ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మరణాల రేటు తగ్గుదల నేపథ్యంలో వెంటిలేటర్ల ఎగుమతులను అనుమతించాలని కేంద్రం నిర్ణయం

Posted On: 01 AUG 2020 4:53PM by PIB Hyderabad

భారత్‌లో తయారైన వెంటిలేటర్ల ఎగుమతులను అనుమతించాలన్న 'కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ' ప్రతిపాదనను కొవిడ్‌పై నియమించిన 'మంత్రుల బృందం' (జీవోఎం) అంగీకరించింది. వెంటిలేటర్ల ఎగుమతులకు సంబంధించిన మరిన్ని చర్యలు తీసుకోవడానికి, 'డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌' (డీజీఎఫ్‌టీ)కు ఈ నిర్ణయాన్ని పంపారు.

    దేశంలో కొవిడ్‌-19 రోగుల మరణాల శాతం రోజురోజుకు తగ్గుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ మరణాల శాతం 2.15 శాతంగా ఉంది. వెంటిలేటర్లపై ఉన్న రోగుల సంఖ్య అతి తక్కువగా ఉందని దీని అర్ధం. జులై 31 నాటికి, దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్‌ కేసుల్లో కేవలం 0.22 శాతం మంది మాత్రమే వెంటిలేటర్లపై ఉన్నారు. దీనికితోడు, దేశీయంగా వెంటిలేటర్ల ఉత్పత్తి స్థిరంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే, వెంటిలేటర్‌ ఉత్పత్తి సంస్థలు ప్రస్తుతం 20కి పైగా ఉన్నాయి. 

    దేశంలో వెంటిలేటర్ల అందుబాటును పెంచడానికి, ఈ ఏడాది మార్చిలో వాటి ఎగుమతులపై నిషేధం విధించారు. డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్‌ నం.53 ప్రకారం, 24.03.2020 నుంచి అన్ని రకాల వెంటిలేటర్ల ఎగుమతులు నిషేధం. ఇప్పుడు ఎగుమతులకు అనుమతి లభించడంతో, భారత వెంటిలేటర్లు విదేశాల్లో కొత్త మార్కెట్లను వెతుక్కుంటాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.


(Release ID: 1642942) Visitor Counter : 251