గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
గణాంకాల దినోత్సవం, 2020 నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం
అంశం: సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ)
Posted On:
29 JUN 2020 4:44PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం, గణాంకాల దినోత్సవం-2020ను నిర్వహించింది. రోజువారీ జీవనంలో గణాంకాల వాడకంపై ప్రాచుర్యం కల్పించడం, ప్రజా సంక్షేమ విధానాలు రూపొందించడానికి గణాంకాలు ఎలా ఉపయోగపడతాయో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ గణాంక వ్యవస్థను స్థాపించడంలో ప్రొ.మహలనోబిస్ చేసిన అమూల్యమైన కృషికి గుర్తింపుగా, ఏటా జూన్ 29న, ఆయన జయంతి సందర్భంగా గణాంకాల దినోత్సవం జరుపుతారు. ఈ ఏడాది కొవిడ్ కారణంగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఈ ఏడాది గణాంకాల దినోత్సవ అంశం "సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు" (ఎస్‌డీజీ)-3 (అందరికీ అన్ని వయస్సుల్లో ఆరోగ్యకర, ఆనందకర జీవనానికి భరోసా ఇవ్వడం) & ఎస్‌డీజీ-5 (లింగ సమానత్వం-మహిళలు, బాలికల సాధికారత సాధించడం).
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ మంత్రి రావ్ ఇందర్‌జిత్ సింగ్ (స్వతంత్ర బాధ్యత) గణాంకాల దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ డా.బిబేక్ డెబ్రోయ్, భారత గణాంకాల సంస్థ అధ్యక్షుడు ప్రొ.బిమల్ కుమార్ రాయ్, జాతీయ గణాంకాల కమిషన్ (ఎన్‌ఎస్‌సీ) ఛైర్మన్ ప్రవీణ్ శ్రీవాత్సవ సహా వివిధ విభాగాల ముఖ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థల్లో అద్భుత ప్రతిభను కనబరిచిన గణాంకవేత్తలను గుర్తించి, సన్మానించేందుకు "ప్రొ. పి.సి.మహలనోబిస్ నేషనల్ అవార్డ్ ఇన్ అఫిషియల్ స్టాటిస్టిక్స్" పేరిట కొత్త పురస్కారాన్ని గణాంకాల శాఖ ఏర్పాటు చేసింది. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డా.చక్రవర్తి రంగరాజన్ ఈ ఏడాది పురస్కారాన్ని అందుకున్నారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్ (నిమ్స్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మాజీ డైరెక్టర్ డా.అరవింద్ పాండే, కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ మాజీ అదనపు డైరెక్టర్ డా.అఖిలేష్ చంద్ర కులశ్రేష్ఠకు సంయుక్తంగా, 'ప్రొ.పి.వి.సుఖాత్మె జాతీయ పురస్కారం-2020'ను అందించారు. గణాంకాల రంగం కోసం వారు జీవితకాలం చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. గణాంకాల అంశంపై అఖిల భారత స్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం నిర్వహించిన ‘ఆన్ ది స్పాట్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్’ విజేతలను కూడా సత్కరించారు.
వివిధ సవాళ్ల అంశాలు, ఎస్‌డీజీలను సాధించే మార్గాలపై ప్రదర్శనలు ఇచ్చారు. "రిపోర్ట్ ఆన్ సస్టెయినబుల్ డెవలెప్‌మెంట్ గోల్స్-నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఎఫ్) ప్రోగ్రెస్ రిపోర్ట్", 2020 (వెర్షన్ 2.1) కొత్త నివేదికను విడుదల చేశారు. దీంతోపాటు, "ఎన్‌ఐఎఫ్, ఎస్‌డీజీ డేటా స్నాప్‌షాట్ హ్యాండ్‌బుక్"ను కూడా విడుదల చేశారు. గణాంకాల దినోత్సవం-2020 అంశమైన 'సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు'పై ఏడాది పొడవునా సెమినార్లు, వర్క్‌షాపులు జరుగుతాయి. గణాంకాల దినోత్సవ చర్చలు, కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
****
(Release ID: 1635207)
Visitor Counter : 513