వ్యవసాయ మంత్రిత్వ శాఖ

మార్చి-జూన్ 2020 సమయంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 23.24% పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు

వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన; విలువ జోడింపుపై దృష్టి సారించడం ద్వారా వ్యవసాయ ఎగుమతుల వృద్ధి, దిగుమతి ప్రత్యామ్నాయాలతో రెండంచెల వ్యూహం

వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశం మేరకు అపెడాకు అనుబంధంగా ప్రత్యేక వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఎగుమతి ప్రోత్సాహక ఫోరంల ఏర్పాటు

Posted On: 18 AUG 2020 12:50PM by PIB Hyderabad

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల్లో వ్యవసాయ రంగంలో స్వయంసమృద్ధి అత్యంత కీలకం. ఇది సాధించాలంటే వ్యవసాయ ఎగుమతులు విస్తరించడం కీలకం. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం వల్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం సమకూరడంతో పాటు రైతాంగం/ వ్యవసాయ ఉత్పత్తిదారులు/  ఎగుమతిదారులు విస్తారమైన అంతర్జాతీయ మార్కెట్లకు తమ ఉత్పత్తులను సరఫరా చేసి తమ ఆదాయాలు పెంచుకోగలుగుతారు. ఎగుమతుల వల్ల వ్యవసాయ రంగంలో పంటల విస్తీర్ణం, ఉత్పాదకత కూడా కూడా పెరిగాయి.

డబ్ల్యుటిఓ వాణిజ్య గణాంకాల ప్రకారం 2017 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం ఎగుమతుల వాటా 2.27%, దిగుమతుల వాటా 1.90% ఉన్నాయి. ప్రపంచాన్ని కరోనా కల్లోలం కుదిపివేస్తూ అన్ని చోట్ల లాక్ డౌన్ లు అమలు జరుగుతున్న సమయంలో కూడా ప్రపంచంలో ఆహార సరఫరా వ్యవస్థకు అంతరాయం కలగకూడదని భావించి భారత్ ఎగుమతులను కొనసాగించింది.  2020 మార్చి-జూన్ నెలల మధ్య కాలంలో రూ.25.552.7 కోట్ల విలువ గల వ్యవసాయ ఎగుమతులు జరిగాయి. 2019 సంవత్సరంలో ఇదే కాలంలో నమోదైన ఎగుమతులు రూ.20,734.8 కోట్లతో పోల్చితే ఇది 23.24% అధికం.
భారత జిడిపిలో వ్యవసాయ ఎగుమతుల వాటా 2017-18లో 9.4 శాతం నుంచి 2018-19 నాటికి 9.9 శాతానికి చేరాయి. ఇదే సమయంలో వ్యవసాయ దిగుమతుల వాటా 5.7 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గింది. వ్యవసాయ ఉత్పత్తులకు దిగుమతి ఆధారనీయత తగ్గి ఎగుమతికి అవసరమైన మిగులు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయనేందుకు ఇది సంకేతం.  

వ్యవసాయ ఎగుమతుల విభాగంలో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి దేశం ఎన్నో మెట్లు పైకి చేరింది. 1950-51లో భారత వ్యవసాయ ఉత్పత్తుల విలువ రూ.149 కోట్లు కాగా 2019-20 నాటికి అది రూ.2.53 లక్షల కోట్లకు చేరింది. దేశానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తుల తయారీదారులు ప్రపంచ ఎగుమతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న వారిలో లేకపోయినప్పటికీ గత 15 సంవత్సరాల కాలంలో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.  ఉదాహరణకి గోధుమ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ వాటి ఎగుమతుల్లో 34వ స్థానంలో ఉంది. అలాగే కూరగాయల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నప్పటికీ ఎగుమతుల్లో 14 స్థానంలో నిలిచింది. పళ్ల ఉత్పత్తి, ఎగుమతులది కూడా అదే పరిస్థితి. పళ్ల ఉత్పత్తిలో దేశం రెండో పెద్ద ఉత్పత్తిదారు అయినప్పటికీ ఎగుమతుల్లో మాత్రం 23వ స్థానంలో ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులకు దీటుగా ఎగుమతుల్లో కూడా అగ్రశ్రేణి దేశాల జాబితాలో చేరాలంటే కొన్ని స్పష్టమైన, క్రియాశీలమైన చొరవలు తీసుకోవడం తప్పనిసరి.

ఈ అంశాన్ని దృష్టిలోఉంచుకుని డిఏసి&ఎఫ్ డబ్ల్యు వ్యవసాయ వాణిజ్య ప్రోత్సాహానికి సమగ్ర కార్యాచరణ, వ్యూహం రూపొందించింది. ఇందుకు ప్రారంభం నుంచి చివరి వరకు అనుసరణీయమైన సమగ్ర వ్యూహం రూపొందించేందుకు ఉత్పత్తులకు ముందు, ఉత్పత్తి, పంటల తర్వాత స్థితిపై గణాంకాలు, సమస్యలపై నిశితంగా అన్వేషణ సాగించాలి. వ్యవసాయంతో సంబంధం గల అన్ని వర్గాలను సంప్రదించిన అనంతరం నిర్దిష్ట బృందాలు, ప్రత్యేక వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు, ఎగుమతులు, బలాలు, సవాళ్లు, ప్రభుత్వ జోక్యంపై విశ్లేషణ కూడా జరిగింది. వ్యవసాయ ఎగుమతులను పెంచడంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించడం, దిగుమతి ప్రత్యామ్నాయాలు పాటించడం అనే రెండంచెల వ్యూహం రూపొందించడం జరిగింది. ఈ దిశగా గుర్తించిన ప్రభుత్వ జోక్యానికి సంబంధించిన అంశాలను నిర్దిష్ట కాలపరిమితి గల కార్యాచరణ ప్రణాళికగా మార్చడం జరిగింది.

వెల్ నెస్ ఆహార ఉత్పత్తులు/  ఆరోగ్య వృద్ధికి దోహదపడే ఆహారం, పోషకాలకు కీలక మార్కెట్లుగా త్వరిత గతిన ఎదుగుతున్న వాటిని గుర్తించడం;   కొత్త విదేశీ మార్కెట్లలోకి చొచ్చుకుపోయేందుకు బ్రాండ్ ఇండియా ప్రచారాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపట్టడం; అధిక విలువ జోడింపునకు అవకాశం ఉన్న కొత్త ఉత్పత్తుల అభివృద్ధి ఆ చర్యలో కొన్ని. వ్యవసాయ ఎగుమతుల్లో మార్కెట్ వాటా పెంచుకునేందుకు గల్ఫ్ దేశాలను కీలక గమ్యంగా గుర్తించారు. భారత వ్యవసాయ ఉత్పత్తులకు గల్ఫ్ ఇప్పటికే బలమైన మార్కెట్. అయినా గల్ఫ్ దేశాలు చేసుకుంటున్న దిగుమతుల్లో భారత వ్యవసాయ ఉత్పత్తుల వాటా కేవలం 10-12 శాతం ఉంది. అలాగే కొత్త భౌగోళిక ప్రాంతాలకు విస్తరించేందుకు అవసరమైన ఉత్పత్తుల జాబితా, ఇప్పటికే బలమైనవిగా గుర్తించిన మార్కెట్లలో మరింత బలోపేతం కావడానికి ప్రవేశపెట్టదగిన కొత్త ఉత్పత్తుల జాబితా రూపొందించడం ప్రధానంగా ఒక ఉత్పత్తుల మార్కెట్ నమూనా కూడా తయారుచేయడం జరిగింది.

ఉద్యానవన పంటలు క్రమంగా వృద్ధి చెందుతున్న విభాగంగా గుర్తించారు. పళ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రతీ ఏడాది భారత్ రూ.5638 కోట్ల విలువ గల 8.23 లక్షల టన్నుల పళ్లు, రూ.5679 కోట్ల విలువ గల 31.92 లక్షల టన్నుల కూరగాయలు ఎగుమతి చేస్తుంది. తాజా పళ్ల ఎగుమతుల్లో ద్రాక్ష అగ్రస్థానంలో ఉండగా మామిడి, దానిమ్మ, అరటి, నారింజ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక తాజా కూరగాయల ఎగుమతి జాబితాలో ఉల్లి, మిశ్రమ కూరగాయలు,  బంగాళాదుంప, టమోటా, పచ్చిమిర్చి ప్రధానమైనవి. పళ్లు, కూరగాయలకు ప్రపంచ మార్కెట్ విలువ 208 బిలియన్ డాలర్లు కాగా భారతదేశం వాటా చాలా తక్కువగా ఉంది. పళ్లు, కూరగాయల ఎగుమతులు పెంచడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయి.  అందుకే ద్రాక్ష, మామిడి, దానిమ్మ, ఉల్లి, బంగాళాదుంప, దోసకాయలకు ప్రాధాన్యత ఇస్తూ పళ్లు, కూరగాయల ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక విధానం కూడా రూపొందించారు.

నాణ్యత, పరిమాణం రెండింటిలోనూ సరఫరాలు పెంచడానికి, సరఫరాల లోటును పూడ్చడానికి ప్రస్తుత వ్యవసాయ క్లస్టర్లను బలోపేతం చేయడం, కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వంటనూనెలు, జీడిపప్పు, పళ్లు, సుగంధ ద్రవ్యాల్లో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా దిగుమతి ప్రత్యామ్నాయాలకు కూడా నిర్దిష్ట కాలపరిమితి గల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

వ్యవసాయ మంత్రిత్వ శాఖలో వ్యవసాయ సహకారం, రైతు సంక్షేమ విభాగం ఆదేశం మేరకు వ్యవసాయ ఎగుమతులను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక ఫోరంలు (ఇపిఎఫ్) ఏర్పాటు చేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్వహణలోని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (అపెడా) ద్రాక్ష, మామిడి, అరటి, ఉల్లి, బియ్యం, పోషకాహార తృణధాన్యాలు, దానిమ్మ, పూల ఉత్పత్తుల కోసం ఎనిమిది వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల ఇపిఎఫ్ లు ఏర్పాటయ్యాయి.

ప్రతీ ఒక్క ఎగుమతి ప్రోత్సాహక ఫోరంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని సంబంధిత మంత్రిత్వ శాఖలు/  డిపార్ట్ మెంట్ల అధికారులు, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతిదారులు సభ్యులుగా ఉంటారు. అపెడా చైర్మన్ ఈ ఫోరంల చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ ఫోరంలు ప్రతీ రెండు నెలలకు ఒక సారి సమావేశమై ఆయా విభాగాల నిపుణులను ఆహ్వానించి సమగ్ర చర్చలు నిర్వహించడంతో పాటు ఉత్పత్తులకు సంబంధించిన అంశాలపై వారి సిఫారసులను గురించి చర్చిస్తాయి.  

ఆ ఫోరంలు క్రమం తప్పకుండా సమావేశమవుతూ ఆయా ఉత్పత్తులు ఉత్పత్తి ధోరణులు, వాటి ఎగుమతులకు సంబంధించి విదేశాల్లోను, దేశీయంగాను నెలకొన్న పరిస్థితిని సమీక్షించి విధానపరమైన, పాలనాపరమైన చర్యలపై ఏఏ చర్యలు తీసుకోవాలో తగు సిఫారసులు చేస్తాయి. ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు, ఇతర వర్గాలతో ఆయా ఉత్పత్తులకు సంబంధించి ఏవైనా సమస్యలున్నాయా అన్నది అడిగి తెలుసుకుని అవసరమైన పరిష్కారాలపై వారికి తగు సూచనలు చేస్తాయి. అలాగే అంతర్జాతీయంగా ఆయా ఉత్పత్తులకు మార్కెట్లు, దేశీయ ఉత్పత్తిదారులకు గల అవకాశాలు, పరిణామాలు, వారిపై ఏర్పడే ప్రభావం వంటి అంశాలన్నింటిపై అధ్యయనం చేసి సత్వరం ఆ సమాచారాన్ని ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు అందచేస్తాయి.

ఫోరం సిఫారసులను అపెడా ఉత్పత్తి కమిటీలు/ అధికారుల ముందుంచుతాయి.  అలాగే వ్యవసాయ ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడం కోసం ఆ ఫోరంలు ఎంఐడిహెచ్, ఎక్స్ టెన్షన్, ఎన్ పిపిఓ వంటి వ్యవసాయ శాఖ అనుబంధ సంఘాలు, డిజిఎఫ్ టి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎంఓఎఫ్ పిఐ వంటి శాఖలతో క్రమం తప్పకుండా చర్చిస్తూ ఉంటాయి.

 

***
 (Release ID: 1646904) Visitor Counter : 402