ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఒకేరోజు కోలుకున్న కోవిడ్ కేసుల్లో భారత్ సరికొత్త రికార్డ్

గత 24 గంటల్లో కోలుకున్నవారు 57,381 మంది

50% పైగా కోలుకున్నట్టు నివేదించిన 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

అత్యధికంగా ఒక్కరోజులో భారత్ లో 8.6 లక్షల పరీక్షలు

Posted On: 15 AUG 2020 1:07PM by PIB Hyderabad

 

కోలుకున్నవారి సంఖ్య పెరుగుదల బాటలో సాగుతూ ఉండగా భారత్ లో కోవిడ్-19 కేసులలో ఒక్క రోజులో కోలుకున్నవారి సంఖ్య అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గడిచిన 24  గంటల్లో 57,381 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Image


ఆ విధంగా పెద్ద ఎత్తున కోలుకుంటూ ఉండటంతో భారత్ లో కోలుకున్నవారి శాతం 70 కి పైబడింది. ఇంకా మరింత మంది కోలుకుంటూనే ఉన్నారు. ఈ దిశలోనే  సానుకూల పరిస్థితిని చాటుకుంటూ 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోలుకుంటున్న వారి శాతం 50ని దాటినట్టు నివేదించాయి. మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ స్థాయిని సైతం అధిగమించినట్టు వెల్లడించాయి. 


మరింత మంది కోలుకుంటూ ఆస్పత్రుల నుంచి, ఇంటి ఐసొలేషన్ (స్వల్ప,  ఒకమోస్తరు లక్షణాలతో ఉన్నవారు)  నుంచి డిశ్చార్జ్ అవుతున్న క్రమంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య ఈరోజు 18 లక్షలు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే నేటికి 18,08,936 కు చేరింది. కోలుకున్నవారి సంఖ్యకూ, చికిత్సలో ఉన్నవారి సంఖ్యకూ మధ్య తేడా  11 లక్షలు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే నేటికి 11,40,716 కు చేరింది.
కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో జరుపుతున్న కృషి  ఫలితంగా రోజువారీ సగటుఇ కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్న 6,68,220 కేసులనే అసలైన భారంగా లెక్కించాల్సి ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసులలో 26.45% . ఇలా ఉండగా గత 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్యను గమనించినా కొత్త కేసుల నమోదు క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోలుకోని వారంతా చికిత్సలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 
మెరుగైన వైద్య చికిత్స మీద దృష్టి సారించటం, ఇళ్ళ ఐసొలేషన్ మీద ప్రత్యేక పర్యవేక్షణ, ఆక్సిజెన్ అందజేయటం, సకాలంలో తరలించి సరైన వైద్య సహాయం అందించటానికి తగిన విధగా అంబులెన్స్ సౌకర్యం, చికిత్సా విధానాల మెరుగుదల, కోవిడ్ చికిత్స అందించే డాక్టర్ల నైపుణ్యంలో మెరుగుదల, ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులతో టెలీ సంప్రదింపుల ద్వారా సాంకేతిక మార్గదర్శనం లాంటి చర్యలు చికిత్సలో సత్ఫలితాలనిస్తున్నాయి. దీనివలన పాజిటివ్ కెసులలో మరణాల శాతం భారత్ లో బాగా నియంత్రణలో ఉంది. ప్రస్తుతం 1.94% కు చేరగా అది క్రమంగా తగ్గుతూ రావటం కనిపిస్తోంది.
భారతదేశం అనుసరిస్తున్న " పరీక్షించి, ఆనవాలు పట్టు, చికిత్స అందించు" అనే వ్యూహం కారణంగా పరీక్షల సంఖ్య గరిష్ట్జ స్థాయికి చేరింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8,68,679  పరీక్షలు జరిగాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 2.85 కోట్లకు పైగా శాంపిల్స్ పరీక్షించినట్టయింది.
ఈ తరహా ప్రతిస్పందన, పరీక్షల వ్యూహం ఫలితంగా దేశంలో పరీక్షల నెట్ వర్క్ విస్తృతమవుతూ వస్తోంది. దీనికి తగినట్టుగా దేశంలోని పరీక్షల లాబ్ ల నెట్ వర్క్ బలోపేతమవుతూ ఈరోజు దేశవ్యాప్తంగా 1465 లాబ్ లు పరీక్షలు చేయగలిగే స్థాయికి వచ్చాయి. వీటిలో 968 ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుండగా 497 ప్రైవేట్ లాబ్ లు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ :  751 (ప్రభుత్వ:  448   + ప్రైవేట్:  303)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 597 (ప్రభుత్వ: 486  + ప్రైవేట్: 111)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 117  (ప్రభుత్వ: 34  + ప్రైవేట్ 83 )
 
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

***


(Release ID: 1646080) Visitor Counter : 331