ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఎంఎస్‌ఎంఈలకు ఉపశమనంగా గత 10 రోజుల్లో రూ.5,204 కోట్ల విలువైన ఆదాయపు పన్ను రిఫండ్స్: సీబీడీటీ
Posted On:
17 APR 2020 9:10PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితుల కారణంగా చేతిలో తగిన నిధులు లేక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈల) వారు ఇబ్బంది పడకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతో ఉపశమనం కల్పిస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఎంఎస్ఎంఈల వారు తమ వ్యాపారాలను సజావుగా నిర్వహించుకొనేందుకు వేతన కోతలు, లేఆఫ్‌లను నివారించేందుకు వీలుగా ప్రత్యక్ష పన్నుల కేంద్రం బోర్డు గడిచిన
పది రోజుల కాలంలో వేగంగా ఆదాయపు పన్ను రిఫండ్స్‌ను జరిపింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 8.2 లక్షల చిన్న వ్యాపారాలకు (సొంత పరిశ్రమాలు, సంస్థలు, కార్పొరేట్ మరియు ట్రస్టులు) చెందిన దాదాపు రూ.5,204 కోట్ల మేర ఆదాయపు పన్ను రిఫండ్స్ జరిపినట్టుగా సంస్థ తెలిపింది. దేశంలో కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులకు సహాయపడటానికి 2020 ఏప్రిల్ 8 వ తేదీన ప్రభుత్వ రిఫండ్స్ వేగవంతం చేయాలన్న నిర్ణయం మేరకు ఆదాయపు పన్ను విభాగం ఇప్పటివరకు రూ.5 లక్షల లోపు విలువైన దాదాపు 14 లక్షల రిఫండ్స్ వేగంగా జరిపినట్టు సీబీడీటీ తెలిపింది. ఎంఎస్‌ఎంఈ రంగంలోని చిన్న వ్యాపారాలకు ఉపశమనం కలిగించడంపై దృష్టి సారించిన సీబీడీటీ సాధ్యమైనంత త్వరలో రూ.7,760 కోట్ల రూపాయల ఐటీ వాపసులను జారీ చేయనుంది. దాదాపు 1.74 లక్షల కేసులకు సంబంధించి పన్ను చెల్లింపుదారుల నుండి మేటి పన్ను డిమాండ్ల సయోధ్యకు సంబంధించి పలు స్పందనలు రావాల్సి ఉందని సీబీడీటీ మరోసారి తన అభ్యర్థనలో పునరుద్ఘాటించింది. దీనికి సంబంధించి సంబంధితులు వచ్చే ఏడు రోజుల లోపు స్పందించాలని కోరింది. ఇదే విషయమై సంబంధితులకు ఈ-మెయిల్ సందేశాలను కూడా పంపింది. వీటికి స్పందనలు త్వరగా లభిస్తే ఆదాయపు పన్ను రిఫండ్స్ త్వరగా ప్రాసెస్ చేయబడుతాయని సీబీడీటీ తెలిపింది. తమ ప్రతిస్పందనలను పన్ను చెల్లింపుదారుల www. incometax india efiling.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ఈ-ఫైలింగ్ ఖాతా ద్వారా కూడా అందించవచ్చని తెలిపింది.
(Release ID: 1615538)
Visitor Counter : 178