PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
20 AUG 2020 6:25PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- మరింత మందికి వ్యాధి నయం; ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య దాదాపు 21 లక్షలు.
- ప‌్రస్తుత కేసులకన్నా నయమైన కేసులు 3 రెట్లు అధికం; కోలుకునే సగటు 74 శాతానికి చేరిక.
- పరీక్షలలో కొత్త రికార్డు; ఒక్కరోజులో 9 లక్షలకుపైగా నమూనాల పరీక్ష.
- నేడు ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు 23,668.
- మరణాల సగటు స్థిరంగా తగ్గుతూ ఇవాళ 1.89 శాతానికి పతనం.
- కోవిడ్-19 కాలంలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద వివిధ రాష్ట్రాల్లో అదనంగా దాదాపు 60.7 లక్షల మంది కొత్త లబ్ధిదారుల జోడింపు.
భారత్‌లో ఒకేరోజు 9 లక్షలకుపైగా కోవిడ్ పరీక్షలతో కొత్త రికార్డు; ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు పెరిగి నేడు 23,668కు చేరిక
భారత్ తొలిసారిగా ఒకేరోజు 9 లక్షలకుపైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు రోజువారీ 10 లక్షల స్థాయికి చేరే సంకల్పంతో ముందుకు సాగుతూ గత 24 గంటల్లో 9,18,470 నమూనాలను పరీక్షించింది. దీంతో ఇప్పటిదాకా మొత్తం పరీక్షల సంఖ్య 3.25 కోట్లు (3,26,61,252) దాటింది. అభివృద్ధి చెందుతున్న పరీక్షా వ్యూహం మేరకు నానాటికీ ప్రయోగశాలల నెట్‌వర్క్ విస్తరిస్తోంది. తదనుగుణంగా ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు వేగంగా పెరుగుతూ ఇవాళ 23,668కి చేరింది. దీంతోపాటు సమర్థ ముందస్తు చర్యలతో ఈ ఘనత సాధ్యమైంది. కోవిడ్-19 రోగులకు సకాలంలో తగిన వైద్య చికిత్ససహా పరీక్షలు, నిఘా, సంప్రదింపులు, జాడ తీయడంద్వారా ముందస్తుగా కేసుల గుర్తింపువల్ల నిర్ధారిత కేసులు కూడా 8 శాతానికి పరిమితమయ్యాయి. మరోవైపు 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటుకన్నా తక్కువగా నమోదవుతుండటం విశేషం. దేశంలో ప్రయోగశాలల నెట్‌వర్క్ కూడా విస్తరిస్తున్నందున ప్రభుత్వ రంగంలో 977, ప్రైవేట్ రంగంలో 517 వంతున 1494 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647388
మరింత మందికి వ్యాధి నయం; కోలుకున్నవారి సంఖ్య దాదాపు 21 లక్షలు; ప‌్రస్తుత కేసులకన్నా 3 రెట్లు అధికం; కోలుకునే సగటు 74 శాతానికి చేరిక
కోవిడ్ వ్యాధినుంచి మరింతమంది బయటపడటంతోపాటు చాలామంది ఏకాంత గృహవాసంలో (స్వల్ప, ఓ మోస్తరు లక్షణాలున్నవారు) చికిత్స పొందుతున్న నేపథ్యంలో దేశం మొత్తంమీద ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య ఇవాళ దాదాపు 21 లక్షలకు చేరుకుంది. ముమ్మర పరీక్షలు, సమగ్ర అనుసరణ-చికిత్స తదితర విధానాలవల్ల 20,96,664 మంది కోలుకోవడం సాధ్యమైంది. ఆ మేరకు గత 24 గంటల్లో 58,794 మందికి వ్యాధి నయంకాగా, కోలుకునేవారి సగటు దాదాపు 74 (73.91) శాతానికి చేరింది. దీంతో దేశంలో ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలోగల (6,86,395) కేసులతో పోలిస్తే కోలుకున్నవారి సంఖ్య 14,10,269 మేర అధికంగా ఉండటం గమనార్హం. దీనివల్ల మొత్తం నమోదైన కేసులలో ప్రస్తుత క్రియాశీల కేసుల సగటు కేవలం 24.19 శాతంగా మాత్రమే నమోదైంది. తద్వారా మరణాల సగటు బాగా తగ్గుతూండగా ప్రపంచ దేశాలకన్నా అత్యల్పంగా నమోదవుతూ ఇవాళ 1.89 శాతానికి పతనమైంది.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647441
ఈసీఎల్జీఎస్ కింద రూ.లక్ష కోట్లకుపైగా విలువైన రుణాల పంపిణీ
కేంద్ర ప్రభుత్వ హామీతో వందశాతం దశలవారీ అత్యవసర రుణహామీ పథకం (ECLGS) కింద ప్రభుత్వ-ప్రైవేటురంగ బ్యాంకులు 2020 ఆగస్టు 18నాటికి రూ.1.5 లక్షల కోట్ల విలువైన రుణాలు మంజూరు చేయగా ఇందులో రూ.లక్ష కోట్లకుపైగా ఇప్పటికే పంపిణీ చేశారు. కోవిడ్-19 దిగ్బంధ సంక్షోభం నేపథ్యంలో వివిధరంగాలకు.. ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఈలకు రుణాలిచ్చి ఆదుకోవడం కోసం స్వయం సమృద్ధ భారతం ప్యాకేజి కింద ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. దీనికింద ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.76,044.44 కోట్లు మంజూరు చేయగా ఇందులో రూ.56,483.41 కోట్లు విడుదల చేశాయి. అలాగే ప్రైవేటురంగ బ్యాంకులు రూ.74,715.02 కోట్లు మంజూరుచేసి, రూ.45,762 కోట్లు విడుదల చేశాయి.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647380
ప్రత్యేక కార్యక్రమం ద్వారా రూ.1,02,065 కోట్ల రుణ పరిమితితో 1.22 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ
కోవిడ్-19 ప్రభావం నుంచి వ్యవసాయ రంగానికి ఊరటనివ్వడం కోసం కిసాన్ క్రెడిట్ కార్డులద్వారా రైతులకు రాయితీ రుణాలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు 17.08.2020 నాటికి రూ.1,02,065 కోట్ల రుణ పరిమితితో 1.22 కోట్ల కార్డులు జారీ అయ్యాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం, వ్యవసాయాభివృద్ధి వేగం పుంజుకోవడానికి ఇది సమర్థంగా తోడ్పడుతుంది. స్వయం సమృద్ధ భారతం ప్యాకేజిలో భాగంగా ప్రభుత్వం 2.5 కోట్లమంది రైతులకు లబ్ధి చేకూరేలా ఇప్పటికే రూ.2లక్షల కోట్ల మేర రాయితీ రుణాలను కేంద్రం ప్రకటించింది. వీరిలో మత్స్యకారులు, పాడి రైతులు కూడా ఉన్నారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647377
మన వైద్యరంగం సౌహార్దత దేశం గర్వపడేలా చేయడంతోపాటు భారత్ విశ్వసనీయ భాగస్వామి కాగలదని ప్రపంచానికి చాటింది: శ్రీ పీయూష్ గోయల్
మన వైద్యరంగం సౌహార్దత దేశం గర్వపడేలా చేయడంతోపాటు భారత్ విశ్వసనీయ భాగస్వామిగా కాగలదని రుజువు చేసిందని కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఈ మేరకు ఇవాళ సీఐఐ 12వ ‘మెడ్‌టెక్ గ్లోబల్ సమ్మిట్’ ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. దేశీయంగానే కాకుండా ప్రపంచానికి తగిన పరిమాణంలో ఔషధ సరఫరాకు భరోసాగా భారత ఔషధ పరిశ్రమ ఎంతో పట్టుదల చూపిందని కొనియాడారు. ముఖ్యంగా “వైద్య పరికరాల పరిశ్రమ ఎంతో కఠినంగా శ్రమించి కోవిడ్ మహమ్మారితో పోరాటానికి కావాల్సిన ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయడంలో ప్రభుత్వానికి సహాయపడింది. అలాగే మన వైద్యులు, అర్థవైద్య సిబ్బంది, ప్రదర్శించిన సౌహార్దత దేశభద్రత, శ్రేయస్సుకు భరోసా ఇవ్వడమేగాక సామాన్యులకు నిరంతర సేవలందించడంలో నిబద్ధతద్వారా దేశం గర్వపడేలా చేశారు” అని పేర్కొన్నారు. ఆ మేరకు కఠినమైన దిగ్బంధమంటే ఏమిటో, అదే సమయంలో వేగంగా కోలుకోవడం ఎలాగో భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని శ్రీ గోయల్ అన్నారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647437
ఫార్మా రంగంలో దేశీయ సామర్థ్య ప్రగతి దిశగా తగు వాతావరణం కల్పనకు ఔషధ విభాగం అనేక చర్యలు చేపట్టింది: శ్రీ గౌడ
ఫార్మా రంగంలో దేశీయ సామర్థ్యం అభివృద్ధికి తగు వాతావరణం కల్పించే దిశగా తమ శాఖ పరిధిలోని ఔషధ విభాగం అనేక చర్యలు తీసుకున్నదని కేంద్ర రసాయనాలు- ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ చెప్పారు. ఫార్మా రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగా దేశంలో 3 బల్క్ డ్రగ్ పార్కులు, 4 వైద్య పరికరాల పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం పథకాలను ప్రారంభించింది. ఈ పార్కుల్లో సాధారణ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర సహాయం పెంచడంతోపాటు బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాల తయారీదారులకు ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాలు ఇచ్చే పథకాన్ని కూడా ప్రభుత్వం విస్తరించనుంది.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647390
కీలక రంగాలపై సమాలోచన చేయాల్సిందిగా నావికాదళ కమాండర్లకు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సూచన
రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నిన్న నావికాదళ కమాండర్ల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించారు. దేశ తీరప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు వారు ఎనలేని కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఎలాంటి సవాలు ఎదురైనా నౌకలు, యుద్ధ విమానాలను మోహరించడంలో చురుగ్గా స్పందిస్తారంటూ నావికాదళ సర్వసన్నద్ధతను కొనియాడడారు. కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్ల గురించి మాట్లాడుతూ- దేశ ప్రయోజనాలతో ముడిపడిన, చరిత్రలోనే అతిపెద్దదైన ‘సముద్ర సేతు’ ఆపరేషన్ చేపట్టారని ప్రశంసించారు. కఠిన సముద్ర పరిస్థితులు, కరోనా సంక్షోభంలోనూ నావికాదళం బెదరకుండా దాదాపు 4 వేలమంది భారతీయులను స్వదేశానికి చేర్చిందన్నారు. 'మిషన్ సాగర్' పేరిట మాల్దీవ్స్, మారిషస్, కొమొరోస్, సీషెల్స్, మడగాస్కర్‌లకు వైద్య సాయం అందించిందని చెప్పారు. అదే సమయంలో దేశ ప్రజల సాయం కోసం క్వారంటైన్ సదుపాయాలు కల్పించడంపైనా నావికాదళ కమాండర్లను రక్షణ మంత్రి అభినందించారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647077
కోవిడ్-19 కాలంలో ఉత్తరప్రదేశ్, బీహార్‌సహా వివిధ రాష్ట్రాల్లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద అదనంగా దాదాపు 60.7 లక్షలమంది కొత్త లబ్ధిదారుల జోడింపు
కోవిడ్-19 కాలంలో 2020 మార్చి నుంచి ఇప్పటిదాకా ఉత్తర ప్రదేశ్, బీహార్‌సహా వివిధ రాష్ట్రాల్లో దాదాపు 60.70 లక్షల మంది కొత్త లబ్ధిదారులను జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకొచ్చాయి. దీంతో ఈ అదనపు లబ్ధిదారులు కూడా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎం-జీకేఏవై) వంటి పథకాల కింద లబ్ధి పొందగలిగారు. తదనుగుణంగా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 80 కోట్లమందికిపైగా వ్యక్తులు/లబ్ధిదారుల కోసం ఆహార-ప్రజాపంపిణీ శాఖ నిరంతరం ఆహార ధాన్యాలు కేటాయిస్తోంది.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647173
విద్యార్థుల అభ్యాస ప్రగతి మార్గదర్శకాలను వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఆవిష్కరించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ నిన్న న్యూఢిల్లీలో విద్యార్థుల అభ్యాస ప్రగతి మార్గదర్శకాలను వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ- ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితుల నడుమ విద్యార్థుల కోసం డిజిటల్ మార్గాల ద్వారా పాఠశాల విద్యను ఇళ్లముంగిటకు తీసుకెళ్లడానికి విద్యామంత్రిత్వ శాఖతోపాటు తమ పరిధిలోని వివిధ సంస్థలు సంయుక్తంగా కృషిచేశాయన్నారు. తదనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యా కేలండర్, ప్రజ్ఞతా మార్గదర్శకాలు, డిజిటల్ విద్య-ఇండియా నివేదిక, నిష్ఠ-ఆన్‌లైన్ తదితర పత్రాలను రూపొందించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని విద్యా మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు జాతీయ విద్యా-పరిశోధన-శిక్షణ మండలి (NCERT) విద్యార్థుల అభ్యాస ప్రగతి మార్గదర్శకాలను రూపొందించింది.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647174
‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ 7వ వారంలో రూ.16,768 కోట్ల వ్యయంతో దాదాపు 21 కోట్ల పనిదినాల కల్పన
కరోనా విజృంభణ నేపథ్యంలో బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని స్వగ్రామాలకు తిరిగివచ్చిన వలస కార్మికులకు ఉపాధి కోసం ప్రభుత్వం ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ (GKRA) కింద ఉద్యమ తరహాలో చర్యలు తీసుకుంది. తదనుగుణంగా ఈ ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో గ్రామీణులకు సాధికారత కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఏడో వారం నాటికి రూ.16,768 కోట్ల వ్యయంతో దాదాపు 21 కోట్ల పనిదినాలు కల్పించారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647419
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- చండీగఢ్: ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో కనీసం 25 శాతం పడకలను కోవిడ్ రోగులకు కేటాయించాలని పాలన యంత్రాంగాధిపతి ఆదేశించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సామాజిక దూరం పాటింపు, వ్యక్తిగత పరిశుభ్రత పద్ధతుల అనుసరణసహా ఇతర ఐఈసీ కార్యకలాపాలు సజావుగా సాగిపోయేలా చూడాలని కోరారు. ఆ మేరకు కౌన్సిలర్లతోపాటు వివిధ ప్రాంత కమిటీలను ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను, నరగపాలక సంస్థలను ఆదేశించారు. నివాసితులు నిబంధనలను కచ్చితంగా పాటించేలా స్థానిక పాలన సిబ్బంది నిఘా ఉంచడంలో వీరంతా సహాయపడతారని పేర్కొన్నారు.
- పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్-19 చికిత్స, పరీక్షల కోసం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రయోగశాలలు అధిక రుసుము వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకన్నా అధికంగా వసూలు చేయకుండా పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సివిల్ సర్జన్లను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన కొనసాగితే అంటువ్యాధుల నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- హర్యానా: రాష్ట్ర విధానసభ ప్రాంగణంలో ఆగస్టు 24న కోవిడ్-19 పరీక్షా శిబిరం ఏర్పాటు చేస్తామని హర్యానా ఆరోగ్య-హోంశాఖల మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఇందులో ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు, పాత్రికేయులు ఇందులో పరీక్షలు చేయించుకోవచ్చునని తెలిపారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు 2020 ఆగస్టు 26నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలకు వారి ఇళ్లవద్దనే పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రంలోని సివిల్ సర్జన్లందరికీ ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 75 కొత్త కేసులు నమోదవగా 73 మంది కోలుకున్నారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో 923 చురుకైన కేసులున్నాయి. కొత్తగా కేసులలో 16 ఇటానగర్ రాజధాని ప్రాంతంలోనివి కాగా, 18 జిల్లాల నుంచి మిగిలిన 59 కేసులు నమోదయ్యాయి.
- అసోం: రాష్ట్రంలో నిన్న 2,054 మంది కోలుకున్నారని, అసోంలో ఒకేరోజు ఇంతమంది ఆస్పత్రులనుంచి ఇళ్లకు వెళ్లడం సంతోషం కలిగించిందని ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ ట్వీట్ చేశారు. ఈ మేరకు వైద్య బృందం కృషి అన్నివిధాలా ప్రశంసార్హమని ఆయన కొనియాడారు. ఇప్పటిదాకా 60,348 మంది కోలుకోగా, ప్రస్తుతం 23,753 మంది చికిత్స పొందుతున్నారు.
- మణిపూర్: రాష్ట్రంలోని కేంద్ర భద్రతా దళాలకు చెందిన 56మంది సహా 111 మందికి ఇవాళ కోవిడ్ నిర్ధారణ అయింది. ఇప్పటిదాకా మణిపూర్‌లో 96 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,937 మంది చికిత్స పొందుతున్నారు.
- మిజోరం: రాష్ట్రంలో నిన్న 13 కొత్త కేసులు నిర్ధారణ కాగా, మొత్తం కేసులు 873కు చేరాయి. ప్రస్తుతం మిజోరంలో చికిత్స పొందుతున్న కేసులు 489గా ఉన్నాయి.
- నాగాలాండ్: రాష్ట్రంలో ఆర్టీ-పీసీఆర్, ట్రూనాట్ యంత్ర పరికరాలతో కోవిడ్ నిర్ధారణ పరీక్షల నిర్వహణకు రూ.17 కోట్లు వెచ్చించినట్లు నాగాలాండ్ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆర్టీ-పీసీఆర్ ద్వారా 31,124, ట్రూనాట్ ద్వారా 21,015 వంతున నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. కాగా, నాగాలాండ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు ఓజుంగియో సామాజిక దూరం కొలిచే పరికరాన్ని కనుగొన్నాడు. ఇది కలిగి ఉన్నవారు నిబంధనను ఉల్లంఘించినప్పుడు ‘బీప్’మంటూ శబ్దంచేసి హెచ్చరిస్తుంది.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో ప్రస్తుతం 1.60 లక్షల క్రియాశీల కేసులున్నప్పటికీ, దిగ్బంధ విముక్తి చర్యల్లో భాగంగా రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ఈ ఉదయం నుంచి సర్వీసులు పునరుద్ధరించింది. ఈ మేరకు ఉదయం 7 గంటలకు 'శివనేరి' తొలి బస్సు ముంబై నుంచి పూణె బయల్దేరింది. మహారాష్ట్రలో అత్యంత ప్రాచుర్యమున్న వినాయక ఉత్సవాల సందర్భంగా అంతర్-జిల్లా బస్సు సేవల పునరుద్ధరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా, పుణెలో ఇటీవల సీరో-సర్వే నిర్వహించిన సందర్భంగా ఐదు అధిక ముప్పున్న ప్రాంతాలనుంచి వచ్చిన స్థానిక నివాసితుల నమూనాలలో దాదాపు 50 శాతం కరోనావైరస్‌ను నివారించగల ప్రతిరోధకాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో దీనిపైనా కరోనా వైరస్ తటస్థీకరణలో మానవ శరీర స్పందన దిశగా ప్రతిరోధకాల పనితీరుపై తాజా అధ్యయనం చేపట్టాలని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ నిర్ణయించింది.
- రాజస్థాన్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా 129 పురపాలక సంస్థలకు ఎన్నికలు రెండునెలలపాటు వాయిదాపడ్డాయి. ఈ మేరకు 2020 ఆగస్టులో జరగాల్సిన ఎన్నికలను 2020 అక్టోబర్ 20వరకు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ఉత్తర్వులో తెలిపింది. రాజస్థాన్‌లో ప్రస్తుతం 14,671 క్రియాశీల కేసులుండగా మృతుల సంఖ్య 915గా ఉంది.
- గోవా: గోవాలో గత 24 గంటల్లో 8 మంది మరణించడంతో మృతుల సంఖ్య బుధవారం 124కు చేరింది. మరోవైపు ఇవాళ 342 కొత్త కేసులు నమోదవగా 357 మంది కోలుకోవడంతో చురుకైన కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గి 3,838కి దిగివచ్చింది.
- కేరళ: రాష్ట్రంలోని కోళికోడ్ జిల్లాలోగల పెరంబ్రా చేపల మార్కెట్‌లో నిషేధిత ఉత్తర్వులను కూడా ఉల్లంఘిస్తూ ఘర్షణ చోటుచేసుకున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు జారీచేసేదాకా మార్కెట్ మూసివేతకు జిల్లా కలెక్టర్ సాంబశివరావు ఉత్తర్వులిచ్చారు. ఇక రాష్ట్రంలో మరో 6 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం గల్ఫ్ దేశాలలో ఇప్పటిదాకా 406 మంది కేరళవాసులు ఈ వ్యాధికి బలయ్యారు. ఇక కేరళలో నిన్న రికార్డు స్థాయిలో 2,333 కేసుల నమోదుతో మొత్తం కేసులు 50వేల స్థాయిని దాటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 17,382మంది చికిత్స పొందుతుండగా 1,69,687 మంది పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకేరోజు అత్యధికంగా 554 కేసులతోపాటు 8 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 9292కు, క్రియాశీల కేసులు 3523కు, మృతుల సంఖ్య 137కు పెరిగాయి. కోవిడ్ సంరక్షణ కేంద్రం కోసం సిబ్బందిని తరలించడంలో భాగంగా ఆగస్టు 24 నుంచి ఓపీతోపాటు ప్రత్యేక క్లినిక్‌ల మూసివేతకు జిప్మెర్ నిర్ణయించింది. ఇక పుదుచ్చేరిలో కోవిడ్ రోగులకు చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులు సన్నద్ధం కావాలని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సూచించారు. ఇక తమిళనాడులో వినాయక చవితి ఉత్సవాలపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
- కర్ణాటక: కరోనా సంక్షోభం నడుమ సెప్టెంబర్ 21 నుంచి 9 రోజులపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే గోవధ నిషేధ చట్టానికి సవరణ చేయాలని తీర్మానించింది. రాష్ట్రంలోని నియంత్రణ, బఫర్ జోన్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆరోగ్యశాఖ సవరించింది. రాష్ట్రంలో గురువారం 8000కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,49,590కి చేరింది. కర్ణాటకలో కొన్ని రోజులుగా మరణాలు పెరుగుతుండటంతో మృతుల సంఖ్య 4,327కు చేరింది.
- ఆంధ్రప్రదేశ్: కోవిడ్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది వినాయక చవితి బహిరంగ వేడుకలు ఉండబోవని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి చెప్పారు. ఆ మేరకు మంటపాల ఏర్పాటుకు బదులు ఇళ్లలోనే పూజలు చేయాలని ప్రజలను కోరారు. అలాగే విగ్రహ నిమజ్జనం సమయంలోనూ ప్రదర్శనలు, వినాయక మంటపాల ఏర్పాటును ప్రభుత్వం ఈ ఏడాది నిషేధించింది. కాగా, కడప సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్ రెడ్డికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఇవాళ బెయిలుపై విడుదలయ్యారు. అనంతపురంలోని ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల విచారణ ప్రత్యేక కోర్టు నిన్న ఆయన పిటిషన్‌పై విచారణ నిర్వహించి బెయిలు మంజూరు చేసింది. ఇక రాష్ట్రంలో బుధవారందాకా 30,19,296 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడంతో దేశంలో 30 లక్షల స్థాయినిదాటిన నాలుగో రాష్ట్రంగా నిలిచింది.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1724 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవగా 1195మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 395 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 97,424; క్రియాశీల కేసులు: 21,509; మరణాలు: 729; డిశ్చార్జి: 75,186గా ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు నిరాటంకంగా కొనసాగుతుండటంతో హైదరాబాద్‌సహా తెలంగాణలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, డాక్టర్ రెడ్డీస్ సంస్థ జాతీయంగా ‘అవిగాన్’ (ఫావిపిరవిర్) ఔషధాన్ని ప్రవేశపెట్టింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు కోవిడ్-19 వ్యాధి లక్షణాలున్న రోగుల చికిత్సకు ఈ మందును వినియోగించడం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
FACT CHECK
*******
(Release ID: 1647459)
Visitor Counter : 242
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam