కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
పీఎంజీకేవై ప్యాకేజీలో భాగంగా 15 రోజుల్లో ఈపీఎఫ్‌వోలో 3.31 లక్షల కోవిడ్-19 క్లయిమ్‌ల పరిష్కారం
- సుమారు రూ.950 కోట్ల మేర క్లయిమ్‌ల పంపిణి
Posted On:
16 APR 2020 5:48PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని అధిగమించడానికి ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీలో భాగంగా ఈపీఎఫ్ పథకంలో కల్పించిన ప్రత్యేక ఉపసంహరణ వెసులుబాటు కార్మిక వర్గానికి గొప్ప ఊరటను కలిగిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో పీఎంజీకేవై కింద మార్చి 28న జారీ చేసిన నిబంధన నోటీసు దేశంలో కార్మికవర్గానికి సకాలంలో గొప్ప ఉపశమనం కలిగించింది. పీఎంజీకేవై కింద వెసులుబాటు కల్పించిన కేవలం పక్షం రోజుల వ్యవధిలోనే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) సుమారు రూ.946.49 కోట్ల విలువైన దాదాపు 3.31 లక్షల క్లయిమ్‌లను పరిష్కరించింది. దీనికి అదనంగా ఈ పథకం కింద మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్టులు అదనంగా రూ.284 కోట్ల మేర సొమ్మును పంపిణీ చేశాయి. సర్కారు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన నిబంధన ప్రకారం, మూడు నెలల పాటు ప్రాథమిక వేతనాలు, కరువు భత్యం మేరకు తిరిగి చెల్లించని ఉపసంహరణ లేదా ఈపీఎఫ్ ఖాతాలో సభ్యుల క్రెడిట్ నందు 75% వరకు ఏది తక్కువైతే అది అవసరాల కోసం తీసుకొనేలా వెసులుబాటు కల్పించారు. ఇంతకంటే తక్కువ మొత్తానికి కూడా ఈపీఎఫ్‌వో సభ్యుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సొమ్మును ఆడ్వాన్స్ రూపంలో అందిస్తున్నందున దీనికి ఆదాయపు పన్ను మినహాయింపులుండవు. కోవిడ్ నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభ సమయంలో తన సభ్యులకు సేవ చేయడానికి ఈపీఎఫ్‌వో కట్టుబడి ఉంది. ప్రస్తుత కఠిన సమయంలో కూడా తన సభ్యులకు అత్యవసరమైన ఈఎఫ్‌వో సేవలను నిరంతరాయంగా అందించేందుకు ఈపీఎఫ్‌వో కార్యాలయాలు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి. లాక్‌డౌన్ వేళ ఈపీఎఫ్‌వో అందిస్తున్న వివిధ ఆన్‌లైన్ సేవల వల్ల చందాదారులకు ఎంతో ఉపశమనం కల్పిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఏర్పడిన పరీక్ష సమయాల్లో వారి రక్షణకు ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయి.
(Release ID: 1615170)
Visitor Counter : 239