెయిరీలు త‌మ ప‌రిధిలోని ప‌శువుల సంర‌క్ష‌ణ‌కు సాయం అందిస్తుంటాయి. ప‌శువుల‌కు స‌మ‌యానికి టీకాలు వేయిస్తాయి. ప‌శుశాల‌లు శుభ్రంగా ఉండేలా, వాటికి స‌రైన ఆహారం ల‌భించేలా కూడా ఈ డెయిరీలు సాయం అందిస్తాయి. ప‌శువులు అనారోగ్యం పాల‌యితే స‌రైన స‌మయానికి వైద్యులు వ‌స్తారు. నేను గుజ‌రాత్ నుంచి వ‌చ్చాను కాబ‌ట్టి.. అక్క‌డ డెయిరీలు త‌మ ప్రాంతంలోని ప‌శువుల సంర‌క్ష‌ణ‌కు ఎలాంటి ప్రాధాన్య‌ాన్ని ఇస్తాయో స్వ‌యంగా చూశాను. పెద్ద పెద్ద డెయిరీల యాజ‌మాన్యం పాల ఉత్ప‌త్తిదారుల‌కు, రైతుల‌కు సహాయాన్ని అందిస్తాయి. డెయిరీలు త‌మ ప్రాంతాల్లోని రైతుల ద‌గ్గ‌ర‌ నుంచి పాల‌ను కొనుగోలు చేస్తున్న‌ప్ప‌టికీ, వారికి అన్ని విధాలా సాయం అందిస్తున్న‌ప్ప‌టికీ ఆయా ప‌శువుల‌కు యజ‌మానులు రైతులే త‌ప్ప డెయిరీలు కావు. వాటిపై ఇత‌రులు ఎవ‌రికీ యాజ‌మాన్య హ‌క్కులు రావు. అదే విధంగా వ్య‌వ‌సాయం విష‌యంలో కూడా పొలాల‌పై హక్కు రైతుల‌కే ఉంటుంది. డెయిరీ రంగంలోని సంస్క‌ర‌ణ‌లే ఇప్పుడు వ్య‌వ‌సాయ రంగంలో కూడా వ‌స్తున్నాయి. 

మిత్రులారా, 
 
ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. వ్య‌వ‌సాయ వ్యాపారంలో ఉన్న మ‌న స్నేహితుల కార్య‌క‌లాపాల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల చట్టంలోని కొన్ని అంశాలు అడ్డం ప‌డుతున్నాయి. అందుకే మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేయ‌డం జ‌రిగింది. ప‌ప్పులు, బంగాళాదుంప‌లు, వంట నూనె, ఉల్లిపాయ‌లు మొద‌లైనవాటిని ఈ చ‌ట్టం ప‌రిధి నుంచి త‌ప్పించ‌డం జ‌రిగింది. కాబ‌ట్టి మ‌న రైతులు ఈ పంట‌లను త‌మ ప్రాంతాల్లోని గిడ్డంగుల్లో దాచుకొని స‌రైన రేటు వచ్చిన‌ప్పుడు అమ్ముకోవ‌చ్చు. గిడ్డంగుల్లో దాచుకోవ‌డానికి అడ్డంగా నిలిచిన చ‌ట్ట స‌మ‌స్య‌ల‌ను తొల‌గించ‌డం జ‌రిగింది కాబ‌ట్టి శీత‌ల గిడ్డంగుల నెట్ వ‌ర్కులు కూడా అభివృద్ధి చెంది దేశ‌వ్యాప్తంగా విస్త‌రిస్తాయి. 

మిత్రులారా, 

వ్య‌వ‌సాయ‌రంగంలో, వ్య‌వ‌స్థ‌లో ఈ చరిత్రాత్మ‌క సంస్క‌ర‌ణ‌లను చేసిన త‌ర్వాత కొంత‌మందికి ఇది న‌చ్చ‌డం లేదు. ప్ర‌తిదీ త‌మ నియంత్ర‌ణ‌లో నుంచి జారిపోతోంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఇలాంటి వారు ఇప్పుడు రైతుల‌కు సంబంధించిన క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల విష‌యంలో వారిని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌రకు సంబంధించి స్వామినాథన్ క‌మిటీ చేసిన సిఫారసుల‌ను అమ‌లు చేయ‌కుండా చూసిన పెద్ద మ‌నుషులే ఇప్పుడు ప్ర‌భుత్వ సంస్క‌ర‌ణ‌ల‌కు అడ్డుప‌డుతున్నారు. ఈ దేశంలోని ప్ర‌తి రైతుకు నేను హామీని ఇస్తున్నాను.. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు సంబంధించిన వ్య‌వ‌స్థ ఇంత‌కు ముందు ఎలా ప‌ని చేసేదో ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. అలాగే ప్ర‌తి వ్య‌వ‌సాయ సీజ‌న్ లో ప్ర‌భుత్వం చేసే సేక‌ర‌ణ ఎలా కొన‌సాగుతూ వ‌చ్చిందో ఇక‌ ముందు కూడా అలాగే ఉంటుంది. 

మిత్రులారా, 

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు సంబంధించి, ప్ర‌భుత్వ ప‌రిధిలో చేసే పంట‌ల సేక‌ర‌ణ‌కు సంబంధించి మా ప్ర‌భుత్వం చేసిన కృషి గ‌తంలో ఏనాడూ జ‌ర‌గలేదు. ఎవ‌రు నిజాలు మాట్లాడుతున్నారు, ఎవ‌రు రైతుల సంక్షేమం కోసం ప‌ని చేస్తున్నార‌నే విష‌యం గ‌ణాంకాలను చూస్తే తెలుస్తుంది. గ‌త ఐదు సంవత్సరాల్లో మా ప్ర‌భుత్వం చేసిన పంట‌ల సేక‌ర‌ణ‌ను, 2014కంటే ముందు ఐదు సంవ‌త్స‌రాల‌పాటు అప్ప‌టి ప్ర‌భుత్వం చేసిన సేక‌ర‌ణ‌ను పోల్చి చూడండి. అస‌లు విష‌యాలు మీకు తెలుస్తాయి. గ‌తంతో పోలిస్తే దాదాపుగా 24 రెట్లు ఎక్కువ‌గా రైతుల ద‌గ్గ‌ర‌ నుంచి ప‌ప్పు ధాన్యాల‌ను, నూనెగింజ‌లను మా ప్ర‌భుత్వం సేక‌రించింది. ఈ ఏడాది క‌రోనా ప్ర‌భావం మొద‌లైన త‌ర్వాత రైతుల ద‌గ్గ‌ర‌ నుంచి రికార్డు స్థాయిలో గోధుమ‌ల్ని కొనుగోలు చేయ‌డం జ‌రిగింది. ఈ ఏడాది  గోధుమ‌లు, వ‌రిధాన్యం‌, ప‌ప్పుదినుసులు‌, నూనెగింజ‌ల‌తో క‌లుపుకొని ర‌బీ పంట‌ల‌కు సంబంధించి రైతుల‌కు ప్ర‌భుత్వం అంద‌జేసిన క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల సొమ్ము 1 ల‌క్షా 13 వేల కోట్ల రూపాయలు. గ‌త ఏడాదితో పోలిస్తే ఇది 30 శాతం అధికం. అంటే క‌రోనా కాలంలో రైతుల‌ను ఆదుకోవ‌డానికిగాను ప్ర‌భుత్వం రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేసి రికార్డు స్థాయిలో వారికి చెల్లింపులు చేయ‌డం జ‌రిగింది.
 
మిత్రులారా, 

దేశ రైతుల‌కు నూత‌న వ్య‌వ‌స్థ‌ల‌ను త‌యారు చేసి ఇవ్వాల్సిన బాధ్య‌త 21 శతాబ్ద భార‌త‌దేశానిది.  ఈ ప‌ని ని ఆధునిక ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా చేయాలి. రైతులు స్వ‌యంస‌మృద్ధి ని సాధించ‌డానికిగాను మా ప్ర‌భుత్వం నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉంటుంది. ఇందుకోసం క‌నెక్టివిటీ కూడా చాలా ముఖ్యం. క‌నెక్టివిటీ విష‌యంలో బిహార్ లో, దేశ‌వ్యాప్తంగా మొద‌లైన ప్రాజెక్టుల విష‌యంలో అంద‌రికీ మ‌రోసారి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. ఇక మ‌రోసారి గ‌ట్టిగా చెబుతున్నాను.. క‌రోనా వైర‌స్ పై పోరాటాన్ని మ‌నం దృఢంగా కొన‌సాగించాలి. దీన్ని మ‌నం జ‌యించాలి. క‌రోనా నుంచి మ‌న కుటుంబ స‌భ్యుల‌ను ర‌క్షించుకోవాలి. ఇందుకోసం పెట్టుకున్న నియ‌మ నిబంధ‌న‌లను త‌ప్ప‌కుండా పాటించాలి. ఒక నియ‌మాన్ని ప‌క్క‌న పెట్టినా అది ప్ర‌మాద‌క‌రంగా మారుతుంది. మ‌నం అంద‌రం ఈ నియ‌మ నిబంధ‌నలను పాటించాలి. నేను మ‌రోసారి బిహార్ లోని నా సోద‌రులకు, నా సోద‌రీమ‌ణుల‌కు ధన్యవాదాలు తెలియ‌జేస్తున్నాను. 
న‌మ‌స్కారాలు.

 
***


(Release ID: 1658013) Visitor Counter : 247