ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ తో సాహసోపేతంగా పోరాడినందుకు, తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో దేశానికి వందనం పలికిన - ప్రధానమంత్రి.

జాతీయ డిజిటల్ ఆరోగ్య పధకాన్ని ప్రకటించిన - ప్రధానమంత్రి.

Posted On: 15 AUG 2020 2:28PM by PIB Hyderabad

కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి మరియు భారతదేశం యొక్క ఏకకాల గ్రేడెడ్ మరియు ప్రో-యాక్టివ్ విధానం దేశాన్ని “ఆత్మ నిర్భర్” గా మార్చింది. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతి నుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆరోగ్యరంగంలో, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎత్తిచూపారు. 

ఈ వ్యాధి కారణంగా, తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు, ప్రధానమంత్రి తన సంతాపాన్ని తెలియజేస్తూ, "సేవా పరమో ధర్మ" అనే మంత్రాన్ని ఉదహరించిన భారతదేశ కరోనా యోధులను మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.  "మనం కరోనాకు వ్యతిరేకంగా గెలుస్తాము" అని ప్రధానమంత్రి దేశానికి భరోసా ఇచ్చారు.  ‘బలమైన సంకల్పం’ విజయానికి దారి తీస్తుంది.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

కోవిడ్-19 మధ్య స్వావలంబన సాధించటానికి దారి తీసిన దేశంలోని ‘ఆత్మ నిర్భర్ భారత్’ స్ఫూర్తి ని ఆయన ఎత్తిచూపారు. గతంలో దేశీయంగా తయారు చేయని పి.పి.ఈ. పరికరాలు, ఎన్-95 మాస్కులు, వెంటిలేటర్లు మొదలైనవి ఇప్పుడు దేశంలో ఉత్పత్తి అవుతున్నాయని ఆయన చెప్పారు.  అటువంటి ప్రపంచ స్థాయి వస్తువుల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదల "వోకల్ ఫర్ లోకల్" అనే ప్రధానమంత్రి పిలుపులో ప్రతిధ్వనించింది.

ఈ రోజు ఎర్రకోట బురుజులు నుండి ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశంలో కోవిడ్ నిర్ధారణ పరీక్ష సామర్థ్యం స్థిరంగా పెంచిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.  "కేవలం ఒకే ఒక్క ప్రయోగశాల నుండి ఈ రోజు దేశవ్యాప్తంగా 1400 కి పైగా ప్రయోగశాలలు మనకు అందుబాటులో ఉన్నాయి.  ఇంతకుముందు, మనం రోజుకు కేవలం 300 పరీక్షలు నిర్వహిస్తూండగా, ఈ రోజు మనం ఒక రోజు లో 7 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నాము.  మనం దీన్ని చాలా తక్కువ సమయంలో సాధించాము ”అని ఆయన వివరించారు. 

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి భారతదేశం యొక్క వ్యూహం గురించి ప్రధానమంత్రి తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు.  ఈ మిషన్‌లో శాస్త్రవేత్తలు దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  "ప్రస్తుతం, మూడు వ్యాక్సిన్లు పరీక్ష యొక్క వివిధ దశలలో ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఆమోదం తెలిపిన వెంటనే, భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది.  వ్యాక్సిన్ల ఉత్పత్తి మరియు పంపిణీ కోసం అవసరమైన ప్రణాళిక కూడా సిద్ధంగా ఉంది." అని ఆయన తెలియజేశారు. 

వైద్య విద్య మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాలలో పెరిగిన సామర్థ్యం కోసం చేపట్టిన విస్తరణ కార్యక్రమాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు.  కొత్త ఏ.ఐ.ఐ.ఎం.ఎస్. మరియు వైద్య కళాశాలలు దేశంలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయనీ,  ఎం.బి.బి.ఎస్; ఎం.డి.  కోర్సుల్లో 45,000 సీట్లకు పైగా పెంచామనీ, ఆయన తెలిపారు.  కొనసాగుతున్న మహమ్మారి సమయంలో కోవిడ్ కాని ఆరోగ్య సేవలను అందించడంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ & వెల్నెస్ కేంద్రాలు (హెచ్.డబ్ల్యు.సి. లు) పోషించిన పాత్రను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.  మొత్తం 1.5 లక్షల హెచ్.డబ్ల్యూ.సి. లలో, మూడవ వంతు ఇప్పటికే చురుకుగా పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.  ఆరోగ్య రంగంలో సేవల ప్రభావాన్ని, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పి.ఎం.జె.ఎ.వై), మెరుగుపరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

జాతీయ డిజిటల్ ఆరోగ్య పధకాన్ని ప్రకటించిన అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రతి పౌరునికి ఒక ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు (ఐ.డి) ను అందిస్తామని చెప్పారు.  ఈ ప్రత్యేక గుర్తింపు (ఐ.డి) లో ఆ పౌరుని సాధారణ డేటా బేస్ లో వ్యాధులు, రోగ నిర్ధారణ, నివేదిక, మందులు మొదలైన వివరాలను పొందుపరుస్తారు. 

*****



(Release ID: 1646122) Visitor Counter : 319