సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అస్సాంకు 24/7 దూరదర్శన్ ఛానల్
ఈ ఛానల్ అస్సాం ప్రజలకు ఒక బహుమతి : శ్రీ ప్రకాశ్ జవదేకర్
డిడి అస్సాం, రాష్ట్ర విద్యాభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడనుంది : శ్రీ అమిత్ ఖరే
Posted On:
04 AUG 2020 2:52PM by PIB Hyderabad
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జవదేకర్, అస్సాం రాష్ట్రానికి ప్రత్యేకంగా 24 గంటల దూరదర్శన్ ఛానల్‌ను ఈరోజు న్యూఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ , “ ఈ ఛానల్ అస్సాం ప్రజలకు ఒక బహుమతి. ఈ ఛానల్ అస్సాంలోని అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీరుస్తుంది. బహుళ ప్రచారం పొందుతుంది” అని ఆయన అన్నారు.
అన్ని రాష్ట్రాలు స్వంతంగా దూరదర్శన్ చానళ్లు కలిగి ఉండడం ముఖ్యమని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల చానళ్ళు డిడి ఫ్రీ డిష్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. దూరదర్శన్ ఆరు జాతీయ ఛానళ్లలో వచ్చే కార్యక్రమాలను మంత్రి కొనియాడారు. ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశ అభివృద్ధి ఇంజిన్‌గా మార్చాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ఆయన పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతాంలొ పుష్కలంగా సహజ వనరులు, మానవ వనరులు ఉన్నాయని, అనుసంధానత క్రమంగా పెరుగుతున్నదని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం, ఈశాన్య రాష్ట్రాలపై ఇంతకు ముందెన్నడూ లేని విధంగా దృష్టిపెట్టడంలో భాగమే అస్సాంలో దూరదర్శన్ ఛానల్ అని ఆయన అన్నారు.
అస్సాం ముఖ్యమంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్, అస్సాం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు అస్సాం ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు అని ఆయన అన్నారు. “ఈ ఛానల్, అస్సాం ప్రగతిని అన్నిరంగాలలో మరింత ముందుకు తీసుకువెళుతుంది, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలను అట్టడుగు స్థాయి వరకు ఇది తీసుకువెళ్లగలదు” అని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషిని శ్రీ సోనోవాల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.“ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొదటి రోజు నుంచీ ఈశాన్య రాష్ట్రాలకు గల శక్తి సామర్ధ్యాలు, అవకాశాల విషయంపై దృష్టి పెడుతూ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా”రని అన్నారు.
అస్సాం గవర్నర్ ప్రొఫెసర్ జగదీశ్ ముఖి, వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతూ,“ అస్సాంలో ఉన్న మా అందరికీ ఎంతో సంతోష సమయం ఇది. డిడి అస్సాం ను ప్రారంభించడంతో పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ ఖాతాలో మరో ఛానల్ వచ్చి చేరింది” అని ఆయన అన్నారు. గౌహతి దూరదర్శన్ కేంద్ర పై ప్రశంసలు కురిపిస్తూ ప్రొఫెసర్ ముఖి, దీని అవిశ్రాంత కృషి వల్ల అస్సాం కు చెందిన ప్రత్యేక , అత్యద్భుత , సుసంపన్నమైన సంస్కృతికి దేశ వ్యాప్తంగా ఆదరణ లభించిందని చెప్పారు.
సమాచార ప్రసారశాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే , న్యూఢిల్లీలోని దూరదర్శన్ కేంద్రం నుంచి మాట్లాడుతూ, గత ఏడాది ప్రధానమంత్రి డిడి అరుణ్ ప్రభ ను ప్రారంభించినప్పటినుంచి , డిడి నార్త్ ఈస్ట్‌ను ప్రత్యేకంగా అస్సాం కోసం కొత్త ఛానల్‌గా మార్చడంపై చర్చిస్తూ వచ్చిందని చెప్పారు. అస్సాం , ఈశాన్య రాష్ట్రాలకు గేట్‌వే అని అలాగే, ఏసియాన్ దేశాలకూ ఇది గేట్ వే అని అన్నారు. ఏసియాన్ కు అస్సాం రాష్ట్రం ఒక గొప్ప అనుసంధానంగా ఉండగలదని అన్నారు. “డిడి అస్సాం ఈ ప్రాంతంలోని ప్రతిభకు ఒక వేదికగా నిలిచి, మిగిలిన దేశం మొత్తాన్ని ఈశాన్యానికి సన్నిహితం చేయగలదని , ఈశాన్య రాష్ట్రాల ప్రతిభను దేశం మొత్తానికి చేరవేయగలద”ని ఆయన అన్నారు.
”
“ ఇతర ప్రాంతీయ ఛానళ్ల మాదిరే, అస్సాం రాష్ట్ర విద్యాభివృద్ధికి డిడి అస్సాం పెద్ద ఎత్తున కృషి చేయగలదు. వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ భాషలలో ఆన్‌లైన్ విద్యను అందించే కృషిలో డిడి అస్సాం మరో మైలు రాయి కాగలదు.” అని ఆయన అన్నారు.
ప్రసార భారతి సిఇఒ శ్రీ శశి శేఖర్ వెంపటి మాట్లాడుతూ, డిడి అస్సాం ను ప్రారంభించడంతో , ఈశాన్యరాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలకు రాష్ట్రానికి ప్రత్యేకంగా ఛానల్ ఏర్పడినట్టయిందని, తొలి సారిగా ఈశాన్య రాష్ట్ర గొప్ప వైవిధ్యాన్ని శాటిలైట్ లింక్ వల్ల దేశంలోని ఎక్కడి నుంచైనా డిడి ఫ్రీ డిష్ ప్లాట్ ఫాం నుంచి చూడవచ్చని ఆయన అన్నారు.
నేపథ్యం:
డిడినార్త్ ఈస్ట్ ఛానల్‌ను 01-11-1990న ఈశాన్యంలోని 8 రాష్ట్రాలకు 24x7 ఉమ్మడి ఛానల్‌గా పనులు మొదలు పెట్టారు. 15-08-1994న దీనిని ప్రారంభించారు. 27-2-2000 సంవత్సరంలో 24 గంటల ఛానల్‌గా మార్చారు.
డిడి అరుణ్ ప్రభ ఛానల్‌ను అరుణాచల్ ప్రదేశ్‌లో ఆ తర్వాత ప్రారంభించారు. దీనిని ఇటా నగర్ నుంచి ప్రసారం చేస్తున్నారు. డిడి అరుణ్ ప్రభ చానల్ ను ప్రధానమంత్రి 09-02-2019న ప్రారంభించారు.
ఆ తర్వాత, ప్రసారభారతి , ఈశాన్య రాష్ట్రాల రాజధానుల నుంచి ప్రసారమౌతున్న, పరిమిత గంటల ప్రసారాలు కలిగిన ఇతర ఛానళ్ళు అన్నింటినీ డిడి ఫ్రీ డిష్‌లో పెట్టి జాతీయ అనుసంధానత కల్పించాలని నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన డిడి మేఘాలయ, డిడి మిజోరం, డిడిత్రిపుర, డిడి మణిపుర్, డిడి నాగాలాండ్,లు దూరదర్శన్ కేంద్ర షిల్లాంగ్,ఐజ్వాల్,అగర్తల, ఇంఫాల్, కోహిమ, లనుంచి వరుసగా ప్రసారమౌతూ వచ్చాయి. వీటిని 2019 మార్చి 9 నుంచి డిడి ఫ్రీ డిస్ (డిటిహెచ్)ప్లాట్‌ఫాంపై ఉంచడం జరిగింది.
అయితే ఆతర్వాత, డిడి నార్త్ ఈస్ట్ ఛానల్‌ను అస్సాంకు ప్రత్యేక ఛానల్‌గా మార్చాలనుకున్నారు.దీనిని 24X7 ఛానల్‌గా దూరదర్శన్ కేంద్ర , గౌహతి నుంచి ప్రసారం చేస్తారు. దీనిని అస్సాం ప్రజలు, అస్సాం సంస్కృతికి అంకితం చేశారు. ఇందులో 6 గంటల పాటు తాజా అస్సామీ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే బోడో వంటి భాషలకు ప్రత్యేకంగా సమయం కేటాయించారు. డిడి అస్సాం ప్రయోగాత్మక ట్రాన్స్‌మిషన్ 2019 డిసెంబర్ 1న ప్రారంభమైంది.
ప్రస్తుత కోవిడ్ 19 సంక్షోభం సందర్భంగా, తాత్కాలికచర్యగా ఈశాన్య రాష్ట్రాలనుంచి వచ్చే ఛానళ్లను 24 గంటలూ అప్‌లింక్ చేస్తున్నారు. 2020 ఏప్రిల్ నుంచి డిడి నాగాలాండ్, డిడి త్రిపుర, డిడి మణిపూర్, డిడి మేఘాలయ, డిడి మిజోరం లను తాత్కాలికంగా పరిమిత ప్రసార ఛానళ్ల నుంచి 27x7 ఛానళ్లుగా మార్చారు. ఇందుకు డిడి న్యూస్, డిడి ఇండియా స్ట్రీమ్‌లను వాడుకున్నారు. ఆయా కేంద్రాలలోని పరిమిత వనరుల కారణంగా వీటిని వాడుకున్నారు. దీనివల్ల ఏఛానల్ కూడా కార్యక్రమాలు ప్రసారం కాకుండా ఉండే పరిస్థితి లేదు. మామూలుగా నిర్ణీత వేళల్లో స్థానిక వార్తలు, స్థానిక కార్యక్రమాలు ప్రసారం చేసి మిగిలిన సమయంలో జాతీయ వార్తలు ప్రసారం చేస్తూ వచ్చారు.
డిడి అస్సాం ఛానల్‌పై ఆకర్షణీయ కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు కృషి జరుగుతోంది.ఇందులో మెగా సీరియళ్లు, మ్యూజిక్ కార్యక్రమాలు, యాత్రా స్మృతులు, రియాలిటీ షోలు, ఫీచర్ ఫిల్మ్లులు తదితరాలు ఉండనున్నాయి. ఈ కార్యక్రమాలలో ఆ ప్రాంత సంస్కృతిని ప్రముఖంగా చూపుతారు. అలాగే అక్కడి వంటలు, వస్త్రాలు, జానపద సంస్కృతి, గిరిజన జీవితాల వంటివి ఈ కార్యక్రమాలలో ఉండేట్టు చూస్తారు.
***
(Release ID: 1643358)
Visitor Counter : 337
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam