PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
14 AUG 2020 6:29PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- కోవిడ్ వ్యాధి నయమైనవారి సంఖ్య 17.5 లక్షలకుపైగా నమోదు; కోలుకునేవారి సగటు 70.17 శాతం.
- భారత్‌లో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా దాదాపు 8.5 లక్షల రోగ నిర్ధారణ పరీక్షలు.
- స్థిరంగా పతనమవుతూ 1.95 శాతంగా నమోదైన మరణాల సగటు.
- ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,61,595.
- ప్రపంచ ఎగుమతులలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేస్తూ ఒక్క నెలలో 23 లక్షల పీపీఈ కిట్లు ఎగుమతి.
- దేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/కేంద్రీయ సంస్థలకు ఇప్పటిదాకా 1.28 కోట్ల పీపీఈ కిట్లు ఉచితంగా పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వం.
- కోవిడ్-19 నేపథ్యంలో ఎర్రకోటవద్ద స్వాతంత్ర్య దినోత్సవ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు.


భారత్‌లో ఒకేరోజు రికార్డుస్థాయిన 8.5 లక్షలదాకా పరీక్షలు; కోలుకునేవారి సగటు 71.17 శాతానికి చేరిక; మరణాలు 1.95 శాతానికి పతనం
దేశవ్యాప్తంగా ప్రయోగశాలల నెట్‌వర్క్ స్థిరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గత 24 గంటల్లో ఒకేరోజు రికార్డు స్థాయిన అత్యధికంగా 8,48,728 రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం పరీక్షించిన నమూనాల సంఖ్య 2,76,94,416కు పెరిగింది. ప్రతి దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు సగటున రోజువారీగా 140 నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. అయితే, భారత్‌లో ఈ జాతీయ సగటు
అంతకన్నా దాదాపు నాలుగు రెట్లు అధికంగా 603గా ఉండటం గమనార్హం. కాగా, 34 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో రోజువారీ పరీక్షల సగటు ఇంతకన్నా ఎక్కువగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 958, ప్రైవేటు రంగంలో 493 వంతున నేడు 1451 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు “పరీక్ష, అన్వేషణ, చికిత్స” పేరిట భారత్ అనుసరిస్తున్న త్రిముఖ వ్యూహంతోపాటు సమర్థ వైద్య నిర్వహణవల్ల కోలుకునే రోగుల సంఖ్య స్థిరంగా పెరుగుతుండటంతో జాతీయంగా కోలుకునేవారి సగటు ఇవాళ 71.17 శాతానికి పెరిగింది. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య నేడు 17.5 లక్షలు (17,51,555) దాటింది. ఆ మేరకు ప్రస్తుత (6,61,595) కేసులతో పోలిస్తే అంతరం 11 లక్షల (10,89,960) స్థాయికి చేరువైంది. అలాగే సమర్థ, ప్రామాణిక చికిత్స విధానాల అనుసరణవల్ల కోవిడ్ రోగుల మరణాలు కూడా స్థిరంగా తగ్గుముఖం పడుతూ జాతీయ సగటు ఇవాళ 1.95 శాతానికి పతనమైంది.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645851
ఒక్క నెలలో 23 లక్షల పీపీఈ కిట్ల ఎగుమతితో ప్రపంచంలో తన స్థానం నిరూపించుకున్న భారత్; వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/ కేంద్రీయ సంస్థలకు కేంద్రం నుంచి ఉచితంగా 1.28 కోట్ల పీపీఈ కిట్లు
దేశీయంగా పీపీఈ కిట్ల తయారీ సామర్థ్యం పుంజుకోవడంతోపాటు స్థానిక అవసరాలు తీరుతున్న నేపథ్యంలో కిట్ల ఎగుమతికి అనుమతిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ 2020 జూలైలో సవరించిన మార్గదర్శకాలు జారీచేశారు. ఈ సడలింపుతో ఒక్క జూలై నెలలోనే భారత్ 23 లక్షల పీపీఈ కిట్లను ఐదు దేశాలకు ఎగుమతి చేసింది. ఈ మేరకు అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సెనెగల్, స్లొవేనియాలకు కిట్లు ఎగుమతి కావడంతో అంతర్జాతీయ ఎగుమతి విపణిలో భారత్ తన స్థానాన్ని రుజువు చేసుకుంది. ‘స్వయం సమృద్ధ భారతం, మేక్ ఇన్ ఇండియా’ సంకల్ప స్ఫూర్తితో దేశంలో పీపీఈ కిట్లుసహా వివిధ వైద్య పరికరాలు తయారుచేసే సామర్థ్యం పెరిగింది. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం పీపీఈ కిట్లు, N95 మాస్కులు ఉచితంగా సరఫరా చేస్తోంది. దీంతోపాటు రాష్ట్రాలు కూడా ఈ సామగ్రిని నేరుగా కొనుగోలు చేస్తున్నాయి. తదనుగుణంగా 2020 మార్చి నుంచి ఆగస్టుదాకా 1.40 లక్షల దేశీయ పీపీఈ కిట్లను తమ సొంత వనరులతో కొనుగోలు చేశాయి. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా 1.28 కోట్లకుపైగా పీపీఈ కిట్లను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/కేంద్రీయ సంస్థలకు ఉచితంగా పంపిణీ చేసింది.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645899
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో స్వచ్ఛంద రక్తదాన ప్రచారాన్ని ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఇవాళ స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయడంతోపాటు రోగుల ప్రాణరక్షణకు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎయిమ్స్ చేపట్టిన కార్యక్రమాన్ని డాక్టర్ హర్షవర్ధన్ ప్రశంసించారు. “మన 73వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఇప్పటిదాకా కోవిడ్‌పై పోరులో అసువులుబాసిన తెల్లకోటు యోధులకు, కార్గిల్ అమరవీరులకు ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఒక నివాళి. ఆ మేరకు మహమ్మారి నుంచి ప్రజల ప్రాణరక్షణ కోసం ఆత్మబలిదానం చేసిన వైద్యులు, నర్సులు/పారామెడికల్ సిబ్బందిని మనం సదా స్మరించుకోవాలి” అని సూచించారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645853
కోవిడ్-19 నేపథ్యంలో ఎర్రకోటవద్ద స్వాతంత్ర్య దినోత్సవ నిర్వహణకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఎర్రకోట వద్ద 2020 ఆగస్టు 15న పతాకావిష్కరణకు రక్షణ మంత్రిత్వశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జాతీయ వేడులక పవిత్రత, గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఆ మేరకు ఒకవైపు ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడటంతోపాటు వారు కూర్చునేందుకు ఆయ ప్రదేశాలను ఆవరణలుగా విడగొట్టారు. వాటి మధ్యనుంచి నడిచేందుకు చెక్క నేలపై తివాచీలు పరిచి దారులు ఏర్పాటు చేశారు. ఆహ్వానితులంతా తమకు కేటాయించిన చోటికి సులువుగా వెళ్లగలిగేలా ప్రతిచోటా మెటల్ డిటెక్టర్లతో అదనపు ద్వారాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాల వద్ద వాహనాలు సులభంగా వచ్చిపోయేలా ఇటుకలు పరచడంద్వారా సాఫీగా సాగిపోయే ఏర్పాటు చేశారు. మరోవైపు గౌరవ వందనం సమర్పించే బృందం సభ్యులను భద్రత కోసం నిర్బంధవైద్య పరిశీలనలో ఉంచారు. సీట్ల ఏర్పాటుకు సంబంధించి “రెండు గజాల దూరం” (వేడుకల వేళ ఇద్దరు అతిథుల నడుమ ఆరడుగుల దూరం) ఉండాలన్న నియమాన్ని పాటించారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645737
“రోగ నిరోధకత కోసం ఆయుష్” కార్యక్రమానికి శ్రీకారంపై డిజిటల్ ప్రపంచంలో ఉత్సాహపూరిత స్పందన
“రోగ నిరోధకత కోసం ఆయుష్” పేరిట కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ వెబినార్ ద్వారాల మూడు నెలల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో 50 మందికిపైగా పాల్గొనగా, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కీలకోపన్యాసం చేశారు. ఆయుష్ పరిష్కారాలు ప్రపంచం మొత్తాన్ని ఆరోగ్యకర-ఆనందకర జీవితాలవైపు నడిపించగలవని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ పరిధిలోని కొత్త డిజిటల్ కమ్యూనికేషన్ వేదిక ‘ఆయుష్ వర్చువల్ కన్వెన్షన్ సెంటర్’లో ఈ వెబినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆయుష్ మంత్రిత్వశాఖ అధికారిక ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో 60,000 మందివరకూ దీన్ని వీక్షించారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645926
క్యాపెక్స్ పై సీపీఎస్‌ఈ 3వ సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర ఆర్థికమంత్రి
కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయంపై ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమీక్ష నిర్వహించారు. షిప్పింగ్, రోడ్డు రవాణా-రహదారులు, గృహనిర్మాణం-పట్టణ వ్యవహారాలు, రక్షణ, టెలి కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖల కార్యదర్శులతోపాటు ఆ మంత్రిత్వ శాఖల పరిధిలోని 7 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి వివిధ భాగస్వాములతో నిర్వహిస్తున్న వరుస సమావేశాల్లో ఇది మూడోది. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ముగిసేసరికి మూలధన వ్యయ లక్ష్యంలో 50 శాతందాకా ఖర్చు చేయడం కోసం తగిన ప్రణాళికల రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును నిశితంగా పరిశీలించాలని సంబంధిత కార్యదర్శులను ఆర్థిక మంత్రి కోరారు. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారివల్ల ఎదురైన సవాళ్లపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఈ సందర్భంగా చర్చించాయి. కాగా, అసాధారణ పరిస్థితులను అధిగమించడానికి అసాధారణ కృషి అవసరమని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645882
కోవిడ్ మహమ్మారి సమయంలో సీఐసీ పనితీరుపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌కు వివరించిన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బిమల్ జుల్కా
దేశంలో కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలోనూ కేంద్ర సమాచార కమిషన్ ఒక్కరోజు కూడా అంతరాయం లేకుండా పనిచేసిందని, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంతకుముందు కమిషన్ పనితీరుపై ప్రధాన సమాచార కమిషనర్ శ్రీ బిమల్ జుల్కాతో కలసి ఆయన సమీక్షించారు. వాస్తవానికి ఈ సంక్షోభం నడుమ మే 15న కేంద్ర సమాచార కమిషన్ కొత్తగా ఏర్పడిన జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో కూడా వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఫిర్యాదుల విచారణ చేపట్టడం ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు. నిరుడు జూన్ నెలలో కమిషన్ 1,297 కేసులను పరిష్కరించగా, ఈ ఏడాది ఒకవైపు కోవిడ్ సంక్షోభం నడుమ 1785 కేసులు పరిష్కరించటాన్ని ఈ సందర్భంగా ఉటంకించారు. కాగా, దిగ్బంధం కొనసాగుతున్న వేళ కూడా ఫిర్యాదులపై విచారణకు పలు చర్యలు తీసుకున్నామని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌కు శ్రీ జుల్కా వివరించారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645632
షట్లర్ ఎన్.సిక్కిరెడ్డి, ఫిజియోథెరపిస్ట్ కిరణ్‌లకు కోవిడ్ నిర్ధారణ
హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరానికి హాజరైన షట్లర్ సిక్కిరెడ్డి, ఫిజియోథెరపిస్ట్ సి.కిరణ్‌లకు కోవిడ్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. భారత క్రీడా ప్రాధికార సంస్థ (SAI) నిర్దేశం మేరకు శిబిరానికి వచ్చిన ఆటగాళ్లు, శిక్షకులు, సహాయ సిబ్బంది మొత్తానికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో సిక్కిరెడ్డి, కిరణ్ లక్షణరహిత కోవిడ్ బాధితులుగా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో సిక్కిరెడ్డి, కిరణ్‌లతో సంబంధాలున్న వారిని గుర్తించడంతోపాటు ఆ ఇద్దరి నమూనాలను మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు పంపారు. దీనిపై జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ- “శిబిరానికి వచ్చిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయ సిబ్బంది, పాలనాధికారులు ప్రతి ఒక్కరికీ సాయ్ నిర్దేశానుసారం పరీక్షలు నిర్వహించాం. ఇద్దరికి వ్యాధి నిర్ధరణ అయింది. విధివిధానాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆటగాళ్ళు సురక్షితంగా, వీలైనంత త్వరగా శిక్షణ కోసం తిరిగి రావచ్చు” అని చెప్పారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645636
ప్రయాణిక ఓడలపై రేవు రుసుమును 60 నుంచి 70శాతందాకా తగ్గించిన నౌకాయాన మంత్రిత్వ శాఖ
కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ ప్రయాణిక ఓడలపై రుసుమును హేతుబద్ధం చేసింది. ఈ మేరకు రేవు రేసుమును 60 నుంచి 70 శాతందాకా తగ్గిస్తూ, ఈ నిర్ణయాన్ని తక్షణం అమలులోకి తెచ్చింది. దీనివల్ల దేశంలోని ప్రయాణిక నౌకా పరిశ్రమకు గణనీయంగా ఊరట లభిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి ప్రతికూల ఆర్థిక ప్రభావాల నుంచి ప్రయాణిక నౌకా పరిశ్రమకు ఊతమివ్వాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి (ఇన్‌చార్జి) శ్రీ మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఇది భారత క్రూయిజ్ పర్యాటక రంగంద్వారా భారీ విదేశీ మారకం ఆర్జనకు, ప్రత్యక్ష-పరోక్ష సముద్రతీర ఉపాధి కల్పనకు అవకాశాన్ని కల్పిస్తుందన్నారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645634
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో మరో కోవిడ్ మరణం సంభవించింది. అయితే, ఇప్పటిదాకా రాష్ట్రంలో మరణించినవారి సంఖ్య కేవలం నాలుగు మాత్రమే కావడం విశేషం. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లో 82 కొత్త కేసులు నమోదవగా వీటిలో అత్యధికంగా 17 ఇటానగర్ రాజధాని ప్రాంతంలోనివే. ఇక వెస్ట్ కామెంగ్ 14, తూర్పు సియాంగ్ జిల్లా 12 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 790 క్రియాశీల కేసులున్నాయి.
- అసోం: రాష్ట్రంలో నిన్న 2,174 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 49,383కు చేరింది. ప్రస్తుతం అసోంలో క్రియాశీల రోగులు 22,240 మంది ఉన్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ ట్వీట్ చేశారు.
- మణిపూర్: రాష్ట్రంలో కోవిడ్‌పై పోరాడే ముందువరుస యోధుల కోసం 100 పీపీనీ కిట్లను విరాళంగా ఇచ్చినందుకు ఇంఫాల్‌లోని తాంగ్మీబంద్‌లోగల రోమీబాగ్ ఇండస్ట్రీస్ సంస్థను మణిపూర్ ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఇవి మణిపూర్‌లో ఉత్పత్తి అయినవి కాగా, భారత ప్రభుత్వ DRDO-DRDE ఆమోదం పొందినవి కావడం గమనార్హం.
- మేఘాలయ: రాష్ట్రమంతటా ఆరోగ్య ఉప-కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి మేఘాలయ ఆరోగ్య విభాగం ప్రపంచ బ్యాంకుతో రుణ ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో 2020 సెప్టెంబర్- అక్టోబర్ నాటికి ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి పథకం మొదలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఆరోగ్యశాఖకు సూచించారు.
- మిజోరం: రాష్ట్రంలో నిన్న 8 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో మొత్తం కేసులు 657కు చేరగా, ప్రస్తుతం క్రియాశీల కేసులు 314గా ఉన్నాయి.
- నాగాలాండ్: రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని నాగాలాండ్ ముఖ్యమంత్రి చెప్పారు. వ్యాధిసోకిన వ్యక్తులను, ముందువరుస కరోనా పోరాట యోధులను కించపరచవద్దని ఆయన ప్రజలను కోరారు. దిమాపూర్‌లోని అన్ని దుకాణాలు సోమవారం నుంచి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
- సిక్కిం: రాష్ట్రంలో ప్రభుత్వ-ప్రైవేటు విద్యాసంస్థలన్నిటినీ ఆగస్టు 31 వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటుపైన పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ కె.ఎన్.లెప్చా తెలిపారు. సిక్కింలోని గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లో యువతకు... ముఖ్యంగా విద్యావంతులైన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పనకు సమానావకాశాల దిశగా వాణిజ్య-పరిశ్రమల శాఖ పరిధిలో ‘స్కిల్డ్ యూత్ స్టార్ట్-అప్ స్కీమ్’ పేరిట కొత్త సబ్సిడీ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
- కేరళ: రాష్ట్రంలోని మళప్పురం జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌కు కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో వారిని కలిసినవారి జాబితాలోగల ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర పోలీసు డీజీపీసహా నలుగురు మంత్రులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్‌సహా మరో 20మంది రెవెన్యూ అధికారులకు కోవిడ్ నిర్ధారణ కావడంతో కలెక్టర్ కార్యాలయం కరోనా కూడలిగా మారగా జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగా, వ్యాధి పీడితులలో అధికశాతం కరీపూర్ విమాన ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యల్లో పాల్గొన్నవారు కావడం గమనార్హం. ఇక రాజధాని తిరువనంతపురం రాష్ట్రంలోనే అత్యంత తీవ్ర కోవిడ్ ప్రభావిత జిల్లాగా మారింది. ఇక కరోనా నిరోధం దిశగా స్వాతంత్ర్య వేడుకలను 15 నిమిషాలకు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మరో మూడు కోవిడ్ మరణాలు సంభవించాయి. సెంట్రల్ జైలులో మరో 63మంది ఖైదీలకు వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటిదాకా వ్యాధి బారినపడిన ఖైదీల సంఖ్య 164కు చేరింది. ఈ నేపథ్యంలో జైలు ప్రధాన కార్యాలయం మూడు రోజులు మూసివేశారు. రాష్ట్రంలో నిన్న 1,564 కొత్త కేసులు నమోదవగా వివిధ జిల్లాల్లో 13,839 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1.53 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శుక్రవారం 328 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి; దీంతో మొత్తం కేసులు 6680కి, క్రియాశీల కేసులను 2750కి, మరణాలు 106కు చేరాయి. ఇక తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం ఇ-పాస్ విధానాన్ని సరళీకరించింది. ఈ మేరకు ఆధార్ ఉపయోగించి దరఖాస్తు చేస్తే ఆగస్టు 17 నుండి తక్షణం ఇ-పాస్ జారీ అవుతుంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న 40మంది పోలీసు సిబ్బంది ఇటీవల రాజీవ్గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ప్లాస్మా బ్యాంక్‌లో ప్లాస్మా దానం చేశారు. రాష్ట్రంలో నిన్న 5835 కొత్త కేసులు, 119 మరణాలు నమోదవగా 5146మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 3,20,355; క్రియాశీల కేసులు: 53,499; మరణాలు:5397; డిశ్చార్జి:2,61,459; చెన్నైలో యాక్టివ్ కేసులు:10,868గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో ఈసారి స్వాతంత్ర్య దిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. బెంగళూరు నగరంలో రేపు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 75 మంది కరోనా యోధులుసహా కోవిడ్-19 నుంచి కోలుకున్న 25 మందికి ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. ఇక కోవిడేతర వ్యాధులతో బాధపడేవారికి చికిత్స నిరాకరిస్తే శిక్షార్హనేరంగా పరిగణిస్తామని కర్ణాటక వైద్య మండలి వైద్యులను హెచ్చరించింది. తమిళనాడు సరిహద్దు మీదుగా రాకపోకలమీద ఆంక్షలపై కర్ణాటక హైకోర్టు ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. కాగా కర్ణాటకలో నిన్న కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. రాష్ట్రంలో క్రియాశీల కేసులు 78,337 కాగా, ఇప్పటివరకు 3613 మంది మరణించారు.
- ఆంధ్రప్రదేశ్: గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత కె.అచ్చెన్నాయుడుకు కోవిడ్ వ్యాధి నిర్ధారణ అయింది. ఇటీవల ఇఎస్‌ఐ ఆసుపత్రి కుంభకోణంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనావైరస్ బారినపడిన ఆలయ సిబ్బందికి వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా, విశాఖపట్నంలో ఇవాళ కరోనా అవగాహన ప్రచార రథాలను జెండాఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో నిన్న 9996 కొత్త కేసులు, 82 మరణాలు నమోదవగా 9499 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 2,64,142 యాక్టివ్: 90,840; మరణాలు: 2378గా ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులు 50 శాతం పడకలను ప్రభుత్వానికి అప్పగించనున్నాయి. సిద్దిపేటలో కోవిడ్-19 సంచార పరీక్ష సదుపాయం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇటువంటి ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. తెలంగాణలో గత 24 గంటల్లో 1921 కొత్త కేసులు నమోదవగా, 9 మరణాలు నమోదవగా 1210 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులలో 356 కేసులు జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 88,396; క్రియాశీల కేసులు: 23,438; మరణాలు: 674; డిశ్చార్జి అయినవి: 64,284గా ఉన్నాయి.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో కోవిడ్ విస్తరణ నిరోధం దిశగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నిర్బంధవైద్య పరిశీలన నిబంధనలను సడలించింది. ఈ మేరకు ప్రయాణికులు తమ ప్రయాణానికి 72 గంటలముందు స్వీయ-ధ్రువీకరణ ఫారమ్ నింపడంద్వారా సంస్థాగత నిర్బంధం నుంచి మినహాయింపు పొందవచ్చు. అయితే, అలాంటి ప్రయాణికులు ప్రయాణం చేసిన 96 గంటల్లోగా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుని, పొందిన నెగటివ్ ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. కాగా, రాష్ట్రంలో గురువారం 11,813 కొత్త కేసులు నమోదవగా 9,115 మంది కోలుకున్నారు.
- గుజరాత్: రాష్ట్రంలోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30 మందికిపైగా సిబ్బందిగల అన్ని సంస్థలలో కోవిడ్ సమన్వయకర్త నియామకాన్ని తప్పనిసరి చేసింది. దీని ప్రకారం- సంబంధిత అన్ని విధివిధానాలు, ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలు సవ్యంగా అమలయ్యేలా సమన్వయకర్త బాధ్యత వహిస్తారు. ఇక 30 మందికన్నా తక్కువమంది సిబ్బందిగల సంస్థలలో యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాగా, గుజరాత్‌లో 1,092 కొత్త కేసులు నమోదవగా, 1,046 మంది కోలుకున్నారు. ప్రస్త్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 14,310గా ఉంది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని రాజకీయ నాయకులను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర మంత్రులకు గురువారం కోవిడ్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు తాజాగా ఎన్నికైన సుమేర్ సింగ్ సోలంకీతోపాటు నివారి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అనిల్ జైన్ కూడా వ్యాధిబారిన పడ్డారు. భోపాల్‌లో బీజేపీ స్థానిక నేత, అధికార ప్రతినిధి దుర్గేశ్ కేశ్వానీకి కూడా కోవిడ్-19 నిర్ధారణ అయింది.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో కొత్త పరీక్ష సదుపాయాలు ప్రారంభించడంతో రోజువారీ పరీక్షల సామర్థ్యం 11,000 స్థాయికి పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటిదాకా 3.9 లక్షల పరీక్షలు నిర్వహించగా 13,960 కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,187గా ఉంది.
- గోవా: రాష్ట్రంలో కోవిడ్-19 చికిత్స సదుపాయాల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా “అత్యంత విషమస్థితి”లోగల రోగుల కోసం గోవా వైద్య కళాశాల- ఆస్పత్రిలో మూడు వార్డులను కేటాయించింది. ఇక మరో రెండో కోవిడ్ ప్రత్యేక వైద్యకేంద్రాలైన మార్గోవాలోని ఇఎస్ఐ ఆస్పత్రి (దక్షిణ గోవా), పోండా (ఉత్తర గోవా)లోని జిల్లా ఆరోగ్య ఉప-కేంద్రంలో లక్షణరహిత, ఓ మోస్తరు లక్షణాలున్న రోగుకుల చికిత్స అందిస్తాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు. కాగా, గోవాలో కోలుకునేవారి సగటు 72 శాతం కాగా, ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 3,491గా ఉంది.
***
(Release ID: 1645991)
Visitor Counter : 314
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam