యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
జాతీయ క్రీడా పురస్కారాల బహుమతి సొమ్మును పెంచుతున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీ కిరన్ రిజీజూ
Posted On:
29 AUG 2020 6:14PM by PIB Hyderabad
భారత హాకీ లెజెండ్, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకొని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల (స్వతంత్ర హోదా) మరియు మైనారిటీల వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ కిరన్ రిజీజూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ధ్యాన్‌చంద్ జయంతిని "జాతీయ క్రీడా దినోత్సవం"గా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నేడు న్యూఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియంలోని హకీ లెజెండ్ విగ్రహం వద్ద మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ కిరన్ రిజీజూ జాతీయ క్రీడలు మరియు సాహస పురస్కారాలలోని ఏడు విభాగాలలో నాలుగు బహుమతుల సొమ్ము పెంపును ప్రకటించారు. రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు బహుమతి మొత్తాన్ని ఇప్పుడిస్తున్న రూ.7.5 లక్షల నుండి రూ.25 లక్షలకు పెంచారు, అర్జున అవార్డును రూ.5 లక్షల నుండి రూ.15 లక్షలకు పెంచారు, ఇంతకు ముందు ఉన్న ధ్రోణాచార్య (జీవితకాలం) అవార్డు గ్రహీతలకు ఇస్తున్న రూ.5 లక్షలను ఇప్పుడు రూ.15 లక్షలకు పెంచారు. ధ్రోణాచార్య (రెగ్యులర్) అవార్డు గ్రహీతలకు రూ.5 లక్షలకు బదులుగా రూ.10 లక్షలను ఈ బహుమతి సొమ్ముగా ఇవ్వనున్నారు. ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలకు రూ.5 లక్షలకు బదులుగా రూ .10 లక్షలు ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం గురించి శ్రీ రిజీజూ మాట్లాడుతూ “స్పోర్ట్స్ అవార్డుల బహుమతి సొమ్మును చివరిసారిగా 2008 లో సమీక్షించారు. బహుమతుల సొమ్ము మొత్తాలను కనీసం 10 సంవత్సరాలకు ఒకసారైనా సమీక్షించాల్సి ఉంది. ప్రతి రంగంలోని నిపుణులు వారి సంపాదనలో వృద్ధిని పొందుతున్నప్పుడు.. మన క్రీడాకారుల విషయంలో ఎందుకు ఈ వృద్ధి ఉండ కూడదు.” అని అన్నారు.
![](https://ci3.googleusercontent.com/proxy/YaSY5JhEmGUktHo16CHs3TXLc4Ekn3flwDChGopDylPYsqf_wMvgvwO9NKZ754KRu3Q6SDDN9mYR099VKjpkUq3Z5aostLkWoQW6CYp9AnrgCwjh7YLk2Pv0GQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YYU9.jpg)
![](https://ci6.googleusercontent.com/proxy/Ptv1q3COJJL398pZXj7pcYdMsubSyNxeteqJlMGIpDtKZKB71I3Zuf3uoD-YXONm_nbUBHK4sbCxIewQqDZpg6grdReF5ORUx0PmQwaYs2eWUgABJrFXmpgxOg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ZGNU.jpg)
*******
(Release ID: 1649641)
Visitor Counter : 168