ప్రధాన మంత్రి కార్యాలయం

మారిష‌స్ నూత‌న సుప్రీంకోర్టు భ‌వ‌న ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగానికి తెలుగు అనువాదం.

Posted On: 30 JUL 2020 1:16PM by PIB Hyderabad

రిప‌బ్లిక్ ఆఫ్ మారిష‌స్  ప్ర‌ధాన‌మంత్రి, గౌర‌వ‌నీయులు ప్ర‌వింద్ కుమార్ జుగ‌నౌత్ జీ, సీనియ‌ర్ మంత్రులు, మారిష‌స్ కు చెందిన ఇత‌ర ప్ర‌ముఖులు, విశిష్ట అతిథుల‌కు , న‌మ‌స్కారం, శుభోద‌యం.

మీ అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. ముందుగా , మారిష‌స్ ప్ర‌భుత్వం, ప్ర‌జ‌లు కోవిడ్ -19 మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్నందుకు మీకు అభినంద‌న‌లు.స‌కాలంలో మందులు పంపించ‌చ‌డం, త‌న అనుభ‌వాల‌ను పంచుకోవ‌డం వంటి వాటి ద్వారా ఇండియా ఈ కృషికి మ‌ద్ద‌తు తెలప‌గ‌లిగినందుకు నాకు సంతోషంగా ఉంది.

మిత్రులారా, ఇవాళ మ‌నం ఇండియా - మారిష‌స్ ల‌మ‌ధ్య ప్ర‌త్యేక స్నేహంలో మ‌రో మైలురాయివంటి కీల‌క ఉత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాం.పోర్టు లూయిస్ లోని సుప్రీం కోర్టు భ‌వ‌నం, మ‌న మధ్య‌స‌హ‌కారానికి, మ‌న ఉమ్మ‌డి విలువ‌ల‌కు గుర్తుగా ఉంటుంది.ఇండియా, మారిష‌స్ లు త‌మ ప్ర‌జాస్వామిక వ్య‌వ‌స్థ‌ల ప్ర‌ధాన స్థంభాలుగా, స్వ‌తంత్ర న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల‌ను గౌర‌విస్తాయి. అద్భుత‌మైన ఈ నూత‌న భ‌వ‌నం దీని ఆధునిక డిజైన్‌, నిర్మాణం ఈ గౌర‌వానికి సూచిక‌గా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్ణీత స‌మ‌యంలో, ముందు అంచ‌నా వేసిన ఖ‌ర్చు ప‌రిమితిలోనే పూర్తి అయినందుకు సంతోషంగా ఉంది.
ప్ర‌ధాన‌మంత్రి జుగ‌నౌత్‌జీ, కొద్ది నెల‌ల క్రిత‌మే మ‌నం, ప్ర‌తిష్ఠాత్మ‌క మెట్రో ప్రాజెక్టును , అత్య‌ధునాత‌న ఆస్ప‌త్రిని సంయుక్తంగా  ప్రారంభించాం. ఈ రెండు ప్రాజెక్టులూ  మారిష‌స్ ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉన్నాయ‌ని తెల‌సి సంతోషంగా ఉంది.
మిత్రులారా, భార‌త‌దేశ, సాగ‌ర్ (ఎస్‌.ఎ.జి.ఎ.ఆర్‌)- సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫ‌ర్ ఆల్ ఇన్ ద రీజియ‌న్ గురించి నేను మొద‌టి సారిగా మారిష‌స్ లోనే మాట్లాడాను. ఎందుకంటే, హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతంలో భార‌త విధానానికి మారిష‌స్ కీల‌కంగా ఉంది. ఇవాళ‌, అభివృద్ధి భాగ‌స్వామ్యంలోనూ విధానంలోనూ భార‌త్ హృద‌య‌స్థానంలో ఉంది .
మిత్రులారా, మ‌హాత్మాగాంధీ ఒక మాట‌ చాలా చ‌క్క‌గా చెప్పారు. దానిని నేను ఇక్క‌డ ప్ర‌స్తావిస్తాను :  నేను కూడా మొత్తం ప్ర‌పంచం దృష్టిలో నుంచి ఆలోచించాల‌నుకుంటున్నాను. నా దేశ‌భ‌క్తిఅంటే, మొత్తంగా మాన‌వాళికి మంచి జ‌ర‌గ‌డం కూడా. అందువ‌ల్ల నేను భార‌త‌దేశానికి సేవ‌చేయ‌డ‌మంటే, మాన‌వాళికిసేవ చేయ‌డం కూడా. ఇది భార‌తదేశానికి దిశానిర్దేశం చేసే తాత్విక‌త‌. భార‌త‌దేశం అభివృద్ధి చెందాల‌ని అనుకుంటోంది. అలాగే ఇత‌రుల‌కు ,వారి అభివృద్ది అవ‌స‌రాల‌లో స‌హాయ‌ప‌డాల‌ని ఇండియా భావిస్తున్న‌ది.
మిత్రులారా,  భార‌త‌దేశ అభివృద్ధి విధానం ప్ర‌ధానంగా మాన‌వీయ కేంద్రిత‌మైన‌ది. మేం మాన‌వాళి సంక్షేమానికి పాటుప‌డాల‌ని అనుకుంటున్నాం. అభివృద్ధి భాగ‌స్వామ్యం పేరుతో, దేశాలు బ‌ల‌వంతంగా ఇత‌రుల‌పై ఆధార‌ప‌డే భాగ‌స్వామ్యంలోకి వెళ్ళిపొవ‌డం మ‌న‌కు చ‌రిత్ర తెలియ‌జేసింది. ఇది మ‌న‌కు వ‌ల‌స‌, సామ్రాజ్య‌వాద పాల‌న‌నిచ్చింది.ఇది అంత‌ర్జాతీయంగా ప‌వ‌ర్ బ్లాక్ లు ఏర్ప‌డ‌డానికి కార‌ణ‌మైంది. అంతిమంగా మాన‌వీయ‌త దెబ్బ‌తినింది.‌
మిత్రులారా, ఇండియా వైవిధ్యం, గౌర‌వంతో కూడిన అభివృద్ధి భాగ‌స్వామ్యాల‌ను అనుస‌రిస్తున్న‌ది.భ‌విష్య‌త్తు ప‌ట్ల , సుస్థిరాభివృద్ధి ప‌ట్ల శ్ర‌ద్ధ క‌లిగిఉంది.
 మిత్రులారా, భార‌త‌దేశానికి, అభివృద్ధి స‌హ‌కారంలో అత్యంత ప్ర‌ధాన‌మైన సూత్రం , మ‌న భాగ‌స్వాముల‌ను గౌర‌వించ‌డం. అభివృద్ధి పాఠాల ఈ భాగస్వామ్యం మా ఏకైక ప్రేరణ. అందువ‌ల్ల మ‌న అభివృద్ధి స‌హ‌కారం ఎలాంటి ష‌ర‌తుల‌తో రాలేదు. ఇది రాజ‌కీయ లేదా వాణిజ్య ప‌ర‌మైన
అంశాల  ద్వారా ఎన్న‌టికీ ప్రభావితం కాదు.
మిత్రులారా,
భార‌త‌దేశ అభివృద్ధి భాగ‌స్వామ్యాలు వైవిధ్యంతో కూడుకున్న‌వి. ఇవి వాణిజ్యం నుంచి సాంస్కృతికం వ‌ర‌కు, ఇంధ‌నం నుంచి ఇంజ‌నీరింగ్ వ‌ర‌కు, ఆరోగ్యం నుంచి గృహ‌నిర్మాణం వ‌ర‌కు, ఐటి నుంచి మౌలిక స‌దుపాయాల వ‌ర‌కు  , క్రీడ‌ల‌నుంచి శాస్త్ర‌విజ్ఞానం వ‌ర‌కు, ఇండియా  ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ది.ఆఫ్ఘ‌నిస్థాన్ లోని పార్లమెంటు భవనం నిర్మాణంలో సహాయం చేసినందుకు భారతదేశం గౌరవించబడిన‌ట్టే. నిజర్ లో మహాత్మా గాంధీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతో సంబంధం కలిగి ఉండటం కూడా మాకు  గర్వంగా ఉంది.  అత్య‌వ‌స‌ర ట్రామా ఆస్ప‌త్రి నిర్మాణం ద్వారా నేపాల్‌ ఆరోగ్య సేవ‌లు మెరుగు ప‌ర‌చుకోవ‌డానికి స‌హాయం చేసినందుకు మాకు ఆనందంగా ఉంది. శ్రీ‌లంక‌లోని మొత్తం 9 ప్రావిన్సుల‌న్నింటా అత్య‌వ‌స‌ర అంబులెన్సు సేవ‌లు క‌ల్పించేందుకు శ్రీ‌లంక కృషికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం మాకు సంతోషంగా ఉంది.
  నేపాల్ తో మేము చేప‌ట్టిన చ‌మురు పైప్ లైన్ ప్రాజెక్టు పెట్రోలియం ఉత్ప‌త్తుల అందుబాటుకు స‌హాయ‌ప‌డుతుంద‌ని తెలియ‌జేయ‌డానికి సంతోషిస్తున్నాను. అలాగే, మాల్దీవుల‌కు చెందిన 34 దీవుల‌కు మంచినీరు అందుబాటులోకి తేవ‌డం, పారి‌శుధ్యానికి  మావంతు సాయం చేయ‌డం మాకు ఆనందంగా ఉంది.ఆఫ్ఘ‌నిస్థాన్‌, గుయానాల‌లో క్రికెట్‌ను పాపుల‌ర్ చేయ‌డానికి మేం అక్క‌డ స్టేడియంల నిర్మాణం , ఇత‌ర స‌దుపాయాలు క‌ల్పించ‌డానికి ప్ర‌య‌త్నించాం.
ఇండియాలో శిక్ష‌ణ పొందిన యువ ఆఫ్ఘ‌న్ క్రికెట్ టీమ్ బ‌ల‌మైన జ‌ట్టుగా ఎద‌గ‌డం చూసి మేము సంతోషిస్తున్నాము. మేం ఇప్పుడు , మాల్దీవుల క్రికెట్ క్రీడాకారుల ప్ర‌తిభ‌కు ప‌దును పెట్ట‌డానికి అలాంటి మ‌ద్ద‌తునే అందిస్తున్నాము. శ్రీ‌లంక‌లో ప్ర‌ధాన గృహ నిర్మాణ ప్రాజెక్టులో ఇండియా ముందుభాగాన ఉండ‌డం గ‌ర్వ‌కార‌ణంగా భావిస్తున్నాం. మా అభివృద్ది భాగ‌స్వామ్యం, మా భాగ‌స్వామ్య దేశాల అభివృద్ధి ప్రాధాన్య‌త‌ల‌ను ప్ర‌తిబింబిస్తుంది.
మిత్రులారా,  ఇండియా ప్ర‌స్తుతం వ‌ర్త‌మానానికి స‌హ‌క‌రించినందుకు మాత్ర‌మే గ‌ర్వించ‌డంలేదు. మీ యువ‌త‌కు మంచి భ‌విష్య‌త్తు ను క‌ల్పించేందుకు స‌హాయం చేయ‌డం మా బాధ్య‌త‌గా మేం భావిస్తాం.
అందుకే శిక్ష‌ణ‌,నైపుణ్యాలు మా అభివృద్ధి స‌హ‌కారంలో అత్యంత కీల‌క‌మైన‌వి. ఇవి మా భాగ‌స్వామ్య దేశంలోని యువ‌త‌ను స్వావ‌లంబ‌కులుగా తీర్చిదిద్దుతాయి. ఆ ర‌కంగా భవిష్యత్తును ఉన్న‌త శిఖ‌రాల‌కు నడిపించడానికి  వారు మరింత విశ్వాసం క‌లిగి ఉంటారు.
 మిత్రులారా, భ‌విష్య‌త్తు సుస్థిరాభివృద్ధిది. మాన‌వ అవ‌స‌రాలు, ఆకాంక్ష‌లు మ‌న స‌హ‌జ ప‌రిస‌రాల‌తో విభేదించేవిగా ఉండ‌రాదు.అందుకే మేం మాన‌వ సాధికార‌త‌, ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల శ్ర‌ద్ధ క‌లిగి ఉంటాం. ఈ తాత్విక‌త ఆధారంగా , ఇండియా అంత‌ర్జాతీయ సౌర కూట‌మి వంటి కొత్త సంస్థ‌ల ఏర్పాటుకు కృషి చేసింది. మాన‌వ ప్ర‌గ‌తి ప్ర‌స్థానాన్ని సూర్యకిర‌ణాలు ప్రకాశమానం చేయుగాక‌. అలాగే విప‌త్తుల‌నుంచి త‌ట్టుకునే బ‌ల‌మైన మౌలిక స‌దుపాయాల‌పై కూడా మేం గ‌ట్టిగా ప‌నిచేస్తున్నాం. ఈ రెండూ, దీవులైన‌ దేశాల‌కు ప్ర‌త్యేకంగా ప‌నికివ‌చ్చేవి. ఈ కృషికి ప్ర‌పంచ దేశాలు క‌లిసి వ‌స్తున్న తీరు సంతోషం క‌లిగిస్తున్న‌ది.
మిత్రులారా, నేను ప్ర‌స్తావించిన ఈ విలువ‌ల‌న్నీ, మారిష‌స్‌తో మా ప్ర‌త్యేక బంధంలో ఒక్క‌టిగా క‌లిసి ఉన్నాయి.మేం హిందూ మ‌హాస‌ముద్ర జ‌లాల‌ను మాత్ర‌మే కాదు బంధుత్వం, సంస్కృతి , భాషల‌ సాధారణ వారసత్వాన్ని కూడా పంచుకుంటున్నాము. మా స్నేహానికి బ‌లం గతం నుంచి వ‌చ్చిన‌ది. అది భ‌విష్య‌త్ దిశ‌గా చూస్తున్న‌ది. మారిష‌స్ ప్ర‌జ‌ల విజ‌యాల‌ను భార‌త‌దేశం గ‌ర్వంగా భావిస్తుంది. ఆప్ర‌వాసి ఘాట్  ప‌విత్ర స‌న్న‌ని మెట్ల దారుల నుంచి, ఆధునిక మారిష‌స్ నిర్మాణం వ‌ర‌కు మారిష‌స్ విజ‌యాలు క‌ష్ట‌ప‌డ‌డం ద్వారా ఆవిష్క‌ర‌ణ‌ల‌ద్వారా సాధించిన‌ది. మారిష‌స్ స్ఫూర్తి ఎంతో ప్రేర‌ణాత్మ‌కం. మ‌న భాగ‌స్వామ్యం రాగల సంవ‌త్స‌రాల‌లో మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర‌గ‌ల‌దు.

विव लामिते एंत्र लांद ए मोरीस  

भारत और मॉरिशस मैत्री अमर रहे।

ఇండియా- మారిష‌స్ స్నేహం చిర‌కాలం వ‌ర్ధిల్లుగాక‌
ధ‌న్య‌వాదాలు.

***


(Release ID: 1642331) Visitor Counter : 259