PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
03 AUG 2020 6:37PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- కోవిడ్ నిర్ధారణ పరీక్షల నిర్వహణలో 2 కోట్లకుపైగా మైలురాయిని అధిగమించిన భారత్; ప్రతి 10 లక్షల జనాభాకు సగటు పరీక్షల సంఖ్య 14,640కి చేరిక.
- ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన టీకాపై పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో 2, 3 దశల ప్రయోగ పరీక్షలకు డీజీసీఐ అనుమతి.
- మరణాలు స్థిరంగా తగ్గుతూ మరింత కనిష్ఠంగా 2.11 శాతానికి పతనం.
- ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య సుమారు 11.8 లక్షలకుపైగా నమోదు.


ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ టీకాపై పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో 2, 3 దశల ప్రయోగ పరీక్షలకు డీసీజీఐ అనుమతి; మరణాలు మరింతగా 2.11 శాతానికి పతనం; మొత్తం కోలుకున్నవారి సంఖ్య 11.8 లక్షలకుపైగా నమోదు
కోవిడ్-19 నిర్మూలన దిశగా ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం-ఆస్ట్రా జెనెకా సంస్థ సంయుక్తంగా రూపొందిస్తున్న టీకా (కోవిషీల్డ్-COVISHIELD)పై భారతదేశంలో ప్రయోగ పరీక్షల నిర్వహణకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతించింది. ఈ మేరకు పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో 2, 3 దశల ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో కరోనా వైరస్ నిరోధానికి వాక్సిన్ వీలైనంత త్వరగా రూపొందే అవకాశం ఉంటుంది. కాగా, భారత్‌లో నమోదయ్యే కేసులలో మరణాల సంఖ్య స్థిరంగా తగ్గుతోంది. ఆ మేరకు ప్రపంచంలో అత్యల్ప మరణ శాతంగల దేశాల జాబితాలో ఒకటిగా కొనసాగుతోంది. తదనుగుణంగా ఇవాళ మరణాల సగటు మరింత కనిష్ఠంగా 2.11 శాతానికి పతనమైంది. గత 24 గంటల్లో 40,574 మందికి వ్యాధి నయంకాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి మొత్తం సంఖ్య 11,86,203కు పెరిగి, కోలుకుంటున్నవారి జాతీయ సగటు 65.77 శాతానికి పెరిగింది. రోజువారీగా కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ చికిత్సలోగల, కోలుకుంటున్న కేసుల మధ్య అంతరం బాగా పెరిగి ప్రస్తుతం 6,06,846కు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 5,79,357గా ఉంది. వీరందరూ ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలోనేగాక ఏకాంత గృహవాసంలో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643155
కోవిడ్ నిర్ధారణ పరీక్షల నిర్వహణలో 2 కోట్లకుపైగా మైలురాయిని అధిగమించిన భారత్; ప్రతి 10 లక్షల జనాభాకు సగటు పరీక్షల సంఖ్య 14,640కి చేరిక
కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల నిర్వహణలో భారత్ 2 కోట్ల మైలురాయిని అధిగమించింది. ఈ మేరకు ఇప్పటిదాకా 2,02,02,858 నమూనాలను పరీక్షించింది. ఇక గత 24 గంటల్లో 3,81,027 పరీక్షలు నిర్వహించగా, ప్రతి 10 లక్షల జనాభాకు సగటు పరీక్షల సంఖ్య 14,640కి పెరిగింది. అలాగే దేశంలో ప్రయోగశాలల స్థిరంగా పెరుగుతూ 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షలు జాతీయ సగటుకన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 914, ప్రైవేటు రంగంలో 434 వంతున మొత్తం 1,348 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643171
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అత్యవసర రోగనిరోధక సేవలకు ఎలక్ట్రానిక్ టీకా నిఘా నెట్‌వర్క్ (eVIN) భరోసా
దేశవ్యాప్తంగా రోగనిరోధకత సరఫరా గొలుసు వ్యవస్థలను బలోపేతానికి వినూత్న సాంకేతిక పరిష్కారం కింద ఎలక్ట్రానిక్ టీకా నిఘా నెట్‌వర్క్ (eVIN) ఉద్దేశించబడింది. జాతీయ ఆరోగ్య కార్యక్రమం (NHM) కింద కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ దీన్ని అమలు చేస్తోంది. దేశంలోని శీతల కేంద్రాలలో నిల్వలు, సరఫరా, నిల్వ శీతోష్ణగ్రత తదితరాల నిజ-సమయ సమాచారాన్ని అందించడమే ఈ-విన్ లక్ష్యం. ఈ నేపథ్యంలో కోవిడ్ మహమ్మారి విజృంభించిన వేళ అవసరమైన మేరకు రోగనిరోధకత సేవలు కొనసాగిస్తూ టీకాలతో నివారించగల వ్యాధులనుంచి గర్భిణులు, తల్లులు, పిల్లల రక్షణకు తగురీతిలో ఈ బలమైన వ్యవస్థ ఉపయోగించబడింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, బలమైన ఐటి మౌలిక సదుపాయాలతోపాటు సుశిక్షిత మానవ వనరుల ద్వారా దేశవ్యాప్తంగాగల వ్యాక్సిన్ల నిల్వ, నిల్వ ఉష్ణోగ్రతలపై నిజ-సమయ పర్యవేక్షణకు ఈ-విన్ తోడ్పడుతుంది. ఈ మేరకు దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరింది. త్వరలో మిగిలిన రాష్ట్రాలతోపాటు అండమాన్-నికోబార్ దీవులు, చండీగఢ్, లదాఖ్, సిక్కింలలోనూ అమలు కానుంది. ప్రస్తుతం, 22 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోగల 585 జిల్లాల్లోని 23,507 శీతల కేంద్రాలు టీకాల సరఫరా-నిర్వహణలో ఈ-విన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్నాయి. ఈ-విన్‌లో భాగంగా డిజిటల్ రికార్డుల నిర్వహణలో తగిన శిక్షణతో టీకాల శీతల సరఫరా గొలుసు సజావుగా పనిచేయడం కోసం 41,420కి పైగా నిర్వహణ ఏజెన్సీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిల్వలో టీకాల కచ్చితమైన ఉష్ణోగ్రత సమీక్ష కోసం టీకా శీతల పరికరాలపై సమీక్షకు దాదాపు 23,900 ఎలక్ట్రానిక్ ఉష్ణోగ్రత లాగర్లు ఏర్పాటు చేయబడ్డాయి.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643223
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- పంజాబ్: రాష్ట్రంలో గర్భిణులకు కరోనా వైరస్ నుంచి రక్షణ దిశగా వారికి దూరవైద్య (టెలి-మెడిసిన్) సేవలందించడంలో 70 మంది మహిళారోగ్యం నిపుణులకు రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక శిక్షణనిచ్చింది. అంతేకాకుండా కోవిడ్-19 నిర్ధారణ అయిన గర్భిణులకు ప్రసూతి సేవలు అందించడం కోసం అన్ని జిల్లా ఆస్పత్రులలో ప్రత్యేక గదులు ఏర్పాటు చేయబడ్డాయి.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో దిగ్బంధం నిబంధన సడలింపు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదల కనిపిస్తోంది. ముంబై శివారులోని థానె, రాయ్‌గడ్ వంటి నగరాల సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా నాసిక్, ఔరంగాబాద్, ధూలే, సాంగ్లివంటి జిల్లాల పరిధిలోగల గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఆదివారం 9,509 కొత్త కేసులు నమోదవగా, 9,926 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో చురుకైన కేసుల సంఖ్య 1,48,537 కాగా, కోలుకునేవారి సంఖ్య పెరుగుతుండటంతో జనం భయం వదిలి పెద్దసంఖ్యలో రోగ నిర్ధారణ పరీక్షల కోసం ముందుకొస్తున్నారు.
- గుజరాత్: రాష్ట్రంలో ఆదివారం 805 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో మొత్తం 46,587 మందికి వ్యాధి నయం కాగా, కోలుకునేవారి సగటు 73.16 శాతానికి పెరిగింది. ఇక సూరత్‌లో 209, అహ్మదాబాద్‌లో 143సహా గుజరాత్‌లో 1,101 కొత్త కేసుల నమోదుతో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 63,675కు చేరింది. ప్రస్తుతం 14,601మంది ఆస్పత్రులలో చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఆదివారం 12 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 706కు చేరింది. మరోవైపు ఈ ఉదయానికి 565 కొత్త కేసులతో మొత్తం కేసులు 44,975కు పెరిగాయి. వీటిలో 12,488 యాక్టివ్ కేసులు కాగా, ఇప్పటిదాకా మొత్తం 29,697 మంది కోలుకున్నారు.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఆదివారం 921కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 33,535కు చేరాయి. రాష్ట్ర ఆరోగ్య సమాచారపత్రం ప్రకారం- 581 మంది కోలుకోగా, ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 23,550కి చేరింది. ప్రస్తుతం 9,099 క్రియాశీల కేసులకు చికిత్స జరుగుతుండగా, ఇప్పటిదాకా 886 మరణాలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 3,246 యాక్టివ్ నియంత్రణ మండళ్లు కొనసాగుతున్నాయి.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాధి సోకినప్పటికీ లక్షణరహిత/స్వల్ప లక్షణాలుగల రోగుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 18,598 పడకలతో 157 కోవిడ్ రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే పడకల సంఖ్యను 25వేలకు పెంచడానికి ఏర్పాట్లు చేస్తోంది. కాగా, రాష్ట్రంలో ఇప్పుడు 2,482 క్రియాశీల కేసులున్నాయి.
- గోవా: గోవాలో ఆదివారం 337 కొత్త కేసులతో ఒకేరోజు అత్యధిక కేసుల రికార్డు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,530కి చేరగా, తాజాగా ఐదుగురి మరణంతో మృతుల సంఖ్య 53కు పెరిగింది. మరోవైపు క్లిష్ట పరిస్థితిలో ఉన్న రోగులకు ప్లాస్మా చికిత్స ప్రక్రియను గోవా ప్రభుత్వం ప్రారంభించింది.
- మణిపూర్: మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.బీరెన్ సింగ్ ఇవాళ లంబిఖోంగ్నాంగ్ఖోంగ్ లోని మణిపూర్ ట్రేడ్ అండ్ ఎక్స్ పో సెంటర్లో 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. అవసరమైతే ఈ సదుపాయాన్ని 1000 పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించే వీలుంది.
- మిజోరం: రాష్ట్రంలో ఇవాళ 8 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 482 కాగా, వాటిలో 216 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటిదాకా 266 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
- నాగాలాండ్: రాష్ట్రంలో ఇవాళ నమోదైన 194 కేసులకుగాను దిమాపూర్ 136, జున్హెబోటో 36, కొహిమాలో 22 వంతున నమోదయ్యాయి. నాగాలాండ్‌లో పరిచయాలవల్ల సోకిన కేసుల అన్వేషణ ముమ్మరం చేసిన నేపథ్యంలో అన్ని ప్రాథమిక పరిచయాలను కనుగొనగా వారంతా ప్రస్తుతం స్వీయ ఏకాంత చికిత్స పొందుతున్నారు.
- కేరళ: రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తికి నిర్లక్ష్యం, అలసత్వమే కారణమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. కోవిడ్ విధివిధానాల అమలులో రాజీ, అజాగ్రత్త ఫలితంగా ప్రస్తుత దుస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 102 కుటుంబ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఇకపై ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిమీద కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కేరళలో ఇవాళ మూడు మరణాల నమోదుతో మృతుల సంఖ్య 85కి చేరంది. రాష్ట్రంలో కోవిడ్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిన్న 1169 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, 11 రోజుల్లో 10,788 మందికి ఈ వ్యాధి సంక్రమించింది. వీరిలో 991 మందికి పరిచయాలవల్ల వ్యాధి సంక్రమించగా 56 కేసుల మూలం తెలియరాలేదు. ప్రస్తుతం 11,342 మంది చికిత్స పొందుతుండగా 1.45 లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 178 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3982కు, మరణాలు 56కు పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1515గా ఉంది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు సోమవారంనుంచి ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ కోసం గ్రేడ్-I కళాశాలకు కేటాయించిన తరహాలోనే గ్రేడ్-II కళాశాలలకూ నిధులు ఇవ్వాలని అధ్యాపకులు ఉన్నత విద్యాశాఖను కోరారు. నాగపట్టణం స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీపీఎం ఎంపీ ఎం.సెల్వరసుకు నిన్న కోవిడ్-19 నిర్ధారణ అయిన నేపథ్యంలో తాజాగా శివగంగ ఎంపీ కార్తీ పి.చిదంబరం కూడా వైరస్ బారినపడినట్లు సోమవారం తేలింది. చెన్నై పొరుగు జిల్లాల్లో చెంగల్పట్టు 446, కాంచీపురం 393, తిరువళ్లూరు 317 వంతున కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 5875 కొత్త కేసులు, 98 మరణాలు నమోదవగా ప్రస్తుతం మొత్తం కేసులు: 2,57,613; క్రియాశీల కేసులు: 56,998; మరణాలు: 4132గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రి నివేదికల ప్రకారం ప్రస్తుతం ఆయన ‘ఆరోగ్యం నిలకడ’గా ఉంది. రాష్ట్రంలోని కోవిడ్ సంరక్షణ కేంద్రాల్లో 10 రోజులుగా పడకల వినియోగం 60-65 శాతంకాగా, అటువంటి సౌకర్యాల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇక ఆదివారం బెంగళూరు నగరంలో నమోదైన కొత్త కేసులకన్నా కోలుకున్నవారి సంఖ్య అధికంగా నమోదైంది. ఈ మేరకు నగరంలో 2105 కొత్త కేసులు నిర్ధారణ కాగా, 2331 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 5532 కొత్త కేసులు, 84 మరణాలు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం మొత్తం కేసులు: 1,34,819; క్రియాశీల కేసులు: 74,590; మరణాలు: 2496గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఆదివారం నాటికి కోవిడ్ కేసులు 7500స్థాయిని దాటాయి. దీంతో నేటినుంచి వారంపాటు మచిలీపట్నంలో సంపూర్ణ దిగ్బంధం విధించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రి విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో సిబ్బంది కొరత ముఖ్యంగా, నర్సుల కొరత తీవ్రంగా ఉన్నందున రోగులు దుస్థితిలో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాలలో వీడియోలు ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని షిఫ్టులకూ కలిపి 100మంది నర్సులను నియమించినట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతోపాటు ఒక రోజులోగా 213మంది నర్సుల నియామకం పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలో నిన్న 8555 కొత్త కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులు: 1,58,764; క్రియాశీల కేసులు: 74,404; మరణాలు: 1474గా ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ సమాచారం పత్రం ప్రకారం- ప్రభుత్వ, ప్రైవేట్ బోధన ఆసుపత్రులు, తెలంగాణలోని కార్పొరేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 రోగులకు పడకల కొరత లేదు. ఈ మేరకు 14,571 పడకలు అందుబాటులో ఉండగా వీటిలో 5936 పడకలు ప్రభుత్వ ఆసుపత్రులలో సిద్ధంగా ఉన్నాయి. గత 24 గంటల్లో 983 కొత్త కేసులు, 11 మరణాలు నమోదవగా 1019మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. కొత్త కేసులలో 273 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 67,660; క్రియాశీల కేసులు: 18,500; మరణాలు: 551; డిశ్చార్జి అయినవి: 48,609గా ఉన్నాయి.
****
(Release ID: 1643239)
|