శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మరో సీఎస్ఐఆర్ ప్రయోగశాలలోనూ కరోనా వైరస్ జన్యుపరమైన అధ్యయనం
Posted On:
17 APR 2020 4:42PM by PIB Hyderabad
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) కు చెందిన మరో ఇన్‌స్టిట్యూట్ నవ్య కరోనా వైరస్‌కు సంబంధించి జన్యువు అధ్యయనపు పనులను చేపట్టింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ (ఐజీఐబీ) సంస్థలు ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమై ఉండగా తాజాగా చండీగఢ్ కేంద్రంగా పని చేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ (ఐఎమ్‌టెక్) సైతం కరోనా వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ పనిని భారీ స్థాయిలో చేపట్టింది.
వైరస్ మూలాలను తెలుసుకొనేలా..
తాము రూపొందించనున్న కోవిడ్-19 జీనోమ్ సీక్వెన్సింగ్ నమూనాలను అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన రిపాజిటరీలకు అందిస్తామని ఐఎమ్‌టెక్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ ఖోస్లా తెలిపారు. ఇండియా సైన్స్ వైర్‌తో ఆయన మాట్లాడుతూ తామందించే జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారం పరిశోధకులు వైరస్ యొక్క మూలాలు, భారత్‌లో వీటికి సంబంధించిన వివిధ జాతులతో పాటు అవి దేశ వ్యాప్తంగా ఎలా వ్యాపించిందనే విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకొనేందుకు వీలు పడనుందని ఆయన వివరించారు. ఈ సీక్వెన్సింగ్ నుంచి పొందిన పూర్తి సమాచారం కోవిడ్-19 రోగ నిర్ధారణ మరియు ఔషధ తయారీలో కొత్త లక్ష్యాలను గుర్తించడానికి తోడ్పడుతుందని డాక్టర్ ఖోస్లా వివరించారు.
జన్యు పరిశోధనలకు ప్రసిద్ధి సీఎస్ఐఆర్-ఐఎంటెక్
సీఎస్ఐఆర్-ఐఎంటెక్ ఇన్‌స్టిట్యూట్ సూక్ష్మ జీవుల మరియు జన్యు పరిశోధనలలో ప్రత్యేకతకు ప్రసిద్దిగాంచింది. క్లినికల్ నమూనాల నుండి వేరు చేసిన సార్స్-సీవోవీ-2 ఆర్ఎన్ఏ జన్యువులపై సీఎస్ఐఆర్-ఐఎంటెక్ జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించనుంది. ఇతర సూక్ష్మజీవులతో పోలిస్తే వైరస్లు అధిక మ్యుటేషన్ రేటును కలిగి ఉంటాయి. వాటి జన్యు పదార్ధం కూడా వేగంగా మారుతూ పరావర్తనం చెందుతూ ఉంటుంది. హోల్- జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది నిర్దిష్ట జీవి జన్యువు యొక్క పూర్తి డీఎన్ఏ క్రమాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే పద్ధతి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) ప్రపంచ దేశాలు జీనోమ్ సీక్వెన్సింగ్ గురించిన సమాచారాన్ని పంచుకొనేందుకు గాను 2008లో ప్రారంభించిన గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్‌ప్లూయాంజా డేటా (జీఐఎస్ఏఐడీ) వేదికపై ఇప్పటి వరకు దాదాపు 9000 నమూనాల సంబంధించిన సీక్వెన్సింగ్ నిర్వహించి అందుబాటులో ఉన్నాయి. ఈ సీక్వెన్సింగ్ నుండి పొందిన జన్యు పరివర్తన వనరు కోవిడ్-19 రోగ నిర్ధారణ మరియు ఔషధాల కొత్త లక్ష్యాలను గుర్తించడానికి ఎంతో దోహదం చేయనుంది.
అన్ని కోణాల్లో కోవిడ్-19 జన్యు అధ్యయనం..
“మేము ఇప్పటికే నమూనాల క్లినికల్ టెస్టింగ్ ప్రారంభించాము. ఇక ఇప్పుడు ఈ వైరల్ జాతుల సీక్వెన్సింగ్ దిశగా మిషన్ దృష్టి సారిస్తోంది. ప్రపంచ మహమ్మారిగా అవతరిస్తున్న కోవిడ్-19 వైరస్ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మేము బాగా సన్నద్ధమవుతున్నాము” అని సీఎస్ఐఆర్-ఐఎంటెక్ డైరక్టర్ డాక్టర్ సంజీవ్ ఖోస్లా తెలిపారు. సార్స్-సీవోవీ-2 వైరస్ రసాయన సవరణను అధ్యయనం చేయడానికి పోర్టబుల్, రియల్ టైమ్ తో పాటుగా నేరుగా జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించేందుకు గాను సీఎస్ఐఆర్-ఐఎంటెక్ తన అనుభవాన్ని ఉపయోగించనుంది.
(Release ID: 1615435)
Visitor Counter : 269