శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 ముగిసిన త‌రువాత భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఉత్తమ పద్ధతులను అన్వేషిస్తున్న ఐఎఫ్ఏసీ

- కోవిడ్-19 ముగిసి‌న త‌రువాత భారత ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనాన్ని కావాల్సిన‌ వ్యూహ రచనపై శ్వేతపత్రం

Posted On: 21 APR 2020 5:26PM by PIB Hyderabad

కోవిడ్‌-19 క‌ట్ట‌డి అనంత‌రం భారత‌ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి కావాల్సిన వ్యూహరచన చేయడానికి కేంద్ర శాస్ర్త, సాంకేతిక శాఖకు (డీఎస్టీ) చెందిన స్వయంప్రతిపత్తి క‌లిగిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ (టిఫాక్) ఒక‌ శ్వేతపత్రాన్ని సిద్ధం చేస్తోంది. భవిష్యత్తు కార్యాచ‌ర‌ణ గురించి ఆలోచన జ‌రిపే ఈ సంస్థ కోవిడ్‌-19 నేప‌థ్యంలో దేశ ఆర్ధిక భద్ర‌త‌పై దృష్టి సారించింది. భార‌త ప్ర‌భుత్వపు మేక్ ఇన్ ఇండియా చొరవలను బలోపేతం చేయడం, దేశీ సాంకేతిక పరిజ్ఞానం యొక్క వాణిజ్యీకరణ, సాంకేతికతతో నడిచే పారదర్శక ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), సమర్థవంతమైన గ్రామీణ ఆరోగ్య సంరక్షణ పంపిణీ, దిగుమతుల‌ను తగ్గించడం, కృత్రిమ మేధ‌, మెషిన్ ల‌ర్నింగ్‌, డేటా అన‌లిటిక్స్ వంటి విభాగాల‌లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక డొమైన్‌లపై ప్ర‌ధానంగా శ్వేతప‌త్రం దృష్టి పెట్టింది. ఈ పత్రాన్ని త్వరలోనే ప్రభుత్వంలోని నిర్ణయాధికారులకు సమర్పించనున్నారు.
భ‌విష్య‌త్తుపై అంత‌ర్ దృష్టితో వ్యూహ‌ర‌చ‌న‌..
కోవిడ్‌-19 మ‌హ‌మ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి మొత్తం ప్ర‌పంచం దాదాపు ఒకే గొడుగు కిందకు వచ్చింది. ఈ మహమ్మారి వ్యాప్తి అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దీని ప్రభావం తయారీ రంగం నుండి వాణిజ్యం, రవాణా, పర్యాటకం, విద్య, ఆరోగ్య సంరక్షణతో స‌హా అన్ని రంగాలకు వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి ఆర్థిక ప్రభావం ఏ మేర‌కు ఉంటుంద‌న్న‌ది ఆయా దేశాలు తీసుకొనే వైర‌స్ క‌ట్ట‌డి నియంత్రణ వ్యూహాలు, ఆయా దేశాలు ఈ విప‌త్క‌ర ప‌రిణామం నుంచి ఎలా బ‌య‌ట‌పడుతుంది అనే విష‌యంపై ఆధార‌ప‌డుతుంద‌ని టిఫాక్ అభిప్రాయ‌ప‌డింది. "కోవిడ్‌-19 వైరస్ ప‌రిస్థితుల‌ను అధిగ‌మించి భ‌విష్య‌త్తులో ముందుకు సాగేట‌ప్ప‌డు సామాజిక-ఆర్ధిక శ్రేయస్సును పెంపొందించ‌డంతో పాటు అదే స‌మ‌యంలో మానవ ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.. వాటిని క‌నిష్ఠీక‌రించే చర్యలపై కూడా క‌చ్చితమైన అంత‌ర్ దృష్టి అవ‌స‌రం. కావున‌, కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన స‌మ‌యంలో సాంకేతిక-సంబంధిత అంశాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని విశ్లేషణ జ‌ర‌ప‌డం మరియు వివిధ రంగాలలో వాటి ప్రభావాల గురించిన ముఖ్య‌మైన స‌మాచారం ఎంతో అవ‌స‌రం" అని డీఎస్‌టీ కార్య‌ద‌ర్శి అశుతోశ్ శ‌ర్మ అన్నారు.
పున‌రుద్ధ‌ర‌ణ‌కు ఉత్త‌మ వ్యూహాల అన్వేష‌ణ‌..
టిఫాక్ బృందంలో వివిధ‌ విభాగాల శాస్త్రవేత్తలు భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి మరియు దానిపై ప్రభావాన్ని క‌నిష్టీక‌రించే ఉత్తమ పద్ధతులను అన్వేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి గాను వారు భవిష్యత్ వ్యూహాలను కూడా రూపొందిస్తున్నారు. కోవిడ్‌-19 మహమ్మారిని నియంత్రించడానికి భారతదేశం ఇప్పటివరకు మెరుగ్గా ఆలోచించిన మెరుగైన చర్యలను తీసుకుంది. దేశంలో ప్రారంభ దశలోనే  లాక్‌డౌన్ అమ‌లు ప‌ర‌చ‌డం ఎంతో ముఖ్య‌మైన చ‌ర్య‌. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్రభావాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు, పరిశోధనా సంస్థలు, పౌర సమాజ సంస్థలు, మరీ ముఖ్యంగా భారత పౌరులు ముందుకు వ‌చ్చి చేతులు కలిపారు. కోవిడ్‌-19 త‌రువాత భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి టిఫాక్ చేస్తున్న ప్రయత్నం భ‌విష్య‌త్తులో ఒక మెరుగైన మార్గాన్ని చూపించడానికి ఎంత‌గానో దోహ‌దం చేయ‌నుంది. 


(Release ID: 1616809) Visitor Counter : 514