PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 04 AUG 2020 8:19PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో ప్రస్తుత కోవిడ్ కేసులకన్నా రెట్టింపు స్థాయికి పెరిగిన కోలుకునేవారి సంఖ్య
  • వ్యాధి నయమైనవారి సంఖ్య 12.3 లక్షలకుపైగా నమోదు; కోలుకునేవారి శాతం 66.31కి చేరిక.
  • మ‌ర‌ణాలు స్థిరంగా తగ్గుతూ మరింత కనిష్ఠంగా 2.1 శాతానికి ప‌త‌నం.
  • దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 6.6 లక్షలకుపైగా నమూనాల పరీక్ష
  • మొత్తం 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్ధారిత కేసులు 10 శాతంకన్నా తక్కువ.

దేశంలో ప్రస్తుత కోవిడ్ కేసులకన్నా రెట్టింపు స్థాయికి  కోలుకునేవారి సంఖ్య; వ్యాధి నయమైనవారు 12.3 లక్షలకుపైగానే; కోలుకునేవారి శాతం 66.31కి చేరిక; మ‌ర‌ణాలు 2.1 శాతానికి ప‌త‌నం

దేశంలో కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 12,30,509కి పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కేసులుకన్నా కోలుకున్న కేసుల సంఖ్య ఇవాళ రెట్టింపు స్థాయికి చేరింది. దీంతో కోలుకునేవారి జాతీయ సగటు 66.31 శాతానికి దూసుకెళ్లింది. మొత్తం కేసులలో ప్రస్తుత (5,86,298) కేసులు కేవలం 31.59 శాతం కాగా, వీరందరూ చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రపంచంలో అత్యల్ప మరణ శాతంగల దేశాల జాబితాలో ఒకటిగా భారత్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ మరింత కనిష్ఠ స్థాయికి తగ్గి 2.10 శాతానికి పతనమైంది. ప్రస్తుత గణాంకాలలో మరణాలపై విశ్లేషణ ప్రకారం 50 శాతం మరణాలు 60 ఏళ్లు అంతకుమించిన వయోవిభాగంలో సంభవించాయి. అలాగే 37 శాతం 45-60 ఏళ్ల విభాగంలో, 11 శాతం 26-44 ఏళ్ల విభాగంలో సంభవించినట్లు తేలింది. ఇక మృతులలో 68 శాతం పురుషులు కాగా, 32 శాతం మహిళలున్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643424

భారత్‌లో గత 24 గంటల్లో 6.6 లక్షలకుపైగా నమూనాల పరీక్ష; 28 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు రోజువారీ 140కిపైగా పరీక్షలు; నిర్ధారిత కేసులు 10 శాతంకన్నా తక్కువ

దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,61,892 నమూనాలను పరీక్షించారు. దీంతో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 2,08,64,750కి పెరిగింది. తదనుగుణంగా ప్ర‌తి 10 ల‌క్ష‌ల జ‌నాభాకు సగటు పరీక్షల సంఖ్య 15,119కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం సగటున రోజూ ప్రతి పది లక్షల జనాభాకు 479కిపైగా పరీక్షలు నిర్వహిస్తుండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మేరకు 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు ప‌రీక్షల సగటు 140గా నమోదువుతోంది. అలాగే వీటిద్వారా నిర్ధారణ అవుతున్న కేసులు కూడా 10 శాతంక‌న్నా తక్కువ‌గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని మరింత తగ్గించి 5 శాతానికి మెరుగుపరచే దిశగా కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిరంతర శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా రోజుకు 10 లక్షల పరీక్షల నిర్వహణ లక్ష్యంగా దేశంలో ప్రయోగశాలల సంఖ్యను పెంచుతున్నాయి. ఆ మేరకు నేడు ప్రభుత్వ రంగంలో 917, ప్రైవేటు రంగంలో 439 వంతున మొత్తం 1,356 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643359

అసోంలో 24 గంటల ప్రసారాల దూరదర్శన్‌ చానెల్‌ ప్రారంభం

అసోం రాష్ట్రానికి ప్రత్యేకంగా 24 గంటల ప్రసారాలు చేసే దూరదర్శన్‌ చానెల్‌ను కేంద్ర సమాచార-ప్రసారశాఖమంత్రి శ్రీ ప్రకాష్‌ జావడేకర్‌ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఇవాళ న్యూఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- “ఈ చానెల్‌ అసోం ప్రజలకు గొప్ప బహుమతి. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సమాచార అవసరాలను తీరుస్తూ విశేష ప్రజాదరణ చూరగొనగలదని నేను విశ్వసిస్తున్నాను” అని ప్రకటించారు. మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అమిత్‌ ఖారే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈశాన్య భారతానికి అసోం ముఖద్వారమైతే, ఆసియాన్‌ దేశాలకు ఈశాన్య భారతం ముఖద్వారం వంటిదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643358

భారత సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌; దరఖాస్తుల సమర్పణపై సమగ్ర సూచనలు జారీచేసిన సైనిక ప్రధాన కార్యాలయం

భారత సైన్యంలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం జారీచేసిన మంజూరు లేఖ సైనిక ప్రధాన కార్యాలయానికి అందింది. తదనుగుణంగా శాశ్వత కమిషన్‌కు మహిళా అధికారుల ఎంపిక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా 5వ నంబరు ఎంపిక బోర్డు ఏర్పాటుకు ఉన్నతాధికారులు ఉపక్రమించారు. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కోసం సమగ్ర సూచనలు జారీచేశారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అందిన తర్వాత బోర్డును తక్షణం సమావేశపరుస్తారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643365

ప్రాథమికోన్నత దశ కోసం ఎంహెచ్‌ఆర్‌డి మార్గదర్శకత్వంలో ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన 8 వారాల ప్రత్యామ్నాయ విద్యా కేలెండర్‌ను ఆవిష్కరించిన హెచ్‌ఆర్‌డి మంత్రి

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (MHRD) శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ప్రాథమికోన్నత దశ విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ విద్యా కేలండర్‌ను ఆవిష్కరించారు. మంత్రిత్వశాఖ మార్గదర్శకత్వాన జాతీయ విద్యా-పరిశోధన-శిక్షణ మండలి (NCERT) ఈ కేలండర్‌ను రూపొందించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- ఆన్‌లైన్ బోధన-అభ్యసన వనరుల వినియోగంద్వారా కోవిడ్-19 సవాలును ఎదుర్కోవడంలో సానుకూల మార్గాన్వేషణ దిశగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఈ కేలండర్‌ మరింత దన్నుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాథమిక దశకు ప్రత్యామ్నాయ కేలండర్‌ను విడుదల చేయగా, ప్రస్తుతం ప్రాథమికోన్నత దశ విద్యార్థుల కోసం 8 వారాల కేలండర్‌ను ఆవిష్కరించామని తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643308

దిగ్బంధం వేళ తూర్పు రైల్వేలో ఈ-వేలంద్వారా రూ.29 కోట్ల మేర రికార్డు స్థాయిలో తుక్కు అమ్మకం

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో దేశంలో దిగ్బంధం విధించడంవల్ల సర్వం స్తంభించిపోయింది. అందులో భాగంగా రైళ్లు పూర్తి సామర్థ్యంతో నడవక రైల్వేశాఖకూ ఆదాయార్జన తగ్గిపోయింది. అయితే, తూర్పు రైల్వే మాత్రం తన ప్రగతి రథచక్రాల పరుగు ఆగకుండా అప్రమత్తంగా వ్యవహరించింది. ఆ మేరకు దిగ్బంధం సమయంలో తూర్పు రైల్వే పరిధిలో మరమ్మతు చేసినా వినియోగానికి పనికిరాని తుక్కును ఎలక్ట్రానిక్‌ విధానంలో వేలం వేసి, ఏకంగా రూ.29 కోట్ల రికార్డుస్థాయి ఆదాయం సమకూర్చుకుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643219

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • మహారాష్ట్ర: ముంబైలో దిగ్బంధం నిబంధనలను గణనీయంగా సడలించిన నేపథ్యంలో బుధవారం నుంచి సరి-బేసి విధానంతో నిమిత్తం లేకుండా అన్ని దుకాణాలు తెరవవచ్చునని  గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. తదనుగుణంగా మాల్స్, మార్కెట్ ప్రదేశాలు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటలవరకు తెరచి ఉంచవచ్చునని పేర్కొంది. అయితే- థియేటర్లు, ఫుడ్ కోర్టులు/ రెస్టారెంట్లు మూసివేత కొనసాగనుంది. ముంబైలో కోవిడ్ వ్యాప్తి శాతం మందగించిన నేపథ్యంలో నగరం చాలా రోజులుగా కొత్త కేసులు 1,000కి లోపే నమోదవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో మొత్తం 1.47 లక్షల క్రియాశీల కేసులున్నాయి.
  • గుజరాత్: రాష్ట్రంలోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎఎంసి) సూక్ష్మ నియంత్రణ జోన్‌లో మరో నాలుగు ప్రాంతాలను చేర్చింది. తదనుగుణంగా ఇవాళ్టినుంచి ఈ ప్రాంతాల్లో ఇంటింటి నిఘా, పరీక్షలు ప్రారంభించారు. సామాజిక దూరం నిబంధనల ఉల్లంఘనపై ఏఎంసీ నగరంలోని ఆల్ఫా మాల్‌కు సీలువేసింది. గుజరాత్‌లో సోమవారం 1,009 కొత్త కేసులు నమోదవగా 974మంది కోలుకున్నారు. క్రియాశీల కేసులు 14,614గా ఉన్నాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో  1,145 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 45,555కు చేరాయి. అయితే, క్రియాశీల కేసుల సంఖ్య 12,785గా ఉంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 588 మంది అధికారులుసహా పోలీసు సిబ్బందికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. మరోవైపు ఇప్పటిదాకా 2 వేల మందిని నిర్బంధ వైద్య పరిశీలన కేంద్రాలకు పంపారు. రాష్ట్రంలో సోమవారం 750 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలోని అంబికాపూర్ వైద్య కళాశాలలో ఇవాళ ఆర్టీ-పీసీఆర్‌ ఆధారిత కోవిడ్ పరీక్షలను ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్, అంబికాపూర్, రాజ్‌నందగావ్‌లలోని వైద్య కళాశాలల్లో కొత్తగా నిర్మించిన ఉన్నతస్థాయి బిఎస్‌ఎల్-2 ల్యాబ్‌లో ఈ పరీక్షల నిర్వహణకు ఐసీఎంఆర్ ఇటీవలే అనుమతించింది. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 2,503 యాక్టివ్ కేసులున్నాయి.
  • కేరళ: రాష్ట్రంలోమరో మూడు మరణాలతో మృతుల సంఖ్య 87కి పెరిగింది. కోవిడ్ వ్యాప్తి నిరోధ బాధ్యతలను పోలీసు బలగాల అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆరోగ్యరంగంలోని పలు సంస్థలు వ్యతిరేకించాయి. కాగా, నిర్బంధ వైద్య పరిశీలన, కేసుల మూలం గుర్తింపు, నియంత్రణ జోన్లను కచ్చితంగా గుర్తించడం వంటి వ్యూహంద్వారా వ్యాధి వ్యాప్తి నిరోధంలో పోలీసులు దృష్టి సారిస్తారని కోవిడ్‌ నిరోధక చర్యల రాష్ట్రస్థాయి నోడల్ అధికారి విజయ్ సఖారే చెప్పారు. కాగా, కేరళలో నిన్న 962 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం రాష్ట్రంలో 11,484 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1.45 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: తమిళనాడులోని ఐఐటి-ఎం, హెల్త్‌కేర్ అంకుర సంస్థ సంయుక్తంగా కోవిడ్‌ రోగుల పర్యవేక్షణ కోసం ఒక పరికరాన్ని రూపొందించాయి. దీన్ని ఇప్పటికే నగరంలోని ఆసుపత్రులలో 2 వేలమంది రోగుల పర్యవేక్షణకు ఉపయోగిస్తున్నారు. నగరంలోని హోటళ్లలో 20 శాతం మాత్రమే వినియోగదారులను అనుమతించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్‌లో నిర్ధారిత కేసులు 8.39 శాతానికి పెరిగాయి. తీవ్ర ముప్పున్న ప్రాంతాల్లో కేసులు అకస్మాత్తుగా పెరగడమే ఇందుకు కారణమని ఆరోగ్య శాఖ పేర్కొంది. తమిళనాడులో నిన్న 5609 కొత్త కేసులు, 109 మరణాలు నమోదవగా 5800 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 2,63,222; క్రియాశీల కేసులు: 56,698; మరణాలు: 4241గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రికి కోవిడ్‌ నిర్ధారణ అయిన నేపథ్యంలో తాజాగా మాజీ సీఎం సిద్దరామయ్య కూడా వైరస్‌ బారినపడ్డారు. ఇక కర్ణాటకలో కోర్టులలో సాధారణ కార్యకలాపాల పునరుద్ధరణ ఇప్పట్లో కష్టమేనని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోని వ్యక్తులకు వైద్య సేవలు నిరాకరిస్తారో/లేదో స్పష్టం చేయాలని సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరింది. కాగా, చురుకైన కోవిడ్ కేసుల సంఖ్యరీత్యా కర్ణాటక జాతీయ స్థాయిలో మూడవ స్థానానికి దిగివచ్చింది. రాష్ట్రంలో కోలుకునేవారి శాతం 42.81 నుంచి ఇప్పుడు 44.78కి పెరిగింది. రాష్ట్రంలో నిన్న 4752 కొత్త కేసులు, 98 మరణాలు నమోదవగా 4776 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 1,39,571; క్రియాశీలం: 74,469; మరణాలు: 2594గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని కరోనా బాధితుల కుటుంబాలకు సహాయంపై ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. దీని ప్రకారం వైరస్‌ బారినపడి మరణించినవారి అంత్యక్రియల కోసం వారి కుటుంబానికి రూ.15వేలు అందజేస్తారు. అలాగే కోవిడ్‌ నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసేవారికి రూ.5 వేలు ఇవ్వాలని అందులో కలెక్టర్లను ఆదేశించింది. కరోనావైరస్ నియంత్రణలో సమర్థ చర్యలు తీసుకున్నందుకు అనంతపూర్ జిల్లా కలెక్టర్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కాగా, రాష్ట్రంలో నిన్న 7822 కేసులు, 63 మరణాలు నమోదవగా 5786 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 1,66,586; క్రియాశీల కేసులు: 76,377; మరణాలు: 1537గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), హైదరాబాద్ మొత్తం 400 కరోనావైరస్‌ జన్యుక్రమాలను నమోదుచేసి, వాటిని ‘సార్స్‌-సీవోవీ-2 (SARS-CoV-2) ప్రపంచ డేటాబేస్‌కు సమర్పించింది. ఈ మేరకు GISAID డేటాబేస్‌కు భారత్‌ నుంచి అందిన 2,000 జన్యుక్రమాలలో అధికశాతం CCMB నుంచి వెళ్లినవే కావడం విశేషం. కాగా, గత 24 గంటల్లో రాష్ట్రంలో 1286 కొత్త కేసులు, 12 మరణాలు నమోదవగా 1066 మంది కోలుకున్నారు; కొత్త కేసులలో 391 జీహెచ్‌ఎంసీనుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 68,946; క్రియాశీల కేసులు: 18,708; మరణాలు: 563; డిశ్చార్జి: 49,765గా ఉన్నాయి.
  • మణిపూర్: రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ కిప్జెన్ నేమ్చా కాంగ్పోక్పిలోని లైకోప్‌లోగల డిఈఈటి సెంటర్లో జిల్లా కోవిడ్ రక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కరోనా యోధులకు వ్యాధి సంక్రమణ నిరోధానికి వైద్యులు, నర్సులు, ఇతర సహాయక సిబ్బందితోసహా ఆరోగ్య కార్యకర్తలందరికీ పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు, ముఖ కవచాలు, చేతి తొడుగులు, హస్త పరిశుభ్రకాలు అందించినట్లు మణిపూర్‌లోని జెనిమ్స్ హాస్పిటల్ అథారిటీ తెలిపింది.
  • మిజోరం: రాష్ట్రంలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 'తెన్జాల్ గోల్ఫ్ రిసార్ట్'ను గౌరవనీయులైన పర్యాటకశాఖ (ఇన్‌చార్జి) మంత్రి  శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇవాళ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ప్రారంభించారు. ‘స్వదేశ్ దర్శన్‌’ పథకం కింద ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు.
  • నాగాలాండ్: నాగాలాండ్‌లో 276 కొత్త కేసులు  నిర్ధారణ కాగా, వీటిలో 187 మంది దిమాపూర్ నుంచి, 89 సోమ నుంచి నమోదయ్యాయి.
  • సిక్కిం: రాష్ట్రంలో ఇవాళ 95 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 761కి చేరగా, ఒక్కరు మరణించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 473 కాగా, సిక్కింలో ఇప్పటిదాకా 28,089 నమూనాలను పరీక్షించారు.
    • ImageImage

 

***



(Release ID: 1643430) Visitor Counter : 283