గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

వీధి వ్యాపారుల ముంగిటికే సూక్ష్మ రుణసదుపాయం పి.ఎం. స్వనిధి పేరిట మొబైల్ యాప్ ప్రారంభం

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రుణ దరఖాస్తుదారులు లక్షా 54వేల మందికి పైచిలుకే
48వేల మందికి ఇప్పటికే రుణం మంజూరు

Posted On: 17 JUL 2020 5:36PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పి.ఎం.స్వనిధి) పథకానికి సంబంధించిన మొబైల్ అప్లికేషన్ (మొబైల్ యాప్)ను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా రోజు ప్రారంభించారు. రుణం కావలసిన వీధి వ్యాపారులకు, రుణం అందించే సంస్థలకు మధ్య యాప్ ఒక డిజిటల్ వారధిగా పనిచేస్తుంది.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో పాటు, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

  పి.ఎం. స్వనిధి యాప్ అనేది డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం దిశగా ముందడుగు. రుణాలిందించే సంస్థల క్షేత్రస్థాయి సిబ్బంది,. పి.ఎం. స్వనిధి పథకం గరిష్టస్థాయిలో లబ్ధిదారులకు ప్రయోజనాలందించేలా చూసేందుకు యాప్ దోహదపడుతుంది. వీధి వ్యాపారులతో సంబంధాలు నెరిపే బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలమైక్రో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు పథకం ఎక్కువ లబ్ధిదారులకు చేర్చేందుకు యాప్ ఉపయోగపడుతుంది.  మొబైల్ యాప్ ఆవిష్కరణతో పథకం అమలు మరింత వేగం పుంజుకోగలదని, వీధి వ్యాపారులు కాగితాలతో సంబంధం లేకుండా పథకానికి అనుసంధానమయ్యేందుకు డిజిటల్ లావాదేవీలకు యాప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు.

  ఇందుకు సంబంధించిన వెబ్ పోర్టల్ ను 2020 జూన్ 29 ప్రారంభించారు. పి.ఎం. స్వనిధి పథకం వెబ్ పోర్టల్ లో ఉన్న అంశాలే, యాప్ లోనూ పొందుపరిచి ఉంటాయి. సర్వే సమాచారంలో… వీధి వ్యాపారులను గుర్తించేందుకు సెర్చ్ సదుపాయం, దరఖాస్తు దారుల ఈకేవైసీ, దరఖాస్తుల పరిశీలన, పర్యవేక్షణ తదితర అంశాలన్నీ యాప్ లో ఉంటాయి. రుణాలు అందించే సంస్థలు, వాటి క్షేత్రస్థాయి సిబ్బంది యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 2020 సంవత్సరం జూలై 2 తేదీన పి.ఎం. స్వనిధి పథకం ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకూ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 1,54,000మందికిపైగా వీధి వ్యాపారులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 48వేల మందికి ఇప్పటికే రుణాలు మంజూరయ్యాయి.

   కోవిడ్-19 లాక్ డౌన్ తో తీవ్రంగా దెబ్బతిన్న వీధి వ్యాపారులు తమ జీవనోపాధిని తిరిగి ప్రారంభించేందుకు వీలుగా రుణాలు అందించే లక్ష్యంతో పి.ఎం. స్వనిధి పథకాన్ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2020 జూన్ 1 ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోను, పట్టణ శివార్లు, గ్రామీణ ప్రాంతాల్లోను ఉన్న 50లక్షల మంది  వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకు పథకాన్ని రూపొందించారు. పథకం కింద వీధి వ్యాపారులు వర్కింగ్ క్యాపిటల్ గా పదివేల రూపాయల రుణం పొందేందుకు వీలుంటుంది. ఏడాది కాలంలో నెలవారీ విడతలుగా రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. లబ్ధిదారులు సకాలంలోగానీ, గడువుకంటే ముందుగానీ రుణం తిరిగి చెల్లస్తే,..7శాతం వార్షిక వడ్డీ సబ్సిడీని వారి ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా జమ చేస్తారు. మొత్తాన్ని ముూడు నెలలకు ఒకసారి అనే ప్రాతిపదికన వారి ఖాతాలకు జమచేస్తారు. పథకం కింద తీసుకున్న రుణాన్ని డిజిటల్ లావాదేవీల ద్వారా చెల్లిస్తే, నెలకు వంద రూపాయల చొప్పున బ్యాంకు ప్రోత్సాహకం అందిస్తారు. పైగా, వీధి న్యాపారులంతా సకాలంలో గానీ, గడువుకంటే ముందుగానే రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా రుణ హెచ్చింపు సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇలా, వారు ఆర్థికంగా మరింత ఉన్నత స్థానానికి ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.

*******



(Release ID: 1639470) Visitor Counter : 268