వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

నేటి నుంచి అమలులోకి వినియోగదారుల రక్షణ చట్టం, 2019
కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ ఏర్పాటు

ఈ కామర్స్ వేదికల అనుచిత వాణిజ్య విధానాల నిరోధం

వినియోగదారుల వివాదాల పరిష్కారం మరింత సులభం: మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్

Posted On: 20 JUL 2020 4:53PM by PIB Hyderabad

వినియోగదారుల రక్షణ చట్టం,2019 ఈరోజు ( 2020 జులై 20) నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం గురించి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖామంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం వలన వినియోగదారుడు మరింత బలవంతుడవుతాడన్నారు. వినియోగదారుల రక్షణ మండలులు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు, మధ్యవర్తిత్వం, ఉత్పత్తి బాధ్యత, తయారీదారులకు శిక్షలు, కల్తీ వస్తువుల అమ్మకం లాంటి విషయాలలో అనేక నిబంధనలు ఈ చట్టంలో పొందుపరచామన్నారు.

ఈ చట్టం కింద కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ ఏర్పాటవుతుందని, ఇది వినియోగదారుల హక్కులను కాపాడటానికి, అమలు చేయటానికి పనిచేస్తుందని చెప్పారు. హక్కుల ఉల్లంఘన జరిగినా, అనుచిత వ్యాపార విధానాలు అవలంబించినట్టు తెలిసినా, తప్పుదారి పట్టించే ప్రకటనలు వెలువరించినా దర్యాప్తు జరిపి ఆ తయారీదారులు, లేదా అమ్మకం దారులు లేదా ప్రకటనల ప్రచురణ.ప్రసార కర్తలమీద జరిమానాలు విధిస్తుందన్నారు. ఈ-కామర్స్ వేదికలు అనుచిత వ్యాపార విధానాలు అవలంబించకుండా అడ్డుకోవటానికి కూడా చట్టంలో నిబంధనలున్నాయని పాశ్వాన్ చెప్పారు. ఈ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు త్వరలో గెజెట్ నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు.

ఈ-కామర్స్ వేదికలు ఆ వస్తువును తిరిగి తీసుకోవటం, డబ్బు తిరిగి ఇవ్వటం, వస్తువు మార్చటం, వారంటీ, గ్యారెంటీ, వస్తువు అందజేయటం, రవాణా చెల్లింపు విధానం, ఫిర్యాదుల పరిష్కారం, చెల్లించిన డబ్బుకు రక్షణ, వస్తువు పంపుతున్న మూలదేశం తదితర వివరాలు కచ్చితంగా తెలియజేయటం ద్వారా కొనుగోలు దారు కొనటానికి ముందుగా తగిన నిర్ణయం తీసుకోవటానికి వీలు కల్పించవలసి ఉంటుంది. వినియోగదారుడు చేసిన ఫిర్యాదును ఈ-కామర్స్ వేదికలు నలభై ఎనిమిది గంటల్లోగా స్వీకరించి అది అందిన నెలరోజుల్లోగా పరిష్కరించి తీరాలని కొత్త చట్టం చెబుతోంది. ఉత్పత్తి బాధ్యత అనే సరికొత్త భావనను కూడా ఈ చట్టం ప్రవేశ పెట్టిందని, దీనివలన వస్తువు తయారీదారుడు, లేదా సేవలందించే వ్యక్తి లేదా అమ్మకం దారుడు ఏదైనా నష్ట పరిహారానికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

వినియోగదారుల వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయటానికి కూడా కొత్త చట్టం ప్రాధాన్యమిచ్చిందని మంత్రి శ్రీ పాశ్వాన్ చెప్పారు. వినియోగదారుల కమిషన్లను బలోపేతం చేయటంలో భాగంగా జిల్లా, రాష్ట్ర కమిషన్లు తమ సొంత ఆదేశాలను సైతం పునస్సమీక్షించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఫిర్యాదులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో కూడా దాఖలు చేయవచ్చు. వినియోగదారుడు తన నివాస ప్రాంతంలోని కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ ఫిర్యాదును 21  రోజులలోగా ఆమోదించినట్టు చెప్పకపోతే దానంతట అదే ఆమోదించబడినట్టుగా భావిస్తారు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణ జరుగుతుంది.

వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా చట్టంలో చేర్చటాన్ని ప్రస్తావిస్తూ, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు ఉందన్నారు. దీనివలన న్యాయప్రక్రియ సులభమవుతుందన్నారు. త్వరగా పరిష్కారం కావటానికి అవకాశమున్నప్పుడు ఇరుపక్షాలూ ఆమోదించిన పక్షంలో వినియోగదారుల కమిషన్ ఆ ఫిర్యాదును మధ్యవర్తిత్వం కోసం పంపవచ్చు.  కమిషన్ల పరిధిలో మధ్యవర్తిత్వ విభాగాలు ఏర్పాటవుతాయి. అలా పరిష్కరించుకున్నప్పుడు మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు.

వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నిబంధనల ప్రకారం రూ.5  లక్షల లోపు కేసులు దాఖలు చేయటానికి ఎలాంటి రుసుమూ ఉండదు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో కూడా ఫిర్యాదులు చేయవచ్చు. వినియోగదారులను గుర్తించలేని పక్షంలో వారికి ఇచ్చే మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధిలో జమచేస్తారు. కేసుల నమోదు, పరిష్కారం, పెండింగ్ తదితర అంశాలమీద రాష్ట్ర కమిషన్ ప్రతి మూడు నెలలకొకసారి కేంద్రప్రభుత్వానికి తెలియజేస్తాయి.

ఉత్పత్తి బాధ్యత అనే కొత్త అంశాన్ని చట్టంలొ చేర్చినట్టు  మంత్రి శ్రీ పాశ్వాన్ వెల్లడించారు. దీని వలన వస్తువు తయారీదారుడు లేదా సేవలు అందించినవాడు, అమ్మకం దారుడు నష్త పరిహారం చెల్లింపుకు బాధ్యులవుతారు. నకిలీ వస్తువులు లేదా నాణ్యత లేని వస్తువులు తయారు చేసినవారికి శిక్ష విధించే అధికారం కోర్టుకు ఉంటుంది. మొదటి సారి నేరం రుజువైతే సంబంధిత వ్యక్తికి రెండేళ్ళవరకూ లైసెన్స్ రద్దు చేయవచ్చు. రెండో సారి నేరం రుజువైతే లైసెన్స్ పూర్తిగా రద్దు చేయవచ్చు.

ఈ చట్టంలో సాధారణ నియమాలతోబాటుగా  కేంద్ర వినియోగదారుల రక్షణ మండలి నిబంధనలు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నియమాలు, రాష్ట్ర, జిల్లా కమిషన్ అధ్యక్షుడు, సభ్యుల నియామక నిబంధనలు, మధ్యవర్తిత్వపు నిబంధనలు, నమూనా నిబంధనలు, ఈ-కామర్స్ నిబంధనలు, వినియోగదారుల కమిషన్ నియమ నిబంధనలు, మధ్యవర్తిత్వపు నియంత్రణలు, రాష్ట్ర, జిల్లా కమిషన్ల మీద పాలనాపరమైన నియంత్రణలకు సంబంధించిన అంశాలన్నీ ఈ చట్టంలో పొందుపరచారు. 


కేంద్ర వినియోగదారు మండలి నిబంధనల ప్రకారం  ఆ మండలి ఏర్పాటవుతుందని, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారపంపిణీ శాఖామంత్రి చైర్మన్ గాని, ఆ శాఖ సహాయమంత్రి వైస్ చైర్మన్ గాను, మరో 34 మంది వివిధ రంగాలకు చెందినవారు సభ్యులుగాను ఈ మడలి ఏర్పాటవుతుంది. ఈ మండలి పదవీకాలం మూడేళ్ళుంటుంది. ఒక్కో ప్రాంతంలోని రెండు రాష్ట్రాలకు చెందిన ఆహార మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమ, తూర్పు ప్రాంతాలతోబాటు ఈశాన్య రాష్ట్రాలనుంచి ప్రాతినిధ్యం ఉంటుంది.

ఇప్పటిదాకా అమలులో ఉన్న వినియోగదారుల రక్షణ చట్టం (1986) ప్రకారం న్యాయవిధానం ఒకే చోట కేంద్రీకృతమై ఉండేదని, దీనివలన ఎక్కువ సమయం పట్టేదని మంత్రి శ్రీ పాశ్వాన్ వివరించారు. అనేక సవరణల అనంతరం ఇప్పుడీ కొత్తం చట్టం రూపొందిందన్నారు. సంప్రదాయ అమ్మకం దారులతోబాటు కొత్తగా వచ్చిన ఈ-కామర్స్ వేదికలనుంచి కూడా ఇప్పుడు వినియోగదారులకు రక్షణ కలుగుతుందన్నారు. దేశంలో వినియోగదారుల చేతిలో ఇప్పుడొక బ్రహ్మాస్తం ఉన్నట్టేనని మంత్రి అభివర్ణించారు.


వినియోగదారు రక్షణ చట్టం - 2019 లోని ముఖ్యాంశాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

***(Release ID: 1640124) Visitor Counter : 641