వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

లబ్దిదారులెవరూ ఎవరూ ఆకలితో అలమటించకుండా రాష్ట్రాలు ఆహార ధాన్యాల పంపిణీని నిర్వహించాలి : శ్రీ రామ్ విలాస్ పాస్వాన్

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆహార పంపిణీకి ఎఫ్.సి.ఐ. ప్రాణాధారమయ్యింది : శ్రీ పాస్వాన్


రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆహారశాఖల మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్.ఎఫ్.ఎస్.ఏ; పి.ఎం.జి.కె.ఏ.వై; ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ మరియు ఒకే దేశం ఒకే కార్డు కార్యక్రమాలను సమీక్షించిన - శ్రీ పాశ్వాన్.

Posted On: 22 MAY 2020 5:37PM by PIB Hyderabad

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ ఈ రోజు ఇక్కడ జరిగిన వీడియో సమావేశంలో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రులు, ఆహారశాఖ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  కోవిడ్-19 మహమ్మారి సమయంలో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ (డి.ఓ.ఎఫ్.పి.డి.) కింద ప్రధాన పథకాల అమలును శ్రీ పాస్వాన్ సమీక్షించారు.  ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ మరియు పి.ఎమ్.జి.కె.ఏ.వై. కింద కేంద్ర ప్రభుత్వం, ఎఫ్.సి.ఐ. మరియు నాఫెడ్ ద్వారా ఆహార ధాన్యాలు, పప్పులు అందజేసినందుకు ప్రధానమంత్రికీ, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రికీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆహార మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.  తమకు విమానాలు, నౌకలు, రైళ్ల ద్వారా సకాలంలో ఆహార ధాన్యాలు అందజేసినందుకు, పర్వత ప్రాంతాలు, ఈశాన్య మరియు అండమాన్ & నికోబార్ దీవులలోని రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాయి. 

పేదలు, వలస కూలీలకు ఆహార ధాన్యాలు మరియు పప్పుధాన్యాల పంపిణీలో, అదేవిధంగా ఒక దేశం ఒక రేషన్ కార్డ్ కార్యక్రమంతో ముందుకు సాగినందుకు శ్రీ పాస్వాన్ రాష్ట్రాలను ప్రశంసించారు.  ఆహార ధాన్యాల సేకరణ బాగా జరుగుతున్నందుకు కూడా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ ఈ రోజు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రులు, ఆహార శాఖ  కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆహారశాఖ మంత్రులు, ఆహార శాఖ కార్యదర్శులతో శ్రీ పాస్వాన్ మాట్లాడుతూ, ఎవరూ ఆకలితో అలమటించకుండా, ఆహార ధాన్యాల పంపిణీ జరగాలని కోరారు.  ‘అంఫన్’ తుఫాను ప్రభావిత ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తుఫాను బారిన పడ్డవారిని కూడా  జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఎఫ్.సి.ఐ. ఆహార పంపిణీకి జీవనాధారంగా మారిందని, రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు మరియు పప్పుధాన్యాల పంపిణీ గురించి కేంద్ర మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రాష్ట్రం యొక్క విజయం మరియు అవరోధాలతో పాటు ఆయా రాష్ట్రాలు ఎదుర్కొన్న ప్రత్యేకమైన సమస్యలను కూడా తెలుసుకున్నారు. ఒక దేశం, ఒక కార్దు (ఓ.ఎన్.ఓ.ఎస్.) పథకం అమలుతీరును కూడా ఆయన తెలుసుకున్నారు. 

ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ

ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద వలస కార్మికులకు ఉచితంగా పంపిణీ చేయడానికి డి.ఓ.ఎఫ్.‌పి.డి. ఇప్పటికే 8 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు  / బియ్యం మరియు 39,000 మెట్రిక్ టన్నుల పప్పులను విడుదల చేసింది.  ఎన్.ఎఫ్.ఎస్.ఏ. లేదా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏ పి.డి.ఎస్. పథకం పరిధిలోకి రాని -  8 కోట్ల మంది వలసదారులు / చిక్కుకు పోయిన కార్మికులకు నెలకు 5 కిలోల గోధుమలు  / బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది.  అదేవిధంగా 1.96 కోట్ల వలస కుటుంబాలకు రెండు నెలలు (మే మరియు జూన్ 2020) నెలకు కుటుంబానికి ఒక కిలో పప్పులు కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. ఆహార ధాన్యాల పంపిణీ 2020 జూన్ 15వ తేదీ లోగా పూర్తవుతుందని భావిస్తున్నారు.  ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ఇప్పటికే 17 రాష్ట్రాలు తమ తమ ఆహార ధాన్యాల వాటాను తీసుకున్నట్లు శ్రీ పాస్వాన్ తెలిపారు.  కాగా, హర్యానా, త్రిపుర రాష్ట్రాలు ఇప్పటికే ఈ పథకం కింద ఆహార ధాన్యాల పంపిణీని ప్రారంభించాయి.  రాష్ట్రంలో రవాణా, డీలర్ల మార్జిన్ మొదలైన వాటితో సహా ఈ పథకం కోసం మొత్తం 3,500 కోట్ల రూపాయల మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన అన్నారు.  రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు లబ్ధిదారుల జాబితాను ముందుగానే అందించాల్సిన అవసరం లేదు,  అయితే, 2020 జూలై 15వ తేదీ లోగా ఆహార ధాన్యాల పంపిణీ నివేదికను పంపాలని కేంద్రప్రభుత్వం కోరింది. 

పి.ఎమ్-జి.కే.ఏ.వై. పధకం : 

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పి.ఎమ్.జి.కె.ఎ.వై.) పథకం కింద, 2020 ఏప్రిల్ నుండి జూన్ వరకు మూడు నెలల కాలానికి, డి.బి.టి. విధానంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలోని 80 కోట్ల ఎన్.ఎఫ్.ఎస్.ఎ. లబ్ధిదారులకు అదనపు ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం జరుగుతోంది. 

పి.ఎమ్.జి.కే.ఏ.వై. కింద 2020 ఏప్రిల్ నెలలో దాదాపు అన్ని రాష్ట్రాలు 90 శాతం కంటే ఎక్కువగా ఎక్కువ ఆహార ధాన్యాలు పంపిణీ చేయగా, పంజాబ్, సిక్కిం, ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో 75 శాతం కంటే తక్కువగా పంపిణీ జరిగినట్లు శ్రీ పాస్వాన్ తెలిపారు.  కాగా ప్రస్తుత నెలలో సుమారు 61% ఆహార ధాన్యాలు రాష్ట్రాలు పంపిణీ చేశాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మణిపూర్, కేరళ, బీహార్ రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలు మే నెలలో 10 శాతం కంటే తక్కువగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయగా, కొన్ని రాష్ట్రాలు ఆహార ధాన్యాల పంపిణీని అసలు ప్రారంభించలేదు. 

పి.ఎమ్.జి.కే.వై. కింద పప్పుల సరఫరా : 

వచ్చే మూడు నెలలకు పి.ఎమ్.జి.కె.వై. పధకం కింద మొత్తం 5.87 లక్షల టన్నుల పప్పుధాన్యాలు అవసరమౌతాయి.   కాగా ఇంప్పటికే 4.05 లక్షల మెట్రిక్ టన్నుల పప్పులు రవాణా చేసినట్లు నాఫెడ్ తెలియజేసింది.  వీటిలో 3.02 లక్షల మెట్రిక్ టన్నుల పప్పులు రాష్ట్రాలు స్వీకరించగా, 1.27 లక్షల మెట్రిక్ టన్నుల పప్పులు 21 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లోని లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేయడం జరిగింది.  ఈ పథకానికి ఖర్చయ్యే 5 వేల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని భారత ప్రభుత్వమే  భరిస్తోందని శ్రీ పాస్వాన్ చెప్పారు. 

జాతీయ ఆహార భద్రతా చట్టం: 

ఎన్.ఎఫ్.ఎస్.ఏ. కింద ప్రతీ నెలా కేటాయించే ఆహారధాన్యాల్లో 93 శాతం కంటే ఎక్కువగా 2020 ఏప్రిల్ నెలలో పంపిణీ చేసినట్లు శ్రీ పాశ్వాన్ తెలియజేశారు. కాగా మే నెలకు కేటాయించిన మొత్తం ఆహార ధాన్యాల్లో 75 శాతం మేర ఆహార ధాన్యాలను రాష్ట్రాలు ఇప్పటికే పంపిణీ చేశాయని కూడా ఆయన చెప్పారు.

ఒక దేశం ఒక కార్డు పధకం:

ఒక దేశం ఒక కార్డు (ఓ.ఎన్.ఓ.సి.) పథకం కింద, పి.డి.ఎస్.  లబ్ధిదారులు తమ బయోమెట్రిక్ ధృవీకరణతో "వన్ నేషన్ వన్ కార్డు" పధకం అమలులో ఉన్న ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలితప్రాంతంలోని చవక ధరల దుకాణం నుండైనా తమ రేషన్ తీసుకోవచ్చు. 2020 మే నెల ఒకటవ తేదీ నాటికి దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు ఈ ఒక దేశం ఒక కార్డు పధకాన్ని అమలు చేస్తున్నాయి.   ఒరిస్సా, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలు మూడూ 2020 జూన్ నాటికి ఈ పధకంలో చేరనున్నాయి. కాగా, 2020 ఆగష్టు నాటికి ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాలు కూడా ఈ పధకంలో చేరతాయిదీనితో ఈ పధకంలో చేరిన రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల సంఖ్య 23 కు చేరుతుంది.  2021 మార్చి 31వ తేదీ నాటికి దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలన్నింటినీ ఓ.ఎన్.ఓ.సి. పధకం పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు శ్రీ పాశ్వాన్ తెలియజేశారు.

ఆహార ధాన్యాల సేకరణ : 

( గోధుమలు / బియ్యం )

2020-21 ఆర్.ఎమ్.ఎస్. లో 2020 మే నెల 21వ తేదీ వరకు మొత్తం 319.95 లక్షల మెట్రిక్ టన్నుల మేర గోధుమలు సేకరించినట్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అధికారులు కేంద్రమంత్రికి తెలియజేశారు.  గత ఏడాది 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఇది 326.15 లక్షల మెట్రిక్ టన్నుల మేర సేకరణ జరిగిందికోవిడ్-19 కారణంగా గోధుమల సేకరణ ఆలస్యంగా మొదలు పెట్టడంతో,  గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది గోధుమల సేకరణ 1.90 శాతం మేర తగ్గింది.  తగినంత జాగ్రత్తలు తీసుకొని, మండీలలో సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ సేకరణను చేపట్టడం జరుగుతోంది.  ఈ సందర్భంగా శ్రీ పాశ్వాన్ మాట్లాడుతూ, ప్రస్తుత సేకరణ వేగం ఇదే స్థాయిలో కొనసాగితే, ఈ సీజన్లో మనం నిర్ణయించుకున్న 400 లక్షల టన్నుల సేకరణ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉందని అన్నారు. 

2020-21 కే.ఎమ్.ఎస్. లో 2020 మే నెల 21వ తేదీ వరకు మొత్తం 460.89 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యం సేకరణ జరిగింది.  ఇది గత ఏడాది 2019-20 లో సేకరించిన 407.86 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ కంటే 13 శాతం ఎక్కువ.  

లాక్ డౌన్ కారణంగా ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్ళను ఎదుర్కొంటున్నపటికీ, ఇంత ప్రోత్సాహకరమైన సేకరణ జరగడం, భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగిన సంఘటిత కృషి ఫలితమని శ్రీ పాస్వాన్ అభివర్ణించారు.  ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజల అదనపు ఆహార ధాన్యాల అవసరాలను తీర్చిన తర్వాత కూడా సెంట్రల్ పూల్‌లోకి  ఈ విధంగా సమృద్ధిగా సేకరణ జరగడం వల్ల, ఎఫ్.సి.ఐ.  తన గిడ్డంగులను తాజా స్టాక్ తో త్వరగా నింపగలిగింది.  ఎన్.ఎఫ్.ఎస్.ఎ. మరియు ఇతర సంక్షేమ పథకాల కింద డిమాండ్లను నెరవేర్చడానికి ఒక నెలకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం కాగా, ప్రస్తుతం ఎఫ్‌.సి.ఐ. వద్ద 600 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి.  

ఆహార సబ్సిడీ :

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి 01 నుండి ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 28,847 కోట్ల రూపాయల సబ్సిడీ జారీ చేసిందని శ్రీ పాశ్వాన్ చెప్పారు. ఇది గత ఏడాది ఇదే కాలంలో చెల్లించిన 12,356 కోట్ల రూపాయల రాయితీ కంటే రెట్టింపు కంటే ఎక్కువ అని ఆయన తెలిపారు.  ఆహార ధాన్యాల సేకరణ వికేంద్రీకరణలో తమ మంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంత్రాలకు పూర్తిగా మద్దతు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

****



(Release ID: 1626302) Visitor Counter : 222