PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 01 AUG 2020 6:36PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దిగ్బంధం తొలిద‌శ త‌ర్వాత కోవిడ్ మ‌ర‌ణాలు కనిష్ఠంగా 2.15 శాతానికి ప‌త‌నం
  • మొత్తం కోలుకున్నవారు దాదాపు 11 లక్షలు; గత 24 గంటల్లో 36,500 మందికి వ్యాధి నయం.
  • భారత్‌లో కోవిడ్‌ నుంచి కోలుకునేవారి జాతీయ సగటు 64.53 శాతంగా నమోదు.
  • ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,65,103.
  • వెంటిలేటర్ల ఎగుమతికి అనుమతించాలని నిర్ణయించిన ప్రభుత్వం.
  • జూలై నెలలో వస్తుసేవల పన్ను స్థూల వసూళ్లు రూ.87,422 కోట్లు.

దిగ్బంధం తొలిద‌శ త‌ర్వాత కోవిడ్ మ‌ర‌ణాలు కనిష్ఠంగా 2.15 శాతానికి ప‌త‌నం; మొత్తం కోలుకున్నవారు దాదాపు 11 లక్షలు; గత 24 గంటల్లో 36,500 మందికి వ్యాధి నయం

దేశంలో కోవిడ్‌-19 మ‌ర‌ణాల సగటు ఇవాళ 2.15 శాతానికి పతనమైన నేపథ్యంలో దిగ్బంధం తొలిద‌శ మొదలైనప్పటినుంచి ఇదే అత్యల్పం. జూన్ మధ్యలో ఇది 3.33 శాతం కాగా, కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతున్న కార‌ణంగా క్రమంగా తగ్గుతూ వచ్చింది. నివారణ చర్యలు సమర్థంగా అమలు చేయడం, ముమ్మర పరీక్షల నిర్వహణ, రోగుల గుర్తింపు, సత్వరం చికిత్సకు తరలింపు వ్యూహం అనుసరించడంతోపాటు చికిత్స ప్రమాణాలు పాటించడంవల్ల రోజూ సగటున 30,000 మందికిపైగా  కోలుకుంటున్నారు. ఆ మేరకు కోలుకుంటున్నవారి సంఖ్య దాదాపు 11లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 36,569 మందికి వ్యాధి న‌య‌మైన నేప‌థ్యంలో ఇప్ప‌టిదాకా కోలుకున్నవారి సంఖ్య 10,94,374కు పెరిగింది. దీంతో కోలుకునేవారి జాతీయ స‌గ‌టు 64.53కు చేరింది. త‌ద‌నుగుణంగా కోలుకున్నవారికీ, ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న‌వారి మ‌ధ్య అంత‌రం 5,29,271కి పెరిగింది. ప్ర‌స్తుతం 5,65,103 మంది చురుకైన వైద్య  పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇక దేశ‌వ్యాప్తంగా 1488 కోవిడ్ ప్ర‌త్యేక ఆస్పత్రులు, 3231 కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు, 10,755 కోవిడ్ రక్షణ కేంద్రాలు కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో తోడ్పడుతున్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642871

డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అధ్య‌క్ష‌త‌న‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యవర్గ మండలి బ్యూరో స‌మావేశం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కార్యవర్గ మండలి బ్యూరో సమావేశానికి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- “ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు నెలల కిందట కోవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. నాటినుంచి   దాదాపు 1.70 కోట్ల మంది వైరస్ బారినపడగా 6.62 లక్షల మందికిపైగా తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు. వ్రపంచ ఆర్థికవ్యవస్థకూ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది” అన్నారు. అలాగే “ఆరోగ్యానికిగల ప్రాముఖ్యాన్ని ప్రపంచం ఇప్పుడు అర్థం చేసుకున్న నేపథ్యంలో  అసంఖ్యాక అంటువ్యాధులు, ఇతర వ్యాధుల వ్యాప్తివల్ల ఎదురయ్యే ముప్పును, దుష్ప్రభావాలను ఎదుర్కొనడానికి వివిధ దేశాలమధ్య మరింత సహకారం అవసరం” అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642707

కోవిడ్‌ మరణాల శాతం తగ్గడంతో వెంటిలేటర్ల ఎగుమతికి నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

భారత్‌లో తయారైన వెంటిలేటర్ల ఎగుమతికి అనుమతించాలన్న కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనకు కోవిడ్‌-19పై మంత్రుల బృందం (GoM) ఆమోదం తెలిపింది. తదనుగుణంగా దేశీయ వెంటిలేటర్ల ఎగుమతి సౌలభ్యం దిశగా తగు చర్యలకోసం ఈ నిర్ణయాన్ని విదేశీవాణిజ్య డైరెక్టర్ జనరల్ (DGFT) కు సమాచారం పంపబడింది. దేశంలో మరణాల శాతం క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 2.15 శాతానికి పతనమైన నేపథ్యంలో వెంటిలేటర్లపైగల కేసుల సంఖ్య తక్కువగా ఉన్నందున మంత్రుల బృందం ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642942

జూలై నెలలో వస్తుసేవల పన్ను స్థూల వసూళ్లు రూ.87,422 కోట్లు

దేశవ్యాప్తంగా 2020 జూలై నెలలో వస్తుసేవల పన్ను (GST) వసూళ్లు రూ.87,422 కోట్లుగా నమోదైంది. ఇందులో కేంద్ర జీఎస్టీ (CGST) రూ. 16,147 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ  (SGST) రూ. 21,418 కోట్లు, సమీకృత జీఎస్టీ (IGST) రూ. 42,592 కోట్లుగా ఉంది. అలాగే సుంకం కింద రూ.7,265 కోట్ల రాబడి వచ్చింది. నిరుడు ఇదే నెలలో జీఎస్టీ వసూళ్ల రాబడితో పోలిస్తే ఇది 86 శాతంగా ఉంది. కాగా, ఈ నెలతో పోలిస్తే గతనెలలో జీఎస్టీ వసూళ్లు అధికంగా ఉండటం గమనార్హం. అయితే, కోవిడ్‌-19 కారణంగా వెసులుబాటు ఇచ్చినందున పన్ను చెల్లింపుదారులలో అధికశాతం 2020 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల సంబంధిత పన్నును కూడా జూన్‌ నెలలో చెల్లించడమే ఇందుకు కారణం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642944

మరో 4 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ‘ఒకే దేశం-ఒకే కార్డు’ పథకం విస్తరణ

'ఒకే దేశం-ఒకే కార్డు' పథకంలో మరో నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కూడా చేరాయి. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌సహా మణిపూర్‌, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను పథకంలో చేర్చేదిశగా కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహార-ప్రజా పంపిణీ శాఖ చర్యలు చేపట్టింది. దేశంలోని 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకంలో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల చేరికతో ఈ సంఖ్య ఆగస్టు 1నాటికి 24 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయికి చేరింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642863

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో అధిక దిగుబడులు, ఖరీఫ్ సాగు కార్యకలాపాలపై శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ సంతృప్తి

దేశాన్ని ఎలాంటి సంక్షోభం నుంచయినా గట్టెక్కించగల సామర్థ్యం వ్యవసాయం, గ్రామీణ రంగాలకు ఉందని కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. కరోనావైరస్ మహమ్మారి ఒకవైపు సవాళ్లు విసురుతున్నప్పటికీ దేశంలో అధిక వ్యవసాయ దిగబడులు నమోదు కావడం హర్షణీయమన్నారు. అలాగే ఖరీఫ్ పంటల సాగు నిరాటంకంగా కొనసాగడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశిత స్వయం సమృద్ధ భారతం లక్ష్యసాధన దిశగా భవిష్యత్తులోనూ గ్రామీణ భారతం, రైతులోకం ప్రధాన పాత్ర పోషించగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642867

‘ఖాదీ’ సిల్క్‌ మాస్క్‌ గిఫ్ట్‌ బాక్స్‌ను ప్రారంభించిన శ్రీ నితిన్‌ గడ్కరీ

మీరిప్పుడు ప్రత్యేకమైన ఖాదీ సిల్క్‌ మాస్కు పెట్టెను మీ బంధుమిత్రులకు బహూకరించవచ్చు. ఈ మేరకు ఖాదీ-గ్రామీణ పరిశ్రమల సంస్థ (KVIC) రూపొందించిన ఈ ‘గిఫ్ట్‌ బాక్సు’ను కేంద్ర సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ నిన్న ప్రారంభించారు. ఈ పెట్టెలో హస్తకళా కౌశలంతో రూపొందించిన విభిన్న రంగులు, చిత్రాలతో కూడిన నాలుగు సిల్కు మాస్కులుంటాయి. వీటికోసం బంగారు అంచుతో అందమైన నల్లని కాగితపు పెట్టెను కూడా తయారుచేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642882

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: కోవిడ్‌ సోకిన వ్యక్తులను ముందుగానే గుర్తిస్తే సకాలంలో చికిత్సకు తరలించే వీలుంటుందని ఈ కేంద్రపాలిత పాలనాధికారి అన్నారు. ఈ మేరకు అధికారులు తమ కృషిని ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇలాంటి కేసులను గుర్తించేందుకు స్వచ్ఛంద కార్యకర్తలతోపాటు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల సహాయం తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు కరోనా వైరస్‌ వాహకులుగా ఉండే అవకాశం ఉందిగనుక వారిపై పర్యవేక్షణను మరింత పటిష్ఠంగా అమలుచేయాలని డీజీపీకి సూచించారు.
  • పంజాబ్: కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల రోగనిరోధకత పెంచేందుకు ‘మిల్క్‌ఫెడ్‌’ రూపొందించిన పోషక పానీయం వర్కా హల్దీ దూద్‌’ను పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆవిష్కరించారు. కరోనావైరస్‌పై పోరాటంలో భాగంగా ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలో ఈ పానీయం త్వరలోనే విశేష ప్రజాదరణ పొందగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
  • మహారాష్ట్ర: కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో ప్రత్యేక మురికివాడల పునరావాస పథకం రూపకల్పన దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం యోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహమ్మారి వ్యాప్తి నియంత్రణలో మురికివాడలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా నిలిచాయి. కాగా, ధారవిలో జూలై 1 రోజువారీ కొత్త కేసులు 531 కాగా, జూలై 31న కేవలం 77కు పరిమితం కావడంతో కోవిడ్‌-19పై పోరాటం కొత్త మలుపు తిరిగింది. ఇక మహారాష్ట్రలో మొత్తం 4,22,118 కేసులు నమోదవగా, శుక్రవారంనాటికి యాక్టివ్‌ కేసుల 1,50,662గా ఉంది.
  • గుజరాత్: రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కోవిడ్-19 నిర్వహణ తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఈ మేరకు నగరంలో అమలు చేసిన ధన్వంతరి రథం, 104 జ్వరాల సహాయకేంద్రం, సంజీవని వ్యాన్ వంటి చర్యలను ఆదర్శంగా తీసుకుని భారత్‌లోని ఇతర రాష్ట్రాలతోపాటు ప్రపంచ దేశాలు కూడా ఇలాంటి ప్రయత్నం చేయాలని సూచించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. కాగా గుజరాత్‌లో శనివారం 1,153 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • రాజస్థాన్: దిగ్బంధ విముక్తి-3 మార్గదర్శకాల మేరకు అంతర్రాష్ట్ర ప్రయాణంతోపాటు రాష్ట్రంలో వ్యక్తుల ప్రయాణం, సరుకుల రవాణాపై ఆంక్షలను రాజస్థాన్‌  ప్రభుత్వం ఆంక్షలు తొలగించింది. దీంతోపాటు రాత్రివేళ కర్ఫ్యూను కూడా రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని ప్రైవేటు ప్రయోగశాలల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్ష రుసుమును రాష్ట్ర ప్రభుత్వం రూ.1,980గా నిర్ణయించింది. కాగా, మార్చి 17 నాటి ఐసీఎంఆర్‌ సూచనల మేరకు ఇంతకుముందు రూ.4,500 వంతున నిర్ణయించడం గమనార్హం. అయితే దేశీయంగా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష కిట్లు తయారవుతుండటంతో నిర్ధారణ పరీక్ష ధరను ప్రభుత్వం రూ.1,980కి తగ్గించింది. నమూనా సేకరణ, ప్యాకింగ్‌, నివేదిక తదితరాలన్నిటికీ కలిపి ఇంతకన్నా ఎక్కువ వసూలు చేయరాదని స్పష్టం చేసింది.
  • గోవా: గోవాలో శుక్రవారం 209 తాజా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 5,913కు చేరింది. వీటిలో 1,657 క్రియాశీల కేసులుకాగా, ఇప్పటిదాకా 4,211 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 45గా ఉంది.
  • కేరళ: రాష్ట్రంలో తాజాగా ఐదు కోవిడ్‌ మరణాలు నమోదవగా వీరిలో కోట్టయంలోని వైద్యకళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. కేరళలో కోవిడ్‌తో మరణించిన తొలి పోలీసు ఉద్యోగి ఈయనే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో 50 ఏళ్లు పైబడిన, ఇతర వ్యాధులున్న పోలీసు అధికారులను కోవిడ్ విధుల్లో నియమించవద్దని డీజీపీ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 88మంది పోలీసు అధికారులు కోవిడ్-19 బారినపడ్డారు. కాగా, రోగకారక నిర్మూలన, పరిశుభ్రం చేయడం కోసం తిరువనంతపురంలోని పోలీసు ప్రధాన కార్యాలయాన్ని రెండు రోజులు మూసివేశారు. కేరళలో నిన్న 1310 కేసులు నమోదవగా వీటిలో 1162 పరిచయాలవల్ల సంక్రమించాయి. రాష్ట్రవ్యాప్తంగా 10,495 మంది చికిత్స పొందుతుండగా 1.43 లక్షలమంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇవాళ మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 51కి పెరిగింది. ఇక 139 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1,357కు పెరగ్గా క్రియాశీల కేసులు 3,593గా ఉన్నాయి. ఇక తమిళనాడులో జూలై 29 వరకు సంభవించిన కోవిడ్ మరణాల్లో 82 శాతం ఇతర అనారోగ్యాలున్నవారు కాగా, మధుమేహం-అధిక రక్తపోటుగల వారు 33.36 శాతంగా ఉన్నట్లు లెక్కలు తేల్చాయి. తమిళనాడులో శుక్రవారం 5,881 తాజా కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 2,45,859కి చేరింది. వీటిలో 57,968 క్రియాశీల కేసులు. ఇక నిన్న 97 మంది మరణించడంతో మృతుల సంఖ్య 3935కు పెరిగింది.
  • కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్‌ బాధితులకు 50 శాతం పడకలను కేటాయించని కారణంగా విపత్తు నిర్వహణ చట్టం కింద బీబీఎంపీ 4 ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. కాగా, కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి, ఆయన భార్యతోపాటు అల్లుడికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. బెంగళూరు నగరంలోని కె.ఆర్.మార్కెట్‌ మూసివేత ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో నిన్న 5483 కొత్త కేసులు, 84 మరణాలు నమోదవగా 3130 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో బెంగళూరు నగరంలోనే 2220 ఉండగా ప్రస్తుతం మొత్తం కేసులు: 1,24,115; క్రియాశీల కేసులు: 72,005; మరణాలు: 2314; డిశ్చార్జి అయినవి: 49,788గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: కేంద్రం జారీచేసిన దిగ్బంధ విముక్తి 3వ దశ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రయాణికుల రాకపోకలను ప్రభుత్వం మరింత సడలించింది. అయితే, రాష్ట్రంలో ప్రవేశించే ముందు ప్రయాణికులు ‘స్పందన’ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా స్వయం చలితంగా రూపొందే ఇ-పాస్ వారి మొబైల్‌ ఫోన్‌తోపాటు ఈ-ఇమెయిల్‌కు పంపబడుతుంది. కాగా, రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాల రావు ఇవాళ విజయవాడలో కోవిడ్‌ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కొన్ని వారాలుగా చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఇక గుంటూరులోని మంగళగిరి పట్టణంలోగల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇవాళ్టినుంచి ఆరు రోజులపాటు భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఆలయ సిబ్బంది కోవిడ్-19 బారిన పడటమే ఇందుకు కారణం. రాష్ట్రంలో నిన్న 10,376 కొత్త కేసులు, 68 మరణాలు నమోదవగా 3822 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,40,933; క్రియాశీల కేసులు: 75,720; మరణాలు: 1349గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్-19తో మరణించినవారిలో దాదాపు సగం మంది ఇతర వ్యాధులు లేనివారేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. కాగా, ఆగస్టు 5నాటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కరోనావైరస్‌ అంశంతోపాటు విద్యా రంగంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. కాగా, గత 24 గంటల్లో 2083 కొత్త కేసులు, 11 మరణాలు నమోదవగా 1114 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 578 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 64,786; క్రియాశీల కేసులు: 17,754; మరణాలు: 530; డిశ్చార్జి అయినవి: 46,502గా ఉన్నాయి.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 107 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 670కి చేరింది. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పటిదాకా మొత్తం 1,591 కేసులు నమోదవగా 918 మంది కోలుకున్నారు. కేవలం ముగ్గురు మాత్రమే మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 81,865 మందికి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
  • అసోం: గువహటిలో జూలై 1న కోవిడ్‌-19 రోజువారీ పరీక్షల సంఖ్య 2112 కాగా, నెలాఖరు (31) నాటికి 6240కి పెరిగింది. ఇక జూలై 4వ తేదీన ఈ నగరంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 777కాగా జూలై 31నాటికి 281కి తగ్గింది.
  • మణిపూర్: రాష్ట్రంలో 6వ కోవిడ్ మరణం నమోదు కాగా, ఈ వ్యక్తి మధుమేహంతోపాటు హెపటైటిస్‌ వ్యాధిలో బాధపడుతుండటంతో ఆస్పత్రిలో చేర్చారు.
  • మిజోరం: రాష్ట్రంలో అసోం రైఫిల్స్‌కు చెందిన సెర్చిప్ బెటాలియన్, జాల్సీ గ్రామంలో కోవిడ్‌-19పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా 42మంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా సామాజిక దూరం, హస్త పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో 552 నమూనాలను పరీక్షించగా 130 మందికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. వీటిలో అత్యధికంగా దిమాపూర్‌లో 109, కొహిమాలో 21 వంతున నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు ఇప్పుడు 1823కు పెరిగాయి.
  • సిక్కిం: రాష్ట్రంలో ఇవాళ 11 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 400 స్థాయికి చేరింది. 
  • ImageImage

 

*******



(Release ID: 1643044) Visitor Counter : 210