పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి గ్రామ పంచాయతీల చర్యలు
వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలు, పోస్టర్లు, గోడరాతలతో అవగాహన పెంపు
రోగకారక నిర్మూలన ద్రవాలు చల్లడం, స్థానిక తయారీ రక్షణ సామగ్రి పంపిణీ
పేదల ముంగిటకు ఉచిత రేషన్, ఆర్థిక సహాయం, నిత్యావసరాల సరఫరా
Posted On:
14 APR 2020 5:42PM by PIB Hyderabad
కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి నిరోధానికి కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆయా రాష్ట్రాల పంచాయతీల స్థాయిలో పలు నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. రాష్ట్రాలవారీగా సదరు చర్యలు ఇలా ఉన్నాయి:-
రాజస్థాన్: అన్ని పంచాయతీల్లోనూ వివిధ మాధ్యమాలద్వారా ప్రజల్లో చైతన్యం పెంపు, క్రమం తప్పకుండా పరిశుభ్రత కార్యకలాపాలు, సోడియం హైపోక్లోరేట్ చల్లడం. వ్యక్తిగత రక్షణకు మాస్కుల పంపిణీ, రేషన్ సరకులు, పశుగ్రాసం, పంపిణీ వగైరా...
బీహార్: భారత-నేపాల్ సరిహద్దు సమీపంలోని సింఘ్వానీ గ్రామ సర్పంచ్ అన్ని రకాలుగానూ అందరికీ ఆదర్శప్రాయంగా పనిచేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్: సామాజిక దూరం పాటింపుపై అవగాహన కల్పన, పంచాయతీరాజ్ అధికారులద్వారా వ్యవసాయ కూలీలు, ఇతర కార్మికులకు హస్త పరిశుభ్రతపై చైతన్యం పెంపు.
తమిళనాడు: పంచాయతీల్లోని గ్రామాల్లో రేషన్ సరకులు తీసుకునే సమయంలో సామాజిక దూరం నిబంధనను తూచా తప్పకుండా పాటిస్తున్న గ్రామస్థులు. రోగకారక నిర్మూలన ద్రవాలు చల్లడం, ఇంటి ముంగిటకు కూరగాయల సరఫరా, ఆరోగ్య-పారిశుధ్య సిబ్బందికి మూడురకాల వ్యక్తిగత రక్షణ సామగ్రి పంపిణీ.
ఒడిషా: కటక్, భువనేశ్వర్, భద్రక్ జిల్లాల పరిధిలోని పంచాయతీల్లో నిరాశ్రయులకు ఆహారం సరఫరా, ఆహార భద్రత సాయం కింద లబ్ధిదారులకు రూ.1,000 వంతున పంపిణీ, గ్రామాల్లో అగ్నిమాపక సిబ్బందిద్వారా రోగకారక నిర్మూలన ద్రవాలు చల్లడం, సామాజిక దూరం పాటింపుపై అవగాహన కల్పన.
తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో అవగాహన పెంపు సమావేశాలు, సర్పంచులు, కౌన్సిలర్లు, జడ్పీ సభ్యులు, పురపాలక చైర్‌పర్సన్లు, తహసీల్దార్లు తదితరులకు కోవిడ్-19 విధివిధానాలపై శిక్షణ. స్వయంగా మాస్కులు తయారుచేసి పంపిణీ చేసిన శంకర్‌పల్లి మండల చైర్‌పర్సన్.
మహారాష్ట్ర: మహారాష్ట్ర నుంచి డోర్నకల్‌లోని తమ నివాసాలకు వెళ్తున్న వలస కార్మికులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వారిని సహాయ శిబిరాలకు తరలించి ఆశ్రయం కల్పించి ఆహారం, నీరు తదితరాలు అందజేశారు.
కర్ణాటక: జాతీయస్థాయికన్నా ముందుగానే ఈ రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోగల జాలి పట్టణ పంచాయతీ దిగ్బంధాన్ని అమలు చేసింది. ఆ మేరకు సర్పంచ్ తమ పంచాయతీ సరిహద్దులను మూసివేయించడమేగాక సమీప పంచాయతీలను కూడా ఈ దిశగా ప్రోత్సహించారు.
లద్దాఖ్: కార్గిల్ జిల్లా పరిధిలోని అతిశీతల ప్రాంతంలోగల చౌకియాల్ పంచాయతీలో ఆహార పంపిణీ చేపట్టారు. దీంతోపాటు లద్దాఖ్‌లో ఆరోగ్య పరీక్షలు, క్వారంటైన్ సదుపాయాలు కూడా చేపట్టారు.
ఝార్ఖండ్: కోడెర్మా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అటవీశాఖ సిబ్బంది ఉచితంగా రేషన్ సరకులు పంపిణీ చేశారు.
కేరళ: అత్యవసర ప్రతిస్పందన కార్యకలాపాలకు వీలుగా ఎర్నాకుళం జిల్లాలోని వడకెక్కెర పంచాయతీ ఏకంగా ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
అండమాన్-నికోబార్ దీవులు: నిరుపేదలకు నిత్యావసరాలు, రేషన్ సరకులు, తాగునీరు తదితరాలను ఇంటింటికీ సరఫరా చేశారు. కొన్నికుటుంబాలకు నగదు సాయం అందించారు.
గోవా: ఉత్తర గోవాలోని సోనాల్ గ్రామవాసులు తమ గ్రామ ప్రవేశద్వారం వద్ద చెక్కగేటును అమర్చారు. ఇక్కడి యువకులు వంతులవారీగా రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. ప్రజలకు బయటకు వెళ్లే అవసరం లేకుండా నిత్యావసరాల సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది.
*****
(Release ID: 1614471)
Visitor Counter : 188
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada