శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

మాస్క్ పై హెర్బల్ డీకంజెస్టెంట్ స్ర్పే చ‌ల్లితే శ్వాస‌లో ఇబ్బంది నుంచి ర‌క్షణ

ఈ ఫార్ములేషన్ శ్వాస తేలిగ్గా తీసుకోవడానికి దోహదపడుతుంది లేదా వాయునాళాన్ని శుద్ధి చేయడం ద్వారా శ్లేష్మాన్ని తొలగించి ఊపిరి ఆడేలా చేస్తుంది

Posted On: 25 APR 2020 3:42PM by PIB Hyderabad

ఫేస్ మాస్క్ వాడడం వల్ల కరోనా ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ పొందవచ్చునని ఆరోగ్య అధికారులు ఎంతో గట్టిగా వాదిస్తున్నారు. కాని దీర్ఘకాలం పాటు మాస్క్ వాడడం వల్ల శ్వాసలోను, శ్వాస ప్రక్రియలోను ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి లక్నోకు చెందిన సిఎస్ఐఆర్-జాతీయ బొటానికల్ పరిశోధన సంస్థ (ఎన్ బిఆర్ఐ) శాస్త్రవేత్తలు హెర్బల్ డీ కంజెస్టెంట్ స్ర్పే తయారుచేశారు.

 

nbri spray

“మాస్క్ లోపలి పొరపై కార్బన్ డయాక్సైడ్, తేమ పేరుకుపోవడమే ఇందుకు కారణం. అది ధరించిన వ్యక్తి గాలి తీసుకున్నప్పుడు అదంతా ఊపిరితిత్తుల్లో తిరిగి చేరుతుంది. ఎక్కువ సార్లు ఇలా జరగడం వల్ల శ్వాసలో ఇబ్బంది ఏర్పడి ఊపిరాడని స్థితి ఏర్పడుతుంది” అని దీనిపై అధ్యయనం చేసిన పరిశోధకుల బృందానికి నాయకత్వం వహించిన సిఎస్ఐఆర్-ఎన్ బిఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శరద్ శ్రీవాస్తవ అన్నారు.

“నాలుగు రకాలైన ఔషధ మూలికలతో తయారుచేసిన హెర్బల్ డీ కంజెస్టెంట్ స్ర్పే దీనికి పరిష్కారం చూపుతుంది. కాని మేథోసంపత్తి హక్కుల సమస్య కారణంగా ఆ మూలికల పేర్లు వెల్లడించడం సాధ్యం కావడంలేదు. ఆయుర్వేద సిద్ధాంతాల ఆధారంగా ఈ ఉత్పత్తి తయారుచేయడం జరిగింది. ఇందులో ఉపయోగించిన మూలికల గురించి సాంప్రదాయిక గ్రంథాల్లో రాసి ఉంది” అని డాక్టర్ శ్రీవాస్తవ వివరించారు.

ఈ ఫార్ములేషన్ శ్వాసనాళంలో అవరోధాలను తొలగిస్తుంది. శ్లేష్మం తొలగించి లేదా దగ్గుకు కారణం అవుతున్న అవరోధాల నుంచి విముక్తి కల్పిస్తుంది. మితిమీరి మాస్క్ ఉపయోగించడం వల్ల ఏర్పడే వత్తిడిని తగ్గిస్తుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ స్ర్పే తయారుచేయడం జరిగింది.

ఎన్ బిఆర్ఐ లక్నోకు చెందిన శాస్ర్త, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) అనుబంధ ప్రయోగశాల. దీన్ని బొటానికల్ పరిశోధనగా భావిస్తారు. ఎన్ బిఆర్ఐకి చెందిన ఈ హెర్బల్ స్ర్పే ప్రాథమిక ఫలితాలు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. దీర్ఘకాలంగా మాస్క్ లు ధరిస్తున్న వారు దీని వల్ల ఎంతో ఊరట పొందుతున్నారు.

ఈ ఇన్ హేలర్ ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయాలని ఇన్ స్టిట్యూట్ భావిస్తోంది. అలా చేసినట్టయితే దాన్ని భారీ పరిమాణంలో ఉత్పత్తి చేసి క్షేత్ర స్థాయిలో  కోవిడ్-19పై పోరాటం జరుపుతున్న వారందరికీ పంపవచ్చు.

(మరిన్ని వివరాలకు :  డాక్టర్ శ్రీవాస్తవ, సిఎస్ఐఆర్-ఎన్ బిఆర్ఐ, లక్నోను ఈ దిగువ ఇ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.)
Email : sharad@nbri.res.in,sharad_ks2003@yahoo.com]

***
 



(Release ID: 1618223) Visitor Counter : 219