పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ భవనం సిద్ధమౌతోంది.

వార్షిక ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యం 50 లక్షలకు పెరిగే అవకాశం

కొత్త భవనం పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడి ఉంటుంది.

Posted On: 16 SEP 2020 3:05PM by PIB Hyderabad

పోర్ట్ బ్లెయిర్ వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరలో కొత్త టెర్మినల్ భవనం సిద్ధమౌతోంది.  నిర్మించబోతోంది.  విమానాశ్రయం నుండి  ప్రస్తుతం ఏటా 18 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.  ప్రయాణీకుల రద్దీ పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని, భారత విమానాశ్రయాల సాధికార సంస్థ 700 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణాన్ని చేపట్టింది. 

మొత్తం 40,837 చదరపు మీటర్ల విస్తీర్ణంతో, నూతన టెర్మినల్ భవనం రద్దీ సమయంలో 1200 మంది ప్రయాణీకులను మరియు ఏటా 50 లక్షల మంది ప్రయాణీకులను నిర్వహించగలదు. ప్రయాణీకుల నూతన టెర్మినల్ భవనంలో దిగువ గ్రౌండ్, ఎగువ గ్రౌండ్ మరియు మొదటి అంతస్తులతో కూడిన మూడు స్థాయిలు ఉంటాయి.  దిగువ గ్రౌండ్ ఫ్లోర్ రిమోట్ రాక, నిష్క్రమణ మరియు సేవా ప్రాంతంగా ఉపయోగించబడుతుంది.  ఎగువ గ్రౌండ్ ఫ్లోర్‌లో బయలుదేరే ప్రయాణీకులకు ఎంట్రీ గేట్ మరియు వచ్చే ప్రయాణీకులకు ఎగ్జిట్ గేట్ ఉంటాయి.  మొదటి అంతస్తు అంతర్జాతీయ ప్రయాణీకుల విశ్రాంతి కోసం లాంజ్ ఉంటుంది.  

ఈ ప్రపంచ స్థాయి భవనం పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడి, ప్రయాణీకుల కోసం,  28 చెక్-ఇన్ కౌంటర్లు, మూడు ప్యాసింజర్ బోర్డింగ్ వంతెనలు, ఇన్-లైన్ స్కాన్ సిస్టమ్‌ తో పాటు ఐదు కన్వేయర్ బెల్టులు, ఇంకా అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ మరియు ఫైర్ అలారం వ్యవస్థల  వంటి అధునాతన సౌకర్యాలు కలిగి ఉంటుంది.   విమానాశ్రయం యొక్క నగరం వైపు ప్రాంతం కూడా, ల్యాండ్ స్కేపింగ్ తో పాటు కారు, టాక్సీ మరియు బస్సులకు తగినంత పార్కింగ్ సౌకర్యాలతో  అభివృద్ధి చేయబడుతోంది. 

ప్రకృతి నుండి ప్రేరణ పొందిన ఈ టెర్మినల్ యొక్క రూపకల్పన సముద్రం మరియు ద్వీపాలను వర్ణించే షెల్ ఆకారపు నిర్మాణాన్ని కలిగి ఉంది.   ఈ కొత్త టెర్మినల్ భవనం రెండు 120 మీటర్ల కాలమ్ లతో 240మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది.తక్కువ నిడివి గల ఉక్కు స్తంభాలకు, పెద్ద పెద్ద స్తంభాల మద్దతుతో ప్రయాణీకులు రావడానికి, బయలుదేరడానికి హాళ్ళు నిర్మిస్తున్నారు.  ఈ కొత్త టెర్మినల్ భవనం, నిర్మాణాత్మక స్టీల్ ఫ్రేమ్డ్ భవనం, పై కప్పు అల్యూమినియం షీట్ తో బిగిస్తారు.  గ్లేజింగ్ చుట్టూ కేబుల్ నెట్ తో అమరుస్తారు.  మొత్తం టెర్మినల్ పైకప్పు కు అమర్చిన  స్కైలైట్ల ద్వారా 100 శాతం సహజ లైటింగ్‌ను కలిగి ఉంటుంది.  టెర్మినల్ భవనం చుట్టూ వంగిన ఆకారపు కేబుల్ నెట్ గ్లేజింగ్ అమర్చడం జరుగుతుంది. పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయంలో ఇంత పెద్ద పరిమాణంలో నిర్మాణం చేపట్టడం ఇదే మొదటిసారి.

ప్రాజెక్టు పనులు 65 శాతం కంటే ఎక్కువ పూర్తయ్యాయి. పోర్ట్ ‌బ్లెయిర్ యొక్క కొత్త టెర్మినల్ భవనం వచ్చే ఏడాది, అంటే 2021 మధ్యలో సిద్ధంకానుంది. 

 

పని పురోగతిలో ఉన్న - టెర్మినల్ భవనం 

 

పని పురోగతిలో ఉన్న - టెర్మినల్ భవనం 

 

నగరం పక్క నుండి ఊహా చిత్రం 

 

*****


(Release ID: 1655436)