రైల్వే మంత్రిత్వ శాఖ
గత సంవత్సర కాలంలో భారత రైల్వేలు చేసిన అత్యుత్తమ భద్రతా పనితీరు; 2019 ఏప్రిల్ నుండి రైల్వే ప్రమాదాల కారణంగా ఒక్క ప్రయాణీకుడు కూడా మృతి చెందలేదు.
భద్రతను పెంచే చర్యలు: పెద్ద సంఖ్యలో (1274) లెవల్ క్రాసింగుల తొలగింపు; 2019-2020లో అత్యధికంగా 5181 ట్రాక్ కి.మీ. మేర పట్టాల పునరుద్ధరణ.
మొత్తం 1309 ఆర్.ఓ.బి. లు / ఆర్.యు.బి. లు నిర్మించబడ్డాయి; రైల్వే నెట్‌వర్క్‌లో భద్రతను పెంచే చర్యల్లో భాగంగా 2019-2020లో 1367 వంతెనలను పునఃరుద్దరించడం జరిగింది.
Posted On:
08 JUN 2020 6:20PM by PIB Hyderabad
భారత రైల్వేలు 2019 ఏప్రిల్ నుండి 2020 మార్చి వరకు అత్యుత్తమ భద్రతా రికార్డును నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు (01.04.2019 నుండి 08.06.2020 వరకు) ఏ రైలు ప్రమాదంలోనూ ఒక్క రైల్వే ప్రయాణికుడు కూడా మృతి చెందలేదు. 166 సంవత్సరాల క్రితం 1853 సంవత్సరంలో భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత మొదటిసారిగా 2019-2020 సంవత్సరంలో ఈ ఘనత సాధించడం జరిగింది. అన్ని విధాలుగా భద్రతా పనితీరును మెరుగుపరచడానికి భారత రైల్వే చేపట్టిన నిరంతర ప్రయత్నాల ఫలితంగానే, గత 15 నెలల్లో ఒక్క ప్రయాణీకుని మరణం కూడా సంభవించలేదు.
భద్రతకు ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యతనిచ్చే, భారతీయ రైల్వే, భద్రతా మెరుగుదల కోసం చేపట్టిన చర్యలలో - మనుషులు నిర్వహించే లెవెల్ క్రాసింగుల తొలగింపు, రోడ్ ఓవర్ బ్రిడ్జీలు (ఆర్.ఓ.బి. లు) / రోడ్ అండర్ బ్రిడ్జెస్ (ఆర్.యు.బి. లు) నిర్మాణం, వంతెనల పునఃరుద్ధరణ, అత్యధికంగా రైలు పట్టాల పునరుద్ధరణ, సంవత్సర కాలంలో ఎస్.ఏ.ఐ.ఎల్. నుండి అత్యధికంగా రైలు పట్టాల సరఫరా, సమర్ధవంతంగా రైలు పట్టాల నిర్వహణ, భద్రతా అంశాలపై కఠినమైన పర్యవేక్షణ, రైల్వే సిబ్బందికి మెరుగైన శిక్షణ, సిగ్నలింగ్ వ్యవస్థలో మెరుగుదల, భద్రతా పనులలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సాంప్రదాయ ఐ.సి.ఎఫ్. కోచ్‌ల నుండి దశలవారీగా అత్యాధునిక, సురక్షితమైన ఎల్.హెచ్.బి. కోచ్‌లకు మారడం మొదలైనవి ఉన్నాయి.
భద్రతను పెంచడానికి భారత రైల్వేలు తీసుకున్న మరి కొన్ని ప్రధాన చర్యలు :
* 2019-20 సంవత్సరంలో మనుష్యులచే నిర్వహించే లెవెల్ క్రాసింగ్ లను రికార్డు సంఖ్యలో 1274 తొలగించడం జరిగింది. 2018-19 లో తొలగించిన 631 తో పోలిస్తే ఇది రెట్టింపు. లెవెల్ క్రాసింగ్ ల తొలగింపులో ఇది అత్యంత ఎక్కువ.
* రైల్వే నెట్‌వర్క్‌లో భద్రతను పెంచడానికి 2019-20 సంవత్సరంలో మొత్తం 1309 ఆర్.ఓ.బి. లు / ఆర్.యు.బి. లు నిర్మించబడ్డాయి.
* 2019-20 సంవత్సరంలో 1367 వంతెనలను పునఃరుద్ధరించడం జరిగింది. ఇది గత ఏడాదిలో పునఃరుద్దరించిన 1013 వంతెనలతో పోలిస్తే 37 శాతం ఎక్కువ.
* 2019-20 సంవత్సరంలో అత్యధికంగా 5,181 ట్రాక్ కిలోమీటర్ల (టి.కే.ఎం) మేర రైలు పట్టాలను పునరుద్ధరించడం జరిగింది. ఇది గత ఏడాదిలో పునరుద్దరించిన 4,265 ట్రాక్ కిలోమీటర్ల (టి.కే.ఎం) తో పోలిస్తే 20 శాతం ఎక్కువ.
* ఈ ఏడాది ఎస్.ఏ.ఐ.ఎల్. (సెయిల్) నుండి అత్యధికంగా 13.8 లక్షల టన్నుల రైలు పట్టాలు సరఫరా అయ్యాయి. వీటిలో 6.4 లక్షల టన్నుల మేర పొడవైన పట్టాలు సరఫరా కావడంతో, ఫీల్డ్ వెల్డింగ్ పరిధి బాగా తగ్గింది, ఇది ఆస్తి యొక్క మంచి విశ్వసనీయతకు దారితీసింది.
* 2019-20 సంవత్సరంలో 285 లెవెల్ క్రాసింగ్ (ఎల్.సి) లను సిగ్నల్స్ తో అనుసంధానం చేయడం జరిగింది. వీటితో సిగ్నల్స్ తో అనుసంధానమైన మొత్తం లెవెల్ క్రాసింగ్ ల సంఖ్య 11,639 కి పెరిగింది.
* భద్రతను మెరుగుపరిచేందుకు 2019-20 సంవత్సరంలో మెకానికల్ సిగ్నలింగ్ తో ఉన్న 84 స్టేషన్లను ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ సిగ్నలింగ్ వ్యవస్థకు మార్చడం జరిగింది.
వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధంగా 2017-18 సంవత్సరంలో రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ (ఆర్.ఆర్.ఎస్.కె) రూపంలో ఏడాదికి 20,000 కోట్ల రూపాయల మేర వ్యవస్థలో ప్రవేశపెట్టిన నిధులతో పైన పేర్కొన్న పనులు చేపట్టడానికి అవకాశం కలిగింది. ఈ నిధితో, అత్యవసర స్వభావం కలిగిన, చాలా క్లిష్టమైన భద్రతా పనులను చేపట్టడం సాధ్యమైంది మరియు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
*****
(Release ID: 1630349)
Visitor Counter : 254