హోం మంత్రిత్వ శాఖ

విశాఖపట్నం గ్యాస్ లీక్ సంఘటన గురించి, చేపట్టిన చర్యల గురించి ఎన్.సి.ఎమ్.సి. నిర్వహించిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన - క్యాబినెట్ కార్యదర్శి.

Posted On: 08 MAY 2020 6:14PM by PIB Hyderabad

విశాఖపట్నంలో నిన్న జరిగిన గ్యాస్ లీక్ వల్ల తలెత్తిన పరిస్థితిని సమీక్షించడానికి క్యాబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన జాతీయ సంక్షోభ యాజమాన్య కమిటి ఈ రోజు వరుసగా రెండవ రోజున సమావేశమయ్యింది.  

సంఘటన జరిగిన అనంతరం ప్లాంట్ లో లీకేజీని అరికట్టడానికీ, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికీ వారు చేపట్టిన చర్యల తో పాటు అక్కడ క్షేత్ర స్థాయి పరిస్థితి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమిటీకి వివరించారు.  ట్యాంకుల నుండి మరింతగా కలుషిత వాయువులు వెలువడకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు. గ్యాస్ లీకైనందువల్ల ఆరోగ్యం, నీరు, గాలి నాణ్యతపై దీర్ఘకాలిక ప్రభావానికి సంబంధించిన సమస్యల గురించి కూడా చర్చించారు 

ప్రస్తుత పరిస్థితి, రక్షణ, సహాయ చర్యల గురించి క్యాబినెట్ కార్యదర్శి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి అవసరమైన పూర్తి సహాయాన్ని అందించాలని ఆదేశించారు.  రసాయన భద్రత, పారిశ్రామిక ప్రక్రియల పై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, క్షేత్ర స్థాయిలో అధికారులు మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరగాలని సూచించారు.  అవసరాన్ని బట్టి అటువంటి నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి తీసుకురావాలని కూడా సూచించారు.  వైద్య పరంగా అనుసరించవలసిన విధి విధానాలపై కూడా వైద్య నిపుణులతో ఇటువంటి సంప్రదింపులు ఏర్పాటుచేయాలని ఆయన తెలిపారు.  నిరోధక రసాయనాలను పంపించడం వంటి అవసరమైన సహాయం గురించి కూడా వారు చర్చించారు 

ఈ సమీక్షా సమావేశంలో పర్యావరణం,  అడవులు, వాతావరణ మార్పు, రసాయనాలుపెట్రోకెమికల్స్, ఫార్మాస్యుటికల్స్ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు;  ఎన్.డి.ఆర్.ఎఫ్. మరియు వైద్య సేవల డైరెక్టర్ జనరళ్ళు; ఎయిమ్స్ డైరెక్టర్;  హోమ్ మంత్రిత్వశాఖకు చెందిన అధికారులు, కేంద్ర వాతావరణ కాలుష్య నివారణ మండలి అధికారులు పాల్గొన్నారు.  విశాఖపట్నం జిల్లా అధికారులతో కలిసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు

 

*****



(Release ID: 1622256) Visitor Counter : 174