ప్రధాన మంత్రి కార్యాలయం

ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా ఎకోసాక్ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 17 JUL 2020 8:49PM by PIB Hyderabad

ఎక్స‌లెన్సీలు/  గౌర‌వ పెద్ద‌లారా 
లేడీస్ అండ్ జెంటిల్మ‌న్
ఈ ఏడాది మ‌నం ఐక్య‌రాజ్య‌స‌మితి 75వ వ్య‌వ‌స్థాపక సంవ‌త్స‌రం నిర్వ‌హించుకుంటున్నాం. మాన‌వాళి పురోగ‌తికి ఐక్య‌రాజ్య‌స‌మితి అందించిన సేవ‌ల‌ను గుర్తు చేసుకోవ‌ల‌సిన స‌మ‌యం ఇది. ప్ర‌స్తుత ప్ర‌పంచంలో ఐక్య‌రాజ్య స‌మితి పాత్ర‌ను మ‌దింపు చేసుకోవ‌డంతో పాటు ప్ర‌పంచ భ‌విష్‌్త్తును తీర్చిదిద్దగల స‌మ‌ర్థ‌త‌తో కూడిన‌దిగా స‌మితిని తీర్చి దిద్ద‌డానికి ఏం చేయాల‌నేది స‌మీక్షించుకోవ‌ల‌సిన అవ‌కాశం ఇది.

ఎక్స‌లెన్సీలు/  గౌర‌వ పెద్ద‌లారా
రెండో ప్ర‌పంచ యుద్ధం ముగియ‌గానే ఐక్యరాజ్య‌స‌మితి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన 50 వ్య‌వ‌స్థాపక స‌భ్య దేశాల్లో భార‌త్ ఒక‌టి. అప్ప‌టికి, ఇప్ప‌టికి ఎంతో మార్పు చోటు చేసుకుంది. ఈ రోజున ప్ర‌పంచంలోని 193 స‌భ్య‌దేశాల‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి ఒక్క తాటిపై న‌డిపిస్తోంది. స‌మితి స‌భ్య‌త్వం పొంద‌డంతో పాటు దానిపై అంచ‌నాలు కూడా ఎంత‌గానో పెరిగిపోయాయి. అదే స‌మ‌యంలో ఈ రోజు బ‌హుముఖీన‌త‌కు ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. 

ఎక్స‌లెన్సీలు/  గౌర‌వ పెద్ద‌లారా
ప్రారంభం నుంచి కూడా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పనులకు, ఎకోసాక్ కు భారతదేశం క్రియాశీలంగా మద్దతు ఇస్తూనే ఉంది. ఎకోసాక్ తొలి అధ్యక్షుడు కూడా భారతీయుడే. ఎకోసాక్ అజెండా, స్థిర అభివృద్ధి లక్ష్యాల రూపకల్పనలో కూడా భారతదేశం చురుకైన పాత్ర పోషించింది. ఈ రోజున దేశీయంగా మేం చేస్తున్న కృషి ద్వారా అజెండా 2030, స్థిర అభివృద్ధి లక్ష్యాల రూపకల్పనలో కూడా మేం ప్రముఖ పాత్ర పోషిస్తూనే ఉన్నాం. అలాగే స్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో ఇతర వర్థమాన దేశాలకు కూడా మేం మద్దతు ఇస్తున్నాం.  

ఎక్స‌లెన్సీలు/  గౌర‌వ పెద్ద‌లారా
ప్రపంచ మానవాళిలో ఆరో వంతు భారతదేశంలోనే ఉన్నారు. ఆ భారం, బాధ్యత ఎంతటితో మాకు తెలుసు. భారతదేశం అభివృద్ధి లక్ష్యాల సాధనలో విజయం సాధించినట్టయితే ప్రపంచ అభివృద్ధి లక్ష్యాల సాధనకు కూడా అది ఎంతో దోహదపడుతుందని మాకు తెలుసు. మా రాష్ర్టాలు, స్థానిక ప్రభుత్వాలు, పౌర సమాజం, ప్రజలు అందరినీ విశ్వాసంలోకి తీసుకుంటూ మేం "సంపూర్ణ సమాజ" వైఖరి అవలంబిస్తున్నాం. "సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్" మా సిద్ధాంతం. "కలిసికట్టుగా ప్రతీ ఒక్కరి వృద్ధికి ప్రతీ ఒక్కరి విశ్వాసంతో అడుగేయడం" అనేది దాని అర్ధం.. సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడి ఉండకూడదు అనే ఎస్ డిజి లక్ష్యాలకు ఇది ప్రతిరూపం. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, విద్యుత్తు, నివాసం అన్నీ అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం కోసం సమ్మిళితత్వంతో కూడిన కార్యక్రమాల ద్వారా మేం ఎంతో పురోగతి సాధిస్తున్నాం.

ఎక్స‌లెన్సీలు/  గౌర‌వ పెద్ద‌లారా
దేశంలోని మొత్తం ఆరు లక్షల గ్రామాల్లోనూ సంపూర్ణ పారిశుధ్యం సాధించడం ద్వారా గత ఏడాది మేం జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని మేం జరుపుకున్నాం.
గత ఐదేళ్ల కాలంలో మేం 1.10 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించాం. దాని వల్ల గ్రామీణ పారిశుధ్యం 38 శాతం నుంచి 100 శాతానికి  పెరిగింది. మా భారీ ఎత్తున చేపట్టిన చైతన్య కార్యక్రమాల కారణంగా మహిళా సాధికారత కూడా సాధిస్తున్నాం. ప్రాథమిక, మాధ్యమిక విద్యా విభాగాల్లో లింగ సమానత కూడా మేం సాధించాం. జీవనోపాధి కార్యక్రమం కింద నిర్వహిస్తున్న స్వయంసహాయక బృందాల్లో సుమారు 7 కోట్ల మంది గ్రామీణ మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. వారు జీవితాలను, జీవనోపాధిని కూడా ఎంతగానో మార్చుతున్నారు. 10 లక్షల మంది మహిళలు మా స్థానిక సంస్థల్లో సభ్యులుగా ఉంది భాగస్వామ్య అభివృద్ధి ప్రక్రియను ముందుకు నడుపుతున్నారు. బ్యాంకు ఖాతాలు లేని 40 కోట్ల మందికి గత ఆరేళ్ల కాలంలో బ్యాంకు ఖాతాలు తెరిపించగా వాటిలో 22 కోట్లు మహిళల ఖాతాలే ఉన్నాయి. ఆర్థిక సమ్మిళితత్వానికి సాంకేతిక పరిజ్ఞానం శక్తిని మేం ఉపయోగించుకుంటున్నాం. ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు నంబర్, బ్యాంకు ఖాతా, మొబైల్ కనెక్షన్ దీనికి ఆధారం. దీని వల్ల 70 కోట్ల మందికి పైగా ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ సాధ్యమయింది. మా ఆహార భద్రతా కార్యక్రమం 81.3 కోట్ల మంది పౌరులకు చేరింది.
"అందరికీ ఇల్లు" కార్యక్రమం వల్ల భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తయ్యే ఏడాది 2022 నాటికి ప్రతీ ఒక్క భారతీయుని భద్రత, రక్షణకు ఆశ్రయంగా నిలిచే ఇల్లుండాలన్నది మా సంకల్పం.  అప్పటికి ఈ కార్యక్రమం కింద 4 కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది. చాలా దేశాల్లోని మొత్తం జనాభాకు గల ఇళ్ల సంఖ్య కన్నా ఇది ఎన్నో రెట్లు అధికం. అలాగే మా "ఆయుష్మాన్ భారత్" పథకం 50 కోట్ల మంది భాగస్వామ్యంతో కూడిన  ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం. గ్రామీణ స్థాయిలో మా ఆరోగ్య వ్యవస్థ విస్తృతి ప్రస్తుత కోవిడ్ పై పోరాటంలో మేం ప్రపంచంలోనే అత్యుత్తమ రికవరీ రేటు కలిగి ఉండడానికి దోహదపడింది. 2025 నాటికి దేశం నుంచి టిబిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంలో సరైన బాటలో మేం సాగుతున్నాం.  భారతదేశ అభివృద్ధి కార్యక్రమాల విస్తృతి, విజయం;  మేం ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానాలు, నవకల్పనల నుంచి  ఇతర వర్థమాన దేశాలు ఎంతో నేర్చుకోవచ్చు. పశ్చిమ ప్రాంత దేశాలతో భారతదేశానికి గల అభివృద్ధి భాగస్వామ్యాల ద్వారా కూడా ఇది సాధ్యమయింది.

ఎక్స‌లెన్సీలు/  గౌర‌వ పెద్ద‌లారా
అభివృద్ధిపథంలో పురోగమిస్తున్నప్పటికీ భూమండలం పట్ల గల బాధ్యతను మేం మరిచిపోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా మేం వార్షికంగా 3.8 లక్షల టన్నుల కర్బన వ్యర్థాలను తగ్గిస్తూ వచ్చాం. గ్రామాలు విద్యుదీకరించడం, 8 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన వంట ఇంధనం అందించడం, ఇంధన సామర్థ్య చర్యలు ప్రవేశపెట్టడం ద్వారానే ఇది సాధించగలిగాం. 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరుల నిర్మాణం, 2.6 కోట్ల హెక్టార్ల బీడు భూములను సారవంతం చేయడం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రకృతితో కలిసి సామరస్యంతో జీవించడం మాకు తరాలుగా వస్తున్న ఆచారం. స్వచ్ఛత కోసం మేం అతి పెద్ద కార్యక్రమం ప్రారంభించాం, ఒక సారి వాడి పడేసే ప్లాస్టిక్ వినియోగాన్ని నిలువరిస్తున్నాం.  అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఏర్పాటు మా అంతర్జాతీయ వాతావరణ కార్యాచరణకు దర్పణం పడుతుంది. అలాగే వైపరీత్యాలను తట్టుకోగల మౌలిక వసతుల సంకీర్ణం ఏర్పాటు చేయడం వల్ల ఇందులో భాగస్వాములైన వారందరూ సమగ్ర వైఖరి అవలంబించే వీలు కలుగుతుంది. అవసరంలో ఉన్నవారిని ఆదుకున్న వాడే మిత్రుడు అనే సిద్ధాంతంతో మా ప్రాంతంలో మొట్టమొదటిగా స్పందించే వారిలో మొదటి వారుగా ఉండడం మాకు గర్వకారణం. భూకంపాలు కావచ్చు, తుపానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు లేదా మానవ కృత సంక్షోభం ఏదైనా కావచ్చు అమిత వేగంతో, సంఘీభావంతో భారత్ స్పందించింది. కోవిడ్ పై ఉమ్మడి పోరాటంలో భాగంగా మేం 150 పైగా దేశాలకు వైద్యం, ఇతర సహాయం అందించాం. మా పొరుగు దేశాలతో కలిసి సార్క్ కోవిడ్ ఎమర్జెన్సీ నిధి మేం ఏర్పాటు చేశాం.

ఎక్స‌లెన్సీలు/  గౌర‌వ పెద్ద‌లారా
కోవిడ్-19 మ‌హ‌మ్మారి అన్ని దేశాలకు గల వైప‌రీత్యాల‌ను త‌ట్టుకోగల శ‌క్తికి ఒక ప‌రీక్ష‌గా నిలిచింది. భార‌త‌దేశంలో మేం ప్ర‌భుత్వ, స‌మాజ చ‌ర్య‌ల‌ను సంఘ‌టితం చేయ‌డం ద్వారా కోవిడ్ పై పోరాటాన్ని ప్ర‌జా ఉద్య‌మంగా మార్చ‌గ‌లిగాం. నిరుపేద కుటుంబాల‌కు ప్ర‌యోజ‌నాలు అందించ‌డానికి మేం అధిక ప్రాధాన్యం ఇచ్చాం. 30 వేల కోట్ల డాల‌ర్ల‌కు పైబ‌డిన విలువ గల ప్యాకేజి మేం ప్ర‌క‌టించాం. ఈ ప్యాకేజితో ఆర్థిక వ్య‌వ‌స్థ తిరిగి ప‌ట్టాల పైకి వ‌స్తుంది. ఆధునిక సాంకేతిక వ‌స‌తుల నిర్మాణం, టెక్నాల‌జీ ఆధారిత వ్య‌వ‌స్థ సిద్ధం అవుతాయి. మేం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో సంఘ‌టిత‌మై స్వ‌యంస‌మృద్ధి గల, ఎలాంటి ఒత్తిడులైనా త‌ట్టుకోగల భారత దేశ నిర్మాణం కోసం “ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్” విజ‌న్ ను ఆవిష్క‌రించాం.

ఎక్స‌లెన్సీలు/  గౌర‌వ పెద్ద‌లారా
బ‌హుళ భాగ‌స్వామ్యం ద్వారానే సుస్థిర‌మైన శాంతి, సుసంప‌న్నత సాధ్య‌మ‌వుతుంద‌ని భార‌త‌దేశం దృఢంగా విశ్వ‌సిస్తుంది. ఈ భూమండ‌లం బిడ్డ‌లుగా మ‌నంద‌రం ఉమ్మ‌డి స‌వాళ్లు, ఉమ్మ‌డి ల‌క్ష్యాల సాధ‌న‌కు చేతులు క‌ల‌పాలి. కాని స‌మ‌కాలీన స‌మాజంలో వాస్త‌విక దృక్ప‌థంలో ఈ బ‌హుళ భాగ‌స్వామ్యం ఆచ‌రించాల్సి ఉంటుంది. సంస్క‌రించిన ఐక్య‌రాజ్య‌స‌మితి కేంద్ర‌స్థానంగా సంస్క‌రించిన బ‌హుళ భాగ‌స్వామ్యం ద్వారానే మాన‌వాళి ఆశ‌ల‌ను మ‌నం తీర్చ‌గ‌లుగుతాం. ఈ రోజున ఐక్య‌రాజ్య‌స‌మితి 75వ వార్షికోత్స‌వాలు నిర్వ‌జ్ఞ‌హించుకుంటున్న ఈ స‌మ‌యంలో మ‌నంద‌రం అలాంటి వ్య‌వ‌స్థ ఏర్పాటుకు ప్ర‌తిజ్ఞ చేయాలి. స‌మితి ప్రాధాన్య‌త‌ను పెంచడం, దాని స‌మ‌ర్థ‌త‌ను మెరుగుప‌ర‌చ‌డం, స‌రికొత్త మానవ కేంద్రీకృత ప్రపంచీక‌ర‌ణ‌కు దాన్ని ఆధార‌భూతంగా చేసుకోవ‌డం అవ‌స‌రం. వాస్త‌వానికి రెండో ప్ర‌పంచ యుద్ధం మిగిల్చిన ఆగ్రహ జ్వాలల నుంచి ఐక్య‌రాజ్య స‌మితి ఉద్భ‌వించింది. ఈ రోజున ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఏర్ప‌డిన ఆగ్రహ జ్వాల‌లు స‌మితి పున‌రుజ్జీవం, సంస్క‌ర‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించాయి. ఈ అవ‌కాశాన్ని మ‌నం వ‌దులుకోకూడ‌దు.

ఎక్స‌లెన్సీలు/  గౌర‌వ పెద్ద‌లారా
అత్యంత ప్ర‌ధాన‌మైన ఈ స‌మ‌యంలో ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్య‌త్వానికి భార‌త‌దేశం ఎన్నిక‌యింది. ప్ర‌పంచ సామ‌ర‌స్యం, సామాజిక-ఆర్థిక స‌మానత సాధన, ప్ర‌కృతిలో స‌మ‌తూకం ప‌రిర‌క్షణ ప‌ట్ల గల లోతైన క‌ట్టుబాటుతో ఐక్య‌రాజ్య స‌మితి అజెండాకు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా భార‌త‌దేశం కీలక పాత్ర పోషిస్తుంది.
న‌మ‌స్కార్.
అంద‌రికీ ధ‌న్య‌వాదాలు.

 (Release ID: 1639566) Visitor Counter : 1188