శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నోవెల్ కరోనా వైరస్‌తో కలసి జీవించడానికి ఐదు చిట్కాలు
Posted On:
02 JUN 2020 10:49AM by PIB Hyderabad
డెభ్బైరోజుల లాక్‌డౌన్ తర్వాత అన్‌లాక్ 1.0 కార్యరూపంలోకి వచ్చింది. అధికారికంగా లాక్‌డౌన్ 5.0 గా పిలిచుకునే తాజా నిబంధనలు 2020 జూన్ 1 నుంచి అమలొ లోకి వచ్చాయి. దీనితో ఆర్థిక వ్యవస్థ, సాధారణ జనజీవనం నియంత్రిత పద్ధతిలో దశలవారీగా తిరిగి మామూలు స్థితికి చేరుకుంటున్నది. ఇది కొత్త సాధారణ స్థితికి ఆరంభం. ఈ పరిస్థితులు మరికొంతకాలం ఉండనున్నాయి . మనం కరొనా వైరస్‌తో కలసి సహజీవనం చేయడం నేర్చుకోవాలని నిపుణులు , అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్ కనిపెట్టడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. అందువల్ల మనం కొత్త సాధారణ పరిస్థితులలో గడపాల్సిఉంటుంది. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్, ప్రొఫెసర్ .కె. విజయ రాఘవన్, ఇండియా సైన్స్ వైర్‌తో మాట్లాడుతూ , వైరస్‌తో కలసి జీవించడానికి ఐదు చిట్కాలు సూచించారు.
“ వైరస్‌ను మార్చనన్నా మార్చాలి , లేదా మనకు మనమన్నా మారాలి. వైరస్‌ను మార్చడానికి కొంత సమయం పట్టవచ్చు” అని ప్రొఫెసర్ విజయరాఘవన్ అన్నారు. వ్యాక్సిన్ , మందులకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి కొనసాగుతున్నాయి. అయితే అవి తగిన క్లినికల్ పరీక్షలు పూర్తి చేసుకుని ప్రజలకు విస్తృత వాడుకలోకి రావాల్సి ఉంది. ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేలా మందులు, వ్యాక్సిన్ తయారీకి కొంత సమయం పడుతుంది. ఆ లోగా మనం ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మనల్ని మనమే మార్చుకోవచ్చు.
ప్రోఫెసర్ రాఘవన్ సూచించిన ఐదు చిట్కాలు:
1.ఇంట్లోనుంచి బయటకు వచ్చేటపుడు మాస్క్ ధరించండి:
ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం ,ఒక వ్యక్తి మాట్లాడినపుడు సుమారు వెయ్యి సూక్ష్మతుంపర్ల లాలాజలం బయట పడుతుందట. ఒక వేళ అతను నోవెల్ కరోనావైరస్ కు గురైన వ్యక్తి అయితే ఈ ఒక్కొక్క తుంపర వేలాది క్రిములను వ్యాప్తి చేస్తుంది. పెద్ద తుంపర్లు సాధారణంగా ఒక మీటరు దూరంలో నేల మీద పడతాయి. అయితే , ఆ ప్రాంతం బాగా వెంటిలేషన్ లేకున్నట్టయితే, సూక్ష్మతుంపర్లు గాలిలో ఎక్కువ కాలం ప్రయాణించే అవకాశం ఉంది. వైరస్‌బారిన పడిన ఎంతో మందికి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందువల్ల వారికి కనీసం తాము వైరస్ బారినపడ్డ విషయం కూడా తెలియదు. మాస్క్‌ను ధరించడం వల్ల అది మనల్ని కాపాడడమే కాక, మనకు వైరస్ సోకి ఉంటే , అది ఇతరులను కూడా కాపాడుతుంది.
“ ఇంట్లో తయారు చేసుకునే మాస్క్‌లకు సంబంధించి మేం ఒక హ్యాండ్ బుక్‌ను సిద్ధం చేశాం. ముఖానికి మాస్క్ తయారు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.” అని ప్రొఫెసర్ రాఘవన్ తెలిపారు.
2. చేతి పరిశుభ్రత విషయంలో అప్రమత్తత:
చైనాలో కోవిడ్ బారిన పడిన సుమారు 75, 465 కేసులను ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆధ్వర్యంలోని ఒక అధ్యయనం ద్వారా పరిశీలించినపుడు, కరోనా వైరస్ ప్రధానంగా రెస్పిరేటరీ డ్రాప్‌లెట్ల నుంచి , కాంటాక్ట్ మార్గం ద్వారా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. అందువల్ల వైరస్ సోకిన వ్యక్తి డైరక్ట్ కాంటాక్ట్‌లోకి వచ్చినపుడు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. లేదా వైరస్ సోకిన వ్యక్తి వాడిన వస్తువులను, లేదా వైరస్‌సోకిన వ్యక్తికి దగ్గరలోని పరిసరాల ఉపరితలాలను తాకినపుడు వైరస్‌వ్యాపించే ప్రమాదం ఉంది. ( ఉదాహరణకు డోర్‌హ్యాండిల్, వాష్‌రూమ్ ట్యాప్ వంటివి)మనం సాధారణంగా ముఖాన్ని చేతితో తాకుతుంటాం. మనం మన చేతులను సబ్బుతో కనీసం 30 సెకండ్లపాటు శుభ్రంగా కడుగుకున్నట్లయితే , చేతికి ఏమైనా వైరస్ ఉంటే అది నాశనమౌతుంది. “ వైరస్ మలం ద్వారా గానీ, నోటి ద్వారా గానీ వ్యాపించవచ్చన్న సూచనలూ ఉన్నాయి. అందువల్ల చేతులను ,కాళ్ళను పరిశుభ్రంగా కడుక్కోవడం అవసరం” అని ప్రొఫెసర్ రాఘవన్ చెప్పారు.
3.సామాజిక దూరం పాటించడం:
చాలావరకు ఇన్ఫెక్షన్ డైరక్ట్ కాంటాక్ట్ వల్ల కానీ లేదా వైరస్ సోకిన వ్యక్తి నోటినుంచి ,ముక్కు నుంచి పడిన తుంపర్ల వల్ల కానీ వ్యాపిస్తుంది. సాధారణంగా ఈ తుంపర్లు వైరస్ సోకిన వ్యక్తినుంచి మీటరు దూరం వరకు పడతాయి.అందువల్ల మార్కెట్లు , ఆఫీసులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లలో ఒక మీటరు వరకు దూరం పాటించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.“ వైరస్ సోకిన లక్షణాలు ఏవీ పైకి కనిపించకుండానే యువకులు దీని బారిన పడే అవకాశం ఉంది. వీరు వయోధికులకు దీనిని సోకేలా చేసే ప్రమాదం ఉంది. అందువల్ల మనం భౌతిక దూరం పాటించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రత్యేకించి వయోధికులు, రకరకాల జబ్బులు కలిగిన వారి విషయంలో జాగ్రత్తలు పాటించాలి.” అని ప్రొఫెసర్ రాఘవన్ తెలిపారు.
4. పరీక్షల నిర్వహణ, గుర్తింపు:
“ ఎవరికైనా కోవిడ్ -19 పాజిటివ్ గా తేలితే , వెంటనే కాస్త వెనక్కి వెళ్ళి ఆలోచించి వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించాలి. వారికి పరీక్షలు నిర్వహించాలి” అని ప్రొఫెసర్ రాఘవన్ తెలిపారు. వైరస్ సొకిన వ్యక్తి మాత్రమే దానిని ఇతరులకు వ్యాప్తి చేయగలడు, లేదా వైరస్ కలిగిన ఉపరితలాలను తాకడం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. అందువల్ల వైరస్ బారిన పడినవారిలో ఎక్కువమందిని గుర్తించినట్టయితే వైరస్ వ్యాప్తిని నియంత్రించడం సులభమౌతుంది.
5. ఐసొలేషన్:
“ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిని ఐసొలేషన్‌లో ఉంచాలి” అని ప్రోఫెసర్ రాఘవన్ తెలిపారు. ఒకసారి వారిని విడిగా ఉంచి, వైద్య సదుపాయం కల్పించవచ్చు. దానికితోడు వారు విడిగా ఉన్నందువల్ల , వ్యాధి సోకిన వ్యక్తి వైరస్‌ను ఇతరులకు వ్యాప్తి చెందించ లేడు. వైరస్ వ్యాప్తి కోరలు పీకేసినట్టు అవుతుంది.
“ దీనిని వేగంగా అమలు చేస్తే , అందరూ దీనిని పాటిస్తే మనం నిశ్చింతగా సాధారణ జీవితం గడపచ్చు. వాక్సిన్, మందుల కోసం ఎదురుచూస్తూనే మనం మామూలు జీవితం గడపచ్చు. మనం ఇవేవీ పాటించకుండా లేదా వీటిలో దేనిని వదిలిపెట్టి వ్యవహరించినా దానివల్ల సమస్యలు ఉంటాయి” అని రాఘవన్ పేర్కొన్నారు.
పశ్చిమదేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు. ముంబాయిలోని ధారవి వంటి ప్రాంతాలలో జనసమ్మర్థత ఎక్కువగా ఉన్నందున భౌతిక దూరం పాటించడం కష్టంగాఉంటోంది. దీనికి తోడు భారతదేశంలోని చాలా ఇళ్ళలో మూడుతరాలవారు కలసి జీవిస్తున్నారు. “ దీనితో భౌతిక దూరం పాటించడం కష్టమౌతోంది. అందువల్ల ఈ ప్రత్యేక సమస్యలను ఎదుర్కొనేందుకు మనకు కొన్ని వినూత్న పరిష్కారాలు అవసరం ” అని ప్రొఫెసర్ విజయ రాఘవన్ అన్నారు.
“ ఏం చేయాలన్నదానికి సంబంధించి వివిధ దశల బాధ్యతలు మనకు ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది కమ్యూనికేషన్. సందేశాన్ని ఆ కమ్యూనికేషన్లో ఉంచి మనమందరం దానిని కార్యాచరణలోకి తీసుకురావాలి” అని ప్రొఫెసర్ కె. విజయరాఘవన్ అన్నారు.
జనసమ్మర్థం ఎక్కువగా గల ప్రాంతాలలో పరిశుభ్రత, పారిశుధ్యాన్ని పాటించేందుకు భారతప్రభుత్వానికి చెందిన ప్రిన్స్‌పల్ సైంటిఫిక్ అడ్వయిజర్ కార్యాలయం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. అలాగే ఇంట్లోనే తయారు చేసుకునే ముఖం, నోటి మాస్క్ లకు సంబంధించి ఒక మాన్యువల్ రూపొందించింది. ఇవి పలు భారతీయ భాషలలో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ కింది వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
http://psa.gov.in/information-related-covid-19.
(Release ID: 1628612)
Visitor Counter : 388