PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 15 AUG 2020 7:00PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశంలో గత 24 గంటల్లో ఒకేరోజు అత్యధికంగా 57,381 మందికి వ్యాధి నయం.
 • మొత్తం 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకునేవారి సగటు 50 శాతానికిపైగా నమోదు.
 • భారత్‌లో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 8.6 లక్షల రోగ నిర్ధారణ పరీక్షలు.
 • దేశవ్యాప్తంగా కోలుకునేవారి జాతీయ సగటు 70 శాతానికిపైగా నమోదు.
 • మొత్తం నమోదైన కేసులలో ప్రస్తుత (6,68,220) కేసులు 26.45 శాతమే.
 • స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భాగంగా కోవిడ్‌పై జాతి సాహసోపేత పోరాటాన్ని కొనియాడిన ప్రధానమంత్రి; జాతీయ డిజిటల్‌ ఆరోగ్య కార్యక్రమంపై ప్రకటన.
 • స్వయం సమృద్ధ భారతంవైపు విజయవంతంగా సాగే మన పయనాన్ని కరోనా ఆపజాలదు: ప్రధాని.

Image

గత 24 గంటల్లో 57,381 కోలుకోగా భారత్‌ కొత్త రికార్డు; 32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకునే సగటు 50 శాతానికిపైగా నమోదు; భారత్‌లో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 8.6 లక్షల కోవిడ్‌ రోగ నిర్ధారణ పరీక్షలు

కోవిడ్-19 నుంచి ఒక్కరోజులో కోలుకున్నవారి సంఖ్య అత్యంత గరిష్ఠంగా నమోదు కావడంతో భారత్‌ కొత్త శిఖరాన్ని అధిరోహించింది. ఈ మేరకు గత 24 గంటల్లో 57,381 మందికి వ్యాధి నయమై ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. తదనుగుణంగా కోలుకునేవారి సగటు 70 శాతం దాటి దూసుకెళ్లింది. దీనికితోడు 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో  కోలుకేనేవారి సగటు 50 శాతంకన్నా అధికంగా నమోదైంది. మరో 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ సగటును సైతం అధిగమించడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 18 లక్షలు (18,08,936) దాటింది. దీంతో ప్రస్తుత, కోలుకునే కేసుల మధ్య అంతరం 11 లక్షలు (11,40,716) దాటింది. ఆ మేరకు ప్రస్తుత (6,68,220) కేసుల సంఖ్య మరింత తగ్గి, ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులలో 26.45 శాతానికి దిగివచ్చింది. వీరంతా చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇక అంతర్జాతీయ సగటుతో పోలిస్తే భారత్‌లో మరణాలు స్థిరంగా తగ్గుతూ నేడు 1.94 శాతానికి తగ్గాయి. భారత్‌ అనుసరిస్తున్న “పరీక్ష, అన్వేషణ, చికిత్స” పేరిట భారత్‌ అనుసరిస్తున్న త్రిముఖ వ్యూహంతో గత 24 గంటల్లో అత్యధికంగా 8,68,679 రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 2.85 కోట్ల స్థాయిని దాటింది. దేశవ్యాప్తంగా ప్రయోగశాలల నెట్‌వర్క్‌ స్థిరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 968, ప్రైవేటు రంగంలో 497 వంతున మొత్తం 1465 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646080

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కోవిడ్‌పై జాతి సాహసోపేత పోరాటాన్ని కొనియాడిన ప్రధానమంత్రి; జాతీయ డిజిటల్‌ ఆరోగ్య కార్యక్రమంపై ప్రకటన

దేశంలో కోవిడ్-19 పరిస్థితులు, ఆ మహమ్మారిపై జాతి యావత్తూ ఏకకాలంలో క్రమబద్ధంగా, ముందుచూపుతో సాగించిన పోరాటం ‘స్వయం సమృద్ధ భారతం’ దిశగా సాగిన తీరు- 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ ఎర్రకోటపైనుంచి ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో ప్రతిఫలించింది. ఆరోగ్యరంగంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ వ్యాధివల్ల ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలియజేశారు. ‘సేవా పరమో ధర్మః’ మంత్రాన్ని ఉటంకిస్తూ- భారత కరోనా యోధుల త్యాగాలను కీర్తించాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. “మనం కరోనాపై తప్పక విజయం సాధిస్తాం” అని ప్రధాని దేశానికి భరోసా ఇచ్చారు.  “మనోబలమే మనల్ని విజయంవైపు నడిపిస్తుందిఅన్నారు. కోవిడ్-19 పరిస్థితుల నడుమ స్వావలంబన సాధనకు దారితీసిన స్వయం సమృద్ధ భారతంస్ఫూర్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. లోగడ దేశంలో తయారుకాని పీపీఈ పరికరాలు, ఎన్95 మాస్కులు, వెంటిలేటర్లు వంటివి ఇప్పుడు దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. అటువంటి ప్రపంచ స్థాయి వస్తూత్పత్తి సామర్థ్యం పెరుగుదల “స్థానికతకు స్వగళం” అనే ప్రధానమంత్రి పిలుపులో ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ‘జాతీయ డిజిటల్ ఆరోగ్య పథకాన్ని’ ప్రకటించిన అనంతరం- ప్రతి పౌరునికీ ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు ఇస్తామని, దీనికి సంబంధించిన సమాచార నిధిలో ఆ పౌరునికిగల వ్యాధులు, రోగ నిర్ధారణ, నివేదిక, మందులు తదితర వివరాలన్నిటినీ నమోదు చేస్తారని వివరించారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646122

ఎర్రకోట బురుజుల పైనుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం; అందులోని ముఖ్యాంశాలు

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646112

ఎర్రకోట బురుజుల పైనుంచి 2020 ఆగస్టు 15న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం

“కరోనా కాలంలో మన సోదరీసోదరులు చాలామంది ఈ మహమ్మారి బారిన పడ్డారు; చాలా కుటుంబాలు ప్రభావితమయ్యాయి; చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి కుటుంబాలన్నిటికీ నా సంతాపం తెలియజేస్తున్నాను. దేశంలోని 130 కోట్ల మంది ప్రజల మొక్కవోని సంకల్పబలం, దీక్ష మనల్ని కరోనాపై గెలిపిస్తాయని నేను ప్రగాఢంగా విశ్వస్తున్నాను. మన గెలుపు ఖాయం...

కరోనా మహమ్మారి పరిస్థితుల నడుమ 130 కోట్లమంది భారతీయులు స్వావలంబన సాధనదిశగా ప్రతినబూనారు. ఇవాళ ప్రతి భారతీయుడి మనస్సులో స్వావలంబన నినాదం నాటుకుపోయింది...

నిరుడు దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ​​18 శాతం పెరిగింది. ఆ మేరకు కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ ప్రపంచంలో అగ్రస్థానంలోగల కంపెనీలు భారత్‌వైపు చూస్తున్నాయి...

నేడు ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను, దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడమే మన ప్రాధాన్యం. ఈ ప్రయత్నంలో జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది

కరోనా సంక్షోభ వేళ సజావుగా సేవలదించడంలో ఈ ఉపకరణాలు ఎంతో సాయపడ్డాయి. ఈ కాలంలో మేం కోటి పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం. రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా 80 కోట్లకుపైగా ఉచిత ఆహారధాన్యాలు సరఫరా చేయబడ్డాయి; సుమారు 90 వేల కోట్ల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి

కరోనా మహమ్మారి వేళ కూడా భారత ప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం రూ.1,00,000 కోట్లు మంజూరు చేయడం మీకు తెలిసిందే...

కరోనా కాలంలో ఈ సోదరీమణుల ఖాతాల్లో సుమారు రూ.30 వేల కోట్లు జమయ్యాయి.

కరోనా మహమ్మారి ఈ కాలంలో ఆరోగ్య రంగం అందరి దృష్టినీ ఆకర్షించడం చాలా సహజం. ఈ సంక్షోభ సమయంలో ఆరోగ్య రంగం మనకు స్వావలంబన ప్రాధాన్యంపై గొప్ప పాఠం నేర్పింది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం కూడా ముందుకు సాగాలి

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు సిద్ధమవుతుందన్న ఆదుర్దా అందరిలోనూ ఉంది. ఈ ఉత్సుకత సహజం. ఈ ఆందోళన ప్రపంచంలోని ప్రతి ఒక్కరిలో, ప్రతిచోటా ఉందిమన శాస్త్రవేత్తలు ప్రయోగశాలలలో తదేక దీక్షతో ఈ కృషిలోనే నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు వివిధ దశల్లో పరీక్షించబడుతున్నాయి...

కరోనా ఒక పెద్ద అవరోధమేగానీ, అది స్వయం సమృద్ధ భారతంవైపు మనం విజయపథంలో సాగుకుండా అడ్డుకోజాలదు.. ”

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646045

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి గౌరవనీయ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్ చేసిన ప్రసంగం

భారత 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిడ్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ మేరకు- “మన ఆత్మవిశ్వాసమే మన బలం కాబట్టే, కోవిడ్‌-19పై పోరాటంలో ఇతర దేశాలకు మనం సహాయపడగలిగాం. ఆ మేరకు మందులు సరఫరా చేయడంద్వారా ఆపత్కాలంలో అంతర్జాతీయ సమాజానికి భారత్‌ అండగా ఉంటుందని మరోసారి రుజువు చేసుకుంది. ఈ మహమ్మారిపై జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ పోరాట వ్యూహాల్లో మనం ముందుండి నడిచాం. కోవిడ్‌-19పై ఈ యుద్ధంలో జీవితంతోపాటు జీవనోపాధి కూడా ముఖ్యమే” అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645900

ప్రధానమంత్రితో నేపాల్‌ ప్రధాని టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి గౌరవనీయులైన నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఒలీ ఇవాళ ఫోన్ చేశారు. భారత 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో తాత్కాలిక సభ్యత్వానికి ఇటీవల భారత్ ఎన్నిక కావడంపై అభినందనలు తెలియజేశారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని కనీస స్థాయికి తగ్గించడంలో రెండు దేశాల్లోనూ చేపట్టిన చర్యలపై దేశాధినేతలిద్దరూ పరస్పరం సంతృప్తి వెలిబుచ్చారు. దీనికి సంబంధించి నేపాల్ కు భారత్ నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646099

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • మహారాష్ట్ర: రాష్ట్ర సహకార మంత్రి బాలసాహెబ్ పాటిల్‌కు కోవిడ్‌ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం కరాద్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 5.73 లక్షలు కాగా, క్రియాశీల కేసులు 1.51 లక్షలుగా ఉన్నాయి.
 • గుజరాత్: రాష్ట్రంలో శుక్రవారం 51,225 రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కోలుకునేవారి శాతం 77.72 స్థాయికి పెరిగింది. గుజరాత్‌లో పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రధానమంత్రి తన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కోరారు. రాష్ట్రంలో  నమోదైన మొత్తం కేసులు 76,569కాగా ప్రస్తుతం 14,299 క్రియాశీల కేసులున్నాయి.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో గత 24 గంటల్లో 451 కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. కాగా, కొత్త కేసులలో రాయ్‌పూర్ నుంచి 142, దుర్గ్‌ నుంచి 59 వంతున ఉన్నాయి. ఇక 199 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 95 కొత్త కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకూ 1750 మంది కోలుకోగా, ప్రస్తుతం 852 మంది చికిత్స పొందుతున్నారు.
 • మణిపూర్: రాష్ట్రంలో ఇవాళ 130 కొత్త కేసులు నమోదవగా ఒకరు మరణించారు. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న దృష్ట్యా మణిపూర్ ప్రభుత్వం పూర్తి దిగ్బంధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది.
 • మేఘాలయ: రాష్ట్రంలో చిన్న వ్యాపారాలు, పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి మద్దతు కార్యక్రమం’ ప్రారంభిస్తోంది. దీనికింద ఒకసారి మద్దతు సాయంగా ఇప్పటికే రూ.50 వేలదాకా రుణం పొందిన చిన్న వ్యాపారులకు కొత్తగా రూ.10,000 వంతున ఇవ్వబడుతుంది. ఇందుకోసం రూ.15 కోట్ల మూలనిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 • మిజోరం: రాష్ట్రంలో 56 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 713కాగా, క్రియాశీల కేసులు 365గా ఉన్నాయి.
 • నాగాలాండ్: రాష్ట్రంలో శుక్రవారం 154 కొత్త కేసులు నమోదవగా, మొత్తం కేసులు 3322కు పెరిగాయి.
 • పంజాబ్: రాష్ట్రంలో కొద్ది వారాల్లో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుతుందనే ఆందోళన నడుమ మహమ్మారి వ్యాప్తి నియంత్రణ దిశగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్ని నగరాల్లోనూ కర్ఫ్యూను రాత్రి 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
 • హర్యానా: రాష్ట్రంలో కోవిడ్‌19 మహమ్మారివల్ల కలిగే కష్టాలను దృష్టిలో ఉంచుకుని, అన్ని మత ప్రదేశాల విద్యుత్ బిల్లులను రద్దుచేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో 2020 ఏప్రిల్ నుంచి జూన్ వరకు రద్దవుతాయి. అయితే, 2020 మార్చి 31దాకాగల సంబంధిత సర్‌చార్జితోపాటు బకాయిలను 2020 అక్టోబర్ 31నాటికి చెల్లించాల్సి ఉంటుంది.
 • కేరళ: రాష్ట్రంలో ఇవాళ 4 కోవిడ్-19 మరణాలు నమోదవడంతో మొత్తం మృతుల సంఖ్య 143కు పెరిగింది. రాజధాని తిరువనంతపురంలో వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. సెంట్రల్ జైలులో మరో 53 మంది ఖైదీలకు కోవిడ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో అత్యధికంగా ఒకేరోజు 1,569 కేసులు నమోదవగా ప్రస్తుతం 14,094 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటివరకు 26,996 మంది కోలుకోగా వివిధ జిల్లాల్లో ప్రస్తుతం 1,55,025 మంది నిఘాలో ఉన్నారు.
 • తమిళనాడు: కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజల సహకారం చాలా అవసరమని పుదుచ్చేరి ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో అన్నారు. కాగా, తమిళనాడులోని కోయంబత్తూరులో కోవిడ్ కేసులు శుక్రవారం 8,274కు పెరిగాయి. ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 164కు పెరిగింది. రాష్ట్ర గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 5,890 కొత్త కేసులు నమోదవగా నిన్న ఒకేరోజు 117 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 3,26,345; క్రియాశీల కేసులు: 53,716; మరణాలు: 5514; చెన్నైలో చురుకైన కేసులు: 11,209గా ఉన్నాయి
 • కర్ణాటక: రాష్ట్రస్థాయి కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ నిర్ణయం మేరకు 10 లక్షల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ డిటెక్షన్ కిట్ల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కోవిడ్‌పై ప్రజలలో అవగాహన కల్పించడంలో స్వచ్ఛంద కార్యకర్తలను మోహరించడం కోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో గణేశ విగ్రహాల ఏర్పాటు, పూజల నిర్వహణను ప్రభుత్వం నిషేధించింది.
 • ఆంధ్రప్రదేశ్: కోవిడ్‌ నుంచి కోలుకున్నవారంతా ముందుకొచ్చి ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారికోసం ప్లాస్మా దానమివ్వాలని స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాల కొరత తీర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ మెడ్-టెక్ జోన్ ఇవాళ బ్రిటన్‌ ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుంది. ఈ మేరకు వాటి తయారీకి అవసరమైన ఆర్థిక, సాంకేతిక, మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా ఎంపికచేసిన భారతీయ మెడ్-టెక్ స్టార్టప్‌లు విశాఖపట్నంలోని మెడ్-టెక్ వ్యాలీ ఇంక్యుబేషన్ సెంటర్‌లో నిర్వహించబడతాయి. కాగా, తమ భద్రత, రక్షణ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆగస్టు 17 నుంచి కోవిడ్-19 విధులను పూర్తిగా  బహిష్కరిస్తామని జూనియర్ వైద్యులు హెచ్చరించారు.
 • తెలంగాణ: రాష్ట్రంలో ఇతరత్రా వ్యాధులు లేని, ఆరోగ్యం బాగున్నవారిలోనే కోవిడ్‌ మరణాలు అధికంగా ఉన్నట్లు ప్రస్తుతం రోగులకు చికిత్స చేస్తున్న ఆరోగ్య నిపుణులు, వైద్యులు పేర్కొంటున్నారు. వారు ఆలస్యంగా ఆస్పత్రులకు రావడమే ఇందుకు ప్రధాన కారణంగా వారు చెబుతున్నారు. తెలంగాణలో గత 24 గంటల్లో 1864 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవగా 1912 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 394 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 90,259; క్రియాశీల కేసులు: 23,379; మరణాలు: 684; డిశ్చార్జి: 66,196గా ఉన్నాయి.

***(Release ID: 1646199) Visitor Counter : 13