రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

నిర్మాణ రంగంలో మొదటి సంపూర్ణ డిజిటలీకరణ సంస్థగా అవతరించిన ఎన్‌హెచ్‌ఏఐ

"డేటా లేక్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌"ను ప్రారంభించిన ఎన్‌హెచ్‌ఏఐ
ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారానే సంప్రదింపులు, నిర్ణయాలు, ప్రాజెక్టు అనుమతులు
పనుల్లో జాప్యం, అడ్డంకులను ముందుగానే పసిగట్టి హెచ్చరిక చేయనున్న సాఫ్ట్‌వేర్‌
సరైన సమయంలో నిర్ణయం తీసుకునేలా వీలు కల్పించనున్న డేటా లేక్‌ సాఫ్ట్‌వేర్‌

Posted On: 12 JUN 2020 3:51PM by PIB Hyderabad

కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మాణ రంగంలో తొలి సంపూర్ణ డిజిటలీకరణ సంస్థగా రికార్డు సృష్టించింది. క్లౌడ్‌ ఆధారిత, కృత్రిమ మేధస్సుతో కూడిన అతి పెద్ద సమాచార విశ్లేషణ వేదిక "డేటా లేక్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌"ను ప్రారంభించడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఎన్‌హెచ్‌ఏఐ పనులను మాన్యువల్‌ పద్ధతి నుంచి ఆన్‌లైన్‌ పోర్టల్‌లోకి ఈ ప్రాజెక్టు మారుస్తుంది. అన్ని ప్రాజెక్టు పత్రాలు, కాంట్రాక్టు నిర్ణయాలు, ఆమోదాలను ఇప్పటి నుంచి పోర్టల్‌ ద్వారా మాత్రమే నిర్వహిస్తారు.

    పనుల్లో జాప్యం, అడ్డంకులను డేటా లేక్‌ సాఫ్ట్‌వేర్‌ ముందుగానే పసిగట్టి హెచ్చరికలు పంపుతుంది. తొందరపాటు నిర్ణయాలను అడ్డుకుంటుంది. గత చరిత్ర ఆధారంగా పలు ప్రత్యామ్నాయాల ఆర్థిక ప్రభావాలను అంచనా వేసి, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. దీనివల్ల అనేక అడ్డంకులు తొలగిపోతాయి.    

    భారీ నగదు మొత్తాలకు సంబంధించిన అనేక కోర్టు కేసులు ఎన్‌హెచ్‌ఏఐపై ఉన్నాయి. వీటిలో అనేకం.. వివాదాలు లేని భూమిని అప్పగించడంలో జాప్యం; వసతులు, యంత్రాలు, సామగ్రి, సిబ్బంది తరలింపు ఖర్చులు, నిర్ణయాల్లో ఆలస్యం వంటివాటికి సంబంధించినవే. ఈ అవరోధాలన్నింటినీ డేటా లేక్‌ సాఫ్ట్‌వేర్‌ తనిఖీ చేసి వివాదాలను తగ్గిస్తుంది. నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పని సాగేలా చేస్తుంది. అన్ని ప్రక్రియలు పోర్టల్‌ ద్వారానే జరగడం వల్ల నిర్ణయాలు వేగంగా తీసుకోవడంతోపాటు, భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ఉంటాయి. 

    ప్రాజెక్టు మొత్తాన్ని క్లౌడింగ్‌ చేసి, జీఐఎస్‌ ట్యాగింగ్‌తో ప్రత్యేక ఐడీ ఇస్తారు కాబట్టి ఏ ప్రాంతం నుంచైనా ప్రాజెక్టు సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. ఎన్‌హెచ్‌ఏఐ కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, అధికారులు ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ ఈ-ఆఫీస్‌ మాడ్యూల్‌ను కూడా దీనిలో కలిపారు. దీంతో సంప్రదింపులన్నీ క్షేత్రస్థాయి నుంచి ప్రధాన కార్యాలయానికి డిజిటల్‌ పద్ధతిలో సురక్షితంగా జరుగుతాయి.

    కొవిడ్‌ కారణంగా సిబ్బంది విధులకు సంబంధించి ఎన్నో సంస్థలు అవస్థలు పడుతున్న తరుణంలో.., ముఖాముఖి సంబంధాలు, ఫైళ్లను ముట్టుకోవడం వంటి ఇబ్బందులు లేకుండా ఎన్‌హెచ్‌ఏఐ ఉద్యోగులు పని చేసుకుంటున్నారు. డేటా లేక్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడంపై, కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో తన సిబ్బందికి ఎన్‌హెచ్‌ఏఐ శిక్షణ ఇచ్చింది.

    పనిలో జాప్యాన్ని తగ్గిచడం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం, రికార్డులు మాయం కాకుండా ఉండటం, ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా పని జరగడం వంటి ప్రయోజనాలతో కూడిన విప్లవాత్మక మార్పులను ఎన్‌హెచ్‌ఏఐలో డేటా లేక్‌ సాఫ్ట్‌వేర్‌ తీసుకొచ్చింది. పనులు సాగుతున్న తీరును అధికారులు, ప్రాజెక్టు సంబంధిత వర్గాలు రియల్‌ టైమ్‌లో చూసే వీలు ఉండడంతో, ఈ సాఫ్ట్‌వేర్‌ పనుల్లో పారదర్శకతను పెంచుతుంది. ఇది సీనియర్లు ఆడిట్‌ చేసినదానితో సమానం.

***



(Release ID: 1631174) Visitor Counter : 256