వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
"వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్" పథకం కింద అన్ని ఎన్.ఎఫ్.ఎస్.ఏ. వలస లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను నిరంతరాయంగా పంపిణీ చేసే ప్రక్రియ ఇప్పుడు 20 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో ప్రారంభించబడింది; అన్ని ఇతర రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలను కూడా 2021 మార్చి లోగా ఈ పధకం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించారు.
మరో నాలుగు రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలైన జమ్మూ & కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ లలో త్వరలో ఈ పధకం ప్రారంభించడానికి అవసరమైన విచారణ, పరీక్షలు పూర్తి అయ్యాయి.
సాంకేతికత ఆధారంగా చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో, రేషన్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేయడం ద్వారా, ఎన్.ఎఫ్.ఎస్.ఏ. లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఏదైనా చౌక ధరల దుకాణం నుండి ఆహార ధాన్యాల కోటాను తీసుకోవడానికి వీలు కలుగుతోంది.
Posted On:
18 JUL 2020 12:28PM by PIB Hyderabad
"వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్" సౌకర్యం, 2019 ఆగస్టు నుండి, 4 రాష్ట్రాలలో రేషన్ కార్డుల యొక్క అంతర్రాష్ట్ర పోర్టబిలిటీగా ప్రారంభించబడింది. ఆ తర్వాత, 2020 జూన్ నెల నుండి, మొత్తం 20 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు జాతీయ పోర్టబిలిటీ క్లస్టర్‌గా విలీనం అయ్యాయి. ఆ విధంగా, ఈ సౌకర్యం, ఎన్.ఎఫ్.ఎస్.ఏ. కార్డు కలిగిన లబ్దిదారుల కోసం, ప్రస్తుతం 20 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో ప్రారంభించబడింది. ఈ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, మిజోరాం, తెలంగాణ, కేరళ, పంజాబ్, త్రిపుర, బీహార్, గోవా, హిమాచల్ ప్రదేశ్, దాద్రా, నాగర్, హవేలీ, డామన్, డియూ, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి.
ఇప్పుడు, మరో నాలుగు రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు, జమ్మూ & కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ లలో ట్రయల్ మరియు టెస్టింగ్ పూర్తయ్యింది. త్వరలో ఈ రాష్ట్రాలు కూడా "వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్" పధకం కింద జాతీయ పోర్టబిలిటీ కి అనుసంధానమవుతాయి. దీనికి అదనంగా, అంతర్-రాష్ట్ర లావాదేవీలకు అవసరమైన వెబ్ సేవలతో పాటు, సెంట్రల్ డాష్‌బోర్డుల ద్వారా వాటి పర్యవేక్షణ కూడా ఈ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అన్ని ఇతర రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు 2021 మార్చి నెల లోగా ఈ పధకం పరిధిలోకి విలీనం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఎ), 2013 పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ, వారి భౌతిక స్థానంతో సంబంధం లేకుండా, దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా, దేశంలోని అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల సహకారంతో 'ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (ఐ.ఎం-పి.డి.ఎస్)' పై కొనసాగుతున్న కేంద్ర రంగ పథకం కింద రేషన్ కార్డుల దేశవ్యాప్త పోర్టబిలిటీని అమలు చేయడం ద్వారా, ఆహార భద్రత కింద నిర్ణయించిన ఆహార పదార్ధాలను అందజేయడం కోసం "వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్" సౌకర్యం అనేది ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ యొక్క ప్రతిష్టాత్మక ప్రణాళిక మరియు ప్రయత్నం.
తాత్కాలిక ఉపాధి కోసం, తమ నివాస స్థలాన్ని తరచూ మార్చుకునే, వలస కార్మికులైన ఎన్.ఎఫ్.ఎస్.ఎ. లబ్ధిదారులు, ఈ వ్యవస్థ ద్వారా, ఇప్పుడు తమకు నచ్చిన ఏదైనా చౌక ధరల దుకాణం (ఎఫ్.పి.ఎస్) నుండి, ఆ ఎఫ్.పి.ఎస్. లో ఉన్న ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ.పి.ఓ.ఎస్) పరికరంలో బయోమెట్రిక్ లేదా ఆధార్ ఆధారిత ప్రామాణీకరణతో వారి వద్ద ఉన్న రేషన్ కార్డును ఉపయోగించడం ద్వారా ఆహార ధాన్యాల కోటాను తీసుకోవచ్చు.
ఆవిధంగా, బయోమెట్రిక్ లేదా ఆధార్ ప్రామాణీకరణ కోసం ఎఫ్.పి.ఎస్.ల వద్ద ఈ.పి.ఓ.ఎస్. పరికరాల సంస్థాపన మరియు ఆధార్ ను అనుసంధానం చేయడం ఈ వ్యవస్థలో ముఖ్యమైన అంశాలు. వీటిని లబ్ధిదారులు వారి రేషన్ కార్డు నంబరు లేదా ఆధార్ నంబర్లలో ఒకటి దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా ఎఫ్.పి.ఎస్. డీలర్‌కు తెలియజేయడం ద్వారా పొందవచ్చు. కుటుంబంలో ఎవరైనా, రేషన్ కార్డులో ఆధార్ నెంబరును అనుసంధానం చేసి, ప్రామాణీకరణ ప్రక్రియ పూర్తి అయినా తర్వాత రేషన్ తీసుకోవచ్చు. ప్రయోజనం పొందడానికి రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డును రేషన్ డీలర్ కు చూపించడం లేదా వెంట తీసుకు వెళ్ళవలసిన అవసరం లేదు. లబ్ధిదారులు వారి వేలి ముద్రలు లేదా ఐరిస్ ఆధారిత గుర్తింపును ఉపయోగించడం ద్వారా ఆధార్ ప్రామాణీకరణ ప్రక్రియను పూర్తిచేయవచ్చు.
*****
(Release ID: 1639623)
Visitor Counter : 240
Read this release in:
Assamese
,
Punjabi
,
Odia
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Tamil
,
Malayalam