మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ నేప‌థ్యంలో విశ్వ‌విద్యాల‌యాల్లో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, అకాడమిక్ కాలెండ‌ర్ అమ‌లుపై యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాలు.

కేంద్ర మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి స‌మ‌క్షంలో మార్గ‌ద‌ర్శ‌కాల విడుద‌ల‌

Posted On: 29 APR 2020 8:16PM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హమ్మారి కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేప‌థ్యంలో విశ్వ‌విద్యాల‌యాల విద్యార్థులు త‌మ విద్యాసంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుండా చూడ‌డానికిగాను యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ ఒక నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేసింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ అమ‌లు అంశాల‌పై సిఫార్సులు చేయాల‌ని క‌మిటీని కోరింది. యూజీసీ మాజీ స‌భ్యులు, హ‌ర్యానా కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్ గా ప‌ని చేస్తున్న ఆర్‌.సి. కుహాద్ ఈ నిపుణుల క‌మిటీకి అధ్య‌క్షునికిగా వున్నారు. 
నిపుణుల క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను ఈ నెల 27న యూజీసీ ఆమోదించింది. ప‌రీక్ష‌లు, అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ కు సంబంధించి ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర మాన‌వ వ‌న‌రుల‌శాఖ మంత్రి శ్రీ ర‌మేష్ పోక్రియాల్ స‌మ‌క్షంలో ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఈ రోజున విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. 
యూజీసీ విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల్లో ముఖ్య‌మైన‌వి ఇలా వున్నాయి. 
1. ఇంట‌ర్మీడియెట్ సెమిస్ట‌ర్ విద్యార్థులు : ప‌్ర‌స్తుత సెమిస్ట‌ర్, దీనిక‌న్నా ముందు అయిపోయిన సెమిస్ట‌ర్ల ఇంట‌ర్న‌ల్ అసెస్‌మెంట్ ఆధారంగా గ్రేడ్లు ఇస్తారు. కోవిడ్ -19 కు సంబంధించిన ప‌రిస్థితి చ‌క్క‌బ‌డిన రాష్ట్రాల‌లో జులై నెల‌లో ప‌రీక్ష‌లు వుంటాయి. 
2. టెర్మిన‌ల్ సెమిస్ట‌ర్ విద్యార్థులు:  జులై నెల‌లో ప‌రీక్ష‌లుంటాయి. 
3. ప్ర‌తి విశ్వ‌విద్యాల‌యంలో కోవిడ్ -19 విభాగం ఏర్పాటు చేస్తారు. ఇది అకాడ‌మిక్ క్యాలెండ‌ర్‌, ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంది. 
4. వేగంగా నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డానికి వీలుగా యూజీసీలో కోవిడ్ -19 విభాగాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.
మార్గ‌ద‌ర్శ‌కాల‌నేవి అడ్వ‌యిజరీలాంటివి మాత్ర‌మే. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి ప‌రిస్థితిని బ‌ట్టి విశ్వ‌విద్యాల‌యాలు త‌మ స్వంత కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించుకోవ‌చ్చు. 
సామాజిక దూరాన్ని పాటించాలి. 
త‌క్కువ స‌మ‌యంలో పూర్తి కావ‌డానికి వీలుగా విశ్వవిద్యాల‌యాలు తాము నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌ను రూపొందించుకోవ‌చ్చు. స‌మాయ‌న్ని మూడు గంట‌ల‌నుంచి రెండు గంట‌ల‌కు కుదించుకొని స‌మ‌ర్థ‌వంత‌మైన ప‌ద్ధ‌తిలో, వినూత్న‌మైన రీతుల్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు. 
విశ్వ‌విద్యాల‌యాలు త‌మ ప‌రీక్ష‌ల‌ను ఆఫ్‌లైన్లోగానీ, ఆన్ లైన్లోగానీ త‌మ నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం జ‌రుపుకోవ‌చ్చు. సామాజిక దూరం నియ‌మాన్ని, ఇత‌ర లాక్ డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తూ అంద‌రు విద్యార్థుల‌కు న్యాయం జ‌రిగేలా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు. 
ప‌రీక్ష‌ల స‌మ‌యం విష‌యంలో ఆయా విశ్వ‌విద్యాల‌యాలు త‌మ‌కు అనుకూల‌మైన స‌మ‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు. 
విద్యార్థులు ఎంత‌మేర‌కు సిద్ధంగా వున్నార‌నే విష‌యంలో స‌మ‌గ్ర‌మైన మ‌దింపు చేయాలి. వారి నివాస ప్రాంతాల్లోను, వారి ప్రాంతాలు, రాష్ట్రాల్లో కోవిడ్ -19 ప‌రిస్థితి ఎలా వుందో తెలుసుకొని దాని ప్ర‌కారం ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి. 
లాక్ డౌన్ స‌మ‌యంలో విద్యార్థులు త‌మ త‌మ విశ్వ‌విద్యాల‌యాల‌కు హాజ‌రైన‌ట్టుగా ప‌రిగ‌ణించ‌డం జ‌రుగుతుంది. 
ప‌రిశోధ‌న విద్యార్థుల‌కు సంబంధించిన వైవా వోసీ ప‌రీక్ష‌ల‌ను గూగుల్‌, స్కైప్‌, మైక్రోసాప్ట్ టెక్నాల‌జీ మొద‌లైన సాంకేతిక‌త‌ల‌ద్వారా వీడియో కాన్ఫ‌రెన్స్ పెట్టుకొని నిర్వ‌హించుకోవ‌చ్చు. 
ప‌రిశోధ‌క విద్యార్థుల‌కు మ‌రో ఆరు నెల‌ల‌పాటు స‌మ‌యాన్ని పొడిగించ‌డం జ‌రిగింది. 
ఇలాంటి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు , మార్గ‌ద‌ర్శ‌కాలు, క్యాలెండ‌ర్‌, ప‌రీక్ష‌ల వివ‌రాల‌కోసం..ఈ లింకును క్లిక్ చేయ‌గ‌ల‌రు. https://static.pib.gov.in/WriteReadData/userfiles/UGC%20Guidelines%20on%20Examinations%20and%20Academic%20Calendar.pdf

******
 


(Release ID: 1619507) Visitor Counter : 288