కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 21 ఈ.ఎస్.ఐ.సి. ఆస్పత్రులను 2,400 ఐసోలేషన్ పడకల సౌకర్యంతో కోవిడ్-19 చికిత్సకు అంకితమైన ఆసుపత్రులుగా మార్చడం జరిగింది : సంతోష్ గాంగ్వార్.
ఫరీదాబాద్‌లోని ఈ.ఎస్.ఐ.సి. వైద్య కళాశాల మరియు ఆసుపత్రుల్లో ప్లాస్మా బ్యాంకును వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించడం జరిగింది.
Posted On:
08 AUG 2020 5:32PM by PIB Hyderabad
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ (ఇంచార్జ్) సహాయ మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గాంగ్వార్ మరియు హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ నిన్న రాత్రి న్యూఢిల్లీ లోని హర్యానా భవన్ నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా హర్యానా, ఫరీదాబాద్ లోని ఈ.ఎస్.ఐ.సి. వైద్య కళాశాల మరియు ఆసుపత్రుల్లో నెలకొల్పిన ప్లాస్మా బ్యాంకును ప్రారంభించారు.
కోవిడ్-19 రోగులకు చికిత్స చేసే సందర్భంలో ప్లాస్మా బ్యాంక్ చాలా ముఖ్యమైన సౌకర్యం అని శ్రీ గాంగ్వార్ తన ప్రసంగంలో తెలియజేశారు.
కోవిడ్ సంక్షోభ పరిస్థితిలో, భారతదేశం అంతటా 21 ఈ.ఎస్.ఐ.సి. ఆస్పత్రులను కేవలం కోవిడ్-19 చికిత్సకు అంకితమైన ఆసుపత్రులుగా మార్చినట్లు శ్రీ గాంగ్వార్ తెలియజేశారు. ఈ ఆస్పత్రులలో 2,400 కి పైగా ఐసోలేషన్ పడకలు, 200 వెంటిలేటర్లతో 550 ఐ.సి.యు / హెచ్.డి.యు. పడకలు కూడా అందుబాటులో ఉంచబడ్డాయి. అల్వార్ (రాజస్థాన్), బిహ్తా, పాట్నా (బీహార్), గుల్బర్గా (కర్ణాటక) మరియు కోర్బా (ఛత్తీస్ గఢ్) లోని ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రులు సుమారు 1300 పడకల క్వారంటైన్ సౌకర్యంతో సేవలందిస్తున్నాయి. దీనితో పాటు, ఫరీదాబాద్ (హర్యానా), బసైదరాపూర్ (న్యూఢిల్లీ), హైదరాబాద్ లోని సనత్ నగర్ ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రుల్లో కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ పరీక్షా సౌకర్యం అందుబాటులో ఉంది. కోవిడ్-19 వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల చికిత్స కోసం ప్లాస్మా థెరపీ ని కూడా ఫరీదాబాద్ మరియు హైదరాబాద్ లోని సనత్ నగర్ ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచారు. కోవిడ్-19 ను ఎదుర్కోవడానికి తన మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ ఈ.ఎస్.ఐ.సి. చేస్తున్న కృషిని శ్రీ గాంగ్వార్ ప్రశంసించారు. భారతదేశంలో తమ సంస్థ ద్వారా బీమా చేసిన వ్యక్తులకు సామాజిక భద్రత కల్పించడానికి ఈ.ఎస్.ఐ.సి. ప్రారంభమైనప్పటి నుండి నిరంతరం సేవలందిస్తోందని ఆయన పేర్కొన్నారు. గత 67 సంవత్సరాల ప్రయాణంలో, ఈ రోజున, ఈ.ఎస్.ఐ.సి., దేశంలోని మొత్తం 722 జిల్లాలకు గాను, 566 జిల్లాలకు తన సేవలను విస్తరించింది. సుమారు 12 కోట్ల మంది లబ్ధిదారులు ఈ.ఎస్.ఐ. సౌకర్యాలను పొందుతున్నారు.
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోవిడ్ -19 మహమ్మారిని కట్టడి చేయడంలో, హర్యానా ప్రభుత్వ ప్రయత్నాల గురించి తెలియజేశారు. హర్యానాలో ప్లాస్మా థెరపీని మూడు వేర్వేరు ప్రదేశాలు, పంచకుల, రోహ్తక్ మరియు గురుగ్రామ్ లలో ప్లాస్మా థెరపీని ప్రారంభించినట్లు చెప్పారు. చివరగా, తన ప్రసంగాన్ని ముగిస్తూ, కోవిడ్ కోలుకున్న రోగులు ముందుకు వచ్చి ఇతరుల ప్రాణాలను కాపాడటానికి వీలుగా వారి ప్లాస్మాను దానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఫరీదాబాద్‌లోని ఈ.ఎస్.ఐ.సి వైద్య కళాశాల మరియు ఆసుపత్రి లో ఇమ్యునోహెమాటాలజీ (వ్యాథి నిరోధక శక్తిని ఉత్తేజపరచు పరిశీలనా విజ్ఞాన విభాగం) మరియు రక్త మార్పిడి విభాగం, 2020 మే 20వ తేదీన భారతీయ వైద్య పరిశోధనా మండలి అనుమతితో ప్లాసిడ్ ట్రయల్ కింద కన్వల్సెంట్ (కోలుకున్న వారి నుండి సేకరించిన) ప్లాస్మా థెరపీని ప్రారంభించింది. మొదటి ప్లాస్మాఫెరెసిస్ చికిత్స 2020 జూన్ 2వ తేదీన జరిగింది. ఈ రోజు వరకు 25 మందికి పైగా రోగులకు ఈ చికిత్సను అందించారు. అదే విధంగా, మొదటి ప్లాస్మా చికిత్స 2020 జూన్ 8వ తేదీన జరిగింది. ఇప్పటివరకు మొత్తం 35 మంది రోగులకు రక్తమార్పిడి చేశారు.
ఫరీదాబాద్ లోని ఈ.ఎస్.ఐ.సి. వైద్య కళాశాలకు చెందిన ఇమ్యునోహెమటాలజీ (వ్యాథి నిరోధక శక్తిని ఉత్తేజపరచు పరిశీలనా విజ్ఞాన విభాగం) మరియు రక్త మార్పిడి విభాగం, ఒకేసారి 400 యూనిట్ల నిల్వ సామర్థ్యంతో అవసరమైన అన్ని పరికరాలు మరియు సిబ్బందిని కలిగి ఉంది. ప్లాస్మాఫెరెసిస్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి చెల్లుబాటు అయ్యే లైసెన్సును కలిగి ఉంది. ఈ ఆసుపత్రిలో రోజుకు 30 ప్లాస్మాఫెరెసిస్ విధానాలను నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. కేవలం అఫెరెసిస్ (రోగి రక్తమును బయటికి తీసి సరిచేయు విధానం) కోసం మాత్రమే కేటాయించిన మూడు యంత్రాలు ఇప్పటికే 24 గంటలూ పనిచేస్తున్నాయి. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల దృష్ట్యా కన్వల్సెంట్ (కోలుకున్న వారినుండి సేకరించిన) ప్లాస్మా చాలా ముఖ్యమైనది.
హర్యానా, ఫరీదాబాద్ లోని ఈ.ఎస్.ఐ.సి. వైద్య కళాశాలకు చెందిన 540 ఐ.సి.యు. పడకల ఆసుపత్రిని కోవిడ్-19 రోగుల చికిత్స కోసం అంకితమైన ఆసుపత్రిగా మార్చారు. దీంతోపాటు, ఫరీదాబాద్ (హర్యానా) లోని ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రిలో, కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ పరీక్షా సౌకర్యం కూడా అందుబాటులో ఉంచబడింది. వైద్య కళాశాలలో అత్యాధునిక పరికరాలు, ఎయిర్ కండిషన్ తో ఉన్న తరగతి గదులు, ప్రయోగశాలలు మొదలైనవి ఉన్నాయి.
వైద్య కళాశాలతో అనుబంధించబడిన ఈ ఆసుపత్రి పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడి, ఇన్ పేషెంట్ మరియు అవుట్ పేషెంట్ విభాగాలతో పాటు వివిధ విభాగాల ద్వారా చికిత్సా సౌకర్యాలను అందిస్తోంది. ఈ ఆసుపత్రిలో ఓ.పి.డి., ఐ.పి.డి., వార్డులు, అత్యవసర, వ్యాధి నిర్ధారణ, శస్త్ర చికిత్స థియేటర్లు, ఐ.సి.యూ., సి.టి.స్కాన్., ఎం.ఆర్.ఐ. వంటి అనేక సేవలు, సౌకర్యాలను ఈ.ఎస్.ఐ.సి. ద్వారా బీమా చేసిన వ్యక్తులు మరియు వారిపై ఆధారపడిన వారికి కల్పిస్తారు. ఈ.ఎస్.ఐ. పధకం కింద బీమా చేసిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యుల ప్రయోజనం కోసమే, ఈ ఆసుపత్రి ప్రత్యేకంగా నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమంలో కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి శ్రీ హీరా లాల్ సమారియా, ఈ.ఎస్.ఐ.సి. డైరెక్టర్ జనరల్, శ్రీమతి అనురాధ ప్రసాద్ తో పాటు, ఎం.ఓ.ఎల్.ఈ., ఈ.ఎస్.ఐ.సి., మరియు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1644510)
Visitor Counter : 231